NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పవన్‌ కల్యాణ్‌కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ అలుపెరుగని పోరాట పటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే.

సోమవారం ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగ్గా.. పిఠాపురం నియోజకవర్గంలో పలు పోలింగ్‌ కేంద్రాలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘అభిమానంతో ఓటేయడం వేరు, ఇష్టంతో ఓటేయడం వేరు. కానీ ప్రేమతో ఓటేయడం సంతోషంగా ఉంటుంది. పిఠాపురం నుంచి పోటీ చేయడంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ అలుపెరుగని పోరాట పటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. క్షేత్రస్థాయిలో పని చేసిన నాయకులు, వీరమహిళల శ్రమ వెలకట్టలేనిది. టీడీపీ, బీజేపీ శ్రేణులతో మమేకమైన తీరు మరువలేనిది. పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురం ప్రజలు మరింత బాధ్యతను పెంచారు’ అని అన్నారు.

నేడు వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని మోడీ..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నేడు ( మంగళవారం ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, వారణాసిలో ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్‌ వేసే కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ముఖ్యమంత్రులు వీరే.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పుష్కర్ ధామి (ఉత్తరాఖండ్ ), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్‌), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్ గఢ్ ), ఏక్ నాథ్ షిండే (మహారాష్ట్ర), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), నయాబ్ సైనీ (హర్యానా), ప్రమోద్ సావంత్ (గోవా), ప్రేమ్ సింగ్ తమంగ్‌ (సిక్కిం), మాణిక్ సాహా (త్రిపుర)తో పాటు ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

హమాస్ ఉగ్రవాదం అంతమయ్యే వరకు నిద్రపోం

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు హమాస్‌ మిలిటెంట్లను రాక్షసులతో పోల్చారు. సోమవారం ఆయన హమాస్‌ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము హమాస్‌ చెరలోని బందీలను ఒక్క సెకను కూడా మరిచిపోమన్నారు. బందీలందరినీ ఇంటికి తెస్తామని స్పష్టం చేశారు. వారి ఉగ్రవాదం అంతమయ్యేవరకు నిద్రపోమని తెలిపారు. వాళ్లో.. మేమో తేల్చుకుంటామని హెచ్చరించారు. అక్టోబరు 7 దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ నిర్మూలిస్తామన్నారు. మళ్లీ ఆయుధాలు పట్టకుండా వారి చేతులను నరికేస్తామని చెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు బెంజమిన్.

విడాకులు తీసుకున్న మరో హీరో.. పోస్ట్ వైరల్..

ప్రముఖ సంగీత డైరెక్టర్, హీరో జీవి ప్రకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… సినిమా రిజల్ట్ తో పనిలేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు.. ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు చేస్తున్నాడు.. నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కొన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి.. అయితే జీవి తాజాగా చేసిన పోస్ట్ ప్రస్తుతం ఓ రేంజులో వైరల్ అవుతుంది..

సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి అనేవి కామన్.. నచ్చితే కొద్దిరోజులు డేట్ అంటూ తిరుగుతారు.. ఇష్టం ఎక్కువైతే పెళ్లి చేసుకుంటారు. లేకుంటే మాత్రం ఎవరి దారి వాళ్లు చూసుకొని లైఫ్ ను సాగిస్తారు. అంతేకాదు ఇండస్ట్రీలో విడాకులు కూడా ఎక్కువగానే అవుతాయి.. ఇప్పటికే ఎంతోమంది జంటలు విడాకులను తీసుకున్నారు.. మొన్న హీరో ధనుష్ విడాకులు తీసుకోగా, నిన్న జీవి ప్రకాష్ కూడా విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో నేడు, రేపు జల్లులు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) మే 17 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. IMD ప్రకారం, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మంగళవారం ఏకాంత ప్రదేశాలలో మెరుపులతో కూడిన ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల విషయానికొస్తే, రాబోయే 48 గంటలపాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి.

ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్..!

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ (మంగళవారం) ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో నామినేషన్ వేయబోతున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా.. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, ప్రధాని మోడీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న.. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మోడీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.

అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి కారును ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కారు ధ్వంసమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి కారులోంచి మృతదేహాలను బయటకు తీశారు. హాపూర్ జిల్లాలోని జాతీయ రహదారి 09పై అల్లాభక్ష్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో.. కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపుకు చేరుకుంది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు దుర్మరణం చెందారు.

తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు.. మూడు కేసులు నమోదు..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలపై మూడు కేసులు నమోదు అయ్యాయి. పరస్పరం ఒకరిపై మరొకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు.. కాగా, జేసీ, పెద్దారెడ్డి కుటుంబాల మధ్య జరిగిన దాడిలో గాయపడిన కానిస్టేబుల్ కమల్ భాష ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అష్మిత్ రెడ్డిలతో పాటు మరి కొందరిపై 147, 148, 188, 353, 332 r/w, 149 IPC, 125 RP యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

ముంబై హోర్డింగ్ ప్రమాదం.. 14కి పెరిగిన మృతుల సంఖ్య.. యజమానిపై ఎఫ్ఐఆర్

ముంబైలో హోర్డింగ్ ఘటన తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14కి చేరింది. కాగా, గాయపడిన వారి సంఖ్య 74గా ఉంది. ఈ ఘటనలో మొత్తం 88 మంది బాధితులు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారి చికిత్స ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

ఘట్కోపర్ నుండి వచ్చిన తాజా చిత్రాలు హోర్డింగ్ కింద వాహనం పాతిపెట్టినట్లు చూపుతున్నాయి. అలాగే ఎన్‌డిఆర్‌ఎఫ్ నిరంతరం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, ‘పెద్ద హోర్డింగ్ పడిపోయినప్పుడు నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్న కార్లు, బైక్‌లు, ప్రజలు అందరూ అందులో చిక్కుకున్నారు. మేము ప్రజలు బయటకు రావడానికి సహాయం చేసాము. వారిని ఎలాగైనా రక్షించాము.

జగిత్యాల జిల్లా చిన్నకొల్వాయిలోనూ వంద శాతం ఓటింగ్‌

తెలంగాణలో నిన్న లోక్‌ సభ ఎన్నికలకు పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటువేసుందకు ముందుకు వచ్చారు. అయితే.. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రెండు గ్రామాల్లో వంద శాతం ఓటింగ్‌ జరిగి ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ‌లోని ఆ రెండు గ్రామాల ఓట‌ర్లు ఓటుతో త‌మ చైతన్యాన్ని చాటారు. లోక్‌సభ నాలుగో ద‌శ‌ ఎన్నికల్లో భాగంగా సోమ‌వారం రాష్ట్రంలో పోలింగ్ జ‌రిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్నకొల్వాయిలో వంద‌ శాతం పోలింగ్‌ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం విశేషం.