Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

యోగా డే సందర్బంగా విశాఖలో ప్రధాని మోడీ పర్యటన..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించి, అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ జూన్ 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 వరకు విశాఖ ఆర్కే బీచ్ లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే యోగా డే సందర్భంగా విశాఖ బీచ్ వేదికగా ఈ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

మోడీ, చంద్రబాబు, పవన్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!

కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ముస్లిం జేఏసీ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీపై మాట్లాడిన ఒవైసీ, ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింల ద్రోహి. ఆయన పాలనలో ముస్లింల పట్ల అన్యాయం ఎక్కువైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, రాజకీయాల్లో పెద్ద పెద్ద నేతలు కూడా వెళ్లిపోతున్నారని అన్నారు.

డ్రగ్స్ కు అడ్డగా పబ్బులు.. ఎన్ని సార్లు రైడ్లు చేసినా..!

హైదరాబాద్‌లో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి? అని ఎవరైనా అడిగితే పబ్స్‌లో దొరుకుతాయని ఈజీగా సమాధానం చెప్పవచ్చు. అంతలా డ్రగ్స్ దందా అక్కడ నడుస్తోంది. ఏకంగా కొంత మంది డీజేలే పెడ్లర్ల అవతారం ఎత్తి వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పబ్బులు.హైదరాబాద్‌లో పబ్బులు.. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.. పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు. ఒక్కసారి రెండుసార్లు కాదు.. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా.. డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. అంతే కాదు డ్రగ్స్‌ వినియోగంలో పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. .హైదరాబాద్‌ పబ్బులలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని మీడియా ఎప్పటి నుంచో చెబుతోంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ మాదక ద్రవ్యాల సప్లై మాత్రం ఆగడం లేదు…డ్రగ్స్ సప్లై చేస్తున్న డీజేలు.

హైటెన్షన్ వైర్లు తెగిపడి ఇద్దరు సజీవదహనం..!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. సాగర్ రింగ్ రోడ్ వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు బిక్షాటన చేసే వ్యక్తులు, ఓ వీధికుక్క అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ఘటన తెల్లవారుజామున సమయంలో చోటుచేసుకుంది. 11 కేవీ విద్యుత్ తీగలు బీడింగ్ తెగిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు, వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కరెంట్ నిలిపివేయడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది.

నేడు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేడు (జూన్ 15) అమరావతికి రానున్నారు. రాష్ట్రానికి రానున్న ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి లంచ్ మీట్లో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి, కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించనట్టు తెలుస్తోంది. ఇక లంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతుల సమస్యలు, దిగుబడి ధరలు, మార్కెట్ పరిస్థితులు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. ప్రభాకర్, ప్రణీత్‌లను ఒకేసారి విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దూకుడు పెంచింది సిట్‌. నాకేం తెలీదని ప్రభాకర్‌ రావు అంటుంటే… ప్రభాకర్‌ రావు చెప్పిందే తాను చేశానని ప్రణీత్‌ రావు అంటున్నాడు !! దీంతో… ఇద్దరినీ కలిపి వాచారించాలని భావిస్తున్నారు సిట్‌ అధికారులు. అలా ఐతే కానీ.. అసలు బండారం బయటపడేలా లేదు. ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా ప్రభాకర్‌ రావు పేరు చెప్తుంటే… ప్రభాకర్‌ రావు మాత్రం తెలీదు… గుర్తులేదు.. మరిచిపోయా… అంటూ సిట్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడట !

ఫోన్‌ ట్యాపింగ్‌ కీలక నిందితుడు.. ప్రభాకర్‌ రావు అమెరికా నుంచి తిరిగిరావడంతో కేసు కొలక్కి వస్తుందని భావించారు. కానీ.. ప్రభాకర్‌ రావు కథ మొదటికి తెచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్న నిందితులంతా ప్రభాకర్‌ రావు పేరు చెప్పారు. తన డైరెక్షన్‌లోనే ట్యాపింగ్‌కి పాల్పడ్డామని ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించారు. కానీ.. ప్రభాకర్‌ రావు మాత్రం తనకేం తెలీదని.. శాఖాపరమైన ఆదేశాలు మాత్రమే ఇచ్చానని చెప్తున్నాడు. అదీకాకుండా… ఉల్టా సిట్‌ అధికారులనే ప్రశ్నిస్తున్నాడు. నాపై ఉన్నతాధికారులను కూడా ఈ కేసులో ఎందుకు చేర్చలేదని సిట్‌ అధికారులనే ప్రశ్నిస్తున్నాడు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం..!

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉధృతంగా కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో పోటెత్తుతుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి పోయాయి. వీటితో పాటు వెలుపల కూడా భక్తులు గట్టి క్యూలైన్లలో వేచి నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కోసం ప్రస్తుతం భక్తులకు సుమారు 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లో భక్తుల రద్దీతో అధికారులు భద్రతా ఏర్పాట్లు, నీటి సదుపాయాలు, అన్నప్రసాద పంపిణీ వంటి చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు.

 

Exit mobile version