NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటి నుంచి అమరావతిలో ముళ్ల కంపలు, తుమ్మ చెట్ల తొలగింపు ప్రారంభం..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు తొలి అడుగు పడబోతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వివక్షకు గురైన అమరావతి రాజధానిని మళ్లీ గాడిన పెట్టేందుకు వీలుగా టీడీపీ సర్కార్ తీసుకున్న చర్యలలో భాగంగా ఇవాళ (బుధవారం) తొలి అడుగుగా కంప చెట్లు, పిచ్చి చెట్లు, తుమ్మ చెట్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అమరావతి రాజధాని అంతా గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పిచ్చి చెట్ల, ముళ్ల చెట్లతో మొత్తం అడవిలా మారిపోయింది. దీంతో వీటిని తొలగించేందుకు సీఆర్‌డీఏ అధికారులు 36.50 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా, సీఆర్డీఏ అధికారులు టెండర్లను ఇటీవలే ఖరారు చేశారు. ఎన్‌సీసీఎల్‌ సంస్థ ఈ టెండర్లను దక్కించుకోవడంతో.. నేటి (బుధవారం) ఉదయం 8 గంటలకు ఎన్‌సీసీఎల్‌ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు చేపట్టబోతుంది. సెక్రటేరియట్‌ వెనుక వైపున ఎన్‌ 9 రోడ్డు నుంచి ఈ పనులు స్టార్ట్ కానున్నాయి. మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఈ పనులను ఆరంభించనున్నారు. ఈ పనులపై మంత్రి మంగళవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జంగిల్‌ క్లియరెన్స్‌ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. రాజధాని క్యాపిటల్‌ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలు పెట్టబోతున్నామని వెల్లడించారు. నెల రోజుల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

జల వనరుల శాఖ అధికారులకు సీఎం కీలక సూచనలు..కరవు పరిస్థితులను సైతం అధిగమించేలా చర్యలు

ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వస్తున్న వరద నీటిని వినియోగించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తిగా నీటితో నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జల వనరులు శాఖ అధికారులను ఆదేశించారు. నీటి వృధాను అరికట్టి ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడాలని స్పష్టం చేశారు. కరవు పరిస్థితులను సైతం అధికమించేందుకు వీలుగా అన్ని రిజర్వాయర్లను, మైనర్ ఇరిగేషన్ చెరువులను నీటితో నింపాలన్నారు. జలవనరుల శాఖపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఉన్న నీటి లభ్యత, తదితర అంశాలపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ రిజర్వాయర్లు, ఇతర ప్రాజెక్టులకు ఎంత నీరు వచ్చి చేరింది, పూర్తి స్థాయిలో నిండక పోవడానికి గల కారణాలను క్షేత్ర స్థాయి నుండి విశ్లేషించుకోవాలని అధికారులకు సూచించారు.

నేడు చీరాల మండలానికి చంద్రబాబు..చేనేత కార్మికులతో ముఖాముఖి

చీరాల మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అనంతరం చేనేత కార్మికులతో కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఉన్న హెలీప్యాడ్ నుంచి సీఎం బయలుదేరుతారు. 3.35కు చీరాలలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకి స్వాగతం పలుకుతారు. అనంతరం రోడ్డు మార్గం గుండా 3.50కు జాండ్రపేటలోని బీవీ అండ్ బీఎన్ హైస్కూల్ ప్రాంగణానికి చంద్రబాబు చేరుకుంటారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికుడి గృహాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత వీవర్స్ సర్వీస్ సెంటరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
చివరగా 5.30కు సభాస్థలి నుంచి బయలుదేరి 5.40 గంటలకు హెలీప్యాడ్ కి చేరుకుని వెలగపూడికి బయలుదేరి వెళతారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థిగా పీలా గోవింద సత్య?

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే చల్లారుతోంది. తాజాగా రాజ‌కీయ పార్టీల‌కు మళ్లీ ప‌రీక్ష మొద‌లైంది. అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాద‌వ్ వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ప‌ద‌వికీ రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేరారు. ఆయ‌న రాజీనామాను అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే శాస‌న‌మండ‌లి ఛైర్మన్ ఆమోదించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ కూట‌మి ఎలాగైన ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాల‌ని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త‌మ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవ‌డానికి వైసీపీ కూడా అదే స్థాయిలో వ్యూహా ర‌చ‌న చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ ఇప్పటికే ఉత్తరాంధ్రాలో సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి బొత్స స‌త్యన్నారాయ‌ణను అభ్యర్థిగా ప్రక‌టించింది.

ఇవాళ బంగ్లాదేశ్‌కు ఎయిరిండియా ప్రత్యేక విమానం

ఆందోళనలు కొనసాగుతున్న బంగ్లాదేశ్‌కు ఎయిరిండియా ఇవాళ (బుధవారం) విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. ముందే షెడ్యూల్‌ చేసిన సర్వీసులను యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది. విస్తారా, ఇండిగో సైతం అదే బాటలో వెళ్తున్నాయి. ఆ దేశ రాజధాని ఢాకాకు విమానాలు వెళ్తాయని పేర్కొనింది. మరోవైపు బంగ్లాలో ఉన్న భారతీయులను భారత్‌కు చేర్చేందుకు ఎయిరిండియా నేడు ఒక ప్రత్యేక విమానాన్ని సైతం ఢాకాకు పంపబోతున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే, ఎయిరిండియా నిన్న (మంగళవారం) సాయంత్రం ఢాకాకు ఓ విమానాన్ని పంపింది. ఉదయం మాత్రం క్యాన్సిల్ చేసింది. ఈ సంస్థ రోజుకు రెండు విమానాలను ఢాకాకు నడిపిస్తుంది. విస్తారా ప్రతి రోజు ముంబయి నుంచి ఢాకాకు రెండు, ఢిల్లీ నుంచి ఢాకాకు వారానికి మూడు సర్వీసులను కొనసాగిస్తుంది. ఇండిగో ఢిల్లీ, ముంబయి, చెన్నై నుంచి ఢాకాకు రోజుకొక విమాన సర్వీసును నడిపిస్తున్నట్లు ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో విస్తారా, ఇండిగో సైతం మంగళవారం తమ రోజువారీ విమానాలను మాత్రం క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందే టికెట్ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఆయా సంస్థలు తగిన ఆఫర్లను అందిస్తుంది.

గోల్డ్ మెడల్ తీసుకువస్తా.. మాటిచ్చిన వినేశ్‌ ఫొగాట్‌!

ఒలింపిక్స్‌ చరిత్రలో ఫైనల్‌ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో మంగళవారం జరిగిన సెమీస్‌లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ గుజ్మన్‌ లోపేజ్‌ను వినేశ్‌ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన వినేష్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ గెలుపుతో వినేష్ కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో టోక్యో కాంస్య విజేత, అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్‌ ఫొగాట్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 11.23 గంటలకు జరగనుంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా వినేశ్‌ బరిలోకి దిగుతోంది. గోల్డ్ మెడల్ తీసుకువస్తా అని వినేశ్‌ తన తల్లికి మాట ఇచ్చింది. సెమీస్‌ విజయం తర్వాత వినేష్ వీడియో కాల్‌లో తన తల్లితో మాట్లాడారు. ఈ సమయంలో వినేష్ తన కుటుంబ సభ్యులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. భావోద్వేగానికి గురైంది. వీడియో చివర్లో ‘గోల్డ్ లానా హై’ (నేను బంగారం తెస్తా) అని తన తల్లితో అన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం.. చున్నీతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..

చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో.. గురువులు మందలించారనో.. ప్రేమ విఫలమైందనో ఇలా పులు కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్షణికావేశానికి లోనై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు చనిపోయాక.. కన్న తల్లిదండ్రు అనుభవించే ఆవేదనను ఒక్కసారి కూడా గుర్తు చేసుకోవడం లేదు. తాజాగా వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి ట్రిబుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేంపల్లి ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం చోటుచేసుకుంది. బాత్రూంలో వాటర్ లైన్ పైపుకు చున్నీతో ఉరి వేసుకుని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జమీషా ఖురేషి గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఫైనల్ ఇయర్ కు చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ క్యాంటీన్ వద్ద పోయింది. మిస్ అయిన మొబైల్ ఫోన్ ను జమీషా ఖురేషి తీసుకున్న విషయాన్ని గుర్తించి ట్రిబుల్ ఐటీ అధికారులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలులోస్తున్నాయి.

జ్ఞాన్‌వాపిలో కొత్త ఆలయ నిర్మాణంపై నేడు కోర్టులో విచారణ..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వార‌ణాసి జిల్లాలో ఉన్న జ్ఞానవాపిలో వివాదాస్పద కట్టడమైన ప్రధాన గోపురం కింద ఏఎస్‌ఐ విచారణ జరిపించాలని వదామిత్ర డిమాండ్ చేస్తుంది. న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగి వాదన పూర్తికాకపోవడంతో కోర్టు మరో వాదనను కొనసాగించింది. జ్ఞానవాపిలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, అక్కడ హిందూవుల పూజలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు లార్డ్ అవిముక్తేశ్వర్ విరాజ్‌మాన్ తరపున హిందూ సేనకు చెందిన అజిత్ సింగ్, విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్ ఫాస్ట్‌ట్రాక్) ప్రశాంత్ కుమార్ ధర్మాసనంలో పెండింగ్‌లో ఉంది.

షేక్ హసీనా, రెహానాలను అరెస్టు చేయండి.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎస్‌సీబీఏ వినతి..!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్టు చేసి తమ దేశానికి పంపించాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌ను కోరారు. ఎస్‌సీబీఏ ఆడిటోరియంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాలో హసీనా అనేక మరణాలకు బాధ్యురాలని ఆరోపణలు చేశారు. అలాంటి వారితో సానుకూల సంబంధాలు ఎలా కొనసాగిస్తారు.. భారత్ దేశ ప్రజలతో బంగ్లాదేశ్ సానుకూల సంబంధాలు కొనసాగించాలని అనుకుంటుంది.. కాబట్టి వెంటనే హసీనా, రెహనాలను తమకు అప్పగించాలని మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ కోరారు.

 

Show comments