ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోంది!
ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్‌లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా బీజేపీ చేయాలనుకుంటుందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఈరోజు దారుస్సలాంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు.
‘వక్ఫ్‌కి వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుంది.వక్ఫ్‌ను బీజేపీ ఖతం చేయాలనుకుంటుంది. దేశంలో ముస్లింలు లేకుండా చేయాలనుకుంటుంది. సెక్షన్ 40లో తప్పులు జరిగి ఉంటే ఉదాహరణ చూపించమని ప్రధానిని నేను డిమాండ్ చేస్తున్నా. మజీద్‌లు, దర్గాలు ఎలా ఉంటాయో.. వక్ఫ్ ప్రాపర్టీ కూడా ప్రభుత్వ ప్రాపర్టీ కాదు. మోడీ ప్రభుత్వం సెక్షన్ 3 ద్వారా వక్ వినియోగులని ఖతం చేయాలని ప్లాన్ చేస్తోంది. వక్ఫ్ వినియోగదారులు లేకుండా చూపించి ప్రభుత్వ ప్రాపర్టీగా చేయాలనుకుంటున్నారు. వక్ఫ్ ప్రాపర్టీకి వక్ డీడ్ చూపించాలని అంటున్నారు. ఎప్పటి నుండో ఉన్న ప్రపర్టీలకు డీడ్ ఎక్కడ ఉంటుంది. మక్కా మసీద్‌కి డీడ్ కావాలంటే ఇక్కడ నుంచి తేవాలి’ అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు.
ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. వాతావరణ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. సముద్ర తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది.
ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా.. చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం: సీఎం
ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని, చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామన్నారు. కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించారని, వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారన్నారు. హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం పేర్కొన్నారు. హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు.
‘హైదరాబాద్ లేక్ సిటీ, గండిపేట, ఉస్మాన్ సాగర్.. హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కొందరు ధనవంతులు విలాసాల కోసం చెరువుల పక్కనే ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. ఆ ఫామ్‌హౌస్‌ల నుంచే వచ్చే డ్రైనేజీ నీరును చెరువుల్లో కలుపుతున్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. ఒత్తిడి వచ్చినా.. మిత్రులకు ఫామ్‌హౌస్‌లు ఉన్నా వదలం. అక్రమణదారుల చర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తాం. అక్రమ కట్టడాలకు స్ఫూర్తి భగవద్గీతే. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు నాకు స్ఫూర్తి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు
కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గిపోవడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గిపోతోంది. జూరాల, సుంకేసుల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం జలాశయానికి 45,855 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,882 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.10 అడుగుల మేర నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 210.5130 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా.. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
పాక్‌లో ఘోరం.. బస్సు కాలువలో పడి 29 మంది మృతి..
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తు్న్న బస్సు కాలువలో పడిపోవడంతో 29 మంది మరణించారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు హవేలీ కహుటా నుంచి రావల్పిండికి 30 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. పానా బ్రిడ్జికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పాకిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. రోడ్డు మార్గాలు, రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడం, కొండలు, పర్వతాలు, లోయల గుండా రోడ్లు ఉండటంతో ప్రమాదాలు జరుగుతంటాయి. అంతకుముందు మంగళవారం 51 మంది పాకిస్తానీలతో కూడిన బస్సు ఇరాన్ వెళ్తుండగా, రాత్రి సమయంలో యాజ్డ్ ప్రావిన్సులోని చెక్ పాయింట్ ముందు బోల్తా పడి మంటలు అంటుకున్నాయి. బ్రేక్ ఫెయిల్యూర్ రోడ్డు ప్రమాదానికి కారణమని ఇరాన్ ట్రాఫిక్ పోలీస్ హెడ్ టేమ టేమర్ హుస్సేనీ చెప్పారు. ఈ ఘటనలో మరణించిన 28 మంది యాత్రికులు మృతదేహాలను పాకిస్తాన్‌కి పంపించారు.
ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు మార్పించారు
హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సహకారంతోటే యథేచ్ఛగా చెరువులు కబ్జాలకు గురైనవి అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే భూములు కబ్జా చేయడానికి అని ఆయన మండిపడ్డారు. పది ఏండ్లలో బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు,111, ఎఫ్టిల్, బఫర్ జోన్ భూములన్ని కబ్జా చేసిండ్రు అని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు మార్పించారని, దురాక్రమనకు గురైన ప్రభుత్వ భూములను ఇంచు వదలకుండా కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో ముందుకు పోతున్నారని, ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని ఆయన అన్నారు.
కేంద్రం తగ్గింది.. “యూపీఎస్ లో ‘యూ’ అంటే మోడీ ప్రభుత్వం యూ-టర్న్”
ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రకటన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. యూపీఎస్‌లో యూ అంటే మోడీ ప్రభుత్వం యూ టర్న్’’ అని ఖర్గే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘లోక్‌సభ ఎన్నికల తర్వాత విపక్షాలు మళ్లీ తెరపైకి రావడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల తన ప్రధాన నిర్ణయాల నుంచి వెనక్కి తగ్గడం ప్రారంభించింది’ అని ఖర్గే సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల పెండింగ్ డిమాండ్‌లను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం హామీతో కూడిన పెన్షన్‌పై భరోసా కల్పించే ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కు ఆమోదం తెలిపింది. యూపీఎస్‌పై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, “యూపీఎస్‌లో ‘యూ’ అంటే మోడీ ప్రభుత్వం యూ టర్న్ అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జూన్ 4 తర్వాత ప్రధాని దురహంకారానికి జనం అడ్డుకట్ట వేశారన్నారు. తమ నిరసనల ద్వారా మోడీ ప్రభుత్వం దీర్ఘకాలిక మూలధన లాభాలు/సూచికకు సంబంధించి బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవడం, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ బిల్లును పంపడం, డ్రాఫ్ట్ బ్రాడ్‌కాస్టింగ్ బిల్లును ఉపసంహరించుకోవడం, బ్యూరోక్రసీలో పార్శ్వ ప్రవేశాన్ని ముగించడం చేసిందని పేర్కొన్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వం నుంచి 140 కోట్ల మంది భారతీయులను రక్షించడంతోపాటు జవాబుదారీతనాన్ని కొనసాగిస్తామని ఖర్గే అన్నారు.
మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో సగం కంటే ఎక్కువే..
నాంపల్లిలోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత – లింగ సమానత్వం పై ఆల్ ఇండియా లెవెల్ ఎడ్యుకేషన్ సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో సగం కంటే ఎక్కువే అని, వృత్తి ,ఉద్యోగ ,వ్యాపార రీత్యా ,గృహ హింస అనేక సందర్భాల్లో మహిళల పై జరుగుతున్న దాని పై అందరూ ఖందించాల్సిందే అన్నారు పొన్నం ప్రభాకర్. తల్లిదండ్రులతో సమానంగా గౌరవింపబడే వారు ఆచార్య దేవో భవ అని, స్పేస్, స్పోర్ట్స్ ఏ వృత్తి రీత్యా అయినా, రాజకీయాల్లో అయినా మహిళలు అన్ని రంగాల్లో రానిస్తున్నారని ఆయన అన్నారు. ఇంకా అనేక హక్కుల్లో మహిళలకు న్యాయం జరగాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్. 265 రోజుల్లో 81 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, మహిళలు ఎవరు పని లేకుండా బస్సులో తిరగరన్నారు పొన్నం ప్రభాకర్. కానీ మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడుతున్నారని, మహిళలను బస్సులో డ్యాన్స్‌లు చేసుకోమంటున్నారు.. మనం ప్రతిగటీస్తే దిగి వచ్చారని ఆయన తెలిపారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడం లేదని భర్తపై భార్య ఫిర్యాదు.. గృహ హింస కేసు నమోదు
కర్ణాటకలో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. తనను భర్త ఫ్రెంచ్ ఫ్రైస్ తిననీయడం లేదన్న కారణంతోనే భార్య భర్తపై స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఏం చేయాలో తోచక భర్త కోర్టుకు వెళ్లాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అవాక్కైంది. వివరాల్లోకి వెళితే… కర్ణాటకకు చెందిన దంపతులకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఆరేళ్ల పాటు అమెరికాలో ఉన్న ఈ జంట.. గతేడాది భారత్‌కు వచ్చారు. ఇటీవలే ఓ బిడ్డకు భార్య జన్మనివ్వడంతో ఆరోగ్యం దృష్యా బంగాళాదుంపలతో చేసిన ఫ్రెంచ్ ప్రైస్ వంటివి తినొద్దని మంచి ఆహారం తీసుకోవాలని సదరు భర్త సూచించారు. అయితే, ఇది భార్యకు నచ్చలేదు. తనను వేధిస్తున్నాడని, మాంసాహారానికి దూరంగా ఉండమంటాడని, ఏం తినాలో వద్దో ఆయనే చెబుతున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బాధితుడు, అతడి తల్లిదండ్రులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 498ఏ కింద గృహ హింస కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో బాధితుడు హైకోర్టును ఆశ్రయించి.. తనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరాడు. అతడి పిటిషన్‌పై జస్టిస్ నాగప్రసన్న విచారణ చేపట్టారు. ఆమె ఆరోపణలు సహేతుకంగా లేకపోవడంతో బాధితుడికి ఊరట కల్పించారు.
మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తారు..
శ్రీకాకుళం జిల్లాలో పీఆర్‌టీయూ యూనియన్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. విద్యాశాఖను తీసుకొవద్దని నారా లోకేష్‌కు చాలా మంది సూచించారు.. కానీ మోజుతో కాదు ఛాలెంజ్‌గా తీసుకుని ఆయన విద్యా శాఖను నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, పిల్లల భవిష్యత్‌కు సానుకూల చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వం వచ్చింది, ఏంటి రెస్పాన్స్ లేదని ఉపాధ్యాయులకు అనిపించవచ్చు.. కానీ రాష్ర్టం పరిస్థితులు చూస్తే అర్థం అవుతుందన్నారు.
