NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

నేటి నుంచి లోక్ సభ సమావేశాలు.. నీట్ పరీక్షపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం రెడీ

18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం (జూన్ 24) నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ మొదటి సెషన్‌లో మొదటి రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు కాంప్లెక్స్‌లో సమావేశమై సభ వైపు కలిసి కవాతు చేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి భర్తిహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. దీని తర్వాత మహతాబ్‌ పార్లమెంట్ హౌస్‌కు చేరుకుని ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలను ప్రారంభిస్తారు.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజులు అక్కడే మకాం..

రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇవాళ ఉదయం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి పయనం అవుతారని సీఎం కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ కార్యక్రమానికి సీఎం హాజరుకావడంతో పాటుగా పార్టీ పెద్దలను కూడా రేవంత్‌ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక నామినేటెడ్‌ పోస్టులు, టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్‌ విస్తరణ లాంటి అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో వీలును బట్టి ఆయన చర్చించే అవకాశముందని తెలుస్తోంది. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన రాష్ట్ర సమస్యలపై ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సీఎం రేవంత్ త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం.

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. నేడు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విడుదల

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తం చెప్పింది. శ్రీవారిని దర్శించుకునేందుకు నేడు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఉదయం 10 గంటలకు టీటీడీ ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని చెప్పింది. అలాగే.. తిరుమల, తిరుపతిలో సెప్టెంబర్‌ నెల వసతి గదుల కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అంతేకాదు ఈనెల 27న తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. అలాగే నవనీత సేవ మధ్యామ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు దర్శన టికెట్లు, వసతి గదులు, సేవా కోటాను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు సూచించారు.

బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్‌ షాక్.. హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్న (ఆదివారం) రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంజయ్‌కుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారంతో పాటు సీనియర్‌ నేత తనయుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. మూడు రోజుల కిందటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో పోచారం హస్తం పార్టీలో చేరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్‌లో చేరారు. ముందుగా తాను సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు.

కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన ఎంఎన్ఎన్ అధినేత కమల్ హాసన్

మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎన్) పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్ ఆదివారం కళ్లకురిచ్చి దుర్ఘటన బాధితులను పరామర్శించారు. కల్తీ మద్యం వల్ల మరణించిన వారి పట్ల కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో బాధితులపై ప్రశ్నలు సంధిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించాల్సింది లేదన్నారు. ఇది కాకుండా, బాధితులకు మనోరోగచికిత్స కౌన్సెలింగ్ సౌకర్యాలు కల్పించాలని కమల్ హాసన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కళ్లకురిచి మద్యం దుర్ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మె… OP, OT సేవలు బంద్‌..

జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నెలనెలా ఉపకార వేతనాలు చెల్లించడమే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా వారు నిరసనలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేవని, ప్రభుత్వం నుంచి వచ్చే నెలనెలా ఉపకార వేతనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో OP సేవలు, తాత్కాలిక OT సేవలను బహిష్కరించి జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.

నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నారా లోకేష్‌

మంత్రిగా నారా లోకేష్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకూ నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మంత్రి వర్గ సమావేశం కూడా ఉండటంతో ఆయన పదవీ బాధ్యలను సచివాలయంలో చేపట్టనున్నారు. ఇప్పటి వరకూ బాధ్యతలను చేపట్టక పోవడానికి ఆయన ఛాంబర్ లో స్వల్ప మార్పులు చేర్పులు చేయడం వల్లే అని చెబుతున్నారు. స్వల్ప మార్పులు చేయాల్సి రావడంతో… ఈ రోజు ఉదయం 9.45 గంటలకు నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ ను లోకేష్ కోసం కేటాయించారు. అందులో మార్పులు చేర్పులు పూర్తి కావడంతో లోకేష్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకూ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉంటూ విధులను నిర్వహిస్తున్నారు.

నేడు శ్రీశైలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు రోడ్డు మార్గంలో నల్లమలలోని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఇవాళ ఉదయం 7 గంటలకు హైదరాబాద్ క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరిన ఆయన మార్గమధ్యంలో అధికార, అనధికారిక నేతలతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీశైలం చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

తమిళనాడుకు చెందిన 22మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

శ్రీలంక నేవీ కొంతమంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. శ్రీలంక సముద్ర జలాల్లో నేడుంతీవు సమీపంలో చేపలు పట్టినందుకు తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులపై శ్రీలంక నేవీ ఈ చర్య తీసుకుంది. ఈ సమాచారాన్ని రామేశ్వరం మత్స్యకారుల సంఘం షేర్ చేసింది. అరెస్టయిన మత్స్యకారులు శనివారం తమిళనాడు నుంచి సముద్రంలోకి వెళ్లారని తెలిపారు. పాలక్‌బే సాగర్ ప్రాంతంలోని నేడుంతీవు సమీపంలో మత్స్యకారులు చేపలు పడుతుండగా, శ్రీలంక నావికాదళం సోమవారం తెల్లవారుజామున ఆ ప్రాంతానికి చేరుకుని, తంగచిమడం నుండి మత్స్యకారుల మూడు పడవలను స్వాధీనం చేసుకున్నట్లు సంఘం తెలిపింది. భారత జాలర్లను శ్రీలంక అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా శ్రీలంక నావికాదళం భారత జాలర్లపై ఇలాంటి చర్య తీసుకుంది.