NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు దేశవ్యాప్తంగా ఉపాధి మేళా.. 70 వేల మందికి అపాయింట్ మెంట్ లెటర్స్

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం (జూలై 22) దాదాపు 70,000 మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) శుక్రవారం (జూలై 21) ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా నేడు 44 చోట్ల ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపికైన ఈ యువకులను వివిధ ఉద్యోగాల్లో నియమిస్తామని పీఎంవో తెలిపింది.

కొత్తగా నియమితులైన వారికి ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. PMO ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ యువకులు రెవెన్యూ శాఖ, ఆర్థిక సేవల విభాగం, పోస్ట్‌ల శాఖ, పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జలవనరుల శాఖ, సిబ్బంది, గృహ వ్యవహారాల శాఖలతో సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ప్రభుత్వంలో చేరనున్నారు.

బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు!

ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఎప్పుడూ భారీ డిమాండే ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రతిరోజు బులియన్ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. అయితే వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలకు నేడు బ్రేక్ పడ్డాయి.

బులియన్ మార్కెట్‌లో శనివారం (జులై 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,440గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 310 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో శనివారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఇక దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రమాదస్థాయిని దాటిన యమునా .. పునరావాస చర్యల్లో ప్రభుత్వాలు

నైరుతి రుతపవనాలతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఢిల్లీలో యమునా నీటిమట్టం మరోసారి ప్రమాదస్థాయిని దాటింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 205.34 మీటర్లకు చేరుకోగా, రాత్రి వరకు పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ప్రక‌టించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా సహా యమునా ఎగువ పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తుండ‌టంతో యమునా నది ఉప్పెనకు దారితీశాయి. యమునా నది నీటిమట్టం శుక్రవారం మరోసారి 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటడంతో వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో పునరావాస చర్యలు మరింత ఆలస్యమయ్యాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 205.34 మీటర్లకు చేరుకుందనీ.. య‌మునా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో, ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో కురుస్తున్న వర్షాలతో గత రెండు మూడు రోజులుగా నీటి మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

మణిపూర్ హింసాకాండపై ఒవైసీ ఫైర్.. మోడీ ఇమేజ్ గురించి భయపడుతున్నారు

అసదుద్దీన్ ఒవైసీ ది వైర్‌లో ప్రచురించిన బీరెన్ సింగ్ ప్రకటనను పంచుకున్నారు, అందులో వీడియో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చిందని అన్నారు. ఈ వీడియోను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చినట్లు సీఎం బీరెన్ తెలిపారు. ‘దీనిని ఖండించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నివసించే ప్రజలు మహిళలను తమ తల్లిగా భావించే రాష్ట్రాలు ఇవి. కానీ అక్రమార్కులు ఇలా చేసి మా ప్రతిష్టను దిగజార్చారు. ఈ నేరానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నామని బీరేన్ సింగ్ అన్నారు. దీనితో పాటు, ఒవైసీ ఇతర బిజెపి నాయకులు, కేంద్ర మంత్రుల ప్రకటనను కూడా పంచుకున్నారు. దీనిలో భారతదేశం గురించి నివేదించినందుకు అంతర్జాతీయ ఏజెన్సీలు ఖండించబడ్డాయి.

ఇటీవల మణిపూర్‌లో, ఇద్దరు మహిళలతో క్రూరత్వానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇందులో జనాలు మహిళలను బట్టలు లేకుండా ఊరేగిస్తున్నారు. ఈ వీడియో మే 4 నాటిది. ఈ కేసులో మే 18 న సున్నా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అయితే నిందితులు రెండు నెలలుగా పట్టుబడలేదు. వీడియో వైరల్ కావడంతో ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు గురువారం (జూలై 20) అరెస్టు చేశారు.

ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆలౌట్! విండీస్‌ స్కోర్ 86/1

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోరుకే ఆలౌటై ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిన వెస్టిండీస్.. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం కాస్త ప్రతిఘటిస్తోంది. రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి విండీస్ 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37), కిర్క్ మెకంజీ (14) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కరేబియన్ జట్టు ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్‌ నైట్‌ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. 87 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (121; 206 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం బాదాడు. దాంతో కోహ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత విదేశీ గడ్డపై సాధించాడు. ఆపై మొదటి రోజు 36 పరుగులు చేసిన జడేజా (61; 152 బంతుల్లో 5 ఫోర్లు) కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. రనౌట్‌గా వెనుదిరిగాడు. కొద్దిసేపటికే జడేజా క్యాచ్‌ ఔట్ అయ్యాడు.

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం… ఇకపై ప్రాంతీయ భాషలో బోధన

మానవుని జీవితంలో విద్య ఎంతో ప్రదానమైంది. విద్యతోనే మానిషి జీవితంలో ఎదగ గలడు. చదువుకోవాలంటే ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్ కోసం చూస్తుంటారు.. తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలోనే వేయాలని చూస్తారు. అలా మంచి పేరున్న ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూల్స్ లో సీటు కోసం చూస్తుంటారు. అయితే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వాటిల్లో కేవలం ఇంగ్లీష్‌ మీడియంలోనే విద్య కొనసాగుతుంటుంది. తమ మాతృభాషలో విద్యను కొనసాగించలేకపోతారు. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) బీర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరు తమకు నచ్చిన భాషలో బోధనా మధ్యామాన్ని ఎంచుకొనేలా నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు తమకు నచ్చిన భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఎంచుకునేందుకు సీబీఎస్‌ఈ పాఠశాలలకు అనుమతించింది.

ఢిల్లీలో 40డిగ్రీలుదాటిన ఉష్ణోగ్రత.. రికార్డు స్థాయిలో 7300 మెగావాట్లు దాటిన విద్యుత్ వినియోగం

దేశ రాజధాని ఢిల్లీలో వేడిగాలుల తీవ్రత పెరిగింది. శుక్రవారం మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఢిల్లీ ప్రజలు అల్లాడిపోయారు. ఢిల్లీ స్టాండర్డ్ అబ్జర్వేటరీ అయిన సఫ్దర్‌జంగ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 40 దాటింది. రానున్న మూడు రోజుల పాటు ప్రజలు ఇదే విధమైన వేడి, తేమను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు వేడి కారణంగా రాజధానిలో విద్యుత్ డిమాండ్ కూడా రికార్డు స్థాయికి చేరుకుంది.

శుక్రవారం ఉదయం నుంచి ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. రోజు గడిచేకొద్దీ సూర్యుడు కూడా మరింత వేడిగా ఉన్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగాయి. ఇదే సమయంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంది. వేడి, తేమ కలయిక కారణంగా ప్రజలు చెమట తుడుచుకుంటూ కనిపించారు.

కలికాలం అంటే ఇదేనేమో.. బతికున్న కోడిని తినేసిన గుర్రం

ఈ భూమి చాలా క్రూరమైన జంతువులతో నిండి ఉంది. వీటిలో సింహం, పులి, చిరుత, హైనా వంటి జంతువులు ఉన్నాయి. ఈ జంతువులు మాంసాహారులు, వివిధ రకాల అడవి జంతువులను వేటాడి తమ కడుపు నింపుకుంటాయి. కొన్ని జంతువులు శాఖాహారం.. మొక్కలు, పువ్వులు, ఆకులను తింటూ జీవిస్తాయి. అలాంటి జంతువులలో ఏనుగులు, గుర్రాలు, ఖడ్గమృగాలు ఉన్నాయి. అయితే ఈ జంతువులలో ఏదైనా మాంసం తినడం ప్రారంభిస్తే ఏమి జరుగుతుందో ఊహించండి? అవును, ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది ప్రజలను కలవరపెడుతోంది.

ఈ వీడియో చూసిన తర్వాత, ఈ శాకాహార జంతువు మాంసాహారం ఎలా తింటుందో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీరు తప్పనిసరిగా గుర్రాలను చూసి ఉంటారు. గుర్రాలు సాధారణంగా ఎండు గడ్డి, మేత తింటాయి. పెంపుడు జంతువులకు ప్రజలు గ్రాములు, ప్రోటీన్లు అధికంగా ఉండే వాటిని తినిపించినప్పటికీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో గుర్రం కోడిని పట్టుకుని తింటున్నట్లు కనిపిస్తుంది.

తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో ఒడిశాకు పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూలై 24న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హనుమకొండ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 26 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు.

పొలాల్లో అల్లం దొంగతనం.. సీసీ కెమెరాలు పెట్టిన రైతన్నలు

గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం. ద్రవ్యోల్బణం పెరగడంతో పొలాల్లో పచ్చి కూరగాయలు, మసాలా దినుసుల చోరీ మొదలైంది. టమాటా తర్వాత దొంగలు అల్లం మీద దొంగలు కన్నేశారు. ఒక్కసారిగా ధరలు పెరగడంతో అల్లం చోరీ ఘటనలు ఎక్కువయ్యాయని ఆ పంట సాగు చేసిన రైతులు చెబుతున్నారు. దీంతో లక్షల రూపాయలు నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ పంటలను దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

తాజాగా కర్ణాటకలో అల్లం చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చీకటి పడగానే దొంగలు అల్లం దొంగిలించడానికి బయలుదేరుతారు. పొలంలో రైతు లేని సమయం చూసి అల్లం పంటను ఈ దొంగలు ఎత్తుకెళ్లారు. విశేషమేమిటంటే.. కర్ణాటకకు వచ్చిన తర్వాత అల్లం సాగు చేసే కేరళ రైతులపైనే దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అల్లం దొంగతనంపై కేరళకు చెందిన పలువురు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..

తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనాలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు.. వర్షాలు ఆగాయి కదా అని ఊపిరి పీల్చుకొనేలోపు ఇప్పుడు మరో బాంబ్ లాంటి వార్తను అధికారులు చెప్పారు..ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండొచ్చని ప్రకటించింది.. దీంతో జనాలు భయపడుతున్నారు.. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురంభీమ్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు… హనుమకొండ, వరంగల్‌, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..

అలాగే ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ.. వర్షంతో పాటుగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరిస్తున్నారు అధికారులు.. మొత్తం మీద కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ తోపాటు.. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు కుండపోత వానలు, ఇంకోవైపు ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుత్తోంది. కాళేశ్వరం, మేడిగడ్డ దగ్గర అదే ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 5లక్షల క్యూసెక్కుల ఇన్‌ అండ్ ఔట్‌ ఫ్లో కొనసాగుతుంది..