NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్

జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు అడ్వాన్సులు వెయ్యకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. సంవత్సరాలు గడుస్తున్న మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అడిగారు. వచ్చేవారం మన్నెగూడ పనులు ప్రారంభించండి.. మనం ప్రజల కోసం, రైతుల కోసం పని చేస్తున్నాం – కాంట్రాక్ట్ సంస్థల కోసం కాదు అని ఆయన తెలిపారు. పనులు చేయని కాంట్రాక్టర్లను ఫోర్ క్లోజ్ చేయండి అని సూచించారు. పనులు జరుగుతున్న రోడ్ల వద్దకు వచ్చి జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. నాలుగు రోజులు వర్షాలే వర్షాలు..!

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 590 కిలో మీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనన తీవ్ర వాయుగుండం.. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27న తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పేర్కొంది.. ఆ తదుపరి 2 రోజులలో శ్రీలంక తీరం దాటి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉందని.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో నవంబర్ 26 నుండి 29వ తేదీ వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూంచింది.. ఇక, నవంబర్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు..

త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు చేస్తాం: ఎన్వీఎస్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రప్రథమంగా పీపీపీ మోడల్ లో ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయగలిగాం.. ప్రపంచంలో చాలా దేశాలతో పాటు మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ సిస్టమ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో విజవంతం కాలేకపోయిందన్నారు. ఇక, మొదటి దఫాలో 69 కిలో మీటర్లలో 57 స్టేషన్లు ఉన్నాయి. అవి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మధ్య 29 కిలోమీటర్ల ఉంది.. అలాగే, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య 11 కి.మీటర్లు.. నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య 29 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. ఇక, ఒకప్పుడు మెట్రో వద్దని నగరంలో అనేక ఆందోళనలు జరిగాయి.. కానీ ఇప్పుడు మెట్రో కావాలని అడుగుతున్నారు.. నా దిష్టి బొమ్మలు కాల్చిన వారు.. ఈరోజు సన్మానాలు చేస్తున్నారని నా పుస్తకంలో రాశానని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

ఆర్జీవీ వివాదంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కోసం ఏపీ పోలీసులు వేట కొనసాగుతూనే ఉంది.. అయితే, అజ్ఞాతంలోనే ఉన్నారు ఆర్జీవీ.. మరోవైపు.. వర్మను అదుపులోకి తీసుకున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.. ఇక, మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఆర్జీవీ.. ఈ రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఆర్జీవీ వివాదంపై స్పందించారు కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌కు ఆర్జీవీ వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.. గతంలో పోలీసులు ఎక్కడున్నా పట్టుకునేవాళ్లు.. ఇప్పుడు ఆర్జీవీ ఎందుకు దొరకడం లేదు..? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే తరహాలో మీడియా నుంచి ప్రశ్నలు వచ్చాయి.. దీనిపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. నా పని నేను చేస్తున్నా.. పోలీసులు పని వాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.. లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు.. నేను చెయ్యడం లేదు అంటూ నవ్వుతూ బదులిచ్చారు పవన్‌ కల్యాణ్‌..

మహిళలను లక్షాధికారులు చేసేందుకు ప్లాన్.. 19 రకాల వ్యాపారాల గుర్తింపు

ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలోకు హాజరైన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. మహిళలను లక్షధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలను గుర్తించినట్లు తెలిపారు. మహిళలు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్ శిల్పారామంలో అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు అత్యంత బాధాకరం.. సుప్రీం తీర్పుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులే కారణం

జేఎన్జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గౌరవించాచాల్సిందే. అయితే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కకపోవడానికి పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణం. 17 ఏళ్ల క్రితం పుస్తెలు తాకట్టు పెట్టి, అప్పు చేసి ఒక్కో జర్నలిస్టు రూ.2 లక్షల చొప్పున రూ.12 కోట్లు పోగు చేసి ప్రభుత్వానికి చెల్లించి జేఎన్జే హౌజింగ్ సొసైటీ పేరుతో స్థలాలు దక్కించుకున్నారు. నాటి నుండి నేటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏదో ఒకసాకు చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయి. కేసీఆర్ పాలనలో జర్నలిస్టుల బతుకులు మరీ దుర్భరం. ఇండ్ల స్థలాలడిగితే లాఠీలతో కొట్టించారు. ప్రశ్నించే జర్నలిస్టులను వ్రుత్తిలో కొనసాగకుండా అడుగడుగునా అవమానించిన ఘటనలు కోకొల్లలు.

రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్..

రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 20న ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లోని 6 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఏపీలోని 3 స్థానాలు ఉన్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యల రాజీనామా ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభకు ఉప ఎన్నిక జరగనుంది. రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ డిసెంబర్ 3న విడుదల అవుతుంది. డిసెంబర్ 10న నామినేషన్ దాఖలుకి చివరి తేదీ. నామినేషన్ ఉపసంహరణకి డిసెంబర్ 13 చివరితేదీ. డిసెంబర్ 20న పోలింగ్ జరుగగా, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం… పరిసర ప్రాంతాల్లో దట్టంగా కమ్ముకున్న పొగ

జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని SSV ప్యాబ్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది.. ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారీ కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. సంఘటనా స్థలానికి 3 పైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపుచేయడానికి పైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. ఆస్తి నష్టం భారీ గా ఉండవచ్చని సమాచారం.. సంఘటనా స్థలానికి జీడిమెట్ల సీఐ, బాలానగర్ ఏసీపీ చేరుకొని పర్యవేక్షిస్తున్నారు.. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

తెలంగాణ‌లో సామాజిక, ఆర్థిక, కుల స‌ర్వే 92 శాతం పూర్తి

దేశ‌వ్యాప్తంగా కుల‌ గ‌ణ‌న అనేది కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో సాధించే సామాజిక న్యాయం మూడో ఉద్య‌మ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధ‌మ ప్ర‌ధాన‌మంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వ‌ర‌కు ఎస్సీ, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు, బ్యాంకుల జాతీయీక‌ర‌ణ వంటి కార్య‌క్ర‌మాల‌తో సామాజిక న్యాయం మొద‌టి ద‌శ సాధిస్తే… రాజీవ్ గాంధీ హ‌యాంలో 18 ఏళ్ల‌కే ఓటు హ‌క్కు.. మండ‌ల్ క‌మిష‌న్ నివేదిక వంటి కార్య‌క్ర‌మాల‌తో సామాజిక న్యాయం @ 2.0 పూర్త‌యింద‌ని.. ఇప్పుడు సోనియా గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీల ఆధ్వ‌ర్యంలో కుల గ‌ణ‌న‌కు సామాజిక న్యాయం@ 3.0 ప్రారంభ‌మైంద‌న్నారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మ‌హా యుద్ధం ప్ర‌క‌టించార‌ని… ఆయ‌న బాట‌లో న‌డుస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సామాజిక‌, ఆర్థిక‌, కుల స‌ర్వే మొద‌లుపెట్టింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో స‌ర్వే 92 శాతం పూర్త‌యింద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీ త‌ల‌క‌టొరా స్టేడియంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన సంవిధాన్ ర‌క్ష‌క్ అభియాన్ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. తెలంగాణ‌లో కుల స‌ర్వే పూర్తి కాగానే తాము సామాజిక న్యాయం మూడో మ‌హా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ‌తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ‘‘అగౌరవించారు’’.. బీజేపీ ఆరోపణ..

కాంగ్రెస్ నేత, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వివాదానికి కేంద్రంగా మారారు. పార్లమెంట్‌లో ఈ రోజు జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అగౌరపరిచారని బీజేపీ మండిపడుతోంది. మంగళవారం జాతీయ గీతాలాపన సమయంలో కూడా కాంగ్రెస్ నేత సరిగా ప్రవర్తించలేదని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేత అమిత్ మాల్వియా రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు వీడియోలను షేర్ చేశారు. రాహుల్ గాంధీ జాతీయ గీతం సమయంలో పక్కచూపులు చూస్తున్నట్లు విమర్శించారు.