కేసీఆర్, హరీశ్ రావు కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు..
ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టున్న ఇబ్బందులు తొలగించడానికి గతంలో రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ కమిటీ నియమించారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీ గత సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చింది.. కేసీఆర్ వేసిన కమిటీనే ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు సాధ్యమని రిపోర్ట్ ఇచ్చింది.. గతంలో వాస్తవాలతో కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టారు అని ఆయన పేర్కొన్నారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీ కట్టాలనేది కేసీఆర్ ఆలోచన చేశారు.. దాంతో కమిటీ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకోకుండా మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టారు.. ప్రాజెక్టులపై వాస్తవాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ ముందు పెట్టే ప్రయత్నం చేశారు.. కానీ, వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీశ్ రావు మధ్య వార్..
తెలంగాణ అసెంబ్లీలో అధికార- ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. శాసనసభలో ఇవాళ నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం ప్రవేశ పెట్టాగా.. దానిపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్పించుకున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే నీటిరంగంపై చర్చ కొనసాగాలని తెలిపారు. పాపాల భైరవుడు కేసీఆర్‌ను సభకు పిలవాలి అని ఆయన కోరారు. ముఖం లేక అసెంబ్లీకి రావడం లేదని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.. హెలికాప్టర్‌లో కూర్చోని నల్లగొండకు పోవచ్చు కానీ, సభకు మాత్రం రాలేరా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ నల్లగొండను నాశనం చేశారన్నారు.. మాపై మాట్లాడిన బాష దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సీఎంను, తనను కూడా అరే తురే అంటున్నారు.. అన్ పార్లమెంటరీ భాష మాట్లాడారని సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.. అయితే, వెంకట్ రెడ్డి కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు..! వారికే కాదు రాష్ట్రానికీ అరిష్టం..!
టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుండగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు.. వారికే కాదు రాష్ట్రానికి కూడా అరిష్టం అంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రాంతీయ పార్టీలు ఆలోచించుకోవాలి. మూడో సారి ఎన్డీయే అధికారంలోకి రాకుండా చూడాలన్నారు. సీఎం వైఎస్ జగన్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. దేశంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి.. అమరావతికి అన్ని రాజకీయపార్టీలు ఆమోదం తెలిపాయి.. కానీ, అధికారంలోకి వచ్చాక జగన్ మూడు రాజధానులు డ్రామా ఆడారు అని దుయ్యబట్టారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నారని ఫైర్ అయ్యారు.
ఢిల్లీలో రైలు ప్రమాదం.. 10 గూడ్స్ రైలు బోగీలు బోల్తా
ఢిల్లీలోని (Delhi) రెసిడెన్షియల్ కాలనీ దగ్గర రైలు ప్రమాదం (Trian Accident) జరిగింది. ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది. దీంతో 10 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఏం జరిగిందోనని భయాందోళన చెందారు. మరోవైపు మరో ట్రాక్‌లో ప్రయాణికులతో ఉన్న రైలు ఆగి ఉంది. అటు వైపు బోల్తా పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న అధికారులు, రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గూడ్స్ రైలుకు చెందిన కనీసం 10 వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు పోలీసులు తెలిపారు. జకీరా ఫ్లై ఓవర్ సమీపంలో ఉదయం 11:50 గంటల ప్రాంతంలో పటేల్ నగర్-దయాబస్తీ సెక్షన్‌లో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. ట్రాక్ లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. హీటెక్కిన ప్రొద్దుటూరు రాజకీయం
ప్రొద్దుటూరు రాజకీయం హీటెక్కుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో రూ.40 కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్యే రాచమల్లు ఆక్రమించాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఎండోమెంట్ భూమిలో సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు ఎందుకు రోడ్డు వేశాడని దుయ్యబట్టారు. ఎండోమెంట్ భూమిపై ఎమ్మెల్యేకు ఉన్న హక్కు ఏమిటి..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాచమల్లు భూదాహం ప్రజలకు తెలియాలనే నిరసన చేపట్టామని వరదరాజుల రెడ్డి తెలిపారు.
రైతుల నిరసన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం..ఎంఎస్‌పీపై ప్యానెల్ ఏర్పాటు.!
పంటలకు మద్దతుధర(ఎంఎస్‌పీ)తో సహా 12 హమీలను అమలు చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులు ఆందోళన చేపట్టారు. ‘ఢిల్లీ ఛలో’పేరుతో మార్చ్ నిర్వహించారు. అయితే, వీరిని హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లోనే పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. మరోవైపు రైతులతో కేంద్ర మంత్రులు పలుమార్లు చర్చించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
మేడారంలో తాత్కాలిక బస్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
మేడారంలో భక్తుల కోసం తాత్కాలిక బస్ స్టేషన్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. 55 ఎకరాల్లో బెస్ క్యాంప్‌తో కూడిన బస్ స్టాండ్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఓకే సారి 30 వేల మంది క్యూ లైన్లో ఉండేలా బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. మేడారం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి సుధాకర్ ప్రారంభానికి రాలేక పోయారని ఆమె వెల్లడించారు. గతంతో పోలిస్తే 20 ఎకరాలను ఎక్కువగా బస్ స్టాండ్ ను విస్తరించామని ఆమె పేర్కొన్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, రెండు సంవత్సరాల కొకసారి సమ్మక్క, సారక్క వన దేవతలు బయటకు వస్తారన్నారు. డబ్బులతో సంబంధం లేకుండా ప్రజలు వచ్చే పండుగ మేడారం జాతర అని ఆమె అన్నారు. వందల కిలోమీటర్లు బంగారాన్ని నెత్తిన పెట్టుకొని వస్తారని, మేడారం కు వచ్చే దారిలో పార్కింగ్, తాత్కాలిక బస్ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతర విజయవంతం లో టీ ఎస్ ఆర్టీసీ కృషి ఎంతో ఉంటుందని, భక్తులు స్వియనియంత్రణ తో దర్శనం చేసుకోవాలనీ కోరుతున్నామన్నారు.
సిట్టింగ్ జడ్జిని కాళేశ్వరం విచారణకు ఇవ్వాలని హైకోర్టును కోరినం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రం సమర్పించింది. శనివారం ఉదయం సభ ప్రారంభం కాగానే నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మంత్రి తన ప్రసంగంలో మేడిగడ్డ ప్రాజెక్టుపై ఆందోళనలను ఎత్తిచూపారు. ప్రాజెక్టుల పరిస్థితిని వివరించే సంక్షిప్త వీడియోను అసెంబ్లీలో పంచుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో చర్చలు కొనసాగుతున్నాయని, ఎన్‌డీఎస్‌ఏ నివేదికను సభకు సమర్పించారని మంత్రి ఉత్తమ్ ఉద్ఘాటించారు. ప్రాజెక్ట్ అనంతర తనిఖీలు లేకపోవడాన్ని మంత్రి ఉత్తమ్ ఎత్తి చూపారు , కాగ్ నివేదిక ఆధారంగా జవాబుదారీ చర్యలను అమలు చేస్తామని ఉద్ఘాటించారు.
నాలుగున్నరేళ్ల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు..
తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చులేకపోతుందని ఏపీ జేపీసీ ఆరోపిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు, IR ఇవ్వకపోడంతో ఏపీ జేపీసీ ఉద్యమ బాట పట్టింది. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని జేఏసీ నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈరోజు గుంటూరు తాలూకా కార్యాలయం ఎదుట ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక పెంక్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి…12వ పీఆర్సీని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల14వ తేదీ నుంచి తాలూకా స్థాయి నుంచి ఉద్యోగులు నిరసనకు దిగారని తెలిపారు.
రవాణా శాఖలో అధికారులంతా బదిలీ..!
తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. అయితే.. తాజాగా తెలంగాణ రవాణా శాఖలో ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ అయ్యేలా రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. అన్ని స్థాయుల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్థానచలనం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (MVI), 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు(RTO), ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు(DTC) బదిలీ అయ్యారు.
ఇదిలా ఉంటే.. నిన్న రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు కొనసాగాయి. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న 95 మంది డీఎస్పీలను బుధవారం బదిలీ చేయగా.. తాజాగా గురువారం మరో 26 మంది డీఎస్పీలను బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. బుధవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులను బదిలీ చేశారు. మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తోన్న, సొంత జిల్లాల్లో పని చేస్తోన్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ గత డిసెంబర్‌లో ఆదేశించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులను బదిలీ చేసినట్లు సమాచారం.
