బీజేపీ స్టేట్ ఆఫీస్ సిబ్బంది అందరినీ కలిసిన ప్రధానమంత్రి
బండి సంజయ్ చొరవతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ స్టేట్ ఆఫీస్ సిబ్బంది అందరినీ కలిసి పలకరించారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు మోడీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందిని కలిశారు. ఆఫీస్ లో పనిచేసే స్వీపర్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ మొదలు అక్కడ పనిచేసే సిబ్బంది అందిరినీ ఆప్యాయంగా పలకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో ఈరోజు కార్యాలయానికి చెందిన సుమారు 40 మంది ఆఫీస్ సిబ్బందిని కలిసేందుకు మోడీ కార్యాలయం అనుమతిచ్చింది. దీంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఆయా సిబ్బందిని వెంటబెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 వద్దకు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన మోదీ ఫామ్ నెంబర్ – 10 వద్ద కు వస్తూ అక్కడున్న సిబ్బందికి అభివాదం చేశారు. మీరంతా ఎన్నేళ్ల నుండి బీజేపీ ఆఫీస్ లో పనిచేస్తున్నారు? ఎలా ఉన్నారు?’’అంటూ పలకరించారు. అనంతరం ఒక్కొక్కరి వద్దకు వచ్చి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మోడీని కలిసే అవకాశం రావడం తమ అదృష్టమని ఆయా సిబ్బంది పేర్కొనడం గమనార్హం. మోడీని కలిసిన వారిలో బంగారు శృతితోపాటు ఆఫీస్ ఇంఛార్జ్ కేవీఎస్ఎన్.రాజు, కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ తదితరులున్నారు.
బండి సంజయ్‌ను భుజాలపై ఎత్తుకుని పరేడ్ మైదానమంతా తిరిగిన బీజేపీ కార్యకర్తలు
ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని ఈ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్ బీజేపీ బహిరంగ సభను నిర్వహించింది. అయితే.. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పరేడ్ గ్రౌండ్స్‌లో బండి సంజయ్‌ను భుజాలపై ఎత్తుకుని పరేడ్ మైదానమంతా బీజేపీ కార్యకర్తలు తిరిగారు. హిందూ టైగర్ బండి సంజయ్…. కాబోయే సీఎం సంజయ్ అంటూ నినాదాలతో పరేడ్ గ్రౌండ్ మారుమ్రోగింది. జైలు నుండి విడుదలైన బండి సంజయ్ ను కలిసేందుకు అడుగడుగునా కార్యకర్తలు ముందుకు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ‘‘బండి’’ని భుజం తట్టి అభినందించారు మోడీ.. ఎలా ఉన్నావ్ అంటూ ఆత్మీయంగా పలకరించారు.బీజేపీ బలోపేతం కోసం చేస్తున్న పోరాటాలు భేష్… భుజం తట్టి అభినందించడం గమనార్హం. ఒకవైపు నరేంద్రమోడీ, మరోవైపు బండి సంజయ్ నామస్మరణతో ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ మైదానమంతా మోగిపోయింది. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో అక్రమంగా అరెస్టై జైలుకు వెళ్లిన బండి సంజయ్ నిన్న బెయిల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన బండి సంజయ్ కు అపూర్వ స్వాగతం లభించింది. పరేడ్ మైదానంలో బండి సంజయ్ అడుగు పెట్టగానే వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి… హిందూ టైగర్ బండి సంజయ్ అంటూ నినాదాలు చేయడం ఆరంభించారు. అదే సమయంలో కార్యకర్తలు బండి సంజయ్ ను తమ భుజాలపై ఎత్తుకుని పరేడ్ మైదానమంతా తిప్పుతూ ‘‘‘హిందూ టైగర్ సంజయన్న…..జై బండి సంజయన్న… జైజై బండి సంజయన్న…. కాబోయే సీఎం బండి సంజయ్… సంజయన్న నాయకత్వం వర్ధిల్లాలి’’ అంటూ నినదించారు. ఆ తరువాత కొద్ది సేపటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రావడంతో వాతావరణమంతా ‘‘మోడీ…మోడీ’’ నామస్మరణతో నిండిపోయింది. ప్రధాని ప్రసంగం ముగించి వెళ్లిపోయిన తరువాత బండి సంజయ్ తిరుగు ముఖం పడుతుండగా మళ్లీ కార్యకర్తలంతా బండి వద్దకు వచ్చి భుజాలపై ఎత్తుకుని సంజయన్న నాయకత్వం వర్దిల్లాలి… కాబోయే సీఎం బండి సంజయ్ అంటూ నినదిస్తూ తిరగడం గమనార్హం.
మోడీ రైలు ఓపెనింగ్‌కు వచ్చి.. తెలంగాణపై విషం చిమ్మారు..
ప్రధాని మోడీ వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి వచ్చి.. తెలంగాణపై విషం చిమ్మారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణపై మోడీకి విద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇవాళ్టికి కూడా గుజరాత్‌లో ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని .. తెలంగాణ అభివృద్ధిని చూసి మోడీ ఓర్వలేకపోతున్నారని మంత్రి అన్నారు. మోడీ సభలో ప్రజలను మోసం చేసే పద్ధతిలో మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రధాని స్థాయిలో మోడీ సభలో మాట్లాడలేదని.. కేసీఆర్‌ను చూసి మోడీకి ఎందుకు భయం అంటూ ప్రశ్నించారు. మోడీకి విజన్ లేదని.. చెప్పుకోవడానికి విజయాలు లేవని మంత్రి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ మాటలకు…మోడీ మాటలకు తేడా లేదని ఆయన పేర్కొన్నారు. మోడీ పర్యటన వల్ల తెలంగాణకు ఏం ఉపయోగం లేదన్నారు. ఇతర పార్టీల నేతలకు సీబీఐ ,ఈడీ నోటీసులు పంపుతుందన్న మంత్రి.. బీజేపీలో చేరితే అవి ఉండవని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం …అవినీతి ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి ఉందని ఆయన ఆరోపణలు చేశారు
రాబోయే ఐదు రోజుల్లో దంచికొట్టనున్న ఎండలు.. ఐఎండీ వార్నింగ్..
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. అయితే రాబోయే 5 రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు దంచి కొట్టనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఉరుములు, బలమైన ఈదురుగాలులతో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాన్ని మినహాయించి చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ ఇటీవల తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ మరియు హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుందని వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణం అవుతోంది. ఐఎండీ ప్రకారం, 1901 నుంచి రికార్డులను పరిశీలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వేసవి కాలంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు నమోదు అవుతుంటాయి. వీటి వల్ల మామిడితో పాటు ఇతర పంటలు దెబ్బతింటాయి.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు.. జాతీయ కార్యదర్శి పదవి?!
బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీకి కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. శుక్రవారం బీజేపీ పెద్దల సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో బిజీబిజీగా గడపుతున్నారు. బీజేపీ అగ్రనేతలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్‌తోనూ భేటీ అయ్యారు. తెలంగాణ, కర్ణాటకల్లో ఆఫ్ స్క్రీన్.. ఏపీలో ఆన్ స్క్రీన్ పాత్ర పోషించనున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని వినియోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలతో టచ్ లోకి వెళ్లాలని కిరణ్ కు హైకమాండ్ బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పతో కిరణ్ భేటీ అయ్యారు. ఏపీలో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. త్వరలో పార్టీలో చేయబోయే మార్పులు చేర్పుల్లో జాతీయ కార్యదర్శి పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఏ మాత్రం వీలున్నా ఈలోగానే జాతీయ కార్సదర్శి పదవి కట్టబెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది బీజేపీ హైకమాండ్. కిరణ్ తో కలిసి పని చేయాలని చెప్పేందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు..
ఇరాన్ దేశంలో ముస్లిం మతాచారాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసు. ముఖ్యంగా హిజాబ్ అంశంలో ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. గతేడాది మహ్సా అమిని అనే మహిళ హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా ఇరాన్ మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరువాత ఆ అమ్మాయి చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు, యువత ప్రభుత్వానికి, హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేశారు. మహిళలు హిజాబ్ తీసివేసి, జట్టు కత్తిరించుకుని నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ఆందోళనలు తగ్గిపోవడంతో హిజాబ్ పట్ల కఠినంగా వ్యవహరించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. షరియా చట్టం ప్రకారం మహిళలు తమ జట్టును హిజాబ్ తో కప్పుకోవాలి. అయితే దీన్ని పకడ్భందీగా అమలు చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. హిజాబ్ ధరించని మహిళలను గుర్తించి శిక్షలు, జరిమానాలు విధిస్తామని అక్కడి అధికారులు శనివారం ప్రకటించారు. హిజాబ్ ఉల్లంఘించిన వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.
హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని నిరోధించాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. హిజాబ్ ఉల్లంఘన దేశ ఆధ్యాత్మిక ప్రతిష్టను దెబ్బతీస్తుందని అక్కడి న్యాయవ్యవస్థ, ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఇరాన్ లోని మాల్స్, రెస్టారెంట్స్, దుకాణాల్లో హిజాబ్ డ్రెస్ కోడ్ ధిక్కరించిన వారిని అరెస్ట్ చేస్తోంది. 1979 విప్లవం తర్వాత ఇరాన్ ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తోంది. దీంట్లో భాగంగా అప్పటి నుంచి 7 ఏళ్లు దాటిని అమ్మాయిలు, మహిళలు తప్పకుండా హిజాబ్ ధరించాలనే చట్టాన్ని చేసింది. ఇటీవల హిజాబ్ లేకుండా దుకాణానికి వచ్చిన ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి పెరుగుతో దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.