Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

హైకమాండ్ నుంచి పిలుపు.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం జాతీయ స్థాయిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపికపై… తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఈరోజు ఢిల్లీ వెళ్లి పార్టీ అభ్యర్థులపై చర్చించి తిరిగి హైదరాబాద్ రానున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన పార్టీలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’
హైదరాబాద్‌కు కేంద్రం మంగళవారం భారీ ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’గా జరుపుకుంటామని చెప్పారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌కు 13 నెలలు స్వాతంత్య్రం రాలేదని, నిజాంల పాలనలో ఉందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘ఆపరేషన్ పోలో’ అనే పోలీసు చర్య తరువాత ఈ ప్రాంతం సెప్టెంబర్ 17, 1948 న నిజాం పాలన నుండి విముక్తి పొందింది. సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలన్న డిమాండ్ ఈ ప్రాంత ప్రజల నుంచి ఉంది. నోటిఫికేషన్ ప్రకారం, “ఇప్పుడు, హైదరాబాద్‌ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి.. యువతలో దేశభక్తి జ్వాలలను వెలిగించడానికి, భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’గా జరుపుకోవాలని నిర్ణయించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, రజాకార్లు, భారత యూనియన్‌లో దాని విలీనాన్ని వ్యతిరేకిస్తూ, హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లో చేరాలని లేదా ముస్లిం ఆధిపత్యం కావాలని పిలుపునిచ్చారు.

ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ నుంచి టీజీకి మార్పు…!
తెలంగాణ రాష్టంలోని వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలోని భాగంగా మార్క్‌ ను టీఎస్‌ నుంచి టీజీ కి మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ ను జారీ చేసింది. ఇందుకుగాను 1988లోని సెక్షన్‌ 41(6) మోటారు వాహనాల చట్టం కింద ఉన్న అధికారాలను వాడుకొని 1989 జూన్‌ 12 నాటికి అప్పటి రవాణా శాఖ జారీ చేయబడిన గెజిట్‌ నోటిఫికేషన్‌ లో ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అందులోని నోటిఫికేషన్‌ లో టేబుల్‌ సీరియల్‌ నంబర్‌ 29A కింద.., తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న టీఎస్‌ స్థానంలో అదికాస్తా తాజాగా టీజీ మార్క్‌ కేటాయించినట్లు తెలిపింది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌ మార్క్‌ లో మార్పు చేయాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రివర్గంలో ఈ విషయం ఫై తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞ్యప్తి పంపారు.

నేడు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి సభకు భూమిపూజ..
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తొలిసభను సమన్వయంతో విజయవంతం చేసేందుకు మూడు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని తమ పార్టీల నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక, ఇవాళ (బుధవారం) ఉదయం 9:32 గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయాలని మూడు పార్టీలకు చెందిన నేతలు నిర్ణయించారు. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని కూటమి నేతలు అంటున్నారు. సమయం తక్కువగా ఉండటంతో మెరుగైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక, ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనను ఖరారు చేసింది. ఈ మేరకు 17న చిలకలూరిపేటలో తలపెట్టిన తెలుగుదేశం-బీజేపీ-జనసేన ఉమ్మడి సభకు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు. సభ ద్వారా ఒకే వేదికపైకి నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండనున్నారు. దీంతో మూడు పార్టీలు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభ నిర్వహణపై ఇప్పటికే ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు.. బీజేపీతో ఏఏంఏంకే పార్టీ దోస్తీ..!
త్వరలో జరగబోయే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా తాము బేషరతుగా మద్దతు ఇవ్వనున్నట్లు అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ తెలియచేసారు. ఇందుకు సంబంధించి అర్ధరాత్రి వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి తిరుచ్చిలో మంగళవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాము బీజేపీ కూటమిలో చేరే విషయమై గడిచిన రెండు, మూడు నెలలుగా చర్చలు జరుగుతున్నాయని టీటీవీ దినకరన్‌ తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయానికి తమ పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమిస్తారని దినకరన్‌ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా బీజేపీ పార్టీతో పొత్తుకు ఏఏంఏంకే పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు. తాజాగా టిటివీ దినకరన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో భేటి అయ్యారు. ఇందులో భాగంగా వచ్చే లోక్ సభ ఎన్నికలలో కలసి పోటి చేయడానికి రెండు పార్టీ పరస్పర అంగీకారం తెలిపాయి.

ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ వేగవంతం.. మార్చి 14న సెలక్షన్ కమిటీ సమావేశం
ఎన్నికల సంఘం కొత్తగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనున్నారు. గత నెలలో, అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ పోస్టుల ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ సమావేశం మార్చి 14న జరిగే అవకాశం ఉందని వర్గాలు భావిస్తున్నాయి. ముందుగా ఈ సమావేశం మార్చి 15న సాయంత్రం 6 గంటలకు జరగాల్సి ఉంది. ఈ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రి, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. పాండే పదవీ విరమణ కారణంగా ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయడానికి మార్చి 7న సమావేశం జరగాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేసేందుకు సమావేశం నోటీసు పంపగా, సాయంత్రం గోయల్ రాజీనామా నోటిఫికేషన్ వెలువడిందని వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం సవరించిన నోటీసును న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం పంపింది. శనివారం మధ్యాహ్నం ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేసేందుకు సమావేశం నోటీసు పంపింది.

జస్ట్ 2డేస్ మాత్రమే.. ఇకపై ఆ సర్వీసును బంద్ చేయనున్న పేటీఎం
Paytm కష్టాలు ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. RBI నిషేధం తర్వాత Paytm పేమెంట్స్ బ్యాంక్ గడువు ఇప్పుడు 2 రోజుల్లో ముగియనుంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 15 వరకు గడువు విధించింది. ఇది మార్చి 15 తర్వాత పూర్తిగా మూసివేయబడుతుంది. RBI సూచనల ప్రకారం.. మార్చి 15, 2024 తర్వాత Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో ఎలాంటి లావాదేవీలు ఆమోదించబడవు. Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో ఉన్న మొత్తాన్ని ఏదైనా ఇతర బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని బ్యాంక్ వినియోగదారులకు సూచించింది. Paytm చెల్లింపులపై నిషేధం తర్వాత, ఏ సేవలు అందుబాటులో ఉంటాయి. ఏ సేవలు నిలిపివేయబడతాయో తెలియక చాలా మంది అయోమయంలో ఉన్నారు. దీని తర్వాత కూడా కొన్ని సేవలు కొనసాగుతాయి. డబ్బు ఉపసంహరణ, రీఫండ్, క్యాష్ బ్యాక్, UPI, OTT చెల్లింపుల ద్వారా డబ్బు ఉపసంహరణ వంటివి. ఏ సేవలు పని చేయవు.

ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’లో టాలీవుడ్ యువ హీరో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి. అశ్వని దత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా కల్కి 2898 ఏడీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కల్కి 2898 ఏడీలో టాలీవుడ్ యువ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. ఇటీవల విడుదలైన ‘హనుమాన్’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన తేజ సజ్జా. ప్రభాస్‌ నటిస్తున్న కల్కి 2898 ఏడీలో తేజ నటిస్తున్నాడట. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాత సి. అశ్వని దత్‌తో తేజ కలిసి కనిపించడం ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. తాను చేయాల్సిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, విషయం చెప్పడానికి సరైన క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు.

Exit mobile version