NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటి..

పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీష్ రావు హైడ్రా బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు రానుందని తెలిపారు. హైడ్రా బాధితులంతా తమ కుటుంబ సభ్యులని, మీ కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయన్నారు. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ వెంటే ఉంటారని భరోసా ఇచ్చారు. బాధితులకు రక్షణ కవచంలా ఉంటామన్నారు. బాధితులకు లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు.

భారీ అగ్నిప్రమాదంలో టాటా ప్లాంట్..

టాటా గ్రూప్ కంపెనీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. శనివారం ఉదయం టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ టాటా తయారీ యూనిట్ నుంచి నల్లటి పొగ బయటకు రావడం కనిపించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినప్పుడు 1500 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు ఉద్యోగులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. అగ్నిమాపక దళం వాహనాలు, సిబ్బంది సహాయక చర్యలు మంటలను ఆర్పే పనిలో ఉన్నారు.

సీబీఐ విచారణ చేయాలి

పీసీ సర్కార్ కంటే పెద్ద మెజీషియన్ చంద్రబాబు నాయుడు అంటూ ఏపీ ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. వైసీపీ నేతలు పూజలు చేస్తున్నారు.. ఇక, ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్.. తప్పులు ఎవరు చేస్తారో వాళ్లే ప్రాయశ్చితం చేసుకోవాలి.. పవన్‌ కల్యాణ్‌ దీక్షలు చూస్తే అదే అనిపిస్తోందన్నారు.. పాపాలు చేసింది, హిందువుల మనోభావాలతో ఆటలు ఆడింది, రాజకీయం చేస్తున్న వాళ్లకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.. అయితే, సమయం వచ్చినప్పుడు నిజాలు అన్నీ బహిర్గతం అవుతాయన్నారు.. సిట్ ఎంక్వైరీ అంటే చంద్రబాబు సీటు కింద పెట్టుకోవడం తప్ప బహిర్గతం కాదన్నారు.. ప్రభుత్వంలో ఉద్యోగులు చేసే విచారణపై మాకు, ప్రజలకు నమ్మకం లేదు.. స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ తో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.. పాదయాత్రలో మెట్ల మార్గం ద్వారా తిరుమల వెళ్లినప్పుడు అవసరం లేని డిక్లరేషన్.. ఇప్పుడు ఎందుకు అవసరం..? అని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..

తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, తిరుమల లడ్డూపై విష ప్రచారం..

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, అన్ని తెలిసి సామాన్యుడు కూడా కాదు ఒక పాలకుడు సాక్షాత్తూ దేశంలోనే విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడుపై తన రాజకీయ దురుద్దేశంతో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారని ఫైర్‌ అయ్యారు.. తిరుపతి దేవస్థానం లేదా ఆ ఏడుకొండలు లేదా పరమ పవిత్రమైన వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నీ దేశం మొత్తం తహతహలాడుతుంది. అలాంటి అలాంటి సన్నిధిలో దొరికే పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఈ రోజు అపవిత్రం జరగకపోయినా.. మలినమైపోయింది అంటూ పలుమార్లు మార్చి మార్చి అపవిత్రం జరిగిందని బొంకుతున్న పాలకులను చూస్తే ఈ రోజు జలిపడే కన్నా భయపడాల్సి వస్తుందన్నారు..

మెడికల్‌ షాప్‌ ముసుగులో స్టెరాయిడ్స్‌ సప్లై చేస్తున్న ముఠా

నిషేధిత స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు. మెడికల్ షాపు ముసుగులో ముఠా స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు గుర్తించారు. జిమ్ కి వెళ్ళే యువకులే టార్గెట్ గా ఈ ముఠా విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు అధికారులు. ఆసిఫ్ నగర్, కార్వాన్ లో పెద్ద మొత్తంలో స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్ నగర్, కార్వాన్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఠా స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆసిఫ్ నగర్ కి చెందిన అతిఫ్ ఖాన్, కార్వాన్ కి చెందిన అజిత్ సింగ్ లను దుపులోకి తీసుకున్న డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు స్టెరాయిడ్స్‌, ట్యాబ్లెట్లు అతీఫ్ ఖాన్, అజిత్ సింగ్ సప్లై చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

జగన్ అబద్ధపు ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలి..

ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోల బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్యలు భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో రాముల వారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసులు, అధికారుల తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులు వైసీపీ నేతలు అంటూనే రాజకీయ ప్రమేయం లేదనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేయటాన్ని చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించారు. పోలీసులు విచారణ పూర్తి చేయకుండా రాజకీయ ప్రమేయం లేదనడం సరికాదనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్

ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. స్వార్థ రాజకీయాల కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు పాపాల ఎఫెక్ట్ ప్రజలపై పడకూడదని ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించామన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి జగన్‌ను వెళ్లనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతటికైన దిగజారతాడని విమర్శించారు. చంద్రబాబు ఆడిన అబద్ధాలను నిజం చేయడానికి పడుతున్న తపన చూస్తుంటే జాలి వేస్తుందన్నారు.

ఈఎన్‌సీ నల్ల వెంకటేష్‌పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ ఆగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు అంశం గత ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించింది. ఈ మేరకు ఆనకట్ట నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ENC నల్ల వెంకటేష్ పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది కమిషన్. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తప్పుడు ఆధారాలు ఇస్తే సహించేది లేదు అంటూ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ వార్నింగ్‌ ఇచ్‌చారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద సికెంట్ పైల్స్ CE CDO సజెస్ట్ చేసింది అన్న వ్యాఖ్యలకు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాం

ఉగ్రవాదం మార్గదర్శకులకు సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ధి చెప్పామని ప్రధాని మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడో విడతలో జరిగే నియోజకవర్గాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్జికల్ స్టైక్స్‌తో శత్రుదేశాలకు భయం పుట్టించామని.. మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే దెబ్బలు తగులుతాయని అర్థం చేసుకున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 2016లో సర్జికల్ స్ట్రైక్‌తో శత్రు భూభాగంలో దాడి చేయగల కొత్త భారత్‌ను ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని ప్రధాని శనివారం అన్నారు.

కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలి?

డిక్లరేషన్ వివాదంపై పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరుపతి కొండకు వెళ్లడానికి డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అంటున్నారని.. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం ఏ అఫిడవిట్ లేకుండా క్రిస్టియన్, ముస్లింల ఇంటికి వెళ్తారు.. అప్పుడు ఎవరికైనా అఫిడవిట్ ఇచ్చారా చంద్రబాబు అంటూ ప్రశ్నలు గుప్పించారు. తాను హిందువునని.. తాను తన భార్యతో కలిసి మసీద్, చర్చి అన్నింటికి వెళ్లామని.. మాకు ఎక్కడా అఫిడవిట్ అడగలేదని పోసాని పేర్కొన్నారు. చంద్రబాబు లాగా ఏ ఒక్కరికి హీన మనస్తత్వం లేదన్నారు.