NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ సభ్యుడు కె.కేశవరావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక ఈ స్థానానికి ఎన్నికయ్యే వారు 2026 ఏప్రిల్‌ 9 వరకు కొనసాగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ పేర్కొంది. మరీ కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఖాళీని ఎవ్వరూ నియామకం అవుతారో వేచి చూడాల్సిందే.

డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?

ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు వీరిద్దరు. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి కలిశారు రామ్, జగన్నాథ్‌. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అందుకే రాజకీయ హత్యలు.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి వంగలపూడి అనిత. కర్నూలులో టీడీపీ నేత హత్య కేసులో నిందితులు ఎంతటి వారైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎస్పీతో రెండు సార్లు సమీక్షించానని.. అగంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరిగితే అందులో ముగ్గురు టీడీపీ నాయకులు ప్రాణాలు కోల్పాయరని ఆవేదన వ్యక్తం చేశారు.. పెద్దల సభకు మచ్చ తెచ్చే విధంగా కొందరు ఎమ్మెల్సీలు ప్రవర్తన ఉంటుందని విమర్శించారు. డ్రైవర్ ను డోర్ డెలివరీ చేసిన వాళ్లు, ఫ్యామిలీ గొడవలతో రచ్చ చేసుకునేవాళ్లు ప్రజాప్రతినిధులు అంటే జనానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నామో చెప్పాలి.. అటువంటి వ్యక్తులను సభకు పంపించిన పార్టీ ఆలోచన చేసుకోవాలి అంటూ హితవు పలికారు హోం మంత్రి వంగలపూడి అనిత.

జమ్మూ కాశ్మీర్‌ లో ఎన్ కౌంటర్.. ఒక కెప్టెన్, నలుగురు ఉగ్రవాదులు హతం

స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు.. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సమయంలో భారత సైన్యానికి చెందిన 48 నేషనల్ రైఫిల్స్‌కు చెందిన ఒక కెప్టెన్ వీరమరణం పొందాడు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పౌరుడు కూడా గాయపడ్డాడు. మరో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. శివగఢ్-అస్సార్ బెల్ట్‌లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో రక్తపు మరకలు ఉండడంతో కాల్పుల్లో ఓ ఉగ్రవాది గాయపడి ఉండొచ్చని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి భద్రతా బలగాలు ఒక ఎం4 కార్బైన్, మూడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నాయని వర్గాలు తెలిపాయి.

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం హేయం.. వైద్యులకు మంత్రి సంఘీభావం

గాంధీ ఆస్పత్రిలో కోల్‌కతా హత్యాచార ఘటనకు నిరసన చేపట్టిన వైద్యులకు మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించారు. ఓ రోగిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన మంత్రి సీతక్క.. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించాలని వ్యాఖ్యానించారు. మహిళలు దేవతలతో సమానమని.. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకి వస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు మహిళలను మళ్ళీ మధ్య యుగాలకు తీసుకువెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం హేయమని.. వైద్యులకు అండగా మేము నిలబడతామన్నారు. తరగతి గదుల నుంచి మహిళలను గౌరవించాలి అని నేర్పించాలన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షించకూడదని వ్యాఖ్యానించారు.

మన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయడం మనందరి బాధ్యత!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా.. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను కేంద్ర మంత్రి ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర్య పండుగ సందర్భంగా 25 కోట్ల మంది భారతీయులు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారని, రేపటి స్వాతంత్ర్య దినోత్సవం వరకు ఈ స్ఫూర్తిని కొనసాగించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు తిరంగా ర్యాలీలు నిర్వహించి.. ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్నారు. దేశ సమైక్యతను కాపాడుకునే ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.

వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌లకు బిగ్‌ షాక్.. డీజీపీ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత కొందరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి.. ఇదే సమయంలో మరికొందరిని వెయిటింగ్‌లో పెట్టింది ప్రభుత్వం.. అయితే, వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్‌ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్‌లో ఉంటూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.. వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు..

విద్యారంగ సమస్యలకు 5,000 కోట్ల కేటాయించాం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకుల హాస్టల్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ప్రతి జిల్లా కలెక్టరు, శాననసభ్యులు, విద్యశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు పొన్నం ప్రభాకర్‌. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక నిధులతో ప్లాంటేషన్ పనులను పూర్తిచేయాలని ఆదేశించామని, పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది, త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెప్తామన్నారు పొన్నం ప్రభాకర్‌.

ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్..

ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 8:30 గంటలకు గాంధీ భవన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు. 9.20 గంటలకి పరేడ్ గ్రౌండ్ చేరుకొని సైనికుల స్మారకానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వాతంత్య్ర వేడుక సంబురాల్లో పాల్గొని.. అనంతరం పలువురికి సేవా, పురస్కార పథకాలు అందజేస్తారు. గోల్కొండ కోట జెండా వందనం కార్యక్రమం అనంతరం.. ఉదయం 11.45 గంటలకు బేగం పేట విమానాశ్రయం నుండి భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు బయలుదేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12:50 గంటలకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చేరుకుంటారు. పుసుగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ,అనంతరం పంప్ హౌజ్ స్విచ్ ఆన్ చేసి..అక్కడే మీడియాతో మాట్లాడతారు. అనంతరం ఖమ్మం జిల్లా వైరా చేసుకొని…మూడో విడత 2లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీ ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

రేపే ఏపీ వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవ‌లం 5 రూపాయలకే పేదవాడి కడుపు నింప‌డం కోసం కూటమి సర్కార్ మళ్ళీ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా రేపు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి..తొలి విడ‌త‌లో 100 అన్న కాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఇక, కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. అలాగే, మిగిలిన 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఆరంభించనున్నారు. అలాగే, సెప్టెంబర్ 5వ తేదీన మరో 99 క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేసేందుకు ఎన్డీయే కూట‌మి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇక‌పోతే, అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ అనే సంస్థ ద‌క్కించుకుంది.

Show comments