NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బ్యాంకులకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎస్ జీ ఫిన్సర్వ్ లిమిటెడ్ కు 28.30 లక్షల జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కు సంబంధించిన కొన్ని షరతులను పాటించనందుకు కంపెనీకి జరిమానా విధించబడింది. ఎస్ జీ ఫిన్‌సర్వ్‌ని ముందుగా ముంగిపా సెక్యూరిటీస్ అని పిలిచేవారు. ఆర్‌బిఐ ఎప్పటికప్పుడు ఆర్థిక సంస్థల నిబంధనలను పాటించని అంశాలపై నిఘా ఉంచుతుంది. కంపెనీలు, బ్యాంకులు నిఘాలో ఉండేలా జరిమానాలు వంటి చర్యలను కూడా తీసుకుంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ ఆర్థిక వివరాలలో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (CoR)కి సంబంధించిన నిర్దిష్ట షరతులను పాటించలేదని ఇతర విషయాలతోపాటు వెల్లడించినట్లు ఆర్‌బిఐ సోమవారం తెలిపింది. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (CoR) జారీ చేసిన నిర్దిష్ట షరతులను పాటించనప్పటికీ, కంపెనీ ప్రజల నుండి డబ్బును డిపాజిట్లుగా తీసుకొని రుణాలు ఇచ్చిందని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌.. ఎన్నికల సంఘానికి నోటీసులు

ఎన్నికల టైంలో పొలిటికల్ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఓ లాయర్ సుప్రీంలో పిల్ ఫైల్ చేశారు. పొలిటికల్ పార్టీలు ఎన్నికల ముందు ఉచిత వాగ్దానాలు చేయకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకునేలా పోల్‌ ప్యానెల్‌ను ఆదేశించాలని ఆ పిటిషన్ లో వెల్లడించారు. ఇక, ఈ ఉచిత హామీల వల్ల ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతుందని బెంగళూరుకు చెందిన లాయర్ వేసిన పిటిషన్ లో వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే అంశంపై పెడింగ్‌లో ఉన్న పలు కేసులతో కలిపి దీన్ని విచారించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కేంద్రానికి, ఈసీకి నోటీసులు ఇచ్చింది. కాగా, పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజయ్‌ హన్సారియా ఉచిత హామీల అంశంపై అత్యవసర విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు. అదే విధంగా ఎన్నికల ముందు ఇచ్చే ఉచిత వాగ్దానాలు ఓటర్లపై తీవ్ర ప్రభావితం చూపించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయని కోర్టులో న్యాయవాది పేర్కొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు..

మంత్రి కోమటిరెడ్డి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి అధికారులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డితో మాట్లాడటానికి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిజామాబాద్ లోక్ సభ పరిధిలో 7 చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామన్నారు. నా వల్లే జిల్లాలో కాంగ్రెస్ వీక్ అయ్యిందన్నారు. రూ.93 కోట్లతో చేపట్టిన మాధవనగర్ ఆర్వోబి.. 2 లైన్ ను 4 లైన్ చేశా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదన్నారు. రైల్వే రంగాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు డిపాజిట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి అధికారులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎందుకు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ముగ్గరు మైనర్లు..

శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు సంచలనం సృష్టించింది.. వలస వచ్చిన ఓ ఫ్యామిలీపై దాడి చేసిన దుండగులు.. అర్ధరాత్రి సమయంలో అత్తా కోడళ్లపై గ్యాంగ్‌ రేపు చేసిన ఘటన కలకలం సృష్టించగా.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. ఘటన జరిగిన 48 గంటల్లోగా నిందితులను అరెస్ట్‌ చేశారు.. ఈ కేసుపై మీడియాతో మాట్లాడిన ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. సత్యసాయి జిల్లాల్లో అత్తా కోడళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో 48 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారని తెలిపారు.. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు ఈ ఘటనలో నిందితులకు వేగంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం.. దీనిపై విచారణకు ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

గురుకుల పాఠశాలకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు..

రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు యాజమాన్యాలు తాళాలు వేసిన విషయం తెలిసిందే. సుమారు 9 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ భవనాల యజమానులు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టళ్లకు తాళాలు వేశారు. దీనిపై రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే వున్నాయని తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా రాని బకాయిలు అడగలేక.. నేడో, రేపో నిధులు విడుదల చేసే సమయంలో ఇలా గురుకులాలకు తాళం వేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఎవరి మాటలు పట్టుకొని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దు అని సూచించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాత బకాయిలు ఇప్పించే బాధ్యత మాదని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

దామగుండంలో నెవీ రాడార్‌ స్టేషన్‌.. శంకుస్థాపన చేసిన రాజ్‌ నాథ్‌ సింగ్‌, రేవంత్ రెడ్డి

దామగుండం నెవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది. దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ సెంటర్‌గా కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్మిస్తోంది. శంకుస్థాపన స్థలానికి చేరుకున్న రాజనాథ్ సింగ్‌కు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు మరికొందరు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ స్టేట్ కీలక అడుగు ముందుకు వేసిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వార్నింగ్..

కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై ఫైర్‌ అయ్యారు. పార్టీ లో క్రమశిక్షణ అనేది చాలా కీలకం అన్నారు. క్రమశిక్షణ ఉల్లంగిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీస్కెళ్లాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయి లో మరింత లోతుగా పని చేయాలన్నారు. రాబోయే ఎన్నిలకలో మనం మరింత గట్టిగా పని చేయాలని సూచించారు. నియోజక వర్గ ఇన్‌చార్జ్ భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పని చేసి మంచి ఫలితాలు తేవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. పార్టీ లో క్రమశిక్షణ అనేది చాలా కీలకం అన్నారు. క్రమశిక్షణ ఉల్లంగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు

హర్యానాలో ఎదురైన పరిస్థితులు మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎదురవ్వకూడదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇంకా షెడ్యూల్ రాక ముందే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులను అధిష్టానం నియమించింది.

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు పరిశీలకులను కాంగ్రెస్ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ఉన్నారు. జార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు తారిక్‌ అన్వర్‌, అధిర్‌ రంజన్‌ చౌదరిని నియమించారు. రాష్ట్ర ఎన్నికల సీనియర్ కోఆర్డినేటర్లుగా పార్టీ నేతలు ముకుల్ వాస్నిక్, అవినాష్ పాండేలను నియమించారు.

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్ ఎప్పుడంటే..!

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.  మహారాష్ట్రలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న వెలువడనున్నాయి. ఇక జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20న పోలింగ్.. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండగా.. జార్ఖండ్‌లో 2025, జనవరి 5తో కాలపరిమితి ముగుస్తుంది. మహారాష్ట్రలో 288 స్థానాలు ఉండగా.. 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2.6 కోట్ల మంది ఓటర్లున్నారు.

సైదాబాద్‌లోని స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్‌ను సందర్శించిన మంత్రి సీతక్క

సైదాబాద్ లోని స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్‌ను మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇక్కడ 72 మంది విద్యార్థులు ఉన్నారని, ఇక్కడ బాల నేరస్తులుగా వచ్చినవారిలో పరివర్తన తీసుకొస్తున్నామన్నారు. ఇది శిక్ష కాలం కాదు శిక్షణ కాలమని ఆమె వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వ అబ్జర్వేషన్ ఉన్నంతవరకు వాళ్ళలో మంచి పరివర్తన రావాలని, వాళ్లకి కావాల్సిన ఎడ్యుకేషన్, వృత్తిపరమైన కోర్సులను నేర్పిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. టాటా టెక్నికల్ సపోర్ట్‌తో సాంకేతిక పరిజ్ఞానం నేర్పిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. విలు విద్యలో నేషనల్ గేమ్స్ వరకు రాణిస్తున్నారని, ఇంకా అవకాశాలు కల్పించి యోగ్యులుగా తీర్చిదిద్దుతామన్నారు.