NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం.. అసెంబ్లీలో ఆమోదం..

తెలంగాణ రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదించింది. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 సవరణ బిల్లు ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ రోజు సభ సమావేశమైన వెంటనే, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తరపున శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను (ప్రకటనల నిషేధం మరియు వాణిజ్యం మరియు వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీని నియంత్రించడం) తరలించారు. ) తెలంగాణ సవరణ బిల్లు 2024.

బిల్లు యొక్క లక్ష్యాలు మరియు లక్ష్యాలను వివరిస్తూ, హుక్కా పార్లర్‌లు యువ తరానికి కలిగిస్తున్న హానిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే నిషేధించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించిందని అన్నారు. పార్లర్లపై నిషేధం విధిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోగా, కేబినెట్ ఆమోదం తెలిపింది. యువత, కళాశాలకు వెళ్లే విద్యార్థులు హుక్కాకు బానిసలుగా మారుతున్నారని, ఈ పరిస్థితిని నిర్వాహకులు సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సిగరెట్ తాగడం కంటే హుక్కా తాగడం చాలా హానికరమని మంత్రి సభలో వ్యాఖ్యానించారు. దాదాపు 200 పఫ్‌లు కలిగిన ఒక గంట హుక్కా సిగరెట్ కంటే 100 రెట్లు ఎక్కువ హానికరం. హుక్కాలో బొగ్గును ఉపయోగించడం వల్ల ఆ పొగలో కార్బన్ మోనాక్సైడ్, హెవీ మెటల్స్ మరియు క్యాన్సర్ కారకాలు అనే రసాయనాలు ఉంటాయి. పొగ హుక్కా స్మోకర్లకే కాదు, పాసివ్ స్మోకర్లకు కూడా హానికరం. హుక్కా పార్లర్‌లు, బార్‌లు బహిరంగ ప్రదేశాల్లో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

రైతుల ఆందోళన.. ఢిల్లీలో మార్చి 12 వరకు 144 సెక్షన్!

తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో రైతులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రైతుల మెగా మార్చ్‌ నేపథ్యంలో ఢిల్లీలో నెల రోజుల పాటు (మార్చి 12 వరకు) 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అశాంతి మరియు భద్రతా సమస్యల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీ సరిహద్దులు సింగు, ఘాజీపూర్, టిక్రి వద్ద భద్రతా చర్యలు మరియు ట్రాఫిక్ ఆంక్షలు తీవ్రమయ్యాయి. 5,000 కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

ఢిల్లీ నగరంలో రైతుల ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్‌, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని కూడా నిషేధించారు. లౌడ్‌ స్పీకర్ల వాడకంపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ భద్రతా చర్యల అమలు ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలలో ట్రాఫిక్‌ను ప్రభావితం చేసింది. సోమవారం ఉదయం ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగింది. దేశ రాజధానిలోకి రైతులు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

షర్మిలకు మంత్రి రోజా కౌంటర్‌.. వైఎస్సార్‌ ఆశయాలకు నిజమైన వారసుడు జగన్‌ మాత్రమే..!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని ఆరోపించారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు చీల్చడానికి షర్మిల వచ్చిందని విమర్శించారు. చంద్రబాబుకు మేలు చేయడానికి వైఎస్ పేరు షర్మిల వాడుకుంటోందని మండిపడ్డారు. వైఎస్ ఆశయాల కోసం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వస్తే.. వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకు వచ్చిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచికూడా చేయలేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా లేకుండా ఏపీని విభజించిన కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినా పార్టీలో.. షర్మిల చేరి.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపైన, నాపై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరి వైఎస్ఆర్ ఆత్మక్షోభించే విధంగా చేసిందన్నారు.. వైఎస్సాఆర్‌కు, ఆయన ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే అన్నారు మంత్రి ఆర్కే రోజా. ఇక, మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి..

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే.. ఆ తర్వాతే మూడు రాజధానులు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో పొత్తుల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఢిల్లీస్థాయిలో చర్చలు సాగుతోన్న తరుణంలో.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. విమర్శలు గుప్పిస్తోంది.. అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉంది..? బీజేపీతో నా? టీడీపీతో నా..? అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.. పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌వి అనైతికమైన పొత్తులు అని దుయ్యబట్టారు.. మా ప్రత్యర్థులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. అసలు జనసేన ఎవరితో పొత్తు లో ఉంది బీజేపీ తో నా, టీడీపీ తోనా? అని నిలదీశారు.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి.. నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీకి కేటాయించారని.. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు.. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక ఇంకో పార్టీలోకి వెళ్తున్న లావు ఒక బీసీ ద్రోహిగా ఫైర్‌ అయ్యారు.. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరి చేసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. ఇక, ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలుచేశారు మంత్రి రాంబాబు.. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన ఆయన.. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు.

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు..

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ బోర్డుకు అప్పగించ కూడదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. షరతులకు అంగీకరించకుండా కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నాగార్జున సాగర్ ప్రాజెక్టును దళారుల సాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేజిక్కించుకుందని ఆరోపణలు వచ్చాయి. రాయలసీమ లిఫ్ట్ పేరుతో రోజుకు 3 టీఎంసీల నీరు ఇచ్చినా కేసీఆర్ స్పందించలేదన్నారు. నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న కారణంగానే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గుర్తించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో గతంలో కంటే ఎక్కువ అన్యాయం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు మీ కోసం..

ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త చెబుతూ.. ఇప్పటికే ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. మొత్తం 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు రిలీజ్‌ చేశారు.. మొత్తం 6,100 పోస్టుల్లో ఎస్జీటీలు 2,280, స్కూల్‌ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్‌ 42 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.. ఇక నోటిఫికేషన్‌ ప్రకారం ఇవాళ్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది.. ఇక, ఫిబ్రవరి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.. మార్చి 5వ తేదీ నుంచి డీఎస్సీ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.. ఇక, మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషల్స్‌లో పరీక్షలు నిర్వహించనుండగా.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్‌ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషల్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోంది..

బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్లాక్ మెయిల్తో బీజేపీ అందర్నీ లొంగ తీసుకుంటోందని ఆరోపించారు. సీబీఐ, జ్యూడిషియల్ ని గుప్పట్లో పెట్టుకుని అధికారంలోకి వస్తామంటున్నారని తెలిపారు. అధికారం కోసం పక్కా మైండ్ గేమ్ తో ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ లను మోడీ, అమిత్ షా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు జైల్ కి వెళ్లాడనికి కారణం మోడీ, అమిత్ షాలేనని రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోని 90శాతం మందికి ఇది తెలుసు.. బీజేపీతో కలవద్దని వారు చెబుతున్నారన్నారు.

ఉత్తమ్‌ మాట్లాడేది మాకే అర్థం కాలేదు.. ప్రజలకు ఏం అర్ధంమౌతుంది..?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉందని, ఆయన తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని, ఆయన మాట్లడేది మాకే అర్ధం కావడం లేదు, తెలంగాణ ప్రజలకు ఏం అర్ధంమౌతుందని ఆయన ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే.. కృష్టా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించబోమంటూ తెలంగాణ అసెంబ్లీలో సోమవారం కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. బీఆర్ఎస్ తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్!’ కారణంగా అధికార పార్టీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం ఇదని ఆయన అభివర్ణించారు. కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా రేపు (మంగళవారం) నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ‘ఛలో నల్గొండ’ ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తీర్మానాన్ని ప్రవేశపెట్టనుందని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ ట్వీట్‌కు మాజీ సీఎం కేసీఆర్ ఫొటోని కేటీఆర్ జోడించారు.

వైసీపీ తరఫున ముగ్గురు నామినేషన్లు దాఖలు.. అభ్యర్థులు ఏమన్నారంటే..!

వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్‌ దాఖలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఈ ముగ్గురు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. వీరికి సీఎం బీఫాం అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికీ అవకాశం కలిపిస్తున్నారని తెలిపారు. తమకు ఇచ్చిన ఈ అవకాశంతో ముగ్గురం కూడా విజయం సాధిస్తామని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు అందరు కోరుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

రాహుల్ భారత్‌ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్ మార్పు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్‌లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. అయితే నెక్ట్స్ వీక్ నుంచి అక్కడ బోర్డు ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో యాత్రను ముందుగానే ముగించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

యూపీలో ఫిబ్రవరి 22 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 26 వరకు కొనసాగనున్న యాత్రను ఈ నెల 21కే ముగిసేలా రాహుల్‌ మార్పులు చేశారని రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాహుల్‌ గాంధీ అనేక సందర్భాల్లో ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు

బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసింది

నెహ్రూ నుండి మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు ఓబీసీ లకి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా మోడీ కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని ఎండగట్టారన్నారు. బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసిందని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రశ్నలకి రాహుల్ గాంధీ తో సహా ఎవరు సమాధానం చెప్పలేదని, కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ ఓట్ల కోసం తాపత్రయ పడుతున్నదన్నారు లక్ష్మణ్‌. మోడీ నీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని, కర్పూరీ ఠాకూర్,చరణ్ సింగ్, పీవీ నరసింహా రావు కి భారత రత్న ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతుందన్నారు లక్ష్మణ్‌. రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించింది చెప్పలేదని, హిందువులను ఆ పార్టీ అవమానించిందన్నారు ఎంపీ లక్ష్మణ్‌. హిందువుల ను, దేవి దేవతలను అవమంచడమే సెక్యులరిజం అని ఆ పార్టీ భావిస్తోందని ఆయన మండిపడ్డారు.

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన దుబాయ్ కేర్స్ సీఈఓ

తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును దుబాయ్ కేర్స్ సంస్థ సీఈఓ, వైస్ చైర్మన్ తారిఖ్ అల్ గర్గ్ సోమవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. భారత విద్యా రంగానికి సంబంధించి కీలక చర్చలు జరిపారు. ప్రపంచ విద్యా వ్యవస్థ పురోగమనానికి తాము చేపడుతున్న చర్యల గురించి తారిఖ్ గర్గ్ రాష్ట్ర మంత్రికి వివరించారు. ఆయా దేశాల్లో విద్యాభివృద్ధి కోసం తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తోందని, వివిధ దేశాల ప్రభుత్వాలతో భాగస్వామ్యమయ్యి పనిచేస్తున్నామని తెలియజేశారు.