నేడు అనకాపల్లిలో జనసేన చీఫ్ రోడ్ షో..
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా నేడు (ఆదివారం) అనకాపల్లికి రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3. 30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రింగ్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజారు, చిన్న నాలుగు రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకూ వారాహి వాహనంలో పవన్ కళ్యాణ్ రోడ్డు షో చేస్తారు. నాలుగు గంటలకు నెహ్రూ చౌక్ కూడలిలో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లడనున్నారు.
ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 7,500 పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ ఈ అరుదైన రికార్డు అందుకున్నాడు.
ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 130.36 స్ట్రైక్ రేట్‌తో 7575 పరుగులు చేశాడు. ఐపీఎల్‍లో 7 వేల మార్క్ పరుగులను కూడా మరే బ్యాటర్ చేయలేదు. ఐపీఎల్‍లో అత్యధిక పరుగుల రికార్డు విరాట్ పేరిటే ఉంది. టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ 221 మ్యాచ్‌లలో 6754 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 180 మ్యాచ్‌లలో 6545 రన్స్ బాదాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (6280 పరుగులు-246 మ్యాచ్‌లు), మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా (5528 పరుగులు-205 మ్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
నేడు బీహార్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (7 ఏప్రిల్ 2024) బీహార్‌లో పర్యటించనున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్‌కు మద్దుతుగా ప్రచారం చేయబోతున్నారు. అలాగే, నవాడాలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే, నవాడా జనసభలో బీజేపీ నేతలతో పాటు ఎన్డీయే కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీల సభ్యులు కూడా పాల్గొంటారు. అయితే, బీహార్‌లో వారం రోజుల వ్యవధిలో రెండవ సారి ప్రధాని ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంతకుముందు.. ఏప్రిల్ 4వ తేదీన జాముయి స్థానం నుంచి NDA తరపున లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రారంభించారు. ఇక, నవాడాలో ప్రధాని మోడీ కార్యక్రమం దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి దశ లోక్‌సభ ఎన్నికలలో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన గయా, ఔరంగాబాద్, జాముయితో పాటు నవాడా లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.
జమ్మూ కాశ్మీర్‌లో మూడోసారి భూకంపం..
జమ్మూకశ్మీర్‌లో భూకంపం గత కొద్దిరోజులుగా భూకంపం వస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం తెల్లవారుజామున 2: 47 గంటల సమయంలో సంభవించింది తెలిపారు. అలాగే, నిన్న కూడా జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.
నేడు కృష్ణాజిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
నేడు కృష్ణాజిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో పాల్గొనున్నారు. అంతేకాకుండా.. ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. నేడు కృష్ణా జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు రాష్ట్రమంతటా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మలి విడత యాత్రలో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నిన్న పల్నాడు జిల్లాలో పర్యటించారు. పామర్రు, ఉయ్యూరులో… ఈరోజు చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజాగళం పేరిట సభలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈరోజు చంద్రబాబు కృష్ణా జిల్లాలోని పామర్రు, ఉయ్యూరులలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు తన సభల్లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తమ కూటమికి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
నిజామాబాద్ లో దారుణం.. బాలికను గర్భవతి చేసిన యువకుడు
చట్టాలుమారుతున్న మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజు ఏదో ఒకచోటు ఆడవారిపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ లో చోటుచేసుకుంది. 9వ తరగతి బాలికను ఓ యువకుడు గర్భవతి చేసిన ఘటన ఆగ్రామం ఉలిక్కిపడేలా చేసింది.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ లో 9వ తరగతి చదువుతున్న బాలికను అదేగ్రామానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు. తనను రోజూ కలిసేవాడు. మాయమాటలు చెబుతూ బాలికను మెల్లిగా తనవైపు మలుచుకున్నాడు. బాలికను మాటలతో మభ్యపెట్టాడు. రోజూ ఓ ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు.. అయితే కొన్ని నెల తరువాత బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలికను కలిస్తే మళ్లీ తనను ఏం చేస్తారో అనేభయంతో యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు ఏదో కోల్పోయినట్లు ఉడటంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో బాలిక అసలు విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే పోలీస్ స్టేషన్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్..!
ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్ తో పాటు ఇతర ఉగ్రవాదులతో పోరాడుతుండగా, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఇజ్రాయెల్‌లో మరోసారి వీధుల్లోకి వచ్చారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ.. దేశంలో ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూ నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ప్రజలను విడుదల చేయాలని కూడా నిరసనకారులు పిలుపునిచ్చారు.
నేడు పదోరోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర
నేడు పదోరోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర కొనసాగనుంది. ప్రకాశం జిల్లాలో జగన్ బస్సుయాత్ర కొనసాగుతుంది. పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్లకు జగన్. సాయంత్రం కొనకనమెట్ల క్రాస్ దగ్గర బహిరంగ సభకు చేరుకుంటారు. అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల, పొదిలి, రాజంపల్లి దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి జగన్. వెంకటాచలంపల్లిలో రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు జువ్విగుంట క్రాస్‌లో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు.
దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు ఈసారి బీజేపీకి ఓట్లు వేయరు..
లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి అయితే దేశం ఇంకోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. భారత్‌లో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చి వేసి.. నిరంకుశత్వాన్ని తీసుకువస్తారని మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశం నిరంకుశ రాజ్యంగా మారకుండా అడ్డుకోవటమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలో వస్తే.. బీజేపీకి కూడా ఎలాంటి లబ్ధి జరుగదు అని తెలిపారు. నెమ్మదిగా బీజేపీ పార్టీ తన ఉనికి కోల్పోతుంది.. కేవలం నరేంద్ర మోడీ మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు.
