Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

మహిళల సెక్స్ సమ్మతి వయసు 18 నుంచి 16కి తగ్గించాలి.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

మధ్యప్రదేశ్ హైకోర్టు మైనర్లు, వారి సంబంధాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల సెక్స్ సమ్మతి వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. చాలా క్రిమినల్ కేసుల్లో యుక్తవయసులో ఉన్న అబ్బాయిలకు అన్యాయం జరుగుతోందని మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ జడ్జ్ ధర్మాసన వ్యాఖ్యానించింది. 2020 జూలై 17న నమోదైన అత్యాచారం కేసును విచారిస్తున్న సందర్భంలో కోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో చిన్న వయసులోనే అందరికీ అవగాహన వస్తోందని పేర్కొంది.

లోపల ఏం లేదు… ఉత్త డొల్ల

రిలీజ్ కి ముందు సెన్సేషన్ గా నిలిచింది ‘లస్ట్ స్టోరీస్ 2’. తమన్నా, కాజోల్, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ వెబ్ సీరీస్ ని చూడడానికి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేసారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లతో యూత్ లో హీట్ పెంచడంతో ‘లస్ట్ స్టోరీస్ 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసారు. ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ లో సీరీస్ స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ బోల్డ్ సీరీస్ లో సీన్స్ కోసం కుర్రాళ్లంతా చేసిన వెయిటింగ్ ని, మేకర్స్ బూడిదలో చేసిన పన్నీరులా అయిపొయింది. ప్రమోషనల్ కంటెంట్ లో చూసిందే తప్ప, అంతకు మించి సీరీస్ లో ఏమీ లేదు అనే కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా హైప్ తప్ప సీరీస్ లో ఏమీ లేదనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది.

యూసీసీపై నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం..

కేంద్రం ఈ పార్లమెంటరీ సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లు ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చించనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ ఈరోజు సమావేశం కానుంది. న్యూఢిల్లీలోని 10 జన్‌పథ్‌లోని ఏఐసీసీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో యూసీసీపై చర్చలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనే దానిపై చర్చించనున్నారు. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జూలై 3న యూసీసీపై సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోడీ నేతృత్వంలోని కమిటీ, కమిటీలోని 31 మంది ఎంపీలకు వారి అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపింది. సోమవారం జరిగే మీటింగ్ లో వీటిని పరిశీలిస్తామని తెలిపారు. పర్సనల్, పబ్లిక్ ఫిర్యాదులు, లా అండ్ జస్టిస్ కి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ అంశంపై లాకమిషన్, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ వారి అభిప్రాయాలను తెలియజేయాలని జూన్ 14న నోటీస్ జారీ చేసింది. ఈ మేరకు జూలై 3న లాకమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇందులో సభ్యుల అభిప్రాయాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, చట్టం, న్యాయం వంటి అంశాలు చర్చించబోతున్నారు.

వివాహిత ఫొటోలు మార్ఫింగ్.. భర్తకు పంపించిన ఓ దుర్మార్గుడు.. !

గోపాలపురానికి చెందిన అచ్చిరెడ్డి, బాధిత మహిళ మీనాను నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో వేధించేవాడు. అప్పట్లో అచ్చిరెడ్డి పై మీనా కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టను అని పెద్దల సమక్షంలో అచ్చిరెడ్డి హామీ ఇవ్వడంతో వివాదం ముగిసింది. కొన్ని నెలల తరువాత రావులపాలెంకు చెందిన పెద్దిరెడ్డికి మీనాను ఇచ్చి కుటుంబసభ్యులు వివాహం జరిపించారు. సంతోషంగా వీరి దాంపత్య జీవితం సాగింది. ఉద్యోగ రీత్యా కొన్ని రోజుల క్రితమే పెద్దిరెడ్డి దుబాయి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అచ్చిరెడ్డి తిరిగి మీనాను వేధించడం మొదలుపెట్టాడు. గతంలో మీనాతో అచ్చిరెడ్డి దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా దుబాయ్ లో ఉన్న భర్తకే పంపించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించాడు. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితురాలు దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.

తుఫాన్… తుఫాన్ లా పరిగెడుతున్నాడు

సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు… అనే కామెంట్స్ మనకి తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఏజ్ తో సంబంధం లేకుండా మహేష్ అంత అందంగా ఎలా ఉంటాడు అనే డౌట్ కూడా అందరిలో ఉంటుంది, ఈ డౌట్ కి ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది. తన ఇన్స్టా లో మహేష్ బాబు వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు పోస్ట్ చేసాడు. ఈ వీడియోస్ చూస్తే సితార, గౌతమ్ లకి కూడా మహేష్ బాబు అన్న అయి ఉంటాడు అనుకోవడంలో తప్పు లేదులే అనిపించకమానదు. మెరుపు వేగంతో పరిగెడుతున్నాడు, ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తున్నాడు, ఎంత కష్టపడాలో అంతా కష్టపడుతున్నాడు. హీరో అంత ఫిట్ అండ్ యంగ్ గా కనిపించడం వెనుక ఇంత కష్టం ఉంటుంది అని తెలియజేస్తూ మహేష్ జిమ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

వెంటనే లొంగిపోవాలి తీస్తా సెతల్వాడ్‌కి హైకోర్టు ఆదేశం.. గుజరాత్ అల్లర్ల కేసులో కుట్ర..

2002 గుజరాత్ అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాలను సృష్టించడం, పలువురుని కేసులో ఇరికించేందుకు కుట్ర చేసిన కేసులో ప్రముఖ హక్కుల నేత తీస్తా సెలత్వాడ్ నిందితురాలిగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో ఆమెను వెంటనే లొంగిపోవాలని, బెయిల్ తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శనివారం వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబరులో ఆమెకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పటివరకు ఆమెను అరెస్టు చేయలేదు.

సుప్రీంకోర్డును ఆశ్రయించే ఉత్తర్వులపై స్టే విధించాలన్న ఆమె తరుపు న్యాయవాది అభ్యర్థను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్ లో 2002 అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్)కి తప్పుడు సమాచారం, సాక్ష్యాలు ఇచ్చారనే అభియోగాలపై ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో అమాయకులను ఇరికించే కుట్ర పన్నారని ప్రధాన అభియోగం. గతంలో ఈ కేసులో తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్వ్కాడ్(ఏటీఎస్) ముంబాయిలో అరెస్ట్ చేసింది.

భార్య కనిపించడంలేదని భర్త సెల్ఫీ సూసైడ్.. నువ్వు లేక నేను లేను శ్వేత అంటూ వీడియో..!

అన్నీ బంధాలకంటే భార్యభర్తల బంధం బలమైనది అంటారు. మగాడి జీవితంలో. ఎక్కువ పాత్ర పోషించేది భార్యే. భార్యలను కొందరు భర్తలు ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారు. అలా ప్రేమగా చూసుకునే భర్తలు.. తమ భార్యలకు అనుకోకుండా ఏమైనా జరగడం కానీ అయితే వాళ్లు తట్టుకోలేరు. వెంటనే ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడుతారు. సమాజంలో భార్యాభర్తల మధ్య కొన్ని దారుణ ఘటనలు జరుగుతున్నా.. ఇంకొందరు మాత్రం భార్యలను తమ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య కన్పించడం లేదనే మనోవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య కన్పించడం లేదని పోలీసులకు కూడ భర్త ఫిర్యాదు చేశాడు. అదృశ్యమైన వివాహిత కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కూడ వివాహిత లభ్యం కాలేదు. దీంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భర్త సెల్ఫీని రికార్డు చేశాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు.

చివరి దశలో తెరమీదకి ఏజ్ రిలాక్సేషన్ వివాదం.. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన..!

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు సంబంధించి పూర్తయినట్లు తెలిపింది. మరోవైపు అభ్యర్థుల వయసు సడలింపు వివాదం చివరి దశలో తెరమీదికి వచ్చింది. అయితే దరఖాస్తు చేసుకునే ముందు ఎలిజబులిటీ ప్రకారమే చేసుకోవాలంటూ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ ఇచ్చింది.

వివిధ పోస్టులకు ఇప్పటికే వయసు నిబంధన వెరీఫై అయినట్లు బోర్డు తెలిపింది. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో వయసు నిబంధనతో పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. వయసు నిబంధన పై నోటిఫికేషన్ లో పేర్కొన్న విధానాన్ని అనుసరిస్తామని రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. అన్ని టెస్టులు క్వాలిఫై అయినా వయసు కారణంగా పలువురు అభ్యర్థులను తిరస్కరించినట్లు బోర్డ్ పేర్కొంది.

జూన్‌లోనూ భారీగా జీఎస్టీ వసూళ్లు.. రూ.1,61,497 కోట్లు..!

దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్‌ నెలకు గానూ రూ.1,61,497 కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూలైనట్లు తెలిపింది.

గతేడాది జూన్‌లో రూ.1.44 లక్షల కోట్లు వసూళ్లు నమోదవ్వగా.. ఈ ఏడాది వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. అలాగే, జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు మార్కు దాటడం ఇది నాలుగోసారి. 2021-22లో తొలి త్రైమాసికంలో జీఎస్టీ సగటు వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లు ఉండగా.. 2022-23 తొలి త్రైమాసికానికి రూ.1.51 లక్షల కోట్లకు, 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1.69 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

“నౌ ఆర్ నెవర్”.. యూసీసీపై ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు..

కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘ యూనిఫాం సివిల్ కోడ్’(యూసీసీ) బిల్లును ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని దీనిపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పలు విపక్షాలు, ముస్లిం, సిక్కు మత సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే యూసీసీపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నౌ ఆర్ నెవర్’ అంటూ ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడుంటూ వ్యాఖ్యానించారు.

విపక్షాలు, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యం చేసుకున్న నఖ్వీ, మత రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ హితవు పలికారు. ఈ సమ్మిళిత సంస్కరణకు ఇదే మంచి సమయం అని.. అందరికీ సమానత్వం , న్యాయం కోసం యూనిఫాం సివిల్ కోడ్ అవసరం అని అన్నారు. యూసీసీ భారతదేశంలోని అందరి పౌరులకు మతం, కులం, వర్గం ప్రమేయం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత విషయాల్లో ఒకే చట్టాలు ఉండాలని సూచిస్తుంది. తమ సంచుచిత ప్రయోజనాల కోసం గత ఏడు దశాబ్ధాలుగా ‘‘మతవాద కుట్రవాదుల’’ నుంచి విముక్తి పొందాలని దేశ అభిప్రాయం అని అన్నారు. 1985లో షాబానో కేసులో కాంగ్రెస్ చేసిన పొరపాటు దేశానికి దశాబ్ధాలుగా శిక్షగా మారిందని నఖ్వీ దుయ్యబట్టారు. ఇప్పటికీ కాంగ్రెస్ ఆ తప్పును దిద్దుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.

 

 

Exit mobile version