విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ వినియోగదారులు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ).. ఇప్పట్లో వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం ఉండబోదని స్పష్టం చేసింది.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ వివరాలను ప్రకటించారు ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి.. ఆ వివరాల ప్రకారం ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండబోదన్న మాట.. ఇక, ఈ సందర్భంగా జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల సబ్సిడీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.. మరోవైపు.. నాయి బ్రహ్మణులు, ఆక్వా రంగం విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.. రాయితీల రూపంలో ఏపీ ప్రభుత్వం రూ. 10,135 కోట్ల వరకు భరిస్తుందని వెల్లడించారు.. అయితే, ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంశం మీద మాత్రమే చార్జీలు పెంచుతున్నామని క్లారిటీ ఇచ్చారు ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి.
శ్రీశైలంలో మహా కుంభాభిషేకం.. ప్రధాని, సీఎంకు ఆహ్వానాలు..!
ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. శ్రీశైలంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది.. ఇప్పటికే సీఎం జగన్‌కు ఆహ్వానం అందగా.. ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఇక, మహా కుంభాభిషేకంలో భాగంగా శివాజీ గోపురం కలిశా ప్రతిష్టాపన చేయనుంది దేవస్థానం.. మహా కుంభాభిషేక సమయంలోనే పంచమఠ లింగాల ప్రతిష్టాపన చేయనున్నట్టు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య స్వామీజీ వెల్లడించారు. వీర శైవ ఆగమ శాస్త్రం, బ్రాహ్మణ ఆగమ శాస్త్రం ప్రకారం కలశ ప్రతిష్ట పనులు నిర్వహించాలన్నారు.. బ్రాహ్మణ, వీరశైవులకు సమాన అవకాశం ఇవ్వాలని ఈవోని కోరుతున్నాం అన్నా జగద్గురు పీఠాధిపతి..
వాళ్లు వై నాట్ 175 అంటే.. మేం వై నాట్ పులివెందుల అంటున్నాం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా? అనే తరహాలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లకు కొదవేలేదు.. ఎమ్మెల్యే ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించిన టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది.. దీంతో.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీయే.. సీఎం అయ్యేది చంద్రబాబే అంటున్నారు ఆ పార్టీ నేతలు.. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.. వై నాట్ 175 అని వైసీపీ నేతలు అంటున్నారు.. కానీ, మేం వై నాట్ పులివెందుల అంటున్నాం అన్నారు.. వైసీపీ ప్రభుత్వం, నాయకులు తీసుకున్న నిర్ణయాలతోనే రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చాయన్న ఆమె.. సీఎం వైఎస్ జగన్ కేసుల నుండి తప్పించుకోవడానికి, ఎమ్మెల్యేలు, నాయకులు చేసే అరాచకాల్ని కప్పిపుచ్చేందుకే అధికారంలోకి వచ్చినట్టుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, ఒకరినొకరు కొట్టుకుంటుంటే లబ్ధి పొందాలనే నీచమైన ఆలోచనతో పరిపాలన చేశారు అంటూ మండిపడ్డారు భూమా అఖిలప్రియ.. రాష్ట్ర ముఖ్యమంత్రి దారిలో కనబడిన ఎమ్మెల్యేలను గుర్తు కూడా పట్టలేడు అంటూ ఎద్దేవా చేసిన ఆమె.. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎమ్మెల్యే, బంధువు, ప్రజలు ఎవరైనా సరే.. ఎదురు చెప్పకూడదు.. అనే మీ ఆలోచన ఎంతో నష్టం కలిగిస్తుందని సూచించారు. వై నాట్ 175 అన్నారు.. కానీ, మేము వై నాట్ పులివెందుల అంటున్నాం అని ప్రకటించారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.
పేపర్ లీక్ చేసిన పెద్దలను సిట్ పిలవాలి
హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరిట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు కొమురంభీం జిల్లాలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణినీ తీసుకువచ్చి దొరలకు మళ్ళీ భూములను కట్టబెట్టి, రైతుల నడ్డి విరిచిందని ఆరోపించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉపయోగపడేలా మార్పులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కొల్పొకండని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి వారికి ప్రభుత్వం చెల్లించాలని భట్టి డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలన్నారు భట్టి. పెద్దలను కాపాడటం కోసమే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేతలకు సిట్ నోటీసులు ఇస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని, అధికారులు తమ కర్తవ్యాన్ని మరిచి, బానిసల్లాగా మారకూడదని ఆయన హితవు పలికారు. పేపర్ లీక్ చేసిన పెద్దలను సిట్ పిలవాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనాపై కేంద్రం హై అలర్ట్.. ఎల్లుండి రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యం కేంద్ర హైఅలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కొవిడ్ అలర్ట్ జారీ చేసింది. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎల్లుండి(సోమవారం) రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నుట్లు తెలుస్తోంది. అలాగే.. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని అధ్యక్షతన బుధవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఆలయంలో మహిళా వేషధారణలో పురుషులు పూజలు చేస్తారు.. ఎందుకో తెలుసా?
కేరళ కొల్లాంలోని చవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్‌కులంగర దేవి ఆలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ ఆచారాలలో భాగంగా చివరి రెండు రోజులలో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో పూజలు చేస్తారు. 19 రోజుల పాటు జరిగే వార్షిక ఆలయ ఉత్సవాల్లో చివరి రెండు రోజులలో పురుషులు స్త్రీల వేషధారణ చేస్తే, స్థానిక దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని దీని వెనుక ఉన్న నమ్మకం. కొన్నేళ్లుగా బంధువులు, స్నేహితులతో వచ్చే మగవారి సంఖ్య పెరిగి 10000 దాటింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కొట్టంకులంగర చమయవిళక్కు అంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వందలాది మంది పురుషులు మహిళ వేషధారణలో శ్రీ కొట్టంకులంగర దుర్గ భగవతి ఆలయంలో దీపార్చన చేశారు. పురుషులు మహిళల వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. రెండు రోజుల పాటు జరిగే చమయవిళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా భారీగా పాల్గొన్నారు. వారు కూడా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మలయాళి నెల ‘మీనం’ 10 ,11వ తేదీల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో వచ్చి.. ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు. అత్యంత ప్రాచుర్యం పొందిన కథనం ప్రకారం, ఆవులను మేపుతూ అమ్మాయిల వేషధారణలో ఉన్న అబ్బాయిల బృందం ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది. పూలు, ‘కోటాన్’ (కొబ్బరితో చేసిన వంటకం) సమర్పించారు. ఒకరోజు దేవత ఒక బాలుడి ముందు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత, పురుషులు స్త్రీల వేషధారణతో అమ్మవారిని ఆరాధించే ఆచారం ప్రారంభమైంది. రాయిని దేవతగా భావిస్తారు. ఏళ్ల తరబడి రాయి పరిమాణం పెరుగుతోందనే నమ్మకం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆచారం అత్యంత ప్రాచుర్యం పొందింది, ఈ పండుగ వివిధ మతాల ప్రజలను ఆకర్షిస్తుంది. వారిలో పెద్ద సంఖ్యలో కేరళ నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు.
అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ
తెలుగులో ప్రసారం అయ్యే జబర్దస్త్ షోలో కొందరు సినీ నటులపై పంచ్‌లు వేస్తుంటారు. హస్యం కోసమే కొన్ని సెటైర్లు వేస్తుంటారు. అయితే కొన్ని సందర్భంగా అవి వివాదాస్పదంగా మారిన సందర్భంగాలూ ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఓ టీవీ ఛానల్ లో ఏకంగా అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తూ చేసిన ఓ స్కిట్ చర్చనీయాంశమైంది. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లతో కూడిన పేరడీ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. సుదీ అరేబియా యొక్క ప్రభుత్వ టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడిన ఈ స్కిట్‌లో అమెరికా అధ్యక్షుడు బిడెన్ యొక్క నిజ జీవిత చర్యలను సరదాగా చేశారు. బిడెన్ దిన చర్యలను, ఆయన హావ భావాలతో స్కిట్ రూపొందించారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ని, బిడెన్ ఏ విధంగా ఉంటారో చూపించారు. విమానం ఎక్కుతూ మెట్లపై ప్రెసిడెంట్ జారి పడిపోవడం లాంటివి ఉన్నాయి. వీడియోలో నటుడు మిస్టర్ బిడెన్ ప్రసంగాన్ని ముగించినట్లు, వైట్ హౌస్ వద్ద పోడియం నుండి ఊపుతున్నట్లు కూడా చూపించారు. ప్రజలను నమస్కరిస్తూ పోడియం నుండి దిగి, రెండు అడుగులు ముందుకు వేసి, మరొకరికి చేయి చాచాడు, అక్కడ ఎవరూ లేరని గ్రహించారు. అనంతరం ఆయన కమలా హారిస్ ను అనుకరించారు. వైస్ ప్రెసిడెంట్ సరైన దిశలో మార్గనిర్దేశం చేశారు. ఈ వీడియోను పేరడీగా హాస్యభరితంగా రూపొందించారు.
త్రివేణి సంగమం లాంటి సినిమా ‘రంగమార్తాండ’…
మెగాస్టార్ చిరంజీవి ఎంత బిజీగా ఉన్నా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలని చూస్తారు. ఏ సినిమా నచ్చినా వారిని వెంటనే పిలిపించి అభినందించడం లేదా ఫోన్ చేసి మాట్లాడడం, ఒక ట్వీట్ చెయ్యడం చిరుకి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన అలవాటు. ఇటివలే బలగం సినిమా నచ్చి, చిత్ర యూనిట్ ని అభినందించిన చిరు తాజాగా రంగమార్తాండ సినిమాని త్రివేణి సంగమం అంటూ ట్వీట్ చేసాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాకి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ లు నటించిన రంగమార్తాండ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. అన్ని సెంటర్స్ లో రంగమార్తాండ సినిమాకి ఎమోషనల్ జర్నీలా ఉంది, మంచి సినిమా చూసాము అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. చిరు కూడా తన ఇంట్లో స్పెషల్ షో వేసుకోని మరీ రంగమార్తాండ సినిమా చూసి తన అభినందనలని తెలిపారు. ”నేను ‘రంగమార్తాండ’ చూశాను. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఇది ఒకటి. ప్రతి నటుడికి తన జీవితాన్నే కళ్ళ ముందు చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే, ఈ సినిమా ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందంల కలయిక, వాటి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరి నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది, బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్ర చేయడం తొలిసారి. సెకండ్ హాఫ్ అంతా అప్రయత్నంగానే కంట తడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇటువంటి సినిమాలు అందరూ తప్పకుండా చూసి ఆదరించాలి. కృషవంశీ, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ… చిత్ర బృందం అందరికీ అభినందలు” అంటూ చిరు ట్వీట్ చేశారు.
మాస్ మహారాజ్ కొత్త సినిమా ట్రైలర్ వచ్చేస్తుంది…
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీమని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇవ్వడం, రావణాసుర టీజర్ ని సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ అంచనాలని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లడానికి మేకర్స్ రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మార్చ్ 28న సాయంత్రం 4:05 నిమిషాలకి రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో మంటల్లో కాలుతున్న ముద్దాయి బోను, న్యాయ దేవత, ఫోర్ గ్రౌండ్ లో గన్ పట్టుకోని సీరియస్ గా చూస్తున్న రవితేజ ఈ పోస్టర్ లో కనిపించారు. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో రావణాసుర సినిమా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ సినిమా అని ప్రూవ్ చేస్తూ వస్తున్న మేకర్స్ మరోసారి ఈ కొత్త పోస్టర్ తో కూడా అలాంటి ఫీల్ నే ఇచ్చారు. మర ట్రైలర్ తో రవితేజ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేస్తాడో చూడాలి. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, పూజితా పోన్నాడా కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీలో అక్కినేని సుశాంత్ కూడా నటిస్తున్నాడు. మరి టీజర్ తో మంచి బజ్ జనరేట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ ట్రైలర్ తో ఎలాంటి అంచనాలని సృష్టిస్తారో చూడాలి.