సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. వయనాడ్‌లో ప్రియాంక గాంధీ భారీ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు వాయనాడ్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇందులో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ 4లక్షల మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. దీనిపై ట్విటర్‌లో రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఫస్ట్ ట్రెండ్‌లో మన అధినేత్రి ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యతతో ఆధిక్యంలో ఉన్నారని అన్నారు. వయనాడ్ ప్రజలు ఈరోజు భారీ మెజారిటీ ఇచ్చి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారని అన్నారు. ప్రియాంక గాంధీ భారీ విజయంతో పార్లమెంట్‌కు అరంగేట్రం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీని అభ్యర్థిగా బరిలోకి దింపింది.
సుప్రీంకోర్టులో జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్
ఇటీవల కాలంలో మీడియాలో ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం. తెలుగు సహా తమిళ, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇటీవల ఆయన చేసిన ఒక తమిళ సినిమాలో పాటకు గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా వరించింది .ఆ ఉత్తమ అవార్డు ఇంకా తీసుకోక ముందే ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నాడని పలుసార్లు రేప్ చేశాడు అంటూ ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందు ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆమె నివాసం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడికి జీరో ఎఫ్ఐఆర్ అంటూ పోలీసులు ట్రాన్స్ ఫర్ చేశారు.
ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర టెలీ కాన్ఫరెన్స్..
ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజ నరసింహ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ మెజర్స్‌పై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్షించారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ దవాఖానలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అదికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి, నివేదిక తయారు చేయాలని సూచించారు. తనిఖీల కోసం వెంటనే పది బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ బృందాలు తొలుత గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటళ్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఫైర్ అలార్మ్స్, స్మోక్ట్ డిటెక్టర్స్ ఉన్నదీ, లేనిది పరిశీలించాలన్నారు.
ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. 3 రోజులు భారీ వర్షాలు..
దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. నేటి నుంచి ఏపీ, తెలంగాణలోకి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఈ అల్పపీడనం తుఫాన్‌గా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారని బీఆర్ఎస్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కలిసి పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. కొడంగల్ లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారని మండిపడ్డారు. వారికోసం పోరాటం చేయండని చెబుతూ బాధపడుతున్నారన్నారు. సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారని తెలిపారు. కొడంగల్ లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు, పిల్లలపై అరాచాకలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నారని అన్నారు.
‘‘ఏక్ హైతో సేఫ్’’.. ఫలితాలపై ఫడ్నవీస్ తొలి స్పందన..
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సంచలన ఫలితాలు నమోదు చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ‘‘మహాయుతి’’ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు గానూ ప్రస్తుతం 220 కిపైగా స్థానాల్లో బీజేపీ+షిండే సేన+అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే సేన, శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 54 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నాయి.
మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు
మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా.. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని, తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో ₹3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్ర లో తీవ్ర ప్రభావం చూపెట్టాయన్నారు. తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర లోని ముంబయి, షోలాపూర్ , పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టమైందన్నారు హరీష్ రావు. బీజేపీ పార్టీ.. హేమంత్ సోరేన్ పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారని, బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయింది. విజయం సాధించిన హేమంత్ సోరెన్ కు శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు.
మహాయుతీ కూటమి చారిత్రాత్మక విజయానికి శుభాకాంక్షలు.. సీఎం ట్వీట్
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహాయుతీ కూటమి చారిత్రాత్మక విజయానికి ఆయన ‘X’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వాన్ని ప్రజలు నమ్మి ఇచ్చిన విజయం.. మోడీ పరివర్తనాత్మక ఆలోచనలు, వికసిత భారత్‌ను సాధించే విధానాలను ప్రజలు నమ్మారని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు చంద్రబాబు ఫోన్ చేశారు.
ప్రియాంక అరంగేట్రం అదిరింది.. లోక్‌సభలో అడుగుపెట్టేదెప్పుడంటే..!
రాహుల్‌గాంధీ సోదరి, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ రాజకీయ అరంగేట్రం అదిరిపోయింది. తొలి ప్రయత్నంలోనే సూపర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ చేయకముందు.. కాంగ్రెస్ పక్షాన ప్రచారం మాత్రమే నిర్వహిస్తూ ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తూ ఉండేవారు. అన్ని వెనుకుండే నడిపించేవారు. అలాంటిది తొలిసారి వయనాడ్ లోక్‌సభ బైపోల్స్ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. అంతే కనీవినీ ఎరుగని రీతిలో భారీ విక్టరీ అందుకున్నారు. తన సోదరుడు రాహుల్‌గాంధీ మీద ఉన్న 3.64 లక్షల మెజార్టీని దాటుకుంటూ 4 లక్షల మెజార్టీని క్రాస్ చేసి అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌పై 4,08,036 ఓట్ల మెజార్టీతో ప్రియాంక విక్టరీ సాధించారు.
అన్ని ప్రాంతాలను సమ దృష్టితో అభివృద్ధి చేస్తాం..
నెల్లూరులో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.. నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. అన్ని ప్రాంతాలను సమ దృష్టితో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి.. అభివృద్ధిలో మీదైన ముద్ర వేయండని అధికారులకు ఆయన సూచించారు.