NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మహిళల భద్రత విషయంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం. బస్ మార్షల్స్ నియమించాలని ఎల్జీకి సిఫార్స్

రాజధాని డిటిసి (ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) బస్సుల భద్రత కోసం మోహరించిన బస్ మార్షల్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని నొక్కి చెబుతూ.. బస్ మార్షల్స్ నియామకం ప్రయాణీకులకు, ముఖ్యంగా మహిళా ప్రయాణీకులకు భద్రతా వాతావరణాన్ని అందించడంలో సహాయపడిందని మంత్రిమండలి పేర్కొంది. బస్సుల లోపల మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడంలో ఈ మార్షల్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని.. వారి పునరుద్ధరణ వల్ల వేధింపులు, నేరాలు, హింస వంటి సంఘటనలను అరికట్టవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపై తక్షణమే దృష్టి సారించాలని, మానవతా దృక్పథంతో దీనిని చూడాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను ముఖ్యమంత్రి తన లేఖలో నొక్కి చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం మహిళల భద్రతగా ఈ అంశానికి ప్రాధాన్యతనిచ్చింది. బస్ మార్షల్‌ల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇచ్చారు.

నేటి బాలలే రేపటి పౌరులు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం, 14 నవంబర్‌ను బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం. దాంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని ఆయన నమ్మాడు. పిల్లలు పూర్తిగా వికసించటానికి సంరక్షణ, పోషణ అవసరమయ్యే మొగ్గల వంటివారని ఆయన తరచుగా చెబుతూ ఉండేవాడు. బాలల దినోత్సవం అనేది పిల్లల అమాయకత్వం, ఉత్సుకత, శక్తి, ఉత్సాహాన్ని జరుపుకునే రోజు. బాలల దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, బాలల హక్కులు, వారి సంక్షేమం , వారి భవిష్యత్తు భద్రత గురించి ఆలోచించడానికి సమయం దొరికిన సందర్భం.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్లు ఆఫర్ చేసింది : సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం బీజేపీపై పెద్ద ఆరోపణ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. అయితే, బీజేపీ ప్రతిపాదనను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంగీకరించడం లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ అంగీకరించలేదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఆ తర్వాత బీజేపీ తనపై తప్పుడు కేసులు పెడుతోందన్నారు. మైసూరు జిల్లా టి నరసిపుర అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.470 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను సిద్ధరామయ్య బుధవారం ప్రారంభించారు.

చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. బద్దలైన రైనా రికార్డు !

తెలుగు తేజం, భారత్ యువ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో తిలక్ సెంచరీ (107 నాటౌట్‌; 56 బంతుల్లో 8×4, 7×6) చేయడంతో ఈ ఫీట్ నమోదు చేశాడు. తిలక్ సెంచరీతో 14 ఏళ్ల సురేశ్ రైనా రికార్డు బద్దలైంది.

2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సురేశ్ రైనా సెంచరీ చేశాడు. 23 ఏళ్ల 156 రోజుల వయసులో మిస్టర్ ఐపీఎల్ ఈ ఫీట్ సాధించాడు. తిలక్ వర్మ 22 ఏళ్ల 4 రోజుల వయసులోనే శతకం సాధించి.. అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ జాబితాలో కివీస్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (26 ఏళ్ల 84 రోజులు), పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ (26 ఏళ్ల 181 రోజులు), విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (27 ఏళ్ల 355 రోజులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మూడవరోజు అసెంబ్లీ సమావేశాలు నేడు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి. బి.సి. జనార్దన్ రెడ్డి – టేబుల్ ఐటెమ్ – 2020-21 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 16వ వార్షిక నివేదిక, కింజరాపు అచ్చెన్నాయుడు, టేబుల్ ఐటెమ్ – 2022-23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క 46వ వార్షిక నివేదిక సమర్పించనున్నారు.

హింసాకాండ.. బూడిదైన 100 వాహనాలు.. 60 మంది అదుపులో

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా సమ్రావత గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన హింసాకాండతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు బృందాలు గస్తీ తిరుగుతున్నాయి. బుధ్రావ్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేష్ మీనా మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నరేష్ మీనా మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారని, అగ్నిప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీంతో స్పందించిన పోలీసులు బాష్పవాయువు షెల్స్‌ను విడుదల చేసి దాదాపు 100 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంతలో అగంతకులు బైక్‌లు, కార్లకు నిప్పు పెట్టారు. రాళ్లదాడిలో 100కు పైగా ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు దగ్ధమయ్యాయి. అదే సమయంలో నరేష్ మీనా మద్దతుదారులైన 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్ మీనాపై నాగర్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయి. ఈ హింసాత్మక ఘటనలో పలువురు గ్రామస్తులు కూడా గాయపడ్డారు.

నేను తాగలేదు.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.. ఇది వాహనదారులపై పోలీసుల రూల్స్‌. మరి ఫుల్‌ గా మద్యం సేవించి పోలీసులే వాహనం నడిపితే. అయితే ఏంటి ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు నిరూపించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో ఓ ట్రాఫిక్‌ ఏసీపీ అదుపులో తీసుకున్న ఘటన దానికి నిదర్శనం. ఓ ట్రాఫిక్‌ ఏసీపీ మద్యం తాగడమే కాకుండా.. పోలీసులతోనే వాగ్వాదానికి దిగాడు. బ్రీత్‌ ఎనలైజర్‌ చేయాలని తెలుపగా నేను తాగలేదు.. ఎందుకు చేయాలని అని వాదించాడు. దీంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఈ హంగామా చోటుచేసుకోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ లో చోటుచేసుకుంది.

బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

నైరుతి ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనమైనప్పటికీ, ఆహార్యం వాతావరణశాఖ అంచనా ప్రకారం, రేపు (నవంబర్ 14) ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగామి రెండు రోజుల్లో (నవంబర్ 15, 16) కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్..

పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి 11 భోగీలు బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈనేపథ్యంలో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు కూడా చేశారు. సుమారు 24 గంటలు శ్రమించి దెబ్బతిన్న ట్రాక్ లను సిద్దం చేశారు అధికారులు. పెద్దపల్లి జిల్లాలో రైళ్ల రాకపోకలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైల్వే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ప్రమాదంలో హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకుని 24 గంటల్లోపు దెబ్బతిన్న ట్రాక్ లను సిద్దం చేసిన అధికారులు. యుద్ద ప్రాతిపాదికన ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు. అప్ లైన్, డౌన్ లైన్ ట్రాక్ లపై రైళ్ల పరుగులు పెట్టనున్నాయి.

 

Show comments