NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ఎప్పుడు ఏ వాహన సేవ అంటే..
తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి.. రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం అయ్యాయి.. ఇక, ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్షవాహనం, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు మలయప్పస్వామి.. మరోవైపు.. రథసప్తమి సందర్భంగా సర్వదర్శనం భక్తులుకు జారీచేసే టోకెన్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపును కూడా రద్దు చేశారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 14 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.. మరోవైపు.. నిన్న శ్రీవారిని 59,695 మంది భక్తులు దర్శించుకున్నారు.. 30,286 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. నిన్న హుండీ ద్వారా ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.

నేటితో ముగియనున్న నాగోబా జాతర.. స్వగ్రామాల‌కు మెస్రం వంశీయులు
ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతర నేటితో ముగియనుంది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఇవాళ ముగియనుంది. పంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో నాగోబా జాతర ఒకటి. ఈనెల 21న ఈజాతరకు మెస్రం వంశీయులు గంగాజలాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని ఆదివాసులంతా జాతరకు వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈజాతర వారం రోజుల పాటు ఇక్కడే ఉండి సంప్రదాయం ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఇంద్రవెల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఎడ్ల బండ్లలో వచ్చిన వారు తమ ఎడ్ల బండ్లను తీసుకొని నేడు జాతర ముగియడంతో తమ స్వగ్రామానికి బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర ఈనెల జనవరి జాతర ఉత్సవాలు 21 నుంచి 28వ తేది వరకు వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెళ్లి దర్శించుకున్నారు. ఈ నెల 24న నిర్వహించే దర్బార్ సమావేశానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై.. నాగోబాను దర్శించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండే కాకుండా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు. దీంతో కేస్లాపూర్‌ గ్రామం భక్తులతో కిక్కిరిసింది. జాతరలో భాగంగా భేటింగ్, కొత్త కోడళ్ల పరిచయం, మందగజిలి పూజ, బేతాళ పూజ మొదలైనవి జరుగుతాయి. మేస్రం వంశీయులు జాతర ముగింపు సందర్భంగా ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామంలోని బుడుం దేవ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత వారు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లానున్నారు.

నేడే నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్.. శంకుస్థాపనలు, బహిరంగ సభ
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ ఇవాళ నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించనున్నారు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ఆవరణలో కొత్త నిర్మస్తున్న కళాభారతికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రైల్వే కమాన్‌ వద్ద నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్‌ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొననున్నారు. కేటీఆర్‌ రాక సందర్భంగా నగర పరిధిలో గులాబీ శ్రేణుల, నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ నేడు ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌ కు చేరుకోనున్నారు. కాకతీయ శాండ్‌ బాక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రారంభించడంతో పాటు కళాభారతికి శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత జరిగే బహిరంగ సభలో కేటీఆర్‌ ప్రసంగిస్తారు. కేటీఆర్ వెళ్లే దారిలో భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు నగరంలోని బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేశారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ఆవరణలో కళా భారతి భవన నిర్మాణ ప్రణాళికకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దాదాపు రూ. 50 కోట్లతో నిర్మించనున్న కళాభారతి ఆడిటోరియం ప్రణాళికలను సమీక్షించారు. అధునాతన సౌకర్యాలతో ఈ ఆడిటోరియం నిర్మిస్తారు. ఇందూర్‌ జిల్లా చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేందుకు ఈ నిర్మాణం రూ.50 కోట్లుతో ఉండనుంది. మంత్రి కేటీఆర్‌ రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ఆవరణలో నిర్మించతలపెట్టిన కళాభారతి భవన నిర్మాణ ప్లాన్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సుమారు రూ. 50 కోట్లతో నిర్మించే కళాభారతి ఆడిటోరింయకు సంబంధించిన ప్లాన్‌లను పరిశీలించారు. అధునాతన సౌకర్యాలతో ఈ ఆడిటోరియంను నిర్మించనున్నారు. ఇందూరు జిల్లా చారిత్రక వైభవం చాటేవిధంగా రూ.50 కోట్లతో ఈ నిర్మాణం ఉండనుంది. సంస్కృతీ సంప్రదాయాలను ఉట్టిపడేలా కళాభారతి రూపొందిస్తామన్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చూసుకుంటున్నారు.

విలక్షణ విజయ నాయిక… శ్రుతి హాసన్!
శ్రుతి హాసన్ పేరు వినగానే ఆమె విలక్షణమైన వ్యక్తిత్వమూ, వైవిధ్యమైన చలనచిత్ర జీవితమూ గుర్తుకు వస్తాయి. తన తండ్రి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ – వారిద్దరి సరసన ఒకేసారి నాయికగా నటించేసి, ఇద్దరితోనూ బంపర్ హిట్స్ అందుకొని తనదైన బాణీ పలికించింది శ్రుతిహాసన్. ఒకప్పుడు ‘ఐరన్ లెగ్’ అన్నవారే తరువాత ‘గోల్డెన్ లెగ్’ అంటూ శ్రుతి హాసన్ కు ఎర్రతివాచీ పరచి మరీ జేజేలు పలుకుతున్నారు. ఆహా… ఇది కదా విజయమంటే! అంతటి సక్సెస్ ను సొంతం చేసుకున్న శ్రుతిహాసన్ నేడు టాప్ స్టార్స్ ఛాయిస్ గా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకునిగా తెరకెక్కుతోన్న ‘సలార్’లో నాయికగా నటిస్తున్నారు శ్రుతి హాసన్. ‘ది ఐ’ అనే ఆంగ్ల చిత్రంలోనూ శ్రుతి ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అసలు శ్రుతిహాసన్ కెరీరే చిత్రవిచిత్రంగా సాగిందని చెప్పవచ్చు. ఆరంభంలో ఆమెను ఫ్లాపులు పలకరించాయి. ఆ పై ‘గబ్బర్ సింగ్’తో అబ్బో అనిపించే విజయాన్ని అందుకున్నారామె. ‘గబ్బర్ సింగ్’కు ముందు ఆ చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ కు, డైరెక్టర్ హారీశ్ శంకర్ కు, శ్రుతి హాసన్ కు సక్సెస్ లేదు. విచిత్రంగా ఆ సినిమాలో అన్ని మైనస్సులూ కలసి ఓ బిగ్ ప్లస్ గా మారి ‘గబ్బర్ సింగ్’ పెద్ద హిట్టయింది. తరువాత మెగా ఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్ తో ‘రేసుగుర్రం’, రామ్ చరణ్ తో ‘ఎవడు’ వంటి హిట్స్ పట్టేశారు శ్రుతి. రవితేజతో ‘బలుపు’, ‘క్రాక్’ వంటి చిత్రాలతోనూ, మహేశ్ బాబుతో ‘శ్రీమంతుడు’తోనూ మరిన్ని విజయాలను తన కిట్ లో వేసుకున్నారామె. ఏది ఏమైనా శ్రుతి హాసన్ కన్నవారు కమల్ హాసన్, సారిక కంటే భిన్నంగా తన కెరీర్ ను మలచుకున్నారు. అలాగే విలక్షణమైన వ్యక్తిత్వంతో సాగుతున్నారు. నవతరానికి అసలు సిసలు ప్రతీకగా కనిపించే శ్రుతిహాసన్ మునుముందు ఏ తీరున అలరిస్తారో చూడాలని ఆమె అభిమానులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం.. పోస్టాఫీసుల్లో 40 వేలకు పైగా కొలువులు
పదోతరగతి పాసైన నిరుద్యోలకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ శుభవార్త తెలిపింది. కేంద్ర తపాలా శాఖ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చింది. పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్‌ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఏ పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్ పోస్ట్‌ మాస్టర్‌, బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్‌ మాస్టర్, డాక్ సేవక్‌ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కేవలం పదోతరగతి అర్హతపైనే పరీక్ష నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు సవరించుకునేందుకు అవకాశం కూడా కల్పించింది. ఈ ఉద్యోగాలకు పోటీ పడే వారు 18-40 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. కంప్యూటర్‌పై అవగాహనతో పాటు సైకిల్ తొక్కడం కూడా రావాలి. కాగా, మొత్తం 40, 889 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1260 ఖాళీలు ఉన్నాయని కేంద్ర తపాలా శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్‌ మాస్టర్‌, బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్‌ మాస్టర్, డాక్ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్ట్‌ను బట్టి ప్రారంభ వేతనం రూ.10,000-12,000 వేరకు ప్రారంభ వేతనం అందుకోవచ్చు. అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) ఉద్యోగాలకు రూ.12 వేల నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) లేదా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగానికి రూ.10 వేల నుంచి రూ.24,470 మధ్య వేతనం చెల్లిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు మాత్రం రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఉగ్రదాడిలో 8 మంది మృతి.. 10 మందికి గాయాలు
జెరూసలేంలోని ప్రార్థనా మందిరంలో శుక్రవారం జరిగిన ఘోరమైన ఉగ్రదాడిలో కనీసం 8 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నెవ్ యాకోవ్ స్ట్రీట్‌లోని ప్రార్థనా మందిరం సమీపంలో రాత్రి 8:15 గంటలకు జరిగిన తుపాకీ దాడిలో 10 మంది గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ‘జెరూసలేం ఉగ్రదాడిలో 8 మంది మృతి చెందగా..10 మంది గాయపడ్డారు. పారామెడిక్స్ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి చికిత్స అందించడం ప్రారంభించారు.’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా పోలీసు బలగాల చేతిలో హతమయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురువారం జెనిన్ శరణార్థి శిబిరంలో జరిగిన ఘోరమైన ఘర్షణల తరువాత జరిగింది. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిలో ఒక వృద్ధ మహిళతో సహా పది మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దళాలచే చంపబడ్డారు. వెస్ట్ బ్యాంక్ నగరంలో జరిగిన దాడిలో ఇజ్రాయెల్ దళాలచే చంపబడిన పాలస్తీనియన్ల మొత్తం సంఖ్య ఈ సంవత్సరం 30కి చేరుకుంది. అంతేకాకుండా, గాజాన్ ఉగ్రవాదుల నుంచి రాకెట్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సెంట్రల్ గాజా స్ట్రిప్‌లో వరుస బాంబు దాడులను ప్రారంభించింది. శుక్రవారం. సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరంలో రాకెట్లను తయారు చేసే భూగర్భ సదుపాయమైన బాటమ్ ఆఫ్ ఫారమ్‌ను వారు లక్ష్యంగా చేసుకున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తెలిపింది.