NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

విద్యార్థులకు ఆ సినిమా చూపించండి.. సీఎం రేవంత్ కు బండి సంజయ్‌ లేఖ

రజాకార్‌ సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ సినిమా చూపించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి ఎంపీ బండి సంజయ్ కుమార్ లేక రాశారు. రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా రజాకార్‌ అన్నారు. నిజాం పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి స్వేచ్ఛా వాయువుల అందించేందుకు జరిగిన పోరాటాలను, రజాకార్ల రాక్షసత్వంపై పోరాడి సమిధలైన యోధుల చరిత్రను, తెలంగాణ ప్రజలకు విమోచన కల్పించేందుకు ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ చేసిన కృషిని అద్బుతంగా తెరపై చూపించిన సినిమా ఇది అని తెలిపారు. నాటి వాస్తవాలను నేటి తరానికి తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎదురయనేది ఈ సినిమాలో చూపించారని అన్నారు. అంతేకాదు.. ఎన్ని అవరోధాలు కల్పించినా వాటిని అధిగమించి సినిమాను అత్యద్బుతంగా తీసిన దర్శక, నిర్మాతలతోపాటు సినిమా యూనిట్‌ను అభినందించడంతోపాటు ప్రభుత్వపరంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌.. విచారణ వచ్చే నెలకు వాయిదా

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. ఏప్రిల్‌ 16వ తేదీన ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం పేర్కొంది.. కాగా, చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని గత వాదనల సందర్భంగా సుప్రీంకోర్టును కోరారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు. అందుకు సంబంధించిన వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు జస్టిస్‌ బేలాఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనంకు తెలిపారు న్యాయవాదులు. ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏపై సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే.. దీంతో.. తదుపరి విచారణ మూడు వారాల పాటు వాయిదా పడగా.. ఆ వాయిదా ప్రకారం ఈ రోజు విచారణ జరగగా.. మళ్లీ 16వ తేదీకి వాయిదా పడింది.

రంగంలోకి వంగవీటి రాధా..! జనసేన ప్లాన్‌ అదే..

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కాకరేపుతున్నాయి.. అన్ని పార్టీలు ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. వంగవీటి రాధాకృష్ణపై ఫోకస్‌ పెట్టింది జనసేన పార్టీ.. ఆయనను రంగంలోకి దించాలని చూస్తోంది.. అయితే, వంగవీటి రాధా వరుసగా రెండోసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం సాగుతుంది.. కానీ, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో రాధాను ప్రచారం చేయించాలని భావిస్తున్నారు జనసేన పార్టీ పెద్దలు.

నేను పార్టీ మారడం లేదు.. పుకార్లు నమ్మకండి..

బీఆర్ఎస్ లోనే ఉంటాను.. నేను పార్టీ మారడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వలసలు పర్వం కొనసాగుతుంది. తాజాగా రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ హస్తం పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలసిందే. కాగా.. ఎర్ర బెల్లి దయాకర్ రావు కూడా కషాయం కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చాయి. వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రధాన అనుచరుడు.. అయితే ఈయన తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మార్నేని రవీందర్ రావు తోపాటు ఆయన భార్య, ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు.

చంద్రబాబు వీక్నెస్‌ బయటపెట్టిన కేశినేని నాని..

టీడీపీకి గుడ్‌బై చెప్పిన బెజవాడ ఎంపీ కేశినేని నాని.. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. ఇక, అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌.. మరికొంతమంది లీడర్లను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఒకరు ఎదిగితే ఓర్వలేని మనిషి చంద్రబాబు అంటూ మండిపడ్డారు.. కొన్ని పాములు తన పిల్లలు తానే, తన గుడ్లను తానే మింగిసినట్లు.. చంద్రబాబు కూడా పార్టీలో ఎదిగేవారిని చూసి.. ఉండలేరని ఆరోపణలు గుప్పించారు.. నేను ఎదగడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని.. నన్ను ఎంపీగా నిలబెడుతూనే.. పోటీగా ఐదు మందిని పెట్టారంటూ దుయ్యబట్టారు..

రేవంత్ రెడ్డి విర్రవీగే మాటలు మానుకోవాలి

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ విమర్శలు గుప్పించారు. ఇవాళ కొప్పుల ఈశ్వర్‌ మీడియాతో మాట్లాడూ.. విర్రవీగే మాటలు రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాలని కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఏదో తప్పు చేసినట్లుగా చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని, విచారణల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ఎగ్గొడుతున్నారని విమర్శించారు కొప్పుల ఈశ్వర్‌. దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలు ఆపేశారని కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చిల్లరగా మాట్లాడుతున్నారని కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు.

కవితకు బెయిల్‌ ఇప్పించగలను.. కానీ..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టైన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉంది. కవితను బయటకు తీసుకువచ్చేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు ఎవరైనా బెయిల్ ఇప్పించగలరా? న్యాయంగా పోరాడితే నేను బెయిల్ ఇప్పించగలనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. సీబీఐ భయం ఉంటే… ఐటీ సోదాల భయం ఉంటే ఎవరైనా తన వద్దకు రావొచ్చని తాను వారిని కాపాడుతానని కేఏ పాల్‌ వెల్లడించారు.

అకాల నష్టం.. అపార నష్టం..

వాతావరణ మార్పుల వలన తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా అకాల వర్షాలు కురిసాయి. ఈ అకాలవర్షాల వలన రాష్ట్రంలో అక్కడక్కడా కొన్ని ప్రాంతాలలో పంట నష్టం సంభవించినట్లు తెలుస్తున్నది. వచ్చే రెండు మూడు రోజులు కూడా ఆకాలవర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలియజేయడమైనది. కావున రైతులందరు వచ్చే రెండు మూడు రోజులు తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా మంత్రి వర్యులు కోరడమైనది అదే విధంగా వ్యవసాయ ఉద్యాన, మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇవ్వవల్సిందిగా ఆదేశించడమైనదని తెలియజేసారు. ముఖ్యముగా మార్కెట్ కు తీసుకువచ్చిన ధాన్యము గానీ, మిర్చి గానీ, మరే ఇతర పంట కానీ దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా కల్లాల్లో గానీ, ఇతర ప్రాంతాలలో ఆరబోసిన ధాన్యము గానీ, ఇతర పంటలు గానీ, దెబ్బతినకుండా రైతులకు తగు సూచనలు ఇవ్వవల్సిందిగా అధికారులను ఆదేశించారు.

కోహ్లీ న్యూలుక్ చూశారా.. అదిరిపోయింది

దాదాపు రెండు నెలల తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2024తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టుతో కలిసి.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రతి ఐపీఎల్ కు ఎవరో ఒక ఆటగాడు వినూత్నమైన స్టైల్ లో ఆకట్టుకోవడం మన చూశాం. తాజాగా.. కింగ్ కోహ్లీ ఈ ఐపీఎల్ లో ఆకట్టుకోవడానికి కొత్త లుక్ లో వస్తున్నాడు.