NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్‌

చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు. ఇలాంటి సంఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి సరైన వివరాలు తెలుసుకొని రైస్ మిల్లు యజమానులు పనిలోకి తీసుకోవాలన్నారు. గంజాయి,డ్రగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటుందన్నారు. ప్రభుత్వం తరుపున 2.50 లక్షల, రైస్ మిల్లు తరుపున మరో 5 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబంలో ఒకరి ఉద్యోగం, ఇల్లు, ఉన్న చిన్న పాప చదువులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా?.. కేసీఆర్‌ పై జీవన్ రెడ్డి ఫైర్‌

బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా?.. కేసీఆర్‌ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నరసింహారెడ్డిని వైదొలగమనడానికి నువ్వెవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగే పోలీస్ లను బెదిరిచ్చినట్టు ఉందన్నారు. కేసీఆర్ పై విచారణ కక్ష సాధింపు కాదన్నారు. విచారణకు సహకరించకపోవడమె కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్టే అన్నారు. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థను కేసీఆర్ కించపరుస్తున్నాడని తెలిపారు.

ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామా

దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామా చేశారు. రిటైరైన తర్వాత సర్వీసులో కొనసాగనిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరో నెలన్నర పదవీ కాలం ఉండగానే కరికాల వలవన్ రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించారని వలవన్‌పై అభియోగాలు వచ్చాయి. ధర్మారెడ్డి రిలీవ్, టీటీడీ కొత్త ఈవోగా శ్యామల రావు నియామకానికే వలవన్‌ను చంద్రబాబు సర్కార్ పరిమితం చేసింది. ఇకపై దేవదాయ శాఖలో కరికాల వలవన్ చేతుల మీదుగా పనులు జరపడానికి ప్రభుత్వ పెద్దలు ఇష్టపడనట్లు తెలుస్తోంది.

ఆగస్టు 1 నుంచి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ

వ్యవసాయం, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఇది ఆదాయాన్ని పెంచడానికి భూముల మార్కెట్ విలువను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించింది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ఇదే తొలిసారి. స్టాంప్ , రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుత విలువను అధ్యయనం చేయడానికి ,  తదనుగుణంగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను నిర్ణయించడానికి దాన్ని సవరించడానికి కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. జూన్ 18న అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో (ఆర్‌డీఓ) సమావేశమైన తర్వాత దీనికి సంబంధించిన గ్రౌండ్‌వర్క్‌ను శాఖ ప్రారంభించనుంది. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువలను సవరించడానికి స్టాంప్ , రిజిస్ట్రేషన్ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈవీఎంలను తొలగించాలన్న ఎలాన్ మస్క్.. వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి వివరణ

ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు – ఈవీఎంల విశ్వసనీయతపై ఇటీవల పోస్టు చేశారు. ఆయన ప్రకటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నుంచి ఈవీఎంలను తొలగించడంపై ఎలోన్ మస్క్ అభిప్రాయాలపై ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిప్పికొట్టారు. అందులో వాస్తవం లేదని అన్నారు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్‌కు వచ్చి నేర్చుకోవాలని అన్నారు. వాస్తవానికి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రద్దు చేయాలని ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికపై ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. ఎందుకంటే వాటిని మనుషులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI హ్యాక్ చేసే ప్రమాదం ఇప్పటికీ చాలా ఎక్కువ అని పేర్కొన్నారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

గోషామహల్‌కు చెందిన బిజెపి శాసనసభ్యుడు టి రాజా సింగ్‌ను పోలీసులు ఆదివారం ఆర్‌జిఐ విమానాశ్రయంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి నగరానికి వచ్చాడు , అతను మెదక్ జిల్లాకు వెళ్లనున్నాడని వార్తలు రావడంతో, పోలీసులు అతన్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి సైబరాబాద్ అల్లర్ల పోలీసులు, స్థానిక పోలీసులు ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో పెద్దఎత్తున మోహరించారు. పశువుల సమస్యపై శనివారం రాత్రి మెదక్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని, దీంతో అక్కడి పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.

ఢిల్లీలో నీటి కోసం ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

ఢిల్లీలో నీటి సమస్య తీవ్ర తరమవుతుంది. నీటి కోసం దాడులు చేసుకున్న సంఘటనలు వెలువడుతున్నాయి. ద్వారకా జిల్లాలో నీటి కోసం పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. అయితే.. ఈ ఘర్షణలో ఎలాంటి మతపరమైన కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. పబ్లిక్‌ కుళాయి నుంచి నీటిని తీసుకునే విషయంలో ఘర్షణ జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో గాయపడ్డ ముగ్గురు వ్యక్తులను ఇందిరాగాంధీ ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేశామన్నారు పోలీసులు. ఇరువర్గాల వాంగ్మూలాలపై విచారణ జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎండ వేడిమి తీవ్రతతో ఢిల్లీలో నీటి సమస్య తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే.. నీటి సమస్యపై రాజకీయ రగడ సాగుతోంది. కుట్రలో భాగంగా.. పైపులైన్‌ను లీక్ చేసి, ప్రజలకు నీరు అందకుండా చేశారని ఢిల్లీ నీటి మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీలోని నీటి పైపులైన్ల భద్రతను పెంచాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరారు. ఈ పైప్‌లైన్‌ను ఎవరు పగలగొడుతున్నారని మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరపాలన్నారు.

నిరాధారమైన ఆరోపణలను ఖండించిన టీజీఎస్ఆర్టీసీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్‌సీఎస్‌) అమలు విషయంలో చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను సంస్థ అమలు చేయడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిందని చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం  ఖండిస్తోంది. నియమ నిబంధనలకు లోబడి బోర్డు అనుమతితోనే సంస్థలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేస్తోంది.

అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంను అమలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం 2022లోనే నిర్ణయించింది. బస్సుల్లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడిన డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కార్డ్స్, మొబైల్ టికెట్స్, మొబైల్ బస్ పాస్ ల  సౌకర్యం కల్పిస్తూ.. సేవలను మరింతగా సులభతరం చేయడమే ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ఈ వ్యవస్థ వల్ల రియల్ టైం సమాచారం ఎప్పటికప్పుడు క్షణాల వ్యవధిలో సంస్థకు తెలుస్తుంది. ఈ సమాచారంతో ప్రయాణికుల డిమాండ్ మేరకు రద్దీని బట్టి సర్వీసులను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుత టికెటింగ్ వ్యవస్థ కంటే ఇది ఎంతో మెరుగైనది.

అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడురోజుల పాటు వేడిగాలులు

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 16 నుండి 18 వరకు ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా.. జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మరియు ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. జూన్ 16 మరియు 17 తేదీలలో.. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ , బీహార్ మరియు జార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలలో హీట్ వేవ్ కొనసాగనుంది.

జూన్ 16, 17 తేదీలలో.. పంజాబ్, హర్యానా-చండీగఢ్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో రాత్రిపూట వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో.. జూన్ 16-18 మధ్య, జూన్ 16న ఢిల్లీ, మహారాష్ట్రలోని విదర్భలో రాత్రి వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. జూన్ 17 నుండి 20 వరకు ఒడిశాలో వాతావరణం వేడి, తేమగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రేపు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్న సీఎం చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన మొదటి పర్యటనలో భాగంగా సోమవారం పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టును సందర్శించి వాటి ప్రస్తుత స్థితిగతులను జలవనరులశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు పూనుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. పోల వరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధా న్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.