NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

16 గంటల రెస్య్కూ విఫలం.. బోరుబావిలో పడిన బాలుడు మృతి..

మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన 10 ఏళ్ల బాలుడు మరణించాడు. 16 గంటల పాటు అధికారుల చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. గంటలు శ్రమించిన అధికారులు బాలుడిని బయటకు తీసుకువచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. బాలుడు సుమిత్ మీనా మరణించినట్లు అధికారులు ఆదివారం ధ్రువీకరించారు.

మధ్యప్రదేశ్ గుణా జిల్లాలోని రఘోఘర్‌లోని జంజలి ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 3.3. గంటలకు బాలుడు బోరుబావిలో పడిపోయారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బోరు బావి నుంచి బాలుడిని బయటకు తీశారు.బాలుడు 39 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు.

పేర్ని నాని భార్య గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పురోగతి..

మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మానస తేజను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోనే అతడ్ని అదుపులోకి తీసుకుని మచిలిపట్నంకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే, మానస తేజ విచారణ సందర్భంగా ఇచ్చే స్టేట్ మెంట్ కీలకం కానుందని పోలీసుల తెలిపారు. అతడి స్టేట్ మెంట్ ఆధారంగా మరి కొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, ఇప్పటికే గోడౌన్ లో 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు కేసు నమోదు చేశారు. అయితే, రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ ఏ1గా ఉన్నారు. ఆమె ముందస్తు బెయిలుపై రేపు తీర్పు ఇవ్వనున్న జిల్లా కోర్టు.. ఇక, ఇదే కేసులో పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టుకి నోటీసులు ఇచ్చిన హాజరుకాని పరిస్థితి నెలకొంది.

బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుంది..

కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే, బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుందని హరీష్ రావు అన్నారు. ఒకవైపు నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ కేజీబీవీ పాఠశాలలో “ఈ బువ్వ మేము తినలేము, మమ్మల్ని తీసుకెళ్లండి” అని తల్లిదండ్రులను విద్యార్థులు వేడుకుంటున్నారు. మరోవైపు అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి అని హరీష్ రావు తెలిపారు. విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక.. నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు..

కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా కవిత మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టిన భయ పడేది లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. బస్సుల సంఖ్య తగ్గించి ఫ్రీ బస్సు ఇస్తున్నారని తెలిపారు. అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చానని కవిత అన్నారు. నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను… దేనికీ భయపడనని అన్నారు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం అన్నారు. మేము తప్పు చేయలేదు… భయపడే ప్రసక్తే లేదన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం..

ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్, సిరిసిల్లలో ధీన్ ధయాల్ ఉపాధ్యాయ పథకం ద్వారా 800 మందికి తొంభై రోజులు యువతి యువకులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఉచిత శిక్షణ, ఉచిత భోజన‌ సదుపాయం కల్పించామని తెలిపారు. 50 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ రెండు లక్షల ఉద్యోగాలు‌ ఇస్తామని మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 25000 జాబ్ లకి నోటిఫికేషన్ ఇచ్చి 50000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెబుతూ టైం పాస్ చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ‌మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బెజవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు..

విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో.. 31వ తేదీ రాత్రి నగరంలో ఫ్లై ఓవర్లు, పశ్చిమ బైపాస్ పై ట్రాఫిక్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నగర వాసులకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి రోడ్డు మీద వేడుకలకు అనుమతులు లేదు.. రాత్రి 11 గంటల తరువాత వాహనాలు నడుపు వ్యక్తి అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడప రాదని తెలిపారు. అలాగే.. ట్రిపుల్ రైడింగ్ చేసి వాహనం నడుప రాదు.. మద్యం సేవించి వాహనాలు నడుప రాదని అన్నారు. ప్రధాన రహదారులు అయిన బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బి.ఆర్.టి. ఎస్. రోడ్ల పై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించబడునని సీపీ చెప్పారు.

ఓఆర్‌ఆర్‌ అమ్ముకున్న వాళ్ళపై విచారణకి అదేశించాం

ఓఆర్‌ఆర్‌ అమ్ముకున్న వాళ్ళ పై విచారణ కి అదేశించామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం 7 వేల కోట్లకు అమ్మిందని ఆయన అన్నారు. హరీష్ రావు కి.. మామ మీదనో.. బామ్మర్ది మీదనో కోపం తోటి అసెంబ్లీ లో విచారణ కి డిమాండ్ చేశారన్నారు. సీఎం విచారణకు ఆదేశించారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు కేసులో ఒకరో ఇద్దరో జైలుకి పోతారని, ఓఆర్‌ఆర్‌ ఎపిసోడ్ లో కూడా జైలు కి వెళ్తారన్నారు. RRR కి అరెండ్లు ఆలస్యం అయ్యిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చామని, టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మార్చిలో RRR పనులు ప్రారంభమవుతాయన్నారు.

నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం..

తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మీరు ‘భారత్‌’ లోని ఏ ప్రాంతం నుంచి వచ్చారన్నది కాదు.. దేశం గర్వించేలా ఏం చేశారన్నది ముఖ్యం. ప్రియమైన ‘నితీష్ కుమార్ రెడ్డి,’ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత్‌ నుంచి అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించినందుకు.. ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) యొక్క కీలకమైన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో 114 పరుగులతో అద్భుతమైన నాక్‌తో మీ ప్రతిభను ప్రదర్శించారు.’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. ‘మరెన్నో ప్రపంచ స్థాయి రికార్డులను సాధించడం కొనసాగించండి, భారత్ జెండాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లండి. యువతకు క్రీడల పట్ల అభిరుచి మరియు దృఢ సంకల్పంతో ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తినివ్వండి. ఈ సిరీస్‌లో భారత్‌ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.’ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కవిత ఆడబిడ్డ కాకపోతే నా సమాధానం వేరేలా ఉండేది

ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై ఎంపీ రఘునందన్ రావు కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ ఎంపీ రఘునందన్‌ రావు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎవరిని భయపెట్టదని, కవిత ఆడబిడ్డ కాకపోతే నా సమాధానం వేరేలా ఉండేదన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్రానికి పట్టిన దరిద్రం…ఎక్కువ ఎగిరిపడితే జనాలు మళ్ళీ బండకేసి కొడతారన్నారు. దర్యాప్తు సంస్థలు తప్పు చేసిన వారిని ఏ కలుగులో దాక్కున్నా పట్టుకువచ్చి విచారణ చేస్తాయని, కవిత తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు ఎంపీ రఘునందన్‌ రావు. మేము భయపెట్టాలని చూస్తే కేటీఆర్, హరీష్ రావు, కవిత అక్కర్లేదని, కేసీఆర్ నే మొదట తీసుకుపోయేవాళ్ళమన్నారు రఘునందన్‌ రావు. ఎవరు తప్పు చేసినా పోలీసులు కేసులు పెడతారు… కోర్టులోకి తీసుకువెళ్తారని, మీపై కేసులకు మోడీకి అసలు ఏంటి సంబంధమని ఆయన మండిపడ్డారు.

కన్హా శాంతి వనంను సందర్శించిన సీఎం

కన్హా శాంతి వనంను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించడం చూసి ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఇలాంటి స్కిల్స్ ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూల్స్ లోనూ అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

 

Show comments