Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ప్లేఆఫ్స్‌ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం

శ్రేయాస్ అయ్యర్ (72), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (54) అర్ధ సెంచరీలతో పాటు యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించడంతో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో, 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. 18వ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై 10 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. చెన్నై బ్యాట్స్ మెన్ మాయాజాలం సొంత గడ్డపై విఫలమైంది. టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవడంతో పంజాబ్ జట్టు విజయం సులభమైంది. చెన్నై బ్యాటింగ్ మరోసారి పూర్తిగా తడబడింది.

నేడు ఆత్మకూరులో చంద్రబాబు పర్యటన.. పింఛన్లు పంపిణీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నారు. నెల్లూరు పాలెంలోని గిరిజన కాలనీలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. కొద్దిసేపు వారితో ముచ్చటించనున్నారు. అనంతరం నారంపేటలో ఎంఎస్ఎమ్ పార్కును ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 11 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేశారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక మేడే సందర్భంగా కార్మికులను కలిసి ముచ్చటించనున్నారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం అమరావతికి బయల్దేరి వెళ్లనున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

పాకిస్తాన్ కు మరో షాక్.. పాక్ విమానాలకు భారత్ గగనతలాన్ని నిషేధిస్తూ నిర్ణయం

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ కు మరో షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని ఉపయోగించకుండా భారతదేశం నిషేధించింది. వైమానిక దళ సభ్యులకు (NOTAM) నోటీసు జారీ చేసింది. ఈ నోటామ్ కింద, ఏప్రిల్ 30 నుంచి మే 23, 2025 వరకు అన్ని పాకిస్తాన్-రిజిస్టర్డ్, సైనిక విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

నేడు స్థానిక ప్రతినిధులతో జగన్ భేటీ.. అనంతరం బెంగళూరుకు పయనం

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ గురువారం స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేవం కానున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైసీపీ స్ధానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్‌ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ముఖ్య నేతలు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు హాజరుకానున్నారు.

మే 1న కార్మిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? భారత్ లో ఎప్పుడు ప్రారంభమైంది?

ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డేగా జరుపుకుంటారు. ఈ రోజు కార్మికుల హక్కులను కాపాడటానికి, వారి సహకారాన్ని గౌరవించడానికి, శ్రామిక వర్గం యొక్క పోరాటాలను స్మరించడానికి ఒక ప్రత్యేక సందర్భంగా నిలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్మికుల జీవితాలను మార్చివేసింది. కానీ ఈ రోజును జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. దానికి మే 1వ తేదీని ఎందుకు ఎంచుకున్నారు. భారత్ లో కార్మిక దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మొదలైన తెలంగాణ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల సందడి

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేశాయి. ఈ మేరకు, మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ఇవాళ (మే 1, 2025) నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు మే చివరి వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంటర్ ఫస్ట్ ఇయర్) తరగతులు జూన్ 2, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.

పాకిస్తాన్ వరుసగా ఏడో రోజు కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఎల్‌ఓసి వద్ద కాల్పులు.. తిప్పికొట్టిన భారత సైన్యం

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉద్రిక్తత పెరిగింది. పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ వరుసగా ఏడో రోజు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఏప్రిల్ 30 రాత్రి నుంచి 2025 మే 1 తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. ఈ కాల్పులు తరచుగా ఉద్రిక్తతకు కేంద్రంగా ఉండే కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో జరిగాయి. పాక్ చర్యకు భారత సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చింది.

అజ్ఞాతంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే.. జాడ కోసం పోలీసుల వేట

వైపీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతపురం జిల్లా రాప్తాడులోని ఆయన నివాసానికి పోలీసులు వచ్చారు. ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. ఫోన్ కూడా స్విచ్ఛాప్‌లో ఉంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా పాపి రెడ్డిపల్లిలో హెలిప్యాడ్ దగ్గర చోటు చేసుకున్న పరిణామాలపై తోపుదుర్తితో పాటు పలువురు వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. ఈ కేసులో తోపుదుర్తిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు. కానీ తోపుదుర్తి అందుబాటు లేరు. మాజీ ఎమ్మెల్యే కోసం కుటుంబ సభ్యుల్ని ఆరా తీయగా.. ఎక్కడికి వెళ్లారో తెలియదని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్‌ కు తోపుదుర్తి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బెయిల్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

 

Exit mobile version