NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఆరేళ్ల చిన్నారి హత్య కేసును ఛేదించినట్లు ప్రకటించిన హోంమంత్రి అనిత

పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అస్ఫియా హత్య కేసును ఛేదించినట్లు హోంమంత్రి అనిత స్వయంగా ప్రకటించారు. అస్ఫియా ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు హోంమంత్రి తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో వందలమందిపై అత్యాచారాలు జరిగాయని తీవ్రంగా విమర్శించారు. ఒక్కరోజు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదన్నారు. చిన్నారి హత్యకేసును వైసీపీ రాజకీయం చేస్తోందన్నారు. చిన్నారిపై అత్యాచారం జరగలేదని, చిన్న గాయం లేదని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఇదిలా ఉండగా.. అస్ఫియా కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు.

హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరు?

హర్యానాలో పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు కూడా హస్తంకే జైకొట్టాయి. పార్టీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి అవకాశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని భూపిందర్ సింగ్ పునరుద్ఘాటించారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన తర్వాత హుడా ఈ వ్యాఖ్య చేశారు. రోహ్‌తక్‌లోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో ఆయన మాట్లాడారు. అనేక ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ విజయంపై హుడా మాట్లాడుతూ.. “మా అంచనా ప్రకారం, మేము పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని నేను ఇప్పటికే చెప్పాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రశ్నకు హుడా, పార్టీలో ఒక సెట్ ప్రక్రియ ఉంది. దీని ప్రకారం పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని, ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.

రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ..

సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద నష్ట బాధితులకు రేపు ఏపీ ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. 98 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.18 కోట్లు ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవ‌ల విజయవాడ వ‌ర‌ద‌ల్లో తీవ్రంగా న‌ష్టపోయిన వ‌ర‌ద బాధితుల్లో 21,768 మంది బాధితులు త‌మ బ్యాంకు ఖాతాల‌ను త‌ప్పుగా న‌మోదు చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు. వాటిని మ‌ళ్లీ క్షేత్రస్థాయిలో బాధితుల‌తో త‌నిఖీ చేసి స‌రిచేశారు. ఈ బాధితులంద‌రికీ సోమ‌వారం సాయంత్రానికి వారందరి ఖాతాల్లోకి వ‌ర‌ద సాయం జ‌మ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరి ఖాతాల్లోకి మొత్తం రూ.18,69,89,000ల సొమ్ము జ‌మ చేయ‌నున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వ‌ర‌దల్లో న‌ష్టపోయిన బాధిత ప్ర‌తి కుటుంబానికి ప్రభుత్వం త‌ప్పనిస‌రిగా సాయం అందించాల‌ని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చార‌ని, ఆ ప్రకారం ప్రతి ఒక్కరికీ సాయం అందుతుంద‌ని చెప్పారు. బాధితులెవ్వరూ అందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని వెల్లడించారు.

నేడు ఐదో రోజు అట్ల బతుకమ్మ.. నైవేద్యంగా అట్లు లేదా దోశ..

బతుకమ్మ.. ఈ పేరు చెప్పగానే తెలంగాణ సాంస్కృతిక వైభవం గుర్తుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంప్రదాయాలను చాటిచెప్పే పండుగ. తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు గౌరమ్మకు మహిళలు వివిధ రకాలుగా పూజలు చేస్తున్నారు. ప్రతిరోజు వివిధ రకాల ప్రసాదాలు తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తూ అందరూ సుఖశాంతులతో ఉండాలని భక్తి శ్రద్దలతో కోరుకుంటారు. పాడి పంటలతో, సంతానంతో సంతోషంగా జీవించాలని వేడుకుంటున్నారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మలతో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైంది..

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐదువేల కోట్లతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నమన్నారు. దసరా పండుగకు ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైందని అన్నారు. తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా కావలసిన నిధులు కేటాయించి విద్యపై దృష్టి పెడతామని చెప్పాము ఆ మేరకు పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో 12th క్లాస్ వరకు విద్యాబుద్ధులు ఇక్కడ నేర్పిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ కళాశాలలు పక్కాభవనాలు లేక కళ్యాణ మండపాలు, అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

టాస్ గెలిచిన పాకిస్తాన్.. భారత్ బౌలింగ్

టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఈరోజు భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. పాకిస్తాన్, భారత్ జట్లలో ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతుంది. భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడగా.. ఇది రెండో మ్యాచ్‌. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించగా, భారత్ ఓడిపోయింది. తన ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్.. ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ భారత్‌కు చావోరేవో. ఇకనుంచి ప్రతి మ్యాచూ కీలకం కాబట్టి పాకిస్థాన్‌పై నేడు గెలిచి తీరాల్సిందే. లేదంటే టోర్నీ ఆరంభ దశ నుంచే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఇంత ఒత్తిడి మధ్య హర్మన్‌ప్రీత్‌ సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుందో..? చూడాలి.

ఉద్యోగం ఇప్పించండి సార్.. డిప్యూటీ సీఎంకు దివ్యాంగురాలు విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు క్లీయర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు.

అన్నదాతల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం

రాష్ట్రంలో శనివారం జరిగిన ముగ్గురు అన్నదాతల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆదివారం అన్నారు. రైతు సంఘం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు ఆదరణ లేకపోవడంతో నష్టపోతున్నారని విమర్శించారు. సాగునీటి సంక్షోభంతో పాటు అసంపూర్తిగా ఉన్న పంట రుణమాఫీ, రైతు భరోసా పథకం లేకపోవడంతో వందలాది మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, అనేక మంది తమ ప్రాణాలను బలిగొన్నారని రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. “సంక్షోభం కారణంగా రైతులు ఆత్మహత్యలతో చనిపోతున్నారు, అయినప్పటికీ ప్రభుత్వం చలించలేదు. ముఖ్యమంత్రి సానుభూతి చూపడం లేదు, పరిపాలన నుండి బాధ్యతాయుతంగా లేదు, ”అని ఆయన వ్యాఖ్యానించారు.

మంత్రి కోమటిరెడ్డికి షాకిచ్చిన మహిళలు

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత సీట్లు దొరకడం లేదని మహిళలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదుట వాపోయారు. మునుగోడు వద్ద ఆర్టిసీ బస్సు ఎక్కిన రాజగోపాల్ రెడ్డి మహిళలను పలకరించారు.. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి మహిళల మధ్య ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగిందని…. ఫ్రీ బస్సు సౌకర్యం కంటే ముందు ఈ పరిస్థితి ఉండేది కాదని రాజగోపాల్ రెడ్డితో అన్నారు మహిళలు. పురుషులు ముఖ్యంగా యువకులు మహిళలకు బస్సులో సీట్లు ఇవ్వాలని కోరిన రాజగోపాల్ రెడ్డికి మహిళల నుండి ఊహించని సమాధానం ఎదురైంది.. టికెట్లు తీసుకున్న వారికి సీట్లు ఇవ్వకుండా వారిని ఎలా నిలబెడతామని ఎదురు ప్రశ్నించారు మహిళలు..

Show comments