NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

హాజీపూర్ ఘటన మర్చి పోలేనిది..

హాజీపూర్ ఘటన మర్చి పోలేనిదని మాజీ ఎంపీ వి.హనుమంత రావు అన్నారు. రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ లో వాస్తవాలు మాట్లాడారని తెలిపారు. హిందువుల మధ్య విద్వేషాలను పెంచొద్దని తెలిపారు. హింసను ప్రోత్సహించొద్దు అన్నారు.. న్యాయం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని ప్రశ్నించారు. బీజేపీ ఓటమి అంచుల నుండి బయట పడిందని తెలిపారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మెజారిటీ ఉందని ఇష్టం వొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు.

నిపుణుల నివేదిక ఆధారంగా పోలవరంపై కార్యాచరణ

పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల బృందం అధ్యయనం కొనసాగుతోంది.. ఇప్పటికే రెండు రోజుల పాటు ప్రాజెక్టును, అక్కడి మట్టి.. పరిసర ప్రాంతాలు ఇలా అనేక కోణాల్లో పరిశీలన చేసిన నిపుణుల బృందం.. ఈ రోజు కూడా తన పర్యటన కొనసాగిస్తోంది.. తమ పర్యటన, పరిశీలన, సమీక్షలు ముగిసిన తర్వాత ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణంపై ఓ నివేదిక ఇవ్వనుంది.. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పనులపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు.. పోలవరం ప్రాజెక్టు ను జగన్ ముంచేశారని విమర్శించిన ఆయన.. జగన్ చేసిన విధ్వంసం కారణంగా పునర్నిర్మాణాలు చేపట్టేందుకు సీడబ్ల్యూసీ ద్వారా అంతర్జాతీయ నిపుణులను పిలిపించి స్టడీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. రాజకీయాలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ నిపుణులు ఇచ్చే సలహాలను CWC తీసుకోనుంది.. నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పనులపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు.

ఈడీ ఎదుట హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. మైనింగ్ కేసులో ఆయనపై ఈడీ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఈడి సోదాలు చేపట్టారు. రెండు రోజులపాటు మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని ఈడీ అభియోగాలు మోపింది. గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో పాటు సోదరుడి ఇంట్లో ఈడి సోదాలు నిర్వహించారు.

పశ్చిమ బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం!

పశ్చిమ బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంజిన్‌ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ డిపార్ట్మెంట్ అధికారులు రంగంలోకి దిగి.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో 5-7 ఫైర్ ఇంజన్స్ మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ఘటనతో సమీప జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మంటలు చెలరేగినప్పుడు ఫ్యాక్టరీలో ఎంత మంది కార్మికులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది.

వరుస రివ్యూలు.. ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ..

వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు.. వివిధ అంశాలపై వరుస రివ్యూలు మొదలు పెట్టారు సీఎం.. ఈ సమీక్షకు మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తదితర మంత్రులు కూడా హాజరయ్యారు.. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై మొదట సమీక్ష ప్రారంభించారు.. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు, చేర్పులపై సీఎం చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు.. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహరాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది.. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని గతంలోనే టీడీపీ ఆరోపణలు చేసిన విషయం విదితమే.. ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాహ్ కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.. దీంతో.. ఇసుక విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై ఫోకస్‌ పెట్టారు సీఎం చంద్రబాబు.. మరోవైపు.. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందనే విమర్శలు ఉన్నాయి.. రోడ్లపై కూడా అప్పట్లో విపక్షాలు సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఉద్యమాన్నే చేశాయి.. ఇప్పుడు వర్షాకాలంలో భారీ వర్షాల నేపథ్యంలో.. రోడ్లు మరింత గందరగోళంగా మారే పరిస్థితులు ఉండడంతో.. ముందుగా రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

డ్రగ్స్ పై యుద్ధం.. సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్ ?

ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి డ్రగ్స్ మీద పోరాటం చేస్తూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు తాజాగా కీలక సూచనలు చేశారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు ప్రకటించారు. సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలన్న ఆయన వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాకు ముందు డిస్ క్లెయిమర్స్ ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై అవగాహన కల్పించడం లేదు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..

పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ

దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా.. మరికొందరు నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని ఐఎండీ తెలిపింది. దీంతో కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.

భవిష్యత్‌లో స్థానిక సంస్థలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం

కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 2019 నుండి 2024 వరకు పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్మన్, జడ్పీటిసి, ఎంపిపి లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, వైస్ చైర్మన్ పెరాల గోపాల్ రావు , జడ్పీటిసి, ఎంపిపి లను ఘనంగా సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్ సభ్యులకు, ఎంపిపి లకు శుభాకాంక్షలు తెలిపారు. 5 సంవత్సరాల ప్రజా జీవితంలో నిధులున్నా ,లేకున్నా అనేకా కష్టాలు వచ్చినా ప్రజల సమస్యలు ఎదుర్కొనీ మంచి పేరు సంపాదించుకున్నారని, జడ్పీటిసి సభ్యునిగా మీ పదవి ముగిసినప్పటికీ ప్రజా జీవితంలో మీరు మళ్ళీ ఏదో ఒక రూపంలో ఎన్నికై ప్రజలతో ఉండాలని కోరుకుంటున్నా అని మంత్రి పొన్నం అన్నారు.

తెలంగాణలో ఈ ఏడాది 10వేల సైబర్‌క్రైమ్‌ కేసులు

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు సైబర్ క్రైమ్ ఘటనలకు సంబంధించి 10,000 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులు (ఎఫ్‌ఐఆర్‌లు) బుక్ అయ్యాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ & కంట్రోల్ సెంటర్ (టిజిసిసిసి) ని సందర్శించిన సందర్భంగా తెలిపారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసుల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడి సైబర్‌ నేరాలను అరికట్టేందుకు, తెలంగాణను సైబర్‌ సేఫ్‌ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సైబర్‌క్రైమ్‌లను ఉక్కు హస్తంతో ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన, దేశంలో పూర్తిస్థాయిలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ బ్యూరో, 1930 కాల్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందన్నారు.

ఏపీలో పెండింగ్ బిల్లులపై వివరాలు సేకరిస్తున్న ఆర్థిక శాఖ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉన్న బిల్లులపై ఆర్థిక శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పెండింగ్ బిల్లులపై వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది. అయితే, పెండింగ్ బిల్లులపై అరకొరగా సమాచారాన్ని కొన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఇస్తున్నారు. మొత్తంగా 10 వేల కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ బిల్లులు ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, శ్వేత పత్రం కోసం చేస్తున్న కసరత్తులో పెండింగ్ బిల్లుల అరకొర సమాచారంపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులపై పూర్తి సమాచారం తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ బిల్లులపై పూర్తి సమాచారం కోరుతూ మరోసారి అన్ని శాఖలకు లేఖలు రాయాలని ఆర్థిక మంత్రి వెల్లడించారు. పెండింగులో సమాచారం ఇవ్వని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని లేఖలో పేర్కొనాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు జారీ చేశారు.