Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

సీఎం క్యాంప్‌ ఆఫీసుకు కేఏ పాల్.. అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా..!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది.. అది కాస్తా వైరల్‌గా మారిపోతుంది.. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకు చేస్తున్న ప్రయత్నం నవ్వులు పూయిస్తుంది.. ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్‌ను కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు సూచనలు చేశారు.. కేంద్ర ఎన్నిక సంఘం ప్రతినిధుల కలసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.. అక్కడి వరకు బాగానే ఉంది.. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు కేఏ పాల్.. సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పాల్‌ను.. అనుమతి లేదని క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు పోలీసులు.. ఇక, పోలీసులు అడ్డుకోవడంతో సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద వేచి చూస్తున్నారు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు..

మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కార్యాలయంలోని రెండు, నాలుగో అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.హైదరాబాద్ తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో 12 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. మహదేవ్ పూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో అధికారుల బృందం రికార్డులు, విలువైన పత్రాలను పరిశీలిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

ఆరు అంశాలపై సీఈసీకి నివేదిక.. గుర్తింపులేని జనసేనకు ఎందుకు ఆహ్వానం..?

ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ బృందాన్ని వరుసగా కలుస్తున్నాయి రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీఈసీ బృందాన్ని కలిశారు ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. సీఈసీకి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించాం అన్నారు. అయితే, జనసేనకి గుర్తింపు లేకున్నా ఎందుకు ఆహ్వానించారని అడిగాం. పొత్తులో భాగంగా టీడీపీ అడిగిందని చెప్పారన్నారు. గ్లాస్ గుర్తు సాధారణ గుర్తు.. సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధం అన్నారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి సీఈవోకి కంప్లైంట్ ఇచ్చారు.. ఇతను టీడీపీలో కీలకంగా వ్యవహారిస్తున్నాడని.. కర్నూల్ జిల్లాలో 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని సురేష్ కంప్లైంట్ ఇచ్చాడు.. కానీ, అక్కడ వెరిఫికేషన్ చేశాక 87శాతం నిజమైన ఓట్లు ఉన్నాయని గుర్తించారని తెలిపారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎప్పుడు ఒకటి కాదు.. దయచేసి నమ్మకండి..!

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎప్పుడు ఒకటి కాదు.. దయచేసి ఈ ప్రచారాన్ని నమ్మకండి అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ఎ ప్పుడు ఒకటి కాదని తెలిపారు. కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని అన్నారు. దయచేసి ఈ ప్రచారం నమ్మవద్దని తెలిపారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. బిల్కిస్ బానో కేసులు కుహనా లౌకిక వాదులు నిన్న కేటీఆర్, రాహుల్, కవితలు మాట్లాడారని, మోడీ నీ విమర్శించారని మండిపడ్డారని తెలిపారు. సుప్రీం కోర్ట్ తీర్పును స్వాగతించారని, చెంప పెట్టు అని కామెంట్ చేశారని అన్నారు. రామ మందిర నిర్మాణం జడ్జిమెంట్ ఇచ్చింది కూడా సుప్రీం కోర్టు అని గుర్తు చేశారు. ఎందుకు మీరు స్వాగతించడం లేదు? అని ప్రశ్నించారు. మీరు ఎవరు వారసులు… రావణుడి, శూర్పణఖ వారసుల… మీ నోళ్ళు ఎందుకు పెకలడం లేదంటూ మండిపడ్డారు. షబానో కేసులో సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది… ప్రస్తుత చీఫ్ జస్టిస్ తండ్రి ఆ జడ్జ్ మెంట్ ఇచ్చారు.

ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..!

ప్రజా పాలనాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ‘‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’’లో బండి సంజయ్ పాల్గొన్నారు. వికసిత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై వెంకటంపల్లి గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వ పాలనా నచ్చక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు. ప్రజలను అప్పటి ప్రభుత్వం, లాగే ఇప్పటి ప్రభుత్వం మోసం చేసి, పాలిస్తాం అంటే, మళ్లీ బీజేపీ ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు.

హిందూపురంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెకు బాలకృష్ణ మద్దతు..

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం రెండు వారాలుగా పోరాటం సాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ.. సఫలం కాలేదు. దీంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. ఈరోజు హిందూపురంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న శిబిరానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెళ్లారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొని.. వారికి మద్దతు తెలిపారు. తమను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ కార్మికులు బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు.

అక్కడ పనికిరాడు కానీ.. ఇక్కడ పోటీకి పనికొస్తాడా..? బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు..

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురంలో పనికిరాని మంత్రి.. రాజమండ్రి రూరల్లో పోటీకి పనికొస్తాడా అంటూ ఆరోపించారు. రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీపై మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని, అధిష్టానం ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్ అని టీడీపీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించింది.. ఇప్పుడు ఉండదని చెప్పడానికి జనసేన నాయకుడు ఎవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి పౌరుడు వికసిత్ భారత్ అంబాసిడర్‌గా మారాలి

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ అంబాసిడర్ గా మారాలన్నారు. నేను సైతం అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, 1990లో అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని బీజేపీ పాలమూరులో తీర్మాణం చేసిందన్నారు కిషన్‌ రెడ్డి. అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా జేజేలు పలికిందని, బానిస మనస్తత్వం నుంచి బయటపడేలా ప్రధాని మోడీ 15 వందల చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తెచ్చారన్నారు కిషన్‌ రెడ్డి. అంతేకాకుండా.. కలల ఊహించనిది… మన కళ్ల ముందు అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయ్యిందని, బాబర్ కూల్చిన రామాలయాన్ని రక్తం చిందించకుండా మళ్లీ నిర్మించారని ఆయన కొనియాడారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువశక్తి మనదేశంలో ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలోని అనేక బహుళజాతి కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని, ఏ దేశం అభివృద్ధి చెందాలన్న యువతదే కీలకపాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు.

పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్.. సీఎంఓ నుంచి పిలుపు..

తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మావతి ఎపిసోడ్ చేరుకుంది. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో.. ఆమేకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. కాగా.. ఈ వ్యవహారంపై సజ్జల రామకృష్ణారెడ్డి సహా సీఎం జగన్ ను కలవనున్నారు ఎమ్మెల్యే పద్మావతి. తనకు సింగనమల సీటు నిరాకరించడంతో ఎమ్మెల్యే పద్మావతి సీఎంవో పై విమర్శలు చేసింది. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు చేసింది. తమ కాలువల నుంచి తాము తాగునీటి విడుదల కోసం.. సీఎంవో నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యల పై సీఎంకు వివరణ ఇవ్వనున్నారు పద్మావతి.

సచివాలయంలో తుమ్మలతో రైతు ప్రతినిధుల సమావేశం

హైదరాబాద్‌లో ఈ రోజు సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని వారి కార్యాలయంలో రైతు ప్రతినిధులు పలువురు కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతుబంధు అమలు, ధరణి పోర్టల్ సమస్యలు, రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, కల్తీ విత్తనాలు, ఎరువులను ఏ విధంగా అరికట్టాలి, సేంద్రియ ఎరువులు, బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతులు, డ్రిప్, చిరు ధాన్యాల సాగు తో పాటు ప్రాసెసింగ్, మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్, మద్దతుధరలు, ఆయిల్ పామ్ సాగు- ప్రాసెసింగ్, శీతల గిడ్డంగులు ఏర్పాటు, తదితర అంశాల గురించి వివిధ కోణాలలో చర్చించుటము జరిగింది. భూసార పరీక్షలు ఆధారంగా పంటల సాగు మీద దృష్టి సారించడం ద్వారా రసాయన ఎరువులు వాడకం గణనీయంగా తగ్గే అవకాశముంది.

జపాన్‌లో మరోసారి భారీ భూకంపం.. హడలిపోతున్న ప్రజలు

కొత్త ఏడాది వేళ జపాన్‌ను వరుస భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్‌ వాసులు తేరుకోకముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్‌ జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. జపాన్ తీరంలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వం కృషిని జస్టిస్ బాల కిషన్ కమిటీ అభినందించింది..

ఎస్సీల స్థితి గతులను అధ్యయనం కోసం జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి రాష్ట్రంలో పర్యటిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కమిటికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కమిటి దృష్టికి తీసుకుని వెళ్లామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని వివరించామన్నారు మంత్రి.

ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదాం

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం నేడు తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఖమ్మం వంటి ఒకటి.. రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయని, ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయామన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదామని, ఇప్పటికీ జరిగిన సమావేశాల్లో ఆత్మవిమర్శ జరిగిన సంగతి తెలిసిందేనని, ఖమ్మం సమీక్ష ఇది ఏడోసారన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటింది. వచ్చిన తెల్లారినించే మా వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రేస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తున్నదని ఆ పార్టీ నెల రోజుల పోకడ స్పష్టమౌతున్నదన్నారు.

Exit mobile version