NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నవారో సంచలనం.. యుఎస్‌ ఓపెన్‌లో కొకో గాఫ్‌ కథ ముగిసే!

యుఎస్‌ ఓపెన్‌ 2024 నుంచి టాప్ సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. పురుషుల టైటిల్ ఫెవరెట్స్ నొవాక్ జకోవిచ్‌, కార్లోస్ అల్‌కరాజ్‌ ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళల డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొకో గాఫ్‌ కథ కూడా ముగిసింది. గాఫ్‌కు అమెరికాకే చెందిన 13వ సీడ్‌ ఎమ్మా నవారో ప్రిక్వార్టర్స్‌లో షాకిచ్చింది. నాలుగో రౌండ్లో 6-3, 4-6, 6-3తో గాఫ్‌ను నవారో ఓడించింది. 60 అనవసర తప్పిదాలు చేసిన గాఫ్‌ మూల్యం చెల్లించుకుంది. నవారోకు యుఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌ చేరడం ఇదే తొలిసారి. రెండో సీడ్‌ అరీనా సబలెంక (బెలారస్‌) క్వార్టర్స్‌లో ప్రవేశించింది. నాలుగో రౌండ్లో 6-2, 6-4తో మెర్టెన్స్‌ (బెల్జియం)ను సునాయాసంగా ఓడించింది. ఏడో సీడ్‌ జెంగ్‌ (చైనా) కూడా క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లో 7-6 (7-2), 4-6, 6-2తో వెకిచ్‌ (క్రొయేషియా)ను మట్టికరిపించింది. ముచోవా (చెక్‌) 6-3, 6-3తో పావోలిని (ఇటలీ)పై, ఆరో సీడ్‌ పెగులా (అమెరికా) 6-4, 6-2తో ష్నైదర్‌ (రష్యా)పై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!

పారిస్‌ పారాలింపిక్స్‌ 2024లో సోమవారం భారత్ ఖాతాలో ఏకంగా ఆరు పతకాలు చేరాయి. షూటర్ నితేశ్‌ కుమార్‌ ఎస్‌ఎల్‌-3 విభాగంలో స్వర్ణం గెలిచాడు. ఎస్‌ఎల్‌-4లో సుహాస్‌ యతిరాజ్‌ రజతం సాధించాడు. మహిళా షూటర్లు తులసిమతి మురుగేశన్ రజతం, మనీషా రామ్‌దాస్‌ కాంస్యం సాధించారు. డిస్కస్‌ త్రోలో యోగేశ్‌ కతూనియా రజత పతకం గెలిచాడు. ఆర్చరీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శీతల్‌ దేవి, రాకేశ్‌ కుమార్‌ జోడి కాంస్యం సాధించింది. ఇప్పటివరకు భారత్ 15 మెడల్స్ ఖాతాలో వేసుకుంది. నేడు కూడా మనకు కీలక పోటీలు ఉన్నాయి. నేటి భారత షెడ్యూల్ను ఓసారి చూద్దాం.

హర్యానా ఎన్నికల్లో ఆప్‌తో పొత్తుపెట్టుకునేందుకు రాహుల్ గాంధీ ఆసక్తి..

హర్యానా ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల మొదటివారంలో ఈ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, వరసగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు కూడా తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో సొంతగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇది తమకి మైనస్‌గా మారి, బీజేపీకి ప్లస్ అవుతుందేమో అని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అనుకుంటోంది. అయితే, రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు పెట్టుకునేందుకు రాహుల్ గాంధీ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, ఆప్‌తో పొత్తుకు అవకాశంపై హర్యానా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా, గుజరాత్, గోవా, ఢిల్లీ, చండీగఢ్‌లలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేశాయి.

వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మూడు రోజుల్లో మరో ముప్పు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలు సోమవారం నాటికి తగ్గుముఖం పట్టినా ముసురు మాత్రం ఎడతెరిపి లేకుండా పోతోంది. సోమవారం రాత్రి 9 గంటల వరకు నగరంలోని నాగోల్‌లో అత్యధికంగా 1.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీరం దాటిన వాయుగుండం 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. కాగా.. నేటి నుంచి వచ్చే 4 రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

భారీ వానలు.. తెలంగాణలో 1400 బస్సులు రద్దు..

భారీ వర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బస్సులను రద్దు చేశారు. ఆదివారం రాత్రి వరకు 877 బస్సులను రద్దు చేశారు. అదేవిధంగా సోమవారం ఉదయం నుంచి 570 బస్సులను రద్దు చేశారు. ప్రధానంగా మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే బస్సులను పూర్తిగా రద్దు చేశారు. ఇవాళ (మంగళవారం) కూడా ఆయా రూట్లలోని రోడ్లన్నీ జలమయం కావడంతో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 1400కు పైగా బస్సులను టీజీఎస్ ఆర్టీసీ రద్దు చేసింది. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ బస్సులను నడుపుతామని చెప్పారు. మరికొన్ని బస్సులను దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు.

నేడు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ వ్యూ

బుడమేరు కాలువ, కృష్ణానది కారణంగా విజయవాడలో వరదలు ఎన్నడూ లేనంతగా అజిత్ సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, నున్న, పాయకాపురం, ప్రస్తుతం రామలింగేశ్వరనగర్, భవానీ పురంలపై ప్రభావం చూపుతున్నాయి. సోమవారం ఈ ప్రాంతాలు నీట మునిగాయి, వేలాది మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు. సోమవారం తెల్లవారుజామున కృష్ణానది నుంచి వరదనీరు ప్రవహించడంతో రామలింగేశ్వరనగర్‌లోని ఇళ్లలోకి ప్రహరీ గోడలు విరిగిపడ్డాయి. ఆరు అడుగుల మేర నీరు చేరడంతో పోలీస్ కాలనీతోపాటు చుట్టుపక్కల రోడ్లపైకి నీరు చేరింది. అయితే.. ఈ నేపథ్యంలోనే వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నేడు ఏరియల్‌ వ్యూ చేయనున్నారు. అయితే.. ఆదివారం సాయంత్రం నుంచి యుద్ధప్రాతిపదికన రెస్క్యూ, రిలీఫ్‌ ఆపరేషన్స్‌ను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత ఎక్కువ కుటుంబాలకు సాయం అందించేందుకు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.

బలహీనపడిన వాయుగుండం… అల్పపీడనంగా మారి వాయుగుండం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో విధ్వంసం కొనసాగుతోంది, రెండు రాష్ట్రాల్లో కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కురుస్తున్న వర్షం మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపింది, రైలు ట్రాక్‌లు, రోడ్లు , విస్తారమైన వ్యవసాయ భూములను వరదలు ముంచెత్తాయి, దీని ఫలితంగా రైళ్ల రద్దు , మళ్లింపు ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా రోజువారీ జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఏజెన్సీలు పని చేస్తున్నందున రెస్క్యూ , రిలీఫ్ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో, వర్ష సంబంధిత సంఘటనలు , వరదలలో కనీసం 17 మంది మరణించగా, తెలంగాణలో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నుండి నిరంతరాయంగా వర్షాలు కురిపించడంతో మృతుల సంఖ్య 16కి చేరుకుంది. అయితే.. విశాఖలో వాయుగుండం బలహీనపడినట్లు అధికారులు వెల్లడించారు. వాయుగుండం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..

మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న(సోమవారం) ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈరోజు ఆయన మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మండలం తిరుమలాయపాలెం వంతెన, నెల్లికుదురు మండలం రావిరాల వద్ద ముఖ్యమంత్రి పర్యటించాల్సి ఉంది. అయితే సీఎం షెడ్యూల్‌లో ఇవాళ స్వల్ప మార్పులు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించారు. ఇవాళ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి మహబూబాబాద్‌ జిల్లా లోని పురుషోత్తం గూడెం వరకు రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. కారేపల్లి, గంగారం తండా, కారేపల్లి గేట్, కొత్త కమలాపురం, పుల్లూరు తండా, పొన్నెకల్, డోర్నకల్, సాలార్ తండా నుంచి పురుషోత్తం గూడెం గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. సీతారాంనాయక్ ఖమ్మం నుంచి నేరుగా తాండాకు చేరుకుంటారు. సుమారు 100 మంది పోలీసులు గ్రామాన్ని వరదలు ముంచెత్తడంతో రక్షించారు. విషయం తెలుసుకున్న సీఎం ముందుగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఆ తర్వాత తిరుమలపాలెం వంతెన, రావిరాల గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది.

విజయవాడ ముంపు ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి..

విజయవాడలోని సితార, రాజరాజేశ్వరి పేట, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ముంపు కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలకు పూర్తిగా ఇళ్లు మునగడం తో అపార్ట్మెంట్ల పైన, కొండలపైన తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు. వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఇళ్ల వద్దకు వచ్చి పరిస్థితి ఏరకంగా ఉందో చూసుకుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లు ముంపు ప్రాంతాలకు తరలించారు. భారీ క్రేన్లు కూడా సిద్ధం చేశారు అధికారులు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లోకి బోట్లు, ట్రాక్టర్లు, క్రేన్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. అయితే.. తాగునీరు, బిస్కెట్లు, ఫుడ్ ప్యాకెట్లు అందించే లారీలను ముంపు ప్రాంతాలలో బాధితులకు పంపుతున్నారు అధికారులు. విజయవాడలోని అనేక వరద ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం డ్రోన్లు, హెలీకాప్టర్ల ద్వారా ఆహారం, నీరు అందిస్తున్నా.. అందరికీ అందడం లేదని చెబుతున్నారు.

మూడో రోజు జలదిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ ఆలయం

మూడో రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మెదక్‌లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఏ క్షణాన అయిన భారీ వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమ్మవారి ఆలయం చుట్టూ మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతుంది. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. ఇక.. మంజీరాకు నక్క వాగు వరద చేరడంతో వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వరదల కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show comments