Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో బస్సు ఫ్లై ఓవర్‌పై నుంచి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్యను జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ధృవీకరించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ, జాజ్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై సోమవారం 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్ నుండి పడిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు. బస్సు కటక్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా, బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. క్షతగాత్రులు కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ, జాజ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్‌ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హెడ్‌ సెంచరీ బాది ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. బెంగళూరుపై 39 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలోనే ట్రావిస్‌ హెడ్‌ నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్ గేల్ అగ్రస్ధానంలో ఉన్నాడు. గేల్ 30 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్ (37 బంతులు), డేవిడ్ మిల్లర్ (38 బంతులు) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సులతో హెడ్‌ విధ్వంసక శతకం చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.

నేడు ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఇలా సాగనుంది..!

ప్రస్తుతం దేశంలో లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో ఓవైపు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు ఒకేసారి జరగడంతో రాష్ట్రంలో రాజకీయ హీట్ మరింతగా జోరందుకుంది. ఇందులో భాగంగానే అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాలలో పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది. ఇక పార్టీల పెద్దలు రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలను మమేకం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలో పాల్గొంటున్నాడు. ఇక ఇందుకు సంబంధించి నేటి విశేషాలు చూస్తే..

హైదరాబాద్‌లో దారుణం.. కన్న తండ్రి ముందే కొడుకు హత్య

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బహదూర్ పూరాలోని అసద్ బాబానగర్ లో ఓ వ్యక్తిని కత్తులో విచక్షణారహితంగా పొడిచి చంపారు. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బహదూర్ పూరాలోని అసద్ బాబానగర్ లో ఖలీల్ అనే వ్యక్తి తమ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. అయితే కొందరు యువకులు అర్ధరాత్రి ఖలీల్ ఇంటికి వెళ్లారు. ఖలీల్ తో మాట్లాడాలని ఇంటి నుండి బయటకు తీసుకుని వచ్చారు. మాట్లాడుతూ వారి వెంట తెచ్చుకున్న కత్తులతో ఖలీల్ పై దాడికి దిగారు. ఖలీల్ గట్టిగ కేకలు వేయడంతో తండ్రి బయటకు పరుగున వచ్చాడు. అప్పటికే ఖలీల్ ను ఆగంతకు చుట్టుముట్టి కత్తులో విచక్షణారహితంగా దాడి చేస్తున్నడంతో తండ్రి అడ్డుపడ్డాడు. తండ్రిని బెదిరించాడు. ఏమీ చేయని నిస్సాయస్థితిలో తండ్రి ఉండిపోయాడు.

నేడు సంగారెడ్డిలో కేసీఆర్ పర్యటన.. లక్షల మందితో బహిరంగ సభ

నేడు సంగారెడ్డి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. సుల్తాన్ పూర్ లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు లక్ష మందికి పైగా హాజరవుతారనే అంచనాతో బీఆర్ ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. సుల్తాన్ పూర్ లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కేసీఆర్ ప్రసంగం నేపథ్యంలో భారీ వేదికను సిద్ధం చేశారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుంచి పటాన్ చెరు, సంగారెడ్డి మీదుగా రోడ్డు మార్గంలో కేసీఆర్ సుల్తాన్ పూర్ చేరుకుంటారు. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రధాన రహదారులు, కూడళ్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ జెండాలతో అలంకరించారు. బహిరంగ సభ ప్రాంతంలో కేసీఆర్‌తో పాటు హరీష్ రావు, మెదక్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ల కటౌట్‌లను ఏర్పాటు చేశారు.

నేడు తమిళనాడులో పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం

నేడు తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తమిళనాడులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటంతో పవన్ కల్యాణ్ ను అక్కడ పర్యటించాలని కోరడంతో ఈరోజు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ కూటమి అయిన ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు. కాగా ఎన్నికల్లో తమిళనాడులో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అందొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. కాగా చెన్నై సౌత్ పార్లమెంట్ స్థానం నుంచి ఇటీవలే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై పోటీ చేస్తున్నారు.

నేడు జనసేన గాజుగ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి సింబల్‌ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఉత్కంఠగా మారింది.. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిబంధనలకు విరుద్ధంగా ఈ గుర్తును జనసేన పార్టీకి ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, తీర్పు రిజర్వ్ చేసింది. నేడు జనసేన గాజు గుర్తుపై తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. అయితే, ఈసీ ఇప్పటికే గాజు గ్లాసు సింబల్‌ను ఫ్రీ సింబల్స్ లిస్ట్‌లో పెట్టడం గమనార్హం. గాజు గ్లాసు గుర్తు తమకే వస్తుందని జనసేన పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా.. మంగళవారం దీనిపై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

 

 

Exit mobile version