NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

అఖిల పక్షంగా ప్రధానిని కలుస్తాం.. కిషన్ రెడ్డి అవకాశం కల్పించాలి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవకాశం ఇస్తే అఖిల పక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు 10వ బొగ్గు వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సింగరేణికి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ ప్రకారం సింగరేణి కి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మల్లు భట్టి విక్రమార్క వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి కాకుండా మొట్టమొదటి సారి కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రక్రియ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు. కిషన్ రెడ్డికి తెలంగాణ పరిస్థితులు బాగా తెలుసన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు, కొంగుబంగారం అన్నారు.

శాసనసభ స్పీకర్‌ ఎన్నిక.. అయ్యన్నపాత్రుడు తరపున పవన్‌, లోకేష్‌ నామినేషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు సమావేశాలు జరగనుండగా.. తొలిరోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రులు, వైఎస్‌ జగన్‌.. ఆ తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు అంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.. మరోవైపు.. రేపు శాసన సభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు సభ్యులు.. ఇప్పటికే సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ను స్పీకర్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దీంతో.. శాసనసభ స్పీకర్ అభ్యర్థిగా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు.. ఇక, అయ్యన్నపాత్రుడు తరపున నామినేషన్ దాఖలు చేశారు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ తదితర నేతలు పాల్గొన్నారు. కూటమికి తిరుగులేని మెజార్టీ ఉన్న నేపథ్యంలో.. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక లాంఛనమే కానుంది.

మీరు గ్రాడ్యుయేట్‌ అయితే నేరుగా గ్రీన్‌ కార్డు ఇచ్చేస్తాం..

యూఎస్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ పూర్తైన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్ కార్డు ఇవ్వాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై మీ ప్రణాళికలు ఏంటి అని ఎదురైన క్వశ్చన్ కు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై ప్రతిసారి విమర్శలు కురిపించే ఆయన నోటి నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆదివారమే పేపర్ లీక్.. ఆ వెంటనే డార్క్ నెట్లో ప్రత్యక్షం..

ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్‌ జూన్‌-2024 పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. ఆ పరీక్షా పత్రాన్ని ఆదివారం నాడే లీక్‌ చేశారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత దానిని ఎన్‌క్రిప్టెడ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని తెలిపారు. దీని విచారణలో భాగంగా ప్రాథమికంగా ఈ అంశాలు బయటకు వచ్చాయి. కాగా, యూజీసీ-నెట్ పరీక్షను జూన్ 18వ తేదీన (మంగళవారం) నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్యాంక్ ముందుకు వెళ్ళాలి

రాజన్న సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి సంఘం కళ్యాణ మండపంలో సిరిసిల్ల అర్బన్ బ్యాంకు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గంకు ఎన్నికైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సహకార రంగంలో బ్యాంక్ లో అంతో విలక్షణమైనదని, 47 బ్యాంక్‌లో అర్బన్ బ్యాంక్ ప్రత్యేకమైందన్నారు. అందరూ తప్పకుండా పాత బకాయిలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్యాంక్ ముందుకు వెళ్ళాలన్నారు కేటీఆర్‌. రాష్ట్రంలో అందరికంటే ముందు మన బ్యాంక్ ముందు ఉండాలి, నేను కూడా అండగా ఉంటానని, పట్టణంలో రానున్న రోజుల్లో కౌన్సీలర్ ఎన్నికలు ఉన్నాయి. ప్రజలందరూ  పట్టణ అభివృద్ధికి పాటుపడాలన్నారు.

తెలంగాణకు రక్షణ కవచం బీఆర్‌ఎస్‌ అని మరోసారి తేలింది

తెలంగాణకు రక్షణ కవచం బీఆర్‌ఎస్‌ అని మరోసారి తేలిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడేది కెసిఅర్ అని నిరూపితం అవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ హక్కులు దారాదత్తం చేస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ పట్ల సోయి లేదని, కేఆర్‌ఎంబీ విషయాల్లో కాంగ్రెస్ ఎదురు దాడి చేసి… తప్పించుకునే ప్రయత్నం చేసిందని జగదీష్ రెడ్డి విమర్శించారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రకు కాంగ్రెస్ , బీజేపీ తెర తీసిందని ఆయన మండిపడ్డారు. ముందు బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి బొగ్గు గనుల వేలంకు అంగీకారంకు వచ్చాయని, అది తెలిసి సింగరేణి బొగ్గు గనుల వేలం ను బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటాం అని చెప్పామన్నారు.

సీజనల్ వ్యాధుల కట్టడిపై సమీక్ష.. వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన డిప్యూటీ సీఎం..

సీజనల్ వ్యాధుల వ్యాప్తి నిరోధంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలపై అసెంబ్లీ కమిటీ హాల్‌లో పవన్‌ కల్యాణ్ సమీక్ష చేపట్టగా.. ఈ సమావేశానికి మంత్రులు సత్యకుమార్, నారాయణ, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పట్టణ, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీజనల్ వ్యాధులపై సమీక్షలో అధికారులను వరుస ప్రశ్నలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉక్కిరిబిక్కిరి చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులను ఆయన నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకివ్వలేదంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం, స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులను సీఎఫ్‌ఎంస్ ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదికివ్వాలని మంత్రి పవన్ ఆదేశించారుతాగునీటి సరఫరాలో లోపాల వల్ల విజయవాడలో డయేరియా కేసులు ఉత్పన్నమవుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధుల కట్టడికి నియంత్రణ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జేపీ నడ్డాకు మరో కీలక పదవి..!

బీజేపీ రాజ్యసభ ఎంపీ జేపీ నడ్డా.. మోడీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే కీలకమైన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలను ప్రధాన మోడీ అప్పగించారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కేంద్రమంత్రి కాగా.. ఇప్పుడు రాజ్యసభలో కూడా సభా నాయకుడిగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

బొగ్గు గనులను వేలం.. కార్మికులు నిరసన

కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని బొగ్గు గనుల పై సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు,నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయటం ద్వారా బొగ్గు ప్రాజెక్టులను బడా ప్రవేట్ సంస్థలకు అప్పగించి ప్రభుత్వ బొగ్గు రంగ సంస్థలను నిర్విర్యం చేయటమే కాక కార్మికుల హక్కులను ఉపాధి అవకాశాలను లేకుండా చేయటం జరుగుతుందని,కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిని ప్రవేటీకరణ చేయమని ప్రకటిస్తూనే తెలంగాణలోని బొగ్గు ప్రాజెక్టులను సింగరేణికి కేటాయించకుండా వేలంలో పెట్టారని,ఈ వేలంలో సింగరేణి పాల్గొనకుండా ఆంక్షలు పెట్టారని ఆరోపించారు.దేశంలోని వనరులు,ప్రభుత్వరంగ సంస్థలను దేశ,విదేశీ సంస్థలకు మోడీ ప్రభుత్వం కారు చౌకగా అమ్మి వేస్తుందన్నారు,వెంటనే కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ప్రారంభమైన తెలంగాణ కేబినెట్‌ భేటీ

తెలంగాణ కేబినెట్‌ భేటీ సచివాలయంలో ప్రారంభమైంది. వ్యవసాయం, రైతు సంక్షేమం ఎజెండాగా కేబినెట్‌లో ప్రధానంగా చర్చ నిర్వహించనున్నారు. రుణమాఫీపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకుట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్‌ 9 నాటికి తీసుకున్న రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించిట్లు సమాచారం. రుణమాఫీ విధివిధానాలు, అందుకు అవసరమైన రూ.39 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవడంపై కేబినెట్‌లో చర్చించారు. ఈ ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.