NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బాల్య వివాహాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ..

బాల్య వివాహాలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాల్య వివాహాలపై మార్గదర్శకాలను జారీ చేసిన కోర్టు, బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఏ వ్యక్తిగత చట్టం ప్రకారం సంప్రదాయాలకు భంగం కలిగించరాదని పేర్కొంది. బాల్య వివాహం ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును హరిస్తుందని కోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

మూసీ సుందరీ కరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం న్యాయం కాదు..

తెలంగాణలో మూసీ సుందరీ కరణ హాట్ టాపిక్ గా మారింది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చి వేస్తుందని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ విమర్శిస్తున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం న్యాయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణను, పునరుజ్జీవన చర్యలను మేం వ్యతిరేకించడం లేదని కానీ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూసీ సుందరీకరణ చేయాలని కోరారు. మూసీ నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి, అభివృద్ధి చేయాలని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో గత 30-40 సంవత్సరాలుగా నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయవద్దని తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గం, గాంధి నగర్ డివిజన్, హరిత అపార్ట్మెంట్ లైన్, ఆంధ్ర కేఫ్ X రోడ్ లో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి సేవరేజ్ లైన్ ను ఆయన ప్రారంభించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఐసీయూలో రోగి మృతి

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో మొత్తం ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో ఒక రోగి మృతి చెందాడు. మంటలు చెలరేగినప్పుడు చాలా మంది రోగులు సీల్దా ప్రాంతంలో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఆసుపత్రిలో ఉన్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 అగ్నిమాపక వాహనాలు ఆసుపత్రికి చేరుకొని, ఘటనా స్థలం నుంచి 80 మందిని రక్షించారు.

నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి..

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో పది మంది ఎమ్మెల్యేలపై కేసు వేశానని.. నేను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. నన్ను చంపుతామని గతంలో బెదిరించిన వాల్లే పోయారని తెలిపారు. నేను మంచి చేయడానికి వచ్చానని.. నామీద కుట్రలు చేస్తున్నారు.. నాకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నా అన్నారు. నాకు సెక్యూరిటీ దేవుడే అని తెలిపారు. కలలో కూడా మీరు బాగుపడరని కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపాలని చూస్తున్నటువంటి వాళ్ళు కచ్చితంగా చస్తారని తెలిపారు. తెలంగాణా గ్రూప్ వన్ విద్యార్థులు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారని.. వాళ్లకు నెల, రెండు నెలలు సమయం ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి పోయిందని.. హర్యానా లో 7 హామీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదన్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. అందుకే కాంగ్రెస్ హామీలను హర్యానాలో జనం నమ్మలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను రేవంత్ రెడ్డి తో ఉంటే రాష్ట్ర అభివృద్ధికి మంచి జరుగుతుందన్నారు.

23న ఏపీ కేబినెట్‌.. సూపర్‌ సిక్స్‌పై ఫోకస్‌..!

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్‌ భేటీకానుంది.. ఇక, వివిధ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు పంపించాలంటూ అన్ని శాఖల కార్యదర్శలకు లేఖ రాశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్.. కాగా, 23వ తేదీన జరగనున్న కేబినెట్‌ సమావేశంలో కీలక చర్చలు సాగే అవకాశం ఉంది.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కేబినెట్‌ సమావేశం చర్చించనుంది.. దేవదాయ శాఖకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.. ఇక, దీపావళి తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో కేబినెట్‌ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది..

లిక్కర్, ఇసుక వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దు.. సీఎం క్లియర్ వార్నింగ్

వైసీపీ చేయని తప్పులు లేవని.. లేకుంటే ఎందుకు ఎన్నికల్లో 11కు పడిపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మనం నిలబడ్డాం నిలదొక్కుకున్నామని.. 93 శాతం సీట్లు వచ్చాయంటే… అందరం గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. విదేశాల‌ నుంచీ వచ్చి మరీ మనల్ని గెలిపించారన్నారు. ఒక నాయకుడు జైలుకు వెళ్ళాడు.. ఒక నాయకుడు టార్చర్ అనుభవించాడని పేర్కొన్నారు. ఏ కార్యకర్త తప్పు చేసిన అది సీఎం మీద పడుతుందన్నారు. మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందన్నారు. 7 శ్వేత పత్రాలు ముందుగానే ఇచ్చామన్నారు.

9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్‌

తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం ఫైల్‌పై తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సంతకం చేశారు. దీంతో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం. కుమార్‌, పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్‌ శ్రీనివాస్‌, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్‌ కుమార్‌, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్‌ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్‌, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, వ్యవసాయ యూనివర్సిటీ వీసీగా అల్దాస్‌ జానయ్య, హార్టికల్చర్‌ వర్సిటీ వీసీగా రాజిరెడ్డి లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

శరత్ సిటీ మాల్ ‘చట్నీస్‌’లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సోదాలు.. కుళ్లిన కూరగాయలు లభ్యం

రెస్టారెంట్ల పరిస్థితి ఇప్పుడు పేరు గొప్ప.. ఊరు దిబ్బలా మారింది. బయటకి చూస్తే క్లాసీగా కనిపిస్తున్నా, వంటగది పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. భోజన ప్రియుల దృష్టిని దూరంగా ఉంచి, నాలుగు మొక్కలు, కొత్త పంథాలను ఉపయోగించి యాంబియెన్స్‌ను మెరుగుపరుస్తున్నారు. కస్టమర్లు హోటళ్ల వంటగదిని పరిశీలించరు కనుక, వారు ఏది అందించినా తింటారు అని భావిస్తున్నాయి రెస్టారెంట్ యాజమాన్యాలు. ముఖ్యంగా హైదరాబాద్‌లో, విభిన్న ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు. వీకెండ్ వచ్చేసరికి, ఇంట్లో వండడం కన్నా రెస్టారెంట్ల నుంచి ఆహారం ఆర్డర్ చేయడం లేదా వెళ్లి తినడం అనేది సర్వసాధారణం అయింది. కానీ, ఈ క్రమంలో నాణ్యత లేని పదార్థాలు, నిల్వ చేసిన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తూ కొన్ని హోటళ్లు పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఫుడ్‌ సేఫ్టే అధికారులు రెస్టారెంట్‌, హోటళ్లపై కొరడా ఝుళిస్తున్నారు. నాణ్యత లోపానికి తావివ్వకుండా.. ఏ చిన్న పొరపాటు చేసినా కేసులు నమోదు చేస్తూ.. అవసరమైతే తగు చర్యలు తీసుకుంటున్నారు.

వైన్ షాపుల ముందు చికెన్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

వైన్ షాపుకు వెళ్లామంటే.. చుక్కేయాలంటే ముక్క ఉండాల్సిందే. లేదంటే.. మందు గరం గరం ఉండి తాగలేకపోతారు. అందుకోసమని.. వైన్ షాపు ముందు పెట్టే చికెన్, చేపలు, గుడ్లు ఇలా ఏదొక నాన్ వెజ్‌ను తెచ్చుకుని కానించేస్తారు. తక్కువ ధరకు దొరుకుతుందని.. వైన్ షాపు ముందు పెట్టే చికెన్‌ను తిన్నారంటే అంతే సంగతులు.. ఎందుకంటే అది కుళ్లిన చికెన్. అది తింటే కడుపులోపల డైజేషన్ కాక.. వాంతులు, విరోచనాలు, మల విసర్జన లాంటివి అవుతుంటాయి. చికెన్ ఇంకొంచెం ఎక్కువగా పాడైతే మనిషి సీరియస్ కూడా అవుతాడు. అంతేకాకుండా.. ఆ చికెన్ తినడం వల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అసలు విషయానికొస్తే…

హైదరాబాద్ నగరంలో కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్న గోడౌన్‌ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీఎస్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన 200 కేజీల చికెన్, గోడౌన్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా.. గోడౌన్‌ కు సంబంధించి అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేవు. బేగంపేట్, ప్రకాష్ నగర్ చికెన్ గోడౌన్‌లలో టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి, తనిఖీలు నిర్వహించారు. చికెన్ గోడౌన్‌లలో కుళ్లిపోయిన చికెన్‌తో చిందరవందరగా ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు.

హమాస్ చీఫ్ సిన్వార్ హతంపై అమెరికా కీలక ప్రకటన

హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తు్న్న ఇజ్రాయెల్ గురువారం మరో చరిత్ర సృష్టించింది. అగ్ర నాయకులందరినీ ఐడీఎఫ్ దళాలు అంతమొందించాయి. అయితే గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి సూత్రదారి యాహ్యా సిన్వార్‌ మాత్రం చేతికి చిక్కలేదు. అతగాడి కోసం ఐడీఎఫ్ దళాలు ఎంత వెతికినా దొరకలేదు. అనూహ్యంగా ఇజ్రాయెల్ సైన్యంలో కొత్తగా చేరిన యువ దళాలు మాత్రం సిన్వార్‌ను చాకచక్యంగా అంతమొందించాయి. తొలుత సరిగ్గా గుర్తించలేకపోయారు. కానీ డీఎన్ఏ టెస్టులు తేలడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ధారించి ప్రకటన చేశారు. చనిపోయింది యాహ్యా సిన్వారేనని వెల్లడించారు. దీంతో ఇజ్రాయెల్ హిస్టరీలో మరో రికార్డు సొంతం చేసుకున్నారు.