NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఆగస్టు 2 వస్తుంది పోతుంది.. కేటీఆర్ కు పొన్నం కౌంటర్..

ఆగస్టు 2 కూడా వస్తుంది పోతుందని కేటీఆర్ కు రవాణా, బీసీ సంక్షేమం శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారని వ్యంగాస్త్రం వేశారు. ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం ఇచ్చేది ఏం లేదన్నారు. ఆగస్టు 2 కూడా వస్తుంది..పోతుందన్నారు. కాళేశ్వరం లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసన్నారు. కేంద్రం నుండి నిధులు తెప్పించు కిషన్ రెడ్డి అని ప్రశ్నించారు. హైదరాబాద్ కి ఒక్క పైసా ఇప్పించలేదు మీరు అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం 10 వేల కోట్లు పెట్టిందన్నారు.

నీతి ఆయోగ్ సమావేశం మధ్యలో నుంచే బెంగాల్ సీఎం మమతా వాకౌట్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేసింది. సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ ఆఫ్ చేసారని ఆరోపించింది. నీతి ఆయోగ్ ను రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సమావేశంలో 20 నిముషాలు మాట్లాడారు.. ఇతర నేతలు 15 నిముషాలు మాట్లాడారు.. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైందని నేను ఒక్కరినే.. కనీసం నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.. కేంద్రం వివక్షా పూరితంగా వ్యవహరిస్తుంది.. కేంద్ర బడ్జెట్ రాజకీయంగా ఉంది అని సీఎం మమతా మండిపడింది. నీతి అయోగ్ సమావేశంలో నా మైక్ కట్ చేయడం అంటే.. బెంగాల్ ప్రజలను మాత్రమే కాదు అన్ని ప్రాంతీయ పార్టీలను కూడా అవమానించడమేనిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

ఢిల్లీలో జగన్‌ ధర్నాపై కేంద్రమంత్రి సంచనల వ్యాఖ్యలు..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వేదికగా చేసిన ధర్నాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి మురుగన్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. ఎన్డీఏ గెలుపును వైఎస్‌ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు అని మండిపడ్డారు.. ఎన్డీఏ గెలుపును తట్టుకోలేక ఢిల్లీకి వచ్చి జగన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.. డ్రామాలు ఆడుతున్న జగన్‌కు ఇండియా కూటమి పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయని దుయ్యబట్టారు.. ఇక, నిబంధనల ప్రకారం చూస్తే వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదు… నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదాకు అర్హత లేకుంటే ఎలా వస్తుంది..? అని ప్రశ్నించారు..

విహార యాత్రలు కాంగ్రెస్ నేతలకు అలవాటు.. జీవన్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్

విహార యాత్రలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీళ్లను ఎట్లా ఎత్తిపోయాలని ప్రభుత్వానికి సోయి లేదన్నారు. సీఎం, మంత్రులకు అవగాహన లేదన్నారు. ఒక్క మంత్రికి వ్యవసాయంపై అవగాహన లేదని తెలిపారు. ఆంద్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసు అన్నారు. తెలంగాణ ఎప్పటికైనా లిఫ్ట్ ల మీద ఆధారపడాల్సిందే అన్నారు. క్రిష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారని తెలిపారు. నీళ్లు ఎట్లా లిఫ్ట్ చేయాలో తెలిసి కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను నిర్మించారని తెలిపారు. విహార యాత్రలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటన్నారు. నేడు రామగుండం దగ్గర గోదావరి ఎట్లా ఉంది…? ప్రాణహిత ఎట్లా ఉందొ వెళ్లి చూడండి అని అన్నారు. మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం చెప్తోందని అన్నారు. ఎల్లంపల్లి నుండి నీళ్ళు ఎట్లా అయినా రైతులకు ఇవ్వాల్సిందే అన్నారు. మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్,సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని తెలిపారు. కోదాడ,సూర్యాపేట నియోజకవర్గాల్లో రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాలు.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

భాగ్యనరంలోని పాతబస్తీ సింహవాహిని మహంకాళి బోనాల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. జాతర సందర్భంగా లాల్ దర్వాజ ముస్తాబు అయ్యింది. పాత బస్తీలోని సింహవాహిని ఆలయంతో పాటు మరో 330 ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. జులై 28వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహించనున్నారు. తెల్లవారు జామున 4 గంటలకు బలిహరణ, ఉదయం 5.30 గంటలకు దేవి మహాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాగా.. లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాలబండ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

వరద తగ్గేవరకు పునరావాస కేంద్రాలు.. ప్రతీ కుటుంబానికి రూ.3 వేలు..

వరద తగ్గేవరకు అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు కొనసాగుతాయి.. వరదలు తగ్గి సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి 3 వేల రూపాయలు అందిస్తాం అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో నిర్వసితులతో ముఖా ముఖి నిర్వహించారు మంత్రులు.. నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయంలో వరదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గాల్లోనే పరామర్శలు, సమీక్షలు నిర్వహించేవాళ్లు.. ప్రతిపక్షాలు వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.. అయితే, వరద బాధితులను ఆదుకునేందుకు NDA ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.

ఆగస్టు 23న ఉక్రెయిన్‌కి ప్రధాని మోడీ..?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల మోడీ రష్యాలో పర్యటించారు. ఈ పర్యటనలో మోడీ-పుతిన్ భేటీ జరిగింది. ఇరు దేశాలు అనేక ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేశాయి. అణుశక్తి మరియు నౌకానిర్మాణం సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఇదిలా ఉంటే ఆగస్టు 23న ప్రదాని ఉక్రెయిన్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ 7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్‌ స్కీని కలిశారు. ఒకవేళ ప్రధాని ఉక్రెయిన్ పర్యటన ఫిక్స్ అయితే, యుద్ధం తర్వాత ఆ దేశంలో మోడీ తొలిసారి పర్యటించినట్లు అవుతుంది.

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ తటస్థంగా వ్యవహరిస్తోంది. ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని నివారించేందుకు చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. గతంలో ప్రధాని మోడీ, పుతిన్‌‌తో మాట్లాడుతూ, ఇది యుద్ధాల సమయం కాదని చెప్పారు. యుద్ధాన్ని నివారించేందుకు మార్గాలు అణ్వేషించాలని ఇటీవల తన రష్యా పర్యటనలో కూడా చెప్పుకొచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చదువుకున్నది ఏడో తరగతి చేసే పని గోడలకు వేసే సున్నం కాబట్టి అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదని, కొంచెం చదువుకున్నోళ్లని పక్కన పెట్టి చూస్తే బడ్జెట్ లో తెలంగాణకి కేంద్రం ఏం ఇచ్చింది అనేది అర్థం అవుతుందన్నారు. తెలంగాణకి కేంద్రం రెండు పథకాల కిందే 50 వేల కోట్ల రూపాయలు వస్తున్నట్టు తెలంగాణ బడ్జెట్ కాపీలోని 4వ పేజీలో ఉందని, ఈ విషయాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పారన్నారు రఘునందన్‌ రావు. ఇది సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ పై ఉన్న అవగాహనకు అద్దం పడుతోందని, పైగా కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇండ్లను ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి ఇస్తారు తప్ప వేరేది కాదన్నారు ఎంపీ రఘునందన్‌ రావు.

మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు పెంచారు. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సీటీయం పంచాయతీ మిట్టపల్లిలో వైసీపీ నేత, సీటీయం సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త అక్కులప్ప ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. అక్కులప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటా చలపతిని పోలీసులు విచారిస్తున్నారు. మాధవరెడ్డి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని మాధవ రెడ్డి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అక్కులప్ప ఇంట్లో డాక్యుమెంట్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. అక్కులప్ప చెప్పిన సమాచారం ఆధారంగా మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఆరు గ్యారంటీలలో నాలుగు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.. అభినందనలు

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీలో అక్బుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. డిమానిటైజేశన్ విషయంలో నేనే వ్యతిరేకించానని, అప్పుడు కేసీఆర్.. మోడీ గురించి సభలో కనీసం మాట్లాడనివ్వలేదని ఆయన అన్నారు. అద్భుతమైన నిర్ణయం అని చెప్పుకొచ్చారని, జానారెడ్డి కూడా నోట్ల రద్దును వ్యతిరేకించారని ఆయన వెల్లడించారు. ఆరు గ్యారంటీ లలో నాలుగు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం..అభినందనలు తెలిపారు. రేషన్ కార్డు నీ అన్ని పథకాలకు ముడి పెడుతున్నారని, చాలామందికి రేషన్ కార్డు లు లేవని, 2022..23 , 2024 లో L &T నష్టపోతే నిధులు ఇచ్చారు కానీ.. ఓల్డ్ సిటీ కి మాత్రం నిధులు ఇవ్వలేదన్నారు అక్బరుద్దీన్‌. ఓల్డ్ సిటీ మెట్రో పనులు వెంటనే ప్రారంభించాలని ఆయన అన్నారు. అక్బర్ సాబ్.. చుక్ చుక్ అంటూ వస్తుంది మెట్రో అంటూ మాటలు చెప్పారని కేటీఆర్ పై అక్బర్ సెటైర్లు వేశారు. మెట్రో వైఎస్ తో వచ్చిందన్నారు.