NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కసరత్తు..!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంత్రుల అభీష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలను కేటాయిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు గురువారం మధ్యాహ్నం అమరావతి చేరుకుని సచివాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై ఉండవల్లిలోని తన నివాసంలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా, మరో వైపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్దయేత్తున ప్రచారం జరుగుతుంది. అలాగే, నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించే ఛాన్స్ ఉందని అందరు భావిస్తున్నారు. ఇక, మిగతా ముఖ్య శాఖలను సీఎం చంద్రబాబు సీనియర్లకు అప్పగించే అవకాశం ఉంది.

నేడు లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో వైఎస్ జగన్ భేటీ..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే వరుస సమావేశాలు పెట్టి అభ్యర్థులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చిస్తున్నారు. అయితే, నేడు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కావాలని ఆదేశాలు అందాయి. వీరందరితో మాజీ ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడతారు. వైసీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్ సభ ఎంపీలు ప్రస్తుతం ఉన్నారు. కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి నేతలతో నేరుగా వైఎస్ జగన్ భేటీ అవుతున్నారు. తాజా, ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను వారి ద్వారా అడిగి తెలుసుకునే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతలతో మాట్లాడనున్నారు. అలాగే, కార్యకర్తలకు అండగా నిలవాలి, దాడుల్లో ఇబ్బంది పడిన కార్యకర్తలకు పార్టీ సపోర్టు ఉంటుందన్న భరోసాను ఈ సమావేశం ద్వారా పంపనున్నట్లు సమాచారం. ఇక, మరి కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై కూడా ప్రధానంగా వైసీపీ ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచనలు చేయనున్నారు.

చురుగ్గా రుతుపవనాలు కదలిక.. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన..
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల కదలికలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు, రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మి. వేగంతో కూడిన తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కాగా.. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 24 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. గంటకు 4-6 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలుగా నమోదైంది. గత 13 రోజులుగా రాయలసీమ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 309.1% వర్షపాతం నమోదైంది. రుతుపవనాలు ఆలస్యంగా రావడమే ఇందుకు కారణం. రుతుపవనాల ఆగమనం రేఖ విజయవాడ – మధ్య ఆంధ్ర – దక్షిణ తెలంగాణ మీదుగా ఉండడంతో రాయలసీమలో అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో కాకుండా ఉత్తర కోస్తా ఆంధ్రలో తక్కువ వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో రుతుపవనాలు వేగం పుంజుకోనున్నాయి. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఆ నదికి ఐదు పోలీస్ స్టేషన్లనుంచి 170మంది పోలీసుల పహారా
ఢిల్లీలోని ఐదు పోలీస్ స్టేషన్ల నుంచి 170 మంది పోలీసులు, పీసీఆర్ వ్యాన్లు, పెద్ద సంఖ్యలో బైక్‌లు.. మునక్ కెనాల్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు గురువారం ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతంలో ఇంత మంది పోలీసులను కలిసి చూడలేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ భద్రతా సిబ్బందిని ప్రజల కోసం కాదు. మునక్ కెనాల్ నుండి నీటి దొంగతనాన్ని అరికట్టడానికి నియమించారు. ఢిల్లీలో పెరుగుతున్న నీటి కొరత, మునక్ కెనాల్ నుండి నీటి చోరీకి సంబంధించిన ఫిర్యాదుల దృష్ట్యా నిఘా పెంచారు. బవానా నుంచి హైదర్‌పూర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు 170 మంది పోలీసులు మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు గస్తీ నిర్వహిస్తున్నారు. కాలువపై పెట్రోలింగ్‌లో పోలీసులు ట్యాంకర్ మాఫియాపై కూడా చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మునక్ కెనాల్ నుంచి అక్రమంగా నీటిని నింపుతున్న మూడు ట్యాంకర్లను పోలీసులు సీజ్ చేశారు. అలాగే ఆరుగురిపై చర్యలు తీసుకున్నారు. బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఆదేశాలు అందిన తరువాత, ఢిల్లీ పోలీసులు అర్థరాత్రి నుండి కాలువ రెండు ఒడ్డులపై నిఘా ప్రారంభించారు. కాలువ పర్యవేక్షణ పనిని ఔటర్ నార్త్, రోహిణి జిల్లా పోలీసు ఐదు పోలీసు స్టేషన్లకు అప్పగించారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత, మునాక్ కెనాల్ బవానా, నరేలా ఇండస్ట్రియల్ ఏరియా, షహబాద్ డెయిరీ, సమయ్‌పూర్ బద్లీ , కేఎన్ కట్జు పోలీస్ స్టేషన్ ప్రాంతం మీదుగా హైదర్‌పూర్ ప్లాంట్‌కు చేరుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులకు నీటి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

బక్రీద్ రోజు రోడ్డుపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగి వార్నింగ్..
నేరగాళ్లు, మాఫియా అణిచివేతను కొనసాగిస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ చేశారు. అణిచివేత చర్యలు మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ‘‘ప్రతి పేద, దోపిడి, అణగారిన మరియు అణగారిన వ్యక్తి ప్రయోజనాలను పరిరక్షించడం మా బాధ్యత, అది ల్యాండ్ మాఫియా లేదా మరేదైనా మాఫియా అయినా, చర్యలు తీసుకుంటాము’’ గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో సమన్వయం చేసుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని పొందాలని అధికారుల్ని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిల్లో జనతా దర్శన్ కార్యక్రమాలనున వెంటనే ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించారు. అవినీతికి వ్యతిరేకంగా జీరో-టాలరెన్స్ పాలసీకి అనుగుణంగా, రాష్ట్ర సచివాలయం నుండి బ్లాక్ స్థాయి వరకు అనైతిక లావాదేవీలను లక్ష్యంగా చేసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లు, డివిజనల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు సూపరింటెండెంట్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాంతిభద్రతలను సమీక్షించారు.

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల ఉద్దేశ్యం ఏమిటి..?
జమ్మూ కాశ్మీర్‌లో వరసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు ఆ రాష్ట్రంలో మరోసారి భయాందోళనల్ని పెంచాయి. గత ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే, ఉగ్రవాదులు రియాసి జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత వరసగా కథువా, దోడా ప్రాంతాల్లో మూడు ఉగ్రవాద ఘటనలు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చగా.. ఒక జవాన్ అమరుడయ్యారు. అయితే, ఇటీవల కాలంలో పీర్ పంజాల్ పరిధి దిగువన ఉన్న జమ్మూలో ఉగ్రవాద ఘటనలు గణనీయంగా పెరిగాయి. రిటైర్డ్ ఆర్మీ అధికారుల ప్రకారం.. ప్రధానిమోడీ, ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతున్న సమయంలో, మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల్ని చక్కదిద్దలేదనే అభిప్రాయాన్ని కలిగించేందుకే బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హుస్నైన్(రిటైర్డ్) అన్నారు. 2000లో జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని చిట్టి సింగ్ పోరా గ్రామంలో ఉగ్రవాదులు 35 మంది సిక్కు యాత్రికులను కాల్చి చంపిన అంశాన్ని ఉదహరించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు ఒక రోజు ముందు ఈ ఘటన జరిగిందని గుర్తు చేశారు.

టీ20‌ల్లో నికోలస్ పూరన్ చరిత్ర!
టీ20‌ల్లో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ తరఫున టీ20‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 17 పరుగులు చేసిన పూరన్.. ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు 91 టీ20‌ మ్యాచ్‌ల్లో 25.52 సగటు, 134.03 స్ట్రైక్ రేట్‌తో 1914 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 82. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌తో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును నికోలస్ పూరన్ బ్రేక్ చేశాడు. గేల్ 79 ఇన్నింగ్స్‌లో 1,899 పరుగులు చేశాడు. గేల్ 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 112. గేల్ బ్యాటింగ్ సగటు 27.92 కాగా.. స్ట్రైక్ రేట్ 137.50గా ఉంది. ఇక టీ20‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ ఉన్నాడు. 122 మ్యాచ్‌ల్లో 4113 రన్స్ చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (4042), రోహిత్ శర్మ (4042), పాల్ స్టిర్లింగ్ (3600), మార్టిన్ గప్తిల్ (3531) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

దేవర ప్రీపోన్ వల్ల అన్ని కోట్లు లాభమా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర” మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సీఎంఏమను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి మేకర్స్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా “ఫియర్ సాంగ్ “ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది .యూట్యూబ్ లో ఈ సాంగ్ కు రికార్డు వ్యూస్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.కానీ ఊహించని విధముగా ఈ సినిమాను ప్రీపోన్ చేస్తూ నిన్న మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ సినిమాను సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఇదే తేదీన పవన్ కల్యాణ్ నటిస్తున్న “ఓజి” సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ లేట్ అయ్యే అవకాశం వుంది.తాజాగా ఎన్టీఆర్ దేవర ఆ డేట్ కు రిలీజ్ కావడంతో “ఓజి” సినిమా రిలీజ్ ఆలస్యం కానుంది.అయితే దేవర సినిమా సోలోగా రిలీజ్ కావడం వల్ల మేకర్స్ కు 50 కోట్ల వరకు లాభాలు రానున్నట్లు సమాచారం.ఈ సినిమా సోలోగా రిలీజ్ కావడం వల్ల భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం రానున్నట్లు తెలుస్తుంది.