Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి! 11 మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌లోని రాయిసేన్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సుల్తాన్‌పూర్ ప్రాంతంలో పెళ్లి ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ ట్రక్కు అదుపు తప్పి.. జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మందికి పైగా గాయపడగా.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పెళ్లి బృందం హోసంగాబాద్‌ నుంచి పిపరియా గ్రామానికి జాతీయ రహదారిపై ఊరేగింపుగా వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు జనాలను బలంగా ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

8రాష్ట్రాల్లో 100సీట్లపై బీజేపీ అభ్యర్థుల పేర్లపై చర్చ.. రెండో జాబితా ఖరారు!

సోమవారం జరిగిన రెండో ఎన్నికల కమిటీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 100కు పైగా సీట్ల కోసం మేధోమథనం చేసింది. ఆ తర్వాత అభ్యర్థుల రెండో జాబితా దాదాపు ఖరారైంది. ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, బీహార్, హిమాచల్ తదితర రాష్ట్రాల సీట్లపై చర్చ జరిగింది. అదే సమయంలో బీహార్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నందున అక్కడ అభ్యర్థుల జాబితా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో సోమవారం జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా 8 రాష్ట్రాల్లోని 100 సీట్లపై మారథాన్ మేధోమథనం జరిగింది. అయితే బీహార్‌, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుపై పూర్తి స్పష్టత లేకపోవడంతో ఆయా రాష్ట్రాల టిక్కెట్ల విషయంలో జాప్యం జరిగే అవకాశం ఉంది.

గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.. స్వల్పంగా ధరలు తగ్గాయి.. ఇవాళ 10 గ్రాముల బంగారం ధర పై 10 రూపాయలు తగ్గగా.. కిలో వెండి పై రూ.100 మేర తగ్గింది.. గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల రేటు రూ.66,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,500లుగా ఉంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల రేటు రూ.66,260 గా ఉంది.. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260 గా నమోదు అవుతుంది.. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,490, 24 క్యారెట్లు రూ.67,090 గా ఉంది.. ఢిల్లీలో ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,890 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,410 గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,260గా ఉంది..

నేడే ప్రారంభం.. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వందే భారత్ రైలు..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి వందే భారత్ రైళ్లలో మరొకటి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగో వందే భారత్ (Vande Bharat) రైలు పట్టాలనెక్కనుంది. సికింద్రాబాద్‌ – విశాఖపట్నం (Secunderabad- Visakha) మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. తెలంగాణలో మొదలయ్యే ఈ భారత్‌ శ్రేణిలో ఇది నాలుగవది. అయితే, ఇప్పటికే ఈ రెండు స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతుంది. ప్రయాణికుల డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇదే మార్గంలో మరో వందే భారత్ ( Vande Bharat ) రైలును ప్రవేశ పెట్టారు. రేపటి (మార్చి 13 ) నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు తొలి సర్వీస్ నడుస్తుంది అన్నమాట.

నేడు విజయవాడకు సీఎం.. పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్న జగన్..!

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ పార్కును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధి దారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.

నేడు బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం.. హాజరు కానున్న అమిత్ షా

బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నందున ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ఇతర నాయకులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతరం రాష్ట్ర నేతలతో షా భేటీ కానున్నారు. సదస్సు అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో సాయంత్రం 4:45 నుంచి 5:45 గంటల వరకు పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం మెరుగ్గా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు.

కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 62 సీట్లపై చర్చ, నేడు రెండో జాబితా విడుదల!

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) రెండో సమావేశం సోమవారం జరిగింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో 6 రాష్ట్రాల్లోని 62 స్థానాల్లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చర్చించగా, అందులో దాదాపు 40 సీట్లకు ఆమోదం లభించింది. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల రెండో జాబితా వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ పేర్లు ఈ జాబితాలో చేర్చవచ్చు.

రాజస్థాన్‌లోని జలోర్-సిరోహి స్థానం నుంచి వైభవ్ గెహ్లాట్ పేరు ఆమోదం పొందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రాహుల్ కశ్వాన్ ప్రస్తుత పార్లమెంట్ నియోజకవర్గం చురు నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. టోంక్‌ సవాయ్‌ మాధోపూర్‌ నుంచి హరీశ్‌ మీనాను అభ్యర్థిగా బరిలోకి దింపవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, జితేంద్ర సింగ్, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్‌లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరని సమాచారం.

రూ.1200కోట్ల వ్యయంతో సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణ.. నేడు శంకుస్థాపన చేయనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ నేడు గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అహ్మదాబాద్‌లోని సబర్మతిలో ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఇది కాకుండా ప్రధాని మోడీ సబర్మతి ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. అక్కడ కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభిస్తారు. గాంధీ ఆశ్రమ స్మారక చిహ్నం మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభిస్తారు. ఇది కాకుండా అహ్మదాబాద్‌లో రూ. 85 వేల కోట్లకు పైగా విలువైన అనేక రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 10 కొత్త వందే భారత్ రైళ్లను కూడా ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

రూ.1200 కోట్ల వ్యయంతో సబర్మతి ఆశ్రమం పునరుజ్జీవింపబడుతుంది. మాస్టర్ ప్లాన్ కింద ప్రస్తుతం ఉన్న ఐదు ఎకరాల ఆశ్రమాన్ని 55 ఎకరాలకు విస్తరించనున్నారు. ఇది కాకుండా ఆశ్రమంలో ప్రస్తుతం ఉన్న 36 భవనాలను పునరుద్ధరించనున్నారు. నిజానికి, 1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ స్థాపించిన మొదటి ఆశ్రమం సబర్మతీ ఆశ్రమం. ఈ మాస్టర్ ప్లాన్‌లో 20 పాత భవనాల పరిరక్షణ, 13 భవనాల పునరుద్ధరణ, మూడు భవనాల పునరుద్ధరణ ఉన్నాయి.

నేడు ఏపీలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

వైసీపీ 13 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసం వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని జగన్‌ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోతో ఓటర్లను ఆకర్షించిన జగన్‌ ఈ సారి అందులో ఏం పెట్టబోతున్నరాన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది. రైతులు, మహిళలు టార్గెట్‌గా కొత్త పథకాలు ఉండనున్నాయి. ఏపీ ఎన్నికలపై తెలంగాణ పథకాల ప్రభావం పడింది. ఈసారి ఎక్కువగా ఉచిత హామీల ఫై జగన్ దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఉచిత హామీలే కావడం తో జగన్ కూడా అదే బాటలో పయనించబోతున్నారు. ఇదిలా ఉంటే.. మొన్న జరిగి అద్దంకిలో జరిగిన సిద్ధం సభలో మేనిఫెస్టో ఫై జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని.. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని.. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామన్నారు. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు. మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో చూడాలి.

నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో బీజేపీ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ సమావేశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. దీనికి ప్రజలు సహకరించాలని పోలీసులు సూచించారు. వాహనదారులు వేరే ప్రాంతాల నుంచి వెళ్లాలని తెలిపారు. ఇబ్బంది పడకుండా సరైన దారుల్లో వెళ్లాలని.. పోలీసులకు సహకరించాలని కోరారు. షా పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లండించారు. ప్రజలు ప్రత్యేక ప్రత్నామ్నాయ దారులుగుండా వెళ్లాలని తెలిపారు. ఇంపీరియల్ గార్డెన్స్‌, పరేడ్ గ్రౌండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయని పేర్కొన్నారు.

Exit mobile version