NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మరోసారి పతాకధారిగా పీవీ సింధు!

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మరోసారి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పతాకధారిగా వ్యవహరించనున్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలుగమ్మాయి సింధు.. పారిస్‌ ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలను సింధు గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల తరఫున టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్ శరత్‌ కమల్‌ పతాకధారిగా వ్యవహరించనున్నారు.

హైదరాబాదీ మాజీ షూటర్, లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య విజేత గగన్‌ నారంగ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత బృందానికి చెఫ్‌ డి మిషన్‌గా వ్యవహరించనున్నారు. చెఫ్‌ డి మిషన్‌గా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్‌ ఎంపిక కాగా.. ఆమె వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో గగన్‌కు అవకాశం వచ్చింది. ‘మేరీ కోమ్‌ స్థానంలో ఒలింపిక్‌ పతకం గెలిచిన యువ అథ్లెట్‌ కోసం చూస్తుండగా.. గగన్‌ పేరును మా సహచరులు సూచించారు. మేరీకి గగన్‌ సరైన ప్రత్యామ్నాయం. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక మహిళా అథ్లెట్‌ సింధు, దిగ్గజ టీటీ ప్లేయర్ శరత్‌ కమల్‌ పారిస్‌లో పతాకధారులుగా వ్యవహరిస్తారు’అని భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు.

చైనాకు చెక్.. భారత్- ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలు కొనుగోలు..

భారత్‌ త్వరలో 26 మెరైన్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. హిందూ మహా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్ తో భారత్ ఈ ఒప్పందం చేసుకుంది. 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం, ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు సోమవారం నుంచి దాదాపు 10- 12 రోజుల పాటు ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో ఇండియన్ గవర్నమెంట్ గట్టి బేరసారాలు కొనసాగిస్తుంది. దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైగా డీల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులతో చర్చలు కొనసాగిస్తుంది. ఇందులో చాలా వరకు విమానాల ధరకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ డీల్ కోసం ఫ్రాన్స్ రూ. 50 వేల కోట్లకు పైగా డిమాండ్ చేస్తుండగా.. భారత్ మాత్రం ఈ డీల్‌లో ఆయుధాలతోనే విమానాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.. ఒక్కో విమానంలో అనేక రకాల క్షిపణులను అమర్చనున్నారు.. అలాగే, వీటిలో భారత్‌కు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఆయుధాలు కూడా ఉండనున్నాయి.

తంగలాన్ ట్రైలర్…ముహూర్తం ఎప్పుడంటే..?

విక్రమ్ తాజా చిత్రం తంగలాన్, పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో రానుంది ఈ చిత్రం. విక్రమ్ చిత్రాలకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గతంలో వచ్చిన అపరిచితుడు, ఇంకొక్కడు, ఐ తెలుగులో కూడా ఆశించిన కలెక్షన్లు రాబట్టాయి. కాగా తంగలాన్ ఎప్పుడొస్తుందా అని అటు తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ లుక్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండడం, పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కనుండడం విక్రమ్ ఈ సారి హిట్ కొడతాడని అంచనా వేశారు. ఈ చిత్ర టీజర్ వారి అంచనాలను మరింత పెంచేలా చేసింది. టీజర్ లో విక్రమ్ లుక్, చిత్ర నేపథ్యం, విక్రమ్ నటన ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుందనడంలో సందేహం లేదు.

నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..

పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో రోజులు గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన, అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. అందులో భాగంగానే స్వయంగా తెలంగాణ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొన్న వరంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్‌ను మరో హైదరాబాద్‌గా తీర్చిదిద్దాలన్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఆయన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై సమీక్షించనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులు సీఎం సమీక్షలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. అన్ని ఏర్పాట్లను తానే స్వయంగా చేస్తున్నట్టు తెలిపారు.

నేడు అమరావతిలో విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ప్రధానంగా వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశం జరగనున్నట్లు సమాచారం. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైనా ఎస్‌ఎల్‌బీసీ (SLBC)లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అలాగే ఏపీ విద్యుత్‌పై ముఖ్యమంత్రి సాయంత్రం 3 గంటలకు శ్వేత పత్రం విడుదల చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో.. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ అందజేసింది.. మిగతా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. అదేవిధంగా రూ.18 వేల కోట్ల వరకు ప్రజలపై వివిధ భారాలు మోపారు. శ్లాబుల మార్పు, ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు తదితర ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం భారీ వడ్డన మోపింది. షిర్డీ సాయి ఎలక్ట్రానిక్స్‌ కేటాయించిన కాంట్రాక్టులపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ట్రాన్స్‌ఫార్మర్లను అధిక ధరకు కొనుగోలు చేసినట్లు కూడా చెప్పనున్నారు.

నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క..

నేడు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ములుగుజిల్లా కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభోత్సవంతో పాటు, దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వాహనాలు, చక్రాల కుర్చీల పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించిన విషయం తెలిసందే.. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. నాణ్యత లేని గుడ్లు, వస్తువులు సరఫరా అయితే వాటిని అంగన్వాడీ కేంద్రాలు తిరస్కరించాలని మంత్రి సూచించారు.

విజయ్ సర్‌కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: తెలుగమ్మాయి ఆనంది

తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్‌ కొన్ని నెలల క్రితం ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పోటీ చేయనున్నారు. పార్టీ పెట్టినప్పటినుంచి విజయ్‌కి మద్దతుగా చాలామంది నటీనటులు మద్దతు పలికారు. తాజాగా ఈ జాబితాలోకి తెలుగమ్మాయి ఆనంది చేరారు. రాజకీయాల్లో విజయ్ సర్‌కి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆనంది పేర్కొన్నారు.

తాజాగా హీరోయిన్ ఆనంది తిరుచ్చిలో ఓ బ్యూటీపార్లర్‌ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆనంది సమాధానం ఇచ్చారు. విజయ్ రాజకీయ ప్రవేశం గురించి అడగ్గా.. ‘విజయ్ సర్ రాజకీయాల్లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సమాజానికి సేవ చేయాలని విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. నా మద్దతు ఎల్లప్పుడూ విజయ్‌కే ఉంటుంది’ అని ఆనంది చెప్పారు. ‘సినిమా చిత్రీకరణ కోసం పలుమార్లు తిరుచ్చికి వచ్చా. ఇది నాకు ఎప్పటికీ మరచిపోలేని ప్రాంతం. ఇక్కడ దొరికే పలు రకాల ఆహార పదార్థాలు చాలా ఇష్టం. ప్రస్తుతం తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నా’ అని ఆమె చెప్పారు.

ఈ రోజు రాయ్‌బరేలీలో రాహుల్‌గాంధీ పర్యటన.. కార్యకర్తలతో భేటీ..!

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేటి (మంగళవారం) ఉదయం 9.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భూమా అతిథి గృహానికి చేరుకోనున్నారు. అతిథి గృహంలో పార్టీ కార్యకర్తలతో రాహుల్ సమావేశమవుతారు. జిల్లా అభివృద్ది పనులపై ఆయన పార్టీ కార్యక్తరలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే, నియోజకవర్గ ప్రజలతో, కార్మికులతో సమావేశమై వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ త్రిపాఠి తెలిపారు.

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఎంపీ, ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ ఇవాళ తన సన్నిహితుల మధ్య ఉండనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాహుల్ తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించడం ఇది రెండోసారి.. ఈ సమయంలో ఆయన తన ఆత్మీయుల కష్టాలను వినడమే కాకుండా జిల్లా అభివృద్ధిలో వాస్తవికతను కూడా తెలుసుకోనున్నారు. ఈ స‌మ‌యంలో రాహుల్ త‌ల్లి రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఫండ్స్ నుంచి రాహుల్ చేసిన ప‌ని గురించిన స‌మాచారం కూడా తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ ఒకరోజు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూమా అతిథి గృహంలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీని మరింత శక్తివంతం చేయడంపై చర్చించే అవకాశం ఉంది.

బిగ్గెస్ట్‌ ఐమాక్స్‌లో ‘కల్కి’ చూడనున్న నాగ్‌ అశ్విన్‌!

రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ సినిమా రూ.900 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కన్పిస్తున్నాయి. దీంతో త్వరలోనే కల్కి రూ.1000 కోట్లు వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్‌ కావడంతో ప్రభాస్‌ ఫాన్స్ ఆనందంలో తేలియాడుతున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు ముందు నుంచే అమెరికాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన నాగ్‌ అశ్విన్‌.. వారితో కలిసి కల్కి సినిమా చూసేందుకు సిద్ధమయ్యారు. అమెరికాలోని బిగ్గెస్ట్‌ ఐమాక్స్‌లో ఈ శనివారం (జులై 13) మధ్యాహ్నం 2:30 గంటలకు అభిమానులతో కలిసి ఆయన కల్కి చూడనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. షో అనంతరం అభిమానులతో కలిసి నాగ్‌ అశ్విన్‌ విజయోత్సవాలు జరుపుకోనున్నారు.

డీఎస్సీ వాయిదా వేయండి.. అర్ధరాత్రి అభ్యర్థుల ఆందోళన..

డీఎస్సీని వాయిదా వేయాలని ఉస్మానియా వేదికగా డీఎస్సీ అభ్యర్థులు అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. నిన్న ప్రభుత్వం తమ సమస్యలను నెరవేర్చాలంటూ ఆందోళన చేసిన డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజీ గ్రౌండ్ లో ఉంచారు. రాత్రి సిటీ కాలేజ్ నుండి ఉస్మానియా క్యాంపస్ వరకు అర్థరాత్రి డీఎస్సీ అభ్యర్థులు ర్యాలీగా ఉస్మానియా యూనివర్శిటీకి చేరుకొని ఆందోళన చేపట్టారు. రాత్రి అవుతున్నా మహిళలు అని చూడకుండా.. లైట్లు లేకపోయినా అక్కడే ఉంచారు. కనీసం తాగడానికి నీళ్ళు లేక లైట్లు ఆపేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వీరి ఆందోళన పట్టించుకోని విద్యాశాఖ ప్రకటించిన విధంగా జులై 11 నుండి హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది. యదావిధిగా జులై 18 నుండి డి.ఏస్.సి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించింది. దీంతో మా ఆందోళనను అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే డీఎస్సీని 3 నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నారు. గతంలో టెట్ ఎక్జామ్ వ్రాసి అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పటికే ఆలస్యమైందన్నారు. కావున వెంటనే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మద్య టెట్ లో అర్హత సాధించిన వారే వాయిదా కావాలంటున్నారు. వీరి ఆందోళనకు విద్యార్థి నాయకులెవరు మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం.