NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ప్రస్తుతానికి ఎత్తు అంతే..!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.. పోలవరం నీటి నిల్వపై లోకసభలో సమాధానం ఇచ్చారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చిచెప్పారు.. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకే క్లారిటీ వచ్చింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023కే పూర్తి కావాల్సి ఉందని లోక్‌సభలో పేర్కొన్నారు ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌. ఇక, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైనట్లు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు పేర్కొంది.. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉందని.. జాప్యం జరిగినట్లు తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. తన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.

కర్నూలుకు ఏపీ హైకోర్టు తరలింపు.. కేంద్రం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడు రాజధానులు తమ విధానం అని స్పష్టం చేసింది.. విశాఖ పరిపాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని పేర్కొంది.. అందులో భాగంగా త్వరలోనే విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ మధ్యే మంత్రులకు తెలిపారు.. ఇక, కర్నూలుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు.. ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలింపు వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు. హైకోర్టును కర్నూలుకు తరలింపు అంశం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు కిరణ్‌ రిజిజు.. ఇక, హైకోర్టు నిర్వహణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు.. అదేవిధంగా హైకోర్టు రోజువారి పాలన వ్యవహారాల బాధ్యత అంతా సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిదే అన్నారు.. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు అయిందని ఈ సందర్భంగా తెలిపారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు అయినట్టు అయ్యింది.. ఇప్పుడు కర్నూలు తరలించే విషయంలో హైకోర్టు ప్రధాని న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.

రెండు నెలల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన స్థంభించింది
రెండు నెలల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన స్థంభించిందని, కవిత ఈడీ నోటీసుల నుంచి అసలు రాష్ట్రంలో పాలన సాగడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్. అయితే.. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత వెనకాలే ఢిల్లీకి వెళ్తోన్న మంత్రులు.. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. కవిత న్యాయ సలహా కోసం ప్రభుత్వ అధికారులను వాడుకుంటుందని, పోలీసు ఉన్నత, న్యాయ ఉన్నత అధికారులు కవిత ఈడీ కేసు రివ్యూ మీటింగ్ లో పాల్గొంటున్నారన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, పంట నష్టం, నగరంలో భవనాలు కూలుతున్న, కాలుతున్న పట్టించుకునే నాథుడే లేడని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బంధుప్రీతి తో కూడుకున్న పాలన నడుస్తోందని, మంత్రులు అధికారిక ప్రెస్ మీట్ లో ప్రభుత్వ పరమైన విషయాలు వదిలేసి రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. ఉన్నత అధికారులు మంత్రుల పక్కనే ఉంటున్నారని, వాళ్లేం ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ లో కూర్చొంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు. సీఎం పర్యటన కంటి తుడుపు చర్య అని, ప్రకటించిన నష్టపరిహారం కూడా ఇదే విధంగా ఉందని ఆయన విమర్శించారు.

పాకిస్థాన్ కెప్టెన్‌కు అరుదైన గౌవరం.. చరిత్ర సృష్టించిన బాబర్
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం గురువారం దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారం సితార-ఎ-ఇమ్తియాజ్‌ను అందుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ డే వేడుకల్లో భాగంగా పంజాబ్ గవర్నర్ హౌస్‌లో జరిగిన ఇన్వెస్టిచర్ వేడుకలో పాకిస్థాన్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ బాబర్‌కు గవర్నర్ బలిఘ్ ఉర్ రెహ్మాన్ అవార్డును అందజేశారు. ఈ అవార్డు ప్రదానంతో బాబర్ క్రీడా రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు 28 సంవత్సరాల వయస్సులో సితార-ఎ-ఇమ్తియాజ్ అవార్డు పొందిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ అయ్యాడు. తన తల్లిదండ్రుల సమక్షంలో ఈ అవార్డును అందుకోవడం అపారమైన గౌరవంగా భావిస్తున్నానని కెప్టెన్ బాబర్‌ పేర్కొన్నాడు.‘ఈ అవార్డు నా తల్లిదండ్రులు, అభిమానులు, పాకిస్థాన్ ప్రజలకు’ అని ట్వీట్ చేశాడు. గతంలో సర్ఫరాజ్ అహ్మద్ సితార-ఎ-ఇమ్తియాజ్‌ను అందుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 2017లో పాకిస్థాన్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌కు నడిపించిన సర్ఫరాజ్‌కు 2018లో కరాచీలోని గవర్నర్ హౌస్‌లో అప్పటి సింధ్ గవర్నర్ మహ్మద్ జుబైర్ అవార్డును అందజేశారు. గత ఏడాది ఆగస్టు 14న, దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారంతో బాబర్‌ను ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాబర్ మే 2015లో జింబాబ్వేపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అతని ప్రదర్శనలు చివరికి 2016లో T20లు, టెస్టులకు అరంగేట్రం చేశాడు. 47 టెస్టుల్లో బాబర్ 48.63 యావరేజ్‌తో 3,696 పరుగులు చేయగా, 95 వన్డేల్లో బాబర్ 59.41 యావరేజ్‌తో 4,813 పరుగులు చేశాడు. 99 టీ20ల్లో బాబర్ 41.41 యావరేజ్‌తో 3,355 పరుగులు చేశాడు.

మారుతి కస్టమర్లకు షాక్.. ఏప్రిల్ నుంచి కొత్త ధరలు
కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీరు మారుతి సుజుకి కస్టమర్లా? అయితే, ఇది మీకు చేదు వార్తే. దేశీయ కార్ల దిగ్గజం కంపెనీ మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని మోడల్ కార్ల ధరలను ఏప్రిల్ నుంచి పెంచేందుకు నిర్ణయించింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చులను భర్తీ చేయడానికి ఏప్రిల్‌లో తమ మోడల్ శ్రేణి ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకి ఇండియా గురువారం తెలిపింది. ఏప్రిల్ నుంచి ధరలను పెంచుకున్నట్లు ప్రకటించిన మారుతీ.. ఎంత శాతం పెంచేది స్పష్టత ఇవ్వలేదు. ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన వ్యయ ఒత్తిడిని కంపెనీ కొనసాగిస్తోందని ఆటో తయారీదారు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు. మారుతి సుజుకి వ్యయాలను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వివిధ అంశాల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ధరల పెరుగుదలను అమలు చేయడం అవసరమని అంగీకరించింది. ఈ ధరల పెంపు సాధారణ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పాటు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే RDE నిబంధనల వంటి నియంత్రణ అవసరాలకు ప్రతిస్పందనగా ఉంది అని కంపెనీ మార్కెటింగ్ , సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. OEM వ్యయ నిర్మాణాలలో 75% వాటా కలిగిన మెటీరియల్‌ల ధరల పెరుగుదల కారణంగా మారుతి సుజుకి జనవరి 2021 నుండి ధరల పెంపును అమలు చేసింది.

రాజమౌళిని విడవని మణిరత్నం!
ఎందరో దర్శకులకు అభిమాన దర్శకునిగా నిలిచారు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్’ టాప్ హండ్రెడ్ లో చోటు సంపాదించింది. ఇక ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతోమంది సినీజనం ఫిదా అయిపోయారు. మణిరత్నం చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఈ నాటికీ ఎంతోమంది ఆయన సినిమాలను చూస్తున్నారు. అంతటి ఘనత వహించిన మణిరత్నం, గత సంవత్సరం తన ‘పొన్నియిన్ సెల్వన్-1’ విడుదల సమయంలో తమకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి డోర్స్ తెరిచారని వ్యాఖ్యానించారు. అప్పట్లో కొందరు మణిరత్నం ఫ్యాన్స్ కు ఈ మాటలు బాధ కలిగించాయి. ‘మణిరత్నం ఎక్కడా? రాజమౌళి ఎక్కడా?’ అనీ కొందరు కామెంట్స్ చేశారు. అలా కామెంట్స్ చేసిన వారికి రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ అంతర్జాతీయంగానూ తనదైన బాణీ పలికిస్తూ సమాధానం చెప్పింది. ఆ సంగతి వదిలేస్తే- రాజమౌళి బాటను ఇంకా మణిరత్నం ఫాలో అవుతున్నారనే కొందరు పరిశీలకులు అంటున్నారు. ‘బాహుబలి’ ఛాయల్లోనే తన భారీ చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ను రూపొందించారు మణిరత్నం. ఈ సినిమా తెలుగు వర్షన్ అంతగా అలరించలేదు. కానీ తమిళ వర్షన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు పోగేసింది. ఈ నేపథ్యంలో మణిరత్నం తన ‘పొన్నియిన్ సెల్వన్-2’ చిత్రాన్ని ఏప్రిల్ లో జనం ముందు నిలపడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి ఒకప్పుడు దక్షిణాదిన ఓ సెంటిమెంట్ ఉండేది. అదేమిటంటే, సౌత్ లో తీసిన సీక్వెల్స్ ఏవీ అంతగా విజయం సాధించవు అన్నదే ఆ నమ్మకం! కానీ, రాజమౌళి ‘బాహుబలి-2’ చిత్రం ‘బాహుబలి-1’ కంటే భారీ విజయం నమోదు చేసి, ఆ సెంటిమెంట్ ను చెరిపేసింది. అందువల్ల రాజమౌళి ఇచ్చిన స్ఫూర్తితో మణిరత్నం సైతం తన ‘పొన్నియిన్ సెల్వన్-2’పై ఆశలు మెండుగానే పెంచుకున్నారు. అంతేకాదు ‘పొన్నియిన్ సెల్వన్-2’ సినిమాను ‘బాహుబలి-2’ విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే మణిరత్నం కూడా విడుదల చేయడానికి పూనుకోవడం విశేషం! ఆరేళ్ళ క్రితం 2017లో ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ‘బాహుబలి-2’ అనూహ్య విజయం సాధించింది. అదే తేదీన విడుదలకు సిద్ధమైన మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్-2’ కూడా గ్రాండ్ సక్సెస్ చూస్తుందేమో అని సినీఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు పోగేసిన ‘పొన్నియిన్ సెల్వన్-1’ సీక్వెల్ గా వస్తోన్న ఈ రెండోభాగానికి తెలుగునాట కొనుగోలుదారులు కరువయ్యారట! కనీసం రాజమౌళిని ఫాలో అవుతున్నందుకైనా ‘పొన్నియిన్ సెల్వన్-2’కు భారీ బిజినెస్ జరుగుతుందేమో చూడాలి.

సమంతతో కలిసి కొండన్న సెప్టెంబర్ లో వసున్నాడట..
మహానటి తరువాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషీ. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులకు మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దాంతో పాటు ఒక కొత్త పోస్టర్ ను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. పోస్టర్ లో విజయ్ మెడలో సాఫ్ట్ వవేర్ ట్యాగ్ వేసుకొని కనిపిస్తుండగా.. మేడ మీద ఉన్న సమంత అతడి చెయ్యి అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు ప్రపంచాలు సెప్టెంబర్ 1 న కలుసుకోనున్నాయి అని మేకర్స్ చెప్పుకొచ్చారు. రెండు భిన్నమైన మనస్తత్వాలు ఉన్నవారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది. వారి జీవితంలో ఖుషీ ఎలా వచ్చింది అనేది ఎంతో హృద్యంగా తెరకెక్కిస్తున్నాడట శివ నిర్వాణ. కశ్మీర్ తో పాటు ఎన్నో అందరమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఖుషీ .. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి .