NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర కొనసాగనుంది. జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జగన్నాధ రథయాత్ర నిర్వహణలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు కూడా మంచి అనుభూతిని కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అభివృద్ధి చేయాలి.. !

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని సంబేపల్లి మండలంలో సర్వసభ్య సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గైర్హజర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్దికి నోచుకోని మండలం సంబేపల్లి అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 90 శాతం అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే సంబేపల్లి మండలం మాత్రం కరువు మండలంగా ప్రకటించలేదు అని ఆరోపించారు. మండల కేంద్రాలలో ఎటువంటి పని లేకున్నా.. సర్వసభ్య సమావేశాలలో అధికారులపై పెత్తనం చెలాయించిన ప్రజాప్రతినిధులు ఇప్పుడెక్కడున్నారు అంటూ ప్రశ్నించారు. అప్రజాస్వామ్య పద్దతిలో గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రభుద్దులకు సమావేశానికి రాకపోవడానికి సిగ్గుశరం ఉందా అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు.

రేవంత్‌ రెడ్డిని అందుకే కలిసాను.. నా రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేదు..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా చాలా అభివృద్ధి చేస్తున్నారని..అందుకే స్వయంగా వచ్చి కలిశానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అనేక సంక్షేభాలు ఎదురుకుంది తెలుగు దేశం పార్టీ అని తెలిపారు. నన్ను ఎందుకు జైలుకు పంపారో తెలియదన్నారు. కానీ తెలంగాణలో మీరు నాకోసం చేసిన నిరసనలు మర్చిపోలేనిదన్నారు. రాజకీయం అంటే సొంత వ్యాపారం చేసుకోవడం కాదని తెలిపారు. తెలుగు దేశం ముందు.. తెలుగు తరువాత చరిత్రకు చాలా తేడా ఉందన్నారు. హైదరాబాద్ లో హై టెక్ సిటి నీ ప్రారంభించిన అభివృద్ధి హైదరాబాద్ దేశంలో నెంబర్ వన్ అయ్యిందన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు, ఎయిర్ పోర్ట్ దూర దృష్టి తో ప్రతిపాదన చేశానని తెలిపారు. వాటిని ప్రారంభించిన ఘనత తెలుగు దేశం పార్టీ దే అని హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ తరువాత వచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ టీడీపీ పేరు చెరిగిపోలేదన్నారు. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా చాలా అభివృద్ధి చేస్తున్నారని, అందుకే స్వయంగా వచ్చి కలిశానని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

ఇంత సాయం చేసిన లంక బుద్ధి పోనిచ్చుకోలేదు.. భారత్ ఆందోళనలు బేఖాతరు..

భారత్‌పై నిఘా పెట్టేందుకు చైనా శ్రీలంకను పావుగా వాడుకుంటోంది. ఇప్పటికే శ్రీలంకకు ఇచ్చిన అప్పులకు బదులుగా ఆ దేశం హంబన్‌టోట నౌకాశ్రయాన్ని డ్రాగన్ కంట్రీకి లీజుకు ఇచ్చింది. తరుచుగా చైనాకు చెందిన పరిశోధన నౌకలు శ్రీలంక, మాల్దీవుల్లో లంగరు వేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి శ్రీలంకకు భారత్ భారీగా సాయం చేసినప్పటికీ, ఈ విషయాన్ని మరిచిపోయి మళ్లీ చైనా పాటనే పాడుతోంది. ప్రస్తుతం పరిశోధన నౌకలపై ఉన్న నిషేధాన్ని వచ్చే ఏడాదిని నుంచి ఎత్తేయాలని శ్రీలంక నిర్ణయించుకున్నట్లు జపాన్ మీడియా నివేదించింది. జపాన్ సందర్శించిన శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ తన వైఖరిని స్పష్టం చేశారు.

అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో పేలిన బాయిలర్.. 15 మందికి తీవ్రగాయాలు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని అల్ట్రాటెక్‌ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి దాదాపు 15 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని బీహార్‌, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట, విజయవాడ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాయిలర్ పేలిన ఘటనలో క్షతగాత్రులను ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహంతో కంపెనీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంపై దాడి ఘటనలో గ్రామస్థులు అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనా స్థలంలో విచారణ చేపట్టి పోలీసు వివరాలు నమోదు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో నేడు, రేపు వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ను జారీ

తెలంగాణలో రుతుపవనాలు తీవ్రతరం కావడంతో హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై 8, 9 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా నగరానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదివారం IMD సూచన ప్రకారం, నగరంలోని అన్ని మండలాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, దానితో పాటు మెరుపులు , ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రత 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

నేపాల్‌లో వరదల బీభత్సం.. 14 మంది మృతి, 9 మంది మిస్సింగ్..

నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల దేశవ్యాప్తంగా 14 మంది మరణించారు. మరో 9 మంది గల్లంతైనట్లు అక్కడి పోలీసులు ఆదివారం తెలిపారు. నేపాల్ మాత్రమే కాకుండా భారత్ లోని హిమాలయ రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో వరదలు తీవ్ర నష్టాలను కలిగించాయి. వీటి వల్ల మిలియన్ల మంది ప్రభావితమయ్యారు.

100 శాతం మురుగునీటిని శుద్ధి చేసిన మొదటి నగరం హైదరాబాద్

డ్రైన్‌ వాటర్‌ శుద్ధిలో బీఆర్‌ఎస్‌ పాలన విజయవంతమైన విధానాన్ని ఎత్తిచూపుతూ , దాదాపు 2,000 ఎంఎల్‌డీ సామర్థ్యంతో హైదరాబాద్‌ 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసిన తొలి భారతీయ నగరంగా అవతరించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఆదివారం అన్నారు. 3,866 కోట్లతో కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఫలించిందని ఆయన తెలిపారు. “మా ప్రణాళిక , కృషి ఫలిస్తున్నాయని పంచుకోవడం సంతోషంగా , గర్వంగా ఉంది,” అని ఆయన చెప్పారు, మూసీ నది పునరుజ్జీవనం , తదుపరి సుందరీకరణకు ఇది మొదటి అడుగుగా ప్రణాళిక చేయబడింది, దీని కోసం గ్లోబల్ డిజైన్ టెండర్లు పిలిచారు. మా ప్రణాళిక & ప్రయత్నాలు ఫలిస్తున్నాయని పంచుకోవడం సంతోషంగా & గర్వంగా ఉంది. దాదాపు 2000 MLD సామర్థ్యంతో హైదరాబాద్ ఇప్పుడు అధికారికంగా 100% మురుగునీటిని శుద్ధి చేస్తున్న మొదటి భారతీయ నగరం. ఇది ₹3,866 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

ఎన్టీఆర్ జిల్లా, బోదవాడలోని సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంఓ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుండి పరిహారం అందేలా చూడడంతో పాటు ప్రభుత్వం నుండి కూడా సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు

పార్టీ ఫిరాయింపుల‌నై మాట్లాడే నైతిక హ‌క్కు బీఆర్ఎస్ నాయ‌కుల‌కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ల స్ఫూర్తిని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని, అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టుప‌ట్టించాడన్నారు. తెలంగాణ వ‌స్తే చాలు- మ‌రే ప‌ద‌వి వ‌ద్ద‌న్నాడని, జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను విస్త‌రించి.. ప్ర‌ధాని కావ‌ల‌ని క‌ల‌లు క‌న్నాడన్నారు. సార్.. కారు.. పదహారు అన్నావు… పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న సీట్లు పోయాయి. డిపాజిట్లు కూడా రాలేదన్నారు మంత్రి జూపల్లి. పూర్తి మెజార్టీ ఉండి కూడా.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆనాడు తన పార్టీలో చేర్చుకున్నాడని, విలువలు ఉండి ఉంటే ఆనాడు.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీ లో చేర్చుకుని విలీనం చేసే వాడు కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని.. బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడారని, అధికారంలో ఉన్నపుడు బీజేపీ పార్టీతో అంటకాగారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.