NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Ntv Top Hl 5pm

Ntv Top Hl 5pm

తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో కర్ణాటక ఫలితాలే.. బీజేపీని తుడిచిపెట్టేస్తాం..

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తు్న్నారు. ఆయన శాన్ ఫ్రానిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో పర్యటిస్తు్న్నారు. ఆదివారం న్యూయార్క్ నగరంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇతర రాష్ట్రాల్లో పునరావృతం అవుతాయని ఆయన అన్నారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని తుడిచిపెడుతామంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదని యావత్ దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని అన్నారు. బీజేపీని కర్ణాటకలో తుడిచిపెట్టగలమని నిరూపించామని, మేం బీజేపీ ఓడించలేదని, తుడిచిపెట్టామని అన్నారు.

యువతి గర్భవతి.. డీఎన్ఏ టెస్ట్ కోరిన యువకుడు.. చివరికి షాక్

నేటి యువత ఎలాంటి పక్కదారి పడుతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రేమ పేరుతో పెళ్లి కాకముందే ‘శోభనం’ కార్యక్రమాల్ని ముగించేసుకుంటున్నారు. కొందరైతే ఒకరికంటే ఎక్కువగా రిలేషన్‌షిప్‌లు మెయింటెయిన్ చేస్తున్నారు. కనీస కుటుంబ మర్యాదల్ని కూడా పట్టించుకోకుండా.. హద్దులు మీరుతున్నారు. గర్భం దాల్చడం, అబార్షన్‌లు చేయించుకోవడం కూడా సంఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయంటే.. పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి. ఈ క్రమంలోనే కొన్ని నేరాలు, ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఒక విషయంలో విభేదాలు నెలకొని, జీవితాలు రోడ్డున పడే దుస్థితికి వచ్చేస్తోంది. కొందరైతే.. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా ఈ ‘ప్రేమకథాచిత్రానికి’ బలైపోయాడు. ఇందులో ఓ అనూహ్య ట్విస్ట్ కూడా ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన హనుమంతుడు అనే యువకుడు.. మల్లనహట్టికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అనుకోకుండా వీరి మధ్య పరిచయం ఏర్పడగా, అది ప్రేమకు దారి తీసింది. అప్పటి నుంచి ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించారు. శారీరకంగానూ కలిశారు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి గర్భం దాల్చింది. అయితే.. ఆ యువకుడు మాత్రం తనకు ఆ యువతి గర్భంతో ఎలాంటి సంబంధం లేదని షాకిచ్చాడు. దాంతో ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. హనుమంతుడు వల్ల తాను గర్భవతిని అయ్యానని, ఇప్పుడు అతడు ముఖం చాటేస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడ్ని పిలిపించి విచారించగా.. తనకు ఏమీ తెలియదని, ఆ అమ్మాయి గర్భం దాల్చడానికి కారణం తాను కాదని కుండబద్దలు కొట్టాడు. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయాలని, అందుకు తాను సిద్ధంగానే ఉన్నానని తెగేసి చెప్పాడు. ఈ దెబ్బతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు.

గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం.. అందుకే ప్రమాద తీవ్రత పెరిగింది..

ఒడిశా బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం దేశాన్ని దు:ఖసాగరంలో ముంచింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాాదంలో 288 మంది మరణించగా.. 1000 మంది గాయపడ్డారు. అయితే ప్రమాదానికి దారి తీసిన క్రమాన్ని రైల్వే బోర్డు ఈ రోజు వివరించింది. ‘‘ఎలక్ట్రానికి ఇంటర్ లాకింగ్ సిస్టమ్’’ సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

ఈ దుర్ఘటన జరిగిన బాలాసోర్ లోని బహనాగ బజార్ స్టేషన్ లో నాలుగు లైన్లు ఉన్నాయని, మధ్యాలో రెండు ప్రధాన ట్రాకులకు ఇరువైపు రెండు లూప్ లైన్లు ఉన్నాయని రైల్వే శాఖ వివరించింది. ఈ రెండు లైన్లలో ఐరన్ ఓర్ తో నిండి ఉన్న గూడ్స్ రైళ్లు ఉన్నాయని తెలిపారు. షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చెన్నై నుండి హౌరాకు వెళ్తుండగా.. బెంగళూర్ నుంచి హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి వస్తోంది. రెండు ప్రధాన ట్రాకుల్లో గ్రీన్ సిగ్నల్ ఉందని, కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 128 కి.మీ., మరో రైలు 126 కి.మీ. పరిమితి గంటకు 130 కి.మీ. కాబట్టి వాటిలో ఏదీ ఓవర్ స్పీడ్ కాదని రైల్వే బోర్డు ఆపరేషన్స్ అండ్ డీడీ మెంబర్ జయ వర్మ సిన్హా తెలిపారు.

చంద్రబాబు లాంటి మోసగాడు.. దేశ చరిత్రలోనే ఉండరు

వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అంత అబద్దాలకోరు, పచ్చి మోసగాడు, నరరూప రాక్షసుడు ఈ దేశ చరిత్రలో ఉండదరని ఆరోపించారు. 2014లో 600కు వాగ్ధానాలు చేసి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో అబద్ధపు వరాలు కురిపించాడని విమర్శించారు. మహానాడు వేదిక మీద పెద్ద నాటకాల రాయుడుగా డ్రామాలాడాడని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను సీఎం జగన్ తాకట్టు పెట్టారని విమర్శించే చంద్రబాబు.. కేంద్రంతో అధికారం పంచుకున్నపుడు ఆ హోదాను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

ఫామ్ హౌస్‌లు కట్టుకున్న వారికి ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయి

నిజామాబాద్ పార్లమెంటు జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం వాగ్దానం చేసి గెలిచిన సీఎం కేసీఆర్…. ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. ఫామ్ హౌస్ లు కట్టుకున్న వారికి ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్ లో టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం, భగీరథ పేరుతో సీఎం కేసీఆర్, టాయిలెట్స్ పేరుతో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అవినీతి లేకుండా అభివృద్ధి పనులు దేశంలో నడుస్తున్నాయని, భారత దేశానికి సరైన సమయంలో ప్రధానిగా మోడీ కావటం దేశ ప్రజల అదృష్టమన్నారు ఎంపీ అర్వింద్‌.

ఎన్నికలొస్తే.. పగటి వేషాల్లాగా చంద్రబాబు రంగులు మారుస్తాడు

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసిన సంగతి తెలిసిందే! ఈ కలయికపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది చర్చించుకుంటున్నారు. ఆ పొత్తు సంగతేమో కానీ, తాజాగా ఈ కలయికపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబుకు ఎన్నికలొస్తే పండగ అని, పగటి వేషాల్లాగా రంగులు మారుస్తాడని ధ్వజమెత్తారు. ఆయన ఏ వేషం వేస్తాడో, ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ అవసరం బీజేపీకి ఉంటే, వాళ్లు వచ్చి కలవాలి కదా? అని ప్రశ్నించారు. అయినా.. టీడీపీ వాళ్లు ఎవరితో పోతే తమకెందుకని తేల్చి చెప్పారు. వాళ్ళు ముగ్గురు కలిసినా, ముప్పై మంది కలిసి పోటీ చేసినా.. తమకొచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు.

ఒడిశా రైలు ప్రమాదంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని పిల్..

ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన మూడు రైళ్ల దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద రైలు ప్రమాదం జరగలేదు. ఏకంగా 288 మంది ప్రయాణికులు మరణించడంతో పాటు 1000కి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వేలోని ఎలక్ట్రానికి ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిగితే తప్పా కారణాలు తెలియరావు.

ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. రైలు ప్రమాదంపై విచారణకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌లో రైల్వే వ్యవస్థలో ప్రమాదాలు, భద్రతా పారామితులను విశ్లేషించడానికి, సమీక్షించడానికి, సూచించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో మరియు సాంకేతిక సభ్యులతో కూడిన నిపుణుల కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.

చంద్రబాబు ప్రవేశపెట్టింది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో

చంద్రబాబు ప్రవేశపెట్టింది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రకటించింది మెసఫెస్టో అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనని పిలుపునిచ్చారు. తాము గడప గడపకు వెళ్ళి ధైర్యంగా మేనిఫెస్టో ఇస్తున్నామని అన్నారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తను ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ఎవరూ చూడకుండా తగలబెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలపై ప్రజల మధ్య చర్చలు జరగాలని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసే సమయంలో.. మేనిఫెస్టో గురించి పట్టించుకునే వాళ్లమే కాదని బాంబ్ పేల్చారు. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీతగా భావించి అమలు చేసే గొప్ప సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు.

అమిత్ షా, జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి?

తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యమని అన్నారు.

ఈరోజు ఉదయం వివిధ జిల్లాల నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు జరిగే ‘మహజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందుకోసం కార్యక్రమాలను మరింత ఉధ్రుతం చేయాలని కోరారు.

Show comments