NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

నీట్ ఫలితాలపై దుమారం..విచారణ కోరుతున్న ప్రియాంక గాంధీ

నీట్ ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ని డిమాండ్‌ చేస్తున్నారు. జూన్‌ 4న వెలువడిన నీట్‌ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మందికి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం మే 5న సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేయడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఆమె చెప్పారు.

ఓడినా 24 గంటలు 365 రోజులూ ప్రజల మధ్యే ఉండాల్సిందే : మల్లికార్జున ఖర్గే

లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలిసారి ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతోపాటు భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. దాదాపు 11:30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ఇతర పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం పని చేస్తూనే ఉండాలని సమావేశంలో ఖర్గే ఉద్ఘాటించారు. 24 గంటల 365 రోజులూ ప్రజల మధ్యే జీవించాల్సి వస్తుందన్నారు. గత కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్యకర్తలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది.

బతికి ఉండగానే స్మారకం.. ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూద్దురు అనేవారు!

అనారోగ్యంతో మరణించిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు(ఆదివారం) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య తెలంగాణ రాష్ట్ర అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం ఫిల్మ్ సిటీ నివాసంలో ఉంచారు. అయితే…జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి గా రామోజీరావు చరిత్రలో నిలిచిపోయారని అంటూ ఒక విడిపి వైరల్ అవుతోంది. చావు కంటే ముందే..స్మారకం నిర్మించుకుని ‘మరణం ఒక వరం’, ‘నాకు చావు భయం లేదు’ అని చెప్పి చూపించారని గతంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో స్మారకం ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు.

రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతుల నివాళి

రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రామోజీరావు పార్థివదేహం వద్ద కొద్దిసేపు చంద్రబాబు మౌనం పాటించారు. నివాళుర్పించిన అనంతరం రామోజీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పరామర్శించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని అన్నారు. మీడియా, చలనచిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రాంతం బుద్ధవనం

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో బుద్ధవనంను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున సాగర్ లోని బుద్ధవనంను సందర్శించానని, బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని ఆయన తెలిపారు. ఆచార్య నాగార్జునుడు తిరిగిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనం ను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి. బౌద్ధ టూరిజం సర్క్యూట్ లో తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని, యువత్ ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రాంతం బుద్ధవనం అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు.. డ్రోన్లు నిషేధం

నరేంద్ర మోడీ.. దేశ ప్రధానిగా మూడోసారి ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు. ఇదిలా ఉంటే ప్రమాణస్వీకారానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ సిద్ధమైంది. పారామిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్‌లతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాణస్వీరాకానికి విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో జీ 20 తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు.. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి

నీట్ (NEET) ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720 కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనితో తోడు ఈ సారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్ లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంటుంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావటమన్నది సాధ్యమయ్యే పనికాదన్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ‘గ్రేస్ మార్కులు’ ఇచ్చామని చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

ఛత్రపతి మాకు స్పూర్తి, పారిపోయే ప్రసక్తే లేదు.. రాజీనామాపై వెనక్కి తగ్గిన ఫడ్నవీస్..

మహారాష్ట్రలో బీజేపీ దారుణ ప్రదర్శనకు తాను బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల చెప్పారు. అయితే, అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ అగ్రనాయకత్వం వారించడంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు. తాను పారిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయాలని అమిత్ షా కోరిన ఒక రోజు తర్వాత ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో బీజేపీ 23 గెలుచుకోగా, 2024 ఎన్నికల్లో కేవలం 09 సీట్లకు మాత్రమే పరిమితమైంది.

వావ్‌.. గ్రీన్ యాపిల్ ఫ్లేవర్‌లో మాన్షన్ హౌస్

ప్రముఖ భారతీయ-నిర్మిత విదేశీ మద్యం తయారీదారు (IMFL) తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ఫ్లాండీ (ప్రీమియం ఫ్లేవర్డ్ బ్రాందీ) శ్రేణిలో కొత్త ఫ్లేవర్ ఆవిష్కరణను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. మాన్షన్ హౌస్ ఫ్లాండీ ఇప్పుడు తెలంగాణలో సరికొత్త గ్రీన్ యాపిల్ ఫ్లేవర్‌లో ప్రారంభించబడింది.

తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ దహనుకర్ మాట్లాడుతూ, “మా మాన్షన్ హౌస్ ప్రీమియం ఫ్లేవర్డ్ బ్రాందీ ఒక కేటగిరీ-ఫస్ట్ ఇన్నోవేషన్. సరికొత్త గ్రీన్ యాపిల్ ఫ్లేవర్‌ను విడుదల చేయడం FY23లో ప్రవేశపెట్టినప్పటి నుండి ఫ్లాండీ యొక్క బలమైన పనితీరుకు నిదర్శనం , మా ప్రాంతీయ స్థాపనను పటిష్టం చేస్తూ మా ప్రీమియం బ్రాందీ పోర్ట్‌ఫోలియోను మరింత మెరుగుపరచాలనే మా ప్రణాళికలకు అనుగుణంగా ఉంది.

నితీష్ కుమార్ పార్టీకి రెండు కేబినెట్ బెర్తులు..

లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఎన్డీయే కూటమి మరోసారి గెలుపొందడంతో వరసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రేపు భారత ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉంటే గతంలా కాకుండా ఈ సారి ఎన్డీయే మిత్రపక్షాల పరపతి పెరిగింది. 2014, 2019లో 543 ఎంపీ సీట్లలో బీజేపీ మెజారిటీ మార్క్(272) సీట్ల కన్నా ఎక్కువ సీట్లను స్వతహాగా కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి మాత్రం 240 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో మిత్రపక్షాలైన జేడీయూ, తెలుగుదేశం, శివసేన వంటి పార్టీలపై ఆధారపడాల్సి ఉంది.