NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

గజం భూమి అయినా వదులుకుంటరేమో కానీ, గ్రామ్ బంగారం మాత్రం వదులుకోలేని పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ ధరలు ఆ రేంజ్ లో పరుగులు పెడుతున్నాయి. పుత్తడిపై పెట్టుబడి పెట్టితే లాభాలు అందుకోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఇక ఇప్పుడు శుభకార్యాల సీజన్ ప్రారంభమైంది. బంగారం కొనేందుకు అంతా రెడీ అవుతున్నారు. గోల్డ్ షాపులు కస్టర్లతో కిటకిటలాడుతున్నాయి. మరి మీరు కూడా బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి సమయం. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 తగ్గింది. నేడు హైదరాబాద్ లో తులం ఎంత ఉందంటే?</p>
<p style=”text-align: justify;”>హైదరాబాద్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,744, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,448 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నిన్న(ఆదివారం) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 77,450గా ఉంది. నేడు రూ. 10 తగ్గడంతో రూ. 77,440 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిన్న(ఆదివారం) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 84,490గా ఉంది. నేడు రూ. 10 తగ్గి రూ. 84,480 వద్ద అమ్ముడవుతోంది. విశాఖ పట్నం,విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,590 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 84,630 వద్దకు చేరింది.

విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, బంగారం, వజ్రాల పట్టివేత

ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో 16.49 కోట్ల విలువైన 1700 గ్రాముల కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ను స్మగ్లర్ పొట్టలో క్యాప్సూల్స్ రూపంలో దాచిపెట్టినట్లు గుర్తించారు. ముంబాయి ఎయిర్‌పోర్ట్‌లో గ్రీన్ చానెల్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించిన ఈ కేటుగాడిని, ట్రావెల్ హిస్టరీ ఆధారంగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అధికారులు స్మగ్లర్‌ను ఆసుపత్రికి తరలించి, వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స ద్వారా పొట్టలో దాచిన డ్రగ్స్‌ను వెలికితీశారు. ఈ ఘటన ముంబయిలో డ్రగ్స్ మాఫియా మళ్లీ చురుకుగా ఉందని సూచిస్తోంది. స్మగ్లింగ్‌లో ఎక్కువగా విదేశీయులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు సదరు వ్యక్తిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇస్రోకి ఎదురుదెబ్బ.. నిర్ధేశిత కక్ష్యలోకి చేరని NVS-02 ఉపగ్రహం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 29న శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్ కింద ఎన్వీఎస్-2 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీన్ని జనవరి 29న GSLV-Mk 2 రాకెట్ ద్వారా ప్రయోగించారు. భారత అంతరిక్ష-ఆధారిత నావిగేషన్ వ్యవస్థకు NVS-02 ఉపగ్రహం కీలకం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (నావిక్)లో కీలకమైనది. అయితే ఇప్పుడు ఇస్రోకు ఎదురు దెబ్బ తగిలింది. అంతరిక్ష నౌకలోని థ్రస్టర్ లు పనిచేయకపోవడంతో NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టడానికి ఇస్రో చేసిన ప్రయత్రాలు విఫలమయ్యాయి.

నేడు హిందూపురంలో 144 సెక్షన్..

హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా హిందూపురం పట్టణంలో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నట్లు హిందూపురం పోలీసులు ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో మున్సిపల్ కమిషనర్ అనుమతించిన వ్యక్తులు మాత్రమే ప్రవేశించేందుకు అనుమతి ఉంది. మిగతా వారెవరూ హాల్‌లోకి వెళ్లరాదు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ప్రజలు గుంపులుగా కూడకూడదని పోలీసులు హెచ్చరించారు. అత్యంత కీలకమైన ఈ ఎన్నిక నేపథ్యంలో పట్టణంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

నేడు రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు హోరాహోరీగా ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో నేడు (ఫిబ్రవరి 3)న 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ సీట్లను కాపాడుకోవాలని, వైసీపీ వీటిని గెలుచుకోవాలని వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

చేనేత కార్మికుల కోసం కొత్త పథకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘వర్కర్ టూ ఓనర్’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్‌లో సమావేశమై పథకం అమలుపై చర్చించారు. ఈ పథకం ద్వారా గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్‌ను ఏర్పాటు చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు. తొలుత ఈ పథకాన్ని సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. జిల్లాలో సుమారు 5,000 నేత కార్మికులు ఉండగా, అందులో 2,000 మంది తీవ్ర పేదరికంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

జేబీఆర్ క్రిప్టో కరెన్సీ మోసంలో కొత్తకోణం

క్రిప్టో కరెన్సీ పేరుతో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి దుబాయ్‌ పారిపోదామనుకున్న రమేష్‌ గౌడ్‌ వ్యవహారం మరో విషయం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి కరీంనగర్ వరంగల్ జిల్లాలో 100 కోట్లు వసూలు చేశాడు రమేష్. రమేష్ ని కాపాడేందుకు సీఐడీ అధికారుల ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్‌లో కేసు నమోదు అయినప్పటికీ అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. నిందితుడైన రమేష్ తో పలుమార్లు హైదరాబాద్ వరంగల్, కరీంనగర్ లో సీఐడీ అధికారుల భేటీలు నిర్వహించారు. రమేష్, సీఐడీ అధికారుల కదలికలపై ఎప్పటికప్పుడు స్పై ఆపరేషన్ చేశారు బాధితులు. రమేష్ తో పలుమార్లు సీఐడీ అధికారులు కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తున్నారు బాధితులు. జేబీఆర్‌ క్రిప్టో రమేష్ పై చేసిన స్పై ఆపరేషన్ ఉన్నతాధికారులకు బాధితులు పంపినట్లు తెలుస్తోంది.

డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ.. క్యాంప్ రాజకీయాలతో రసవత్తర పరిణామాలు

తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక నేడు (ఫిబ్రవరి 3) ఉదయం 11 గంటలకు ఎస్‌వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరగనుంది. భూమన అభినయ రెడ్డి రాజీనామాతో ఖాళీగా మారిన ఈ పదవికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్ష కూటమి ఈ స్థానంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు, క్యాంప్ రాజకీయాలు ముదిరాయి. దీనితో గత మూడు రోజులుగా తిరుపతిలో క్యాంప్ రాజకీయాలు ఉధృతంగా సాగాయి. వైసీపీ కార్పొరేటర్లు పాండిచ్చేరి క్యాంప్‌లో ఉండగా, వారు కొద్దిసేపటి క్రితమే తిరుపతికి చేరుకున్నారు. మరోవైపు, చిత్తూరులో బసచేసిన వైసీపీ కార్పొరేటర్లను రాత్రి తిరుపతి టీడీపీ నేతలు కలిసే ప్రయత్నం చేయడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విషయం తెలుసుకున్న భూమన అభినయ రెడ్డి హుటాహుటిన చిత్తూరుకు చేరుకుని తన పార్టీ కార్పొరేటర్లను తిరుపతిలోని తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచే నేరుగా ఎన్నికల కేంద్రానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.