Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంత్రి వేముల మంజులమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కొంత కాలంగా చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితమే మరణించారు. వారి స్వగ్రామం వేల్పూర్ నందు రేపు ఉదయం అంతక్రియలు జరుగుతాయి. వేముల ప్రశాంత్ రెడ్డి రెండు సార్లు బాల్కొండ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రశాంత్ రెడ్డి తల్లి మరణ వార్త విన్న ఆయన అభిమానులు సంతాపం ప్రకటించారు.

సాగు నీటి రంగంలో పునర్జీవం పథకం ద్వారా 300 కిలో మీటర్ల దూరంలోని కాళేశ్వరం జలాలను తెచ్చి ఎస్సారెస్పీలో పోసుకోవడంతో పాటు ప్రాజెక్టు పరిధిలో రైతులకు, బాల్కొండ, ఆర్మూర్‌ నియోజక వర్గాల్లోని లక్ష్మీ కెనాల్‌, గుత్ప, చౌట్‌పల్లి హన్మంత్‌ రెడ్డి, తదితర ఎత్తిపోతల పథకాలకు నీటికి కొదవ లేకుండా చేశారు. ఎస్సారెస్పీకి దూరంగా ఉండే భీమ్‌గల్‌, మోర్తాడ్‌, వేల్పూర్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో 80 వేల ఎకరాలకు సాగు నీరందించే ప్యాకేజీ- 21తో కాళేశ్వరం జలాలను తెచ్చి కప్పల వాగులో పారించుకోవడం తనకు ఎనలేని ఆనందాన్ని అందించారు.

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త.. 2024 జనవరి నెల‌ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ప్రత్యేక దర్శనం, వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్న తేదీలను ప్రకటించింది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ.. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు దానికి సంబంధించిన రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారు..

ఖమ్మం జిల్లాలో బీజేపీ జాతీయ కార్యదర్శి, ఖమ్మం జిల్లా ఎలక్షన్ ఇన్చార్జ్ సునీల్ దియోధర్ పర్యటించారు. ఈ సందర్భంగా సునీల్ దియోధర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ గజ దొంగ.. కుటుంబ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన కుటుంబం జైల్ లో మీటింగ్ పెట్టుకునే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని సునీల్ దియోధర్ ఆరోపించారు. అవినీతి పరులను మోడీ వదిలి పెట్టరని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ఆయన ఉద్ఘాటించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కి ఓటు వేసినట్టేనని సునీల్ దియోధర్ వ్యాఖ్యానించారు. రెండు హిందూ వ్యతిరేక పార్టీలు అని ఆయన విమర్శించారు.

మరోసారి హాస్పిటల్‌లో చేరిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్…

టాలివుడ్ స్టార్ హీరో సమంత గత కొన్ని నెలలుగా మయోసైటీస్‌తో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. యశోద మూవీ సందర్భంలో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది. అంతేకాదు ఆమె దీనికి ట్రీట్‌మ్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఆమె స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వాడేవారట. ఈ క్రమంలో ఆమె ముఖంలో గ్లో తగ్గిందని తెలుస్తోంది.. ఈ విషయాన్ని సామ్ స్వయంగా చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని కోరుకున్నారు..

ఈ వ్యాధి నుంచి కాస్త కోలుకున్న సమంత విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాను చేసింది.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ అందుకున్న కలెక్షన్స్ పరంగా బాగానే వసూల్ చేసింది.. ఆ సినిమా తర్వాత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారు. అది అలా ఉంటే సమంత తాజాగా తన చేతికి డ్రిప్స్‌ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె ఆసుపత్రి బెడ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను పంచుకుంటూ.. మందుల వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించి ఓ పోస్ట్ చేశారు. తనకు ఈ డ్రిప్సే తనకు కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయని తెలిపారు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

పాక్ ఆటగాళ్లకు ఘనస్వాగతం పలకడంపై మండిపడుతున్న టీమిండియా అభిమానులు

శనివారం అహ్మదాబాద్‌లో భారత్‌-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది. వారికి స్వాగతం పలికేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో టీమిండియా అభిమానులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు. అందుకు సంబంధించి అభిమానులతో పాటు పలువురు నేతలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

అహ్మదాబాద్లోని ప్రధాని మోడీ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడటం కోసం ఇక్కడకు చేరుకున్నారు. పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు అమ్మాయిలు నృత్యం చేశారు. గుజరాతీ దుస్తులు ధరించిన అమ్మాయిలు పాకిస్థాన్ ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ కనిపించారు. అంతేకాకుండా వారిపై పూలవర్షం కురిపించారు. పాక్ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడం టీమిండియా అభిమానులకు నచ్చలేదు. దీంతో ఒక నెటిజన్ బీసీసీఐని ట్రోల్ చేశాడు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఇండియన్ ఆర్మీ ఫోటోను షేర్ చేస్తూ, సైనికుల బలిదానాన్ని బీసీసీఐ మరిచిపోయిందని రాశారు.

స్కిల్‌ కేసులో నారా లోకేశ్‌కు ఊరట

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో లోకేశ్‌ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ కోర్టుకు వివరించింది. ముద్దాయిగా చూపని కారణంగా లోకేశ్‌ను అరెస్ట్‌ చేయబోమని కోర్టుకు సీఐడీ తరఫు న్యాయవాదులు వెల్లడించారు. ఈ కేసులో లోకేశ్‌ పేరును చేర్చితే 41ఏ నిబంధనలు అనుసరిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.

నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో ఈ నెల 4వ తేదీని విచారణ జరిగిన సంగతి విదితమే. ఈ నెల 12 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయవద్దని సీఐడీ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌లో కుటుంబసభ్యులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారని.. అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసినట్లు లోకేశ్ తరఫున లాయర్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం లోకేశ్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.

పాలేరు నుంచి పోటీ చేస్తా.. తెలంగాణ ప్రజల కోసం త్యాగానికి సిద్దం అయ్యాను

హైదరాబాద్‌లో నేడు వైఎస్సార్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల పాల్గొని మాట్లాడుతూ.. పాలేరు నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఇంకో స్థానం నుంచి కూడా పోటీ చేస్తాని ఆమె పేర్కొన్నారు. విజయమ్మ, అనిల్ కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉందని, అవసరం అయితే విజయమ్మ పోటీ చేస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుందని, గొప్ప చరిత్ర లేకపోవచ్చు.. ప్రజల కోసం పోరాటాలు చేశానన్నారు వైఎస్‌ షర్మిల. మొట్టమొదట నిరుద్యోగుల కోసం YSRTP దీక్షలు చేసిందని, ప్రతిపక్షానికి సోయి వచ్చింది.. పాలక పక్షానికి బుద్ది వచ్చిందన్నారు వైఎస్‌ షర్మిల. మధ్యమధ్యలో కార్లు ఎక్కకుండా పాదయాత్ర చేశానని, ఎవరికి బెదరకుండా… అదరకుండా పోరాటం చేశానన్నారు వైఎస్‌ షర్మిల.

కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం అలవాటుగా మారింది..

కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం అలవాటుగా మారిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు. ప్రజల కోసమో, రాజకీయం కోసమో ఆలోచించుకుని మాట్లాడాలని మంత్రి సూచించారు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యత విద్య అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు బైజూస్ మీద మాట్లాడారని.. బైజూస్‌పై స్టడీ చేసి మాట్లాడమని చెప్పానని ఆయన తెలిపారు. బైజూస్ కంటెంట్‌ను ఆ సంస్థ ఫ్రీగా ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఆ మేరకే ఒప్పందం చేసుకున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా బైజూస్ సంస్థకు ప్రభుత్వం చెల్లించటం లేదని పేర్కొన్నారు. బైజూస్ కంటెంట్‌తో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు సుమారుగా 5 లక్షలకు పైగా ట్యాబ్స్ అందించామన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇచ్చే ట్యాబ్స్‌లో 8,9,10 తరగతుల కంటెంట్ వేసి ఇస్తున్నామన్నారు.

అధికారంలోకి వచ్చాక అధికారులకు మిత్తితో సహా ఇస్తాం

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ తన అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. కాంగ్రెస్‌, బీజేపీలు తమ అభ్యర్థుల ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే టికెట్‌ ఆశపడి భంగపడ్డ నేతలు కొందరు ఆయా పార్టీలను వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువరు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారి కుమారుడు మహిపాల్ రెడ్డి, ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరారు. అయితే.. వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బిల్లా రంగాలు పిచ్చి కుక్క లెక్క తిరుగుతున్నారు తెలంగాణ అంతటా అంటూ విమర్శించారు. బిల్లా రంగాలు ఎవరో కాదు కేటీఆర్.. హరీష్ అని ఆయన వ్యాఖ్యానించారు. నీఅయ్యా సీఎం అయినా.. నువ్వు మంత్రి అయినా సోనియాగాంధీ పెట్టిన భిక్ష అని, అమెరికాలో బాత్ రూమ్ లు కడిగే నువ్వు ..మంత్రివి అయ్యావంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

మేము కూడా నిన్నే నమ్ముతున్నాం.. నాని అన్నా.. ఏం చేస్తావో.. ?

న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
హయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం.. నాని.. మరోసారి ఫాదర్ గా నటించడం ఒకటి అయితే.. సీతారామం సినిమాతో తెలుగువారి గుండెల్లో సీతగా స్థిరపడిన మృణాల్.. నటించడం రెండోది. ఇక ఖుషీ సినిమాతో తెలుగుతెరకు పరిచయమై మొదటి సినిమాతోనే అందరి హృదయాలను తనవైపు తిప్పుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్. ఈ సినిమాకు కూడా అతనే మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబుకు బిగ్‌ షాక్‌..

ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌కు విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతించింది. సోమవారం చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలని పేర్కొంది. ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు వాదనలు విన్నది. చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించగా.. పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది.

స్కిల్‌ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ ఉంది. ఈ క్రమంలో సోమవారం వ్యక్తిగతంగా చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు వెల్లడించింది.

 

Exit mobile version