NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

నేడు ఏపీకి రేవంత్‌రెడ్డి.. ప్రత్యేక విమానంలో విజయవాడకు..

వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా అందరూ ప్రజాభవన్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి గాంధీభవన్‌కు చేరుకుని వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని సమీక్షించనున్నారు.

అతడే టీమిండియా అత్యుత్తమ కెప్టెన్: గంభీర్

ప్రతిసారి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అక్కసు వెళ్లగక్కే మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఈసారి ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ధోనీ అని పేర్కొన్నాడు. భారత్ తరఫున మహీ సాధించిన రికార్డును అందుకోవడం చాలా కష్టమన్నాడు. ఇద్దరం కలిసి ఎన్నో మధుర క్షణాల్లో భాగస్వామిగా ఉన్నామని గౌతీ గుర్తుచేశాడు. ఆదివారం (జులై 7) ధోనీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ధోనీ గురించి స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేయగా.. అందులో గంభీర్ మాట్లాడాడు.

‘ఎంతో మంది కెప్టెన్లు వస్తారు, వెళతారు. భారత జట్టులో ఎంఎస్ ధోనీ రికార్డును అందుకోవడం చాలా కష్టం. టెస్ట్‌లలో నంబర్ 1 ర్యాంక్ అందుకోవచ్చు,విదేశీ మ్యాచ్‌లను గెలవవచ్చు కానీ.. రెండు ఐసీసీ ప్రపంచకప్‌లను, ఓ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవడం ఎంతో ప్రత్యేకం. ఇంత కంటే గొప్ప విజయం మరొకటి లేదు. మేం ఇద్దరం కలిసి ఎన్నో కీలక ఘట్టాల్లో పాలుపంచుకున్నాం. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియాలో కామెన్‌వెల్త్ సిరీస్, న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్ విజయాలు.. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ డ్రా చేయడం, ఆసియా కప్ విజేతగా నిలవడం.. ఇలా ఎన్నో మధుర క్షణాల్లో భాగస్వామిగా ఉన్నాను. ధోనీ భారతదేశ అత్యుత్తమ కెప్టెన్’ అని గౌతమ్ గంభీర్ వీడియోలో పేర్కొన్నాడు.

నేడు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర విసృతస్థాయి సమావేశం

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వా తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన నేడు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. రాజమహేంద్రవరం లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, జాతీయ నేతలు శివప్రకాశ్ జీ, అరుణ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొంటారని సామించి శ్రీనివాస్ చెప్పారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ..”గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ కేంద్రంగా తిరుమల శ్రీవారి ఆస్తులు, నిధులు దుర్వినియోగం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని జగన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. వైసీపీ అభ్యర్థిని గెలుపించుకోవాడనికి తిరుమల నిధులను అప్పటి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వాడుకున్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వీర విధేయులకు మాత్రమే తిరుమల కొండ మీద షాపులు కేటాయించారన్నారు.

నేడు రష్యాకు ప్రధాని మోడీ.. కీలక అంశాలపై చర్చ..!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో– రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపే అవకాశం ఉంది. పలు రంగాల్లో విస్తృత స్థాయి సహకారంపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగాక మోడీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే, మూడేళ్ల విరామం తర్వాత భారత్‌– రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతుండటంతో ఈ సమిట్‌లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది.

నేపాల్‌లో వరద బీభత్సం.. ఇప్పటివరకు 62 మంది మృతి

రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి గత నాలుగు వారాల్లో నేపాల్‌లో వర్ష బీభత్సానికి కనీసం 62 మంది మరణించారు మరో 90 మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగులు కారణంగా ఈ రుతుపవనాల మరణాలకు ప్రధాన కారణాలని హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. మృతుల్లో 34 మంది కొండచరియలు విరిగిపడగా, 28 మంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మరణించారని అధికారులు తెలిపారు. ఇది కాకుండా ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏడుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు తర్వాత వరదలు, కొండచరియలు కూడా గణనీయమైన ఆస్తి నష్టం కలిగించాయి. కనీసం 121 ఇళ్లు నీట మునిగాయి, 82 ఇళ్లు దెబ్బతిన్నాయి. రుతుపవనాల వరదలు, కొండచరియలు విరిగిపడటం, వరదల వల్ల ప్రభావితమైన ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ అన్ని రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశించారు.

రేపు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం వద్ద ఆంక్షలు..

రేపు (జూలై 9)న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కల్యాణం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారించారు.జూలై 8న కళాకారులతో పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్ ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9న ఆలయానికి తూర్పు వైపున ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో అమ్మవారి కల్యాణం నిర్వహిస్తారు. 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో రథోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఇదేం మాస్ కాపీయింగ్ మామ.. పరీక్షా హాల్లో విద్యార్థులందరూ ఒకేచోట..

పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై దేశంలో కలకలం రేగుతోంది. నీట్ యూజీ, యూజీసీ నెట్ సహా పలు పెద్ద పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ, సుప్రీంకోర్టుకు చేరింది. ఇది ఇలా ఉండగా మరోవైపు మధ్యప్రదేశ్‌ లోని జీవాజీ యూనివర్శిటీలో దారుణమైన కాపీయింగ్ వెలుగుచూసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తిరుగుతూ ఒకరి పేపర్లను మరొకరు కాపీ కొట్టుకుంటున్నారు. చాలామంది విద్యార్థులు గుంపుగా ఓ డెస్క్ వద్ద కాపీ చేస్తున్నారు. ప్రస్తుతం BA B.Sc పరీక్షలను జీవాజీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. భింద్‌ లోని జివాజీ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో మాస్ కాపీయింగ్ సంఘటన వెలుగు చూసింది. ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు సామూహికంగా కాపీ చేసినట్లు తెలుస్తోంది. SDM పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పుడు అక్కడ అంత సాధారణంగా కనిపించింది. అయితే., అనంతరం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అక్కడ ఉపాధ్యాయులు కాపలా కాసేలా వ్యవహరిస్తున్నారు. మొత్తం విషయం భింద్‌ లోని దామోహ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి సంబంధించినది అని ఎస్‌డీఎం విజయ్‌ సింగ్‌ అన్నారు.

తిరుపతి తరహాలో భక్తులకు యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం..

తిరుమల తిరుపతి మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తులకు స్వయంభూ దర్శనం లభించనుంది. మహాముఖ మండపంలో భక్తులు దూరం నుంచి మూలవరులను చూస్తూ గర్భాలయానికి చేరుకునేలా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. వచ్చే బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని యాదాద్రి ఈవో భాస్కర్ రావు ఈటీవీ భారత్ కు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తులకు తీర్థంతో పాటు శఠగోపాన్ని అనుగ్రహిస్తారని వివరించారు. అందుకోసం ప్రత్యేక పూజారిని నియమిస్తామన్నారు.ఈ నెల 10వ తేదీ బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నేడు, రేపు భారీవర్షాలు.. 11 జిల్లాలకు భారీ వర్షసూచన..

వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు, ప్రజలకు వాతావరణ శాఖ ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాకాలం వచ్చేసింది. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. వర్షాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అధికారుల ప్రకటనలు కొంత ఊరటనిస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.