NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్.. ఇవే సజీవ సాక్ష్యం..!
సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నెల్లూరులో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించిన టీడీపీ అధినేత.. టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి సీఎం జగన్‌కు ఛాలెంజ్ విసురుతూ ట్వీట్ చేశారు.. ”చూడు.. జగన్! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు.. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ కామెంట్ పెట్టారు.. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎన్ని..? నువ్వు కట్టిన ఇళ్లు ఎక్కడ? జవాబు చెప్పగలవా? అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో ట్వీట్ చేశారు చంద్రబాబు.. తన మైబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరిన చంద్రబాబు.. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని క్యాడర్, లీడర్లకు పిలుపునిచ్చారు.

బంగారు తెలంగాణను పక్కకు పెట్టి… బంగారు కుటుంబం నిర్మించుకున్నారు
అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైనా కమ్యునిస్టు పార్టీని వెనక్కి నెట్టేసి బీజేపీ పెద్ద పార్టీగా అవతరించిందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. బంగారు తెలగాణను పక్కకు పెట్టి… బంగారు కుటుంబం నిర్మించుకున్నారని మండిపడ్డారు కిషన్‌ రెడ్డి. దేశంలో తెలంగాణను నవ్వుల పాలు చేశారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. దేశంలో కుటుంబ పార్టీ లకు నాయకత్వం వహిస్తానని, ఖర్చు పెట్టుకుంటా అని కేసీఆర్ చెప్పడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. 9 ఏళ్ళల్లో ఒక్క రోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదని, కేసీఆర్ సచివాలయానికి రారు.. పాలనను విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు. కుట్రలు చేసి.. బీజేపీని అనిచివేయలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. TSPSC పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, ఆ విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని ఆయన దుయ్యబట్టారు. TSPSC లీకేజీ నీ ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు.

జగన్ పాలనపై అన్ని వర్గాలు పూర్తి సంతృప్తి.. ప్రజలకు ఏం కావాలో ఆయనకే తెలుసు..!
పేదల గుండె చప్పుడు, వారి హృదయంలో మాట, వారికేమి‌ అవసరమో ఒక్క సీఎం వైఎస్‌ జగనన్నకే తెలుసునని, అందుకే ప్రజలంతా ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమండ్రి 38వ వార్డు సీతంపేట ఫారెస్ట్ కల్యాణ మండపంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని ఎంపీ భరత్, రాజ్యసభ సభ్యుడు, ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ పిల్లి సుభాస్ చంద్రబోస్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్, కరపత్రాలు, మొబైల్ ఫోన్ స్టిక్కర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకూ జరగలేదన్నారు. ఇక, ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పాలన ఒక మహా యజ్ఞంలో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారని తెలిపారు ఎంపీ భరత్‌. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినది మొదలు నేటి వరకూ ఈ నాలుగేళ్ళలో రూ.2లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల ద్వారా నిరుపేద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా సొమ్ములు జమ చేసిన ఘనత జగనన్నదని అన్నారు. నాలుగు సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి చేస్తే, మరో ఐదు సంవత్సరాలు మళ్లీ సీఎంగా జగనన్నకే‌ అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని మరింత సర్వతోముఖాభివృద్ధి చేస్తారన్నారు. పేదలను అన్ని విధాలా ఆదుకుని, వారి జీవన‌ విధానంలో పెనుమార్పులు తీసుకు రావాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన సమసమాజ స్థాపన దిశగా జగన్ పాలన కొనసాగుతోందని, జగన్ పాలనపై అన్ని వర్గాల నుండి పూర్తి సంతృప్తి, హర్షం వ్యక్తమవుతోందని ఎంపీ భరత్ తెలిపారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో గృహసారథులు, కన్వీనర్లు ప్రతీ ఇంటికి వెళ్లి కనీసం 5 నిమిషాలు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. జగన్ పాలనపైనా, సంక్షేమ పథకాలు అమలుపైనా అయిదు ప్రశ్నలు అడిగి, రికార్డు చేసుకుంటారని చెప్పారు. గృహ యజమానుల అనుమతితో ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో కూడిన స్టిక్కర్ ఇంటి తలుపునకు అంటించడం, మొబైల్ కు స్టిక్కర్, అలాగే ఫోన్ ద్వారా సమాచారం పంపడం జరుగుతుందని వివరించారు ఎంపీ మార్గాని భరత్ రామ్‌.

కొత్త బిచ్చగాళ్లకు కేసీఅర్‌ను ఎదుర్కొనే దమ్ము లేదు
కొత్త బిచ్చగాళ్ల కు కేసీఅర్ ను ఎదుర్కొనే దమ్ము లేదంటూ ధ్వజమెత్తారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మీకు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, దమ్ముంటే అభివృద్ధి లో పోటీ పడాలని ఆయన బీజేపీ నేతలకు సవాల్‌ చేశారు. నడిచే వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు. పేపర్ లీకేజీ దుర్మార్గమైన చర్య అని ఆయన దుయ్యబట్టారు. దొంగే దొంగ దొంగ అంటున్నారని, ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలే ఎన్నికల్లో బొంద పెడతారని ఆయన నిప్పులు చెరిగారు. భయపడేది లేదని, మీకు 10 మంది ఉంటే మాకు 90 మంది ఉన్నారు గ్రామంలో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దమ్ముంటే అభివృద్ధి లో నిధులు తేవడంలో పోటీ పడాలని, కోట్లాది మంది ఆత్మీయుల ఆశీర్వాదం అండ మాకు ఉన్నాయని ఆయన అన్నారు. గతంలో రాజులు కత్తులతో యుద్ధాలు చేసే వారని, ఇప్పుడు ప్రజల ఆశీర్వాదం ఓటుతోనే యుద్ధం చేస్తామన్నారు.

బీజేపీలో అనిల్ కరివేపాకు.. పార్టీ నుంచి గెంటేస్తారు..
బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీపై ఆయన సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడి నిర్ణయం షాక్ కు గురి చేసిందని ఎకె ఆంటోనీ చిన్న కుమారుడు అజిత్ అన్నారు. కాషాయ పార్టీ అతన్ని తాత్కాలికంగా ఉపయోగించుకున్న తర్వాత కరివేపాకు లాగా విసిరివేస్తుందని అన్నారు. అనిల్ ఆంటోనీ తన నిర్ణయం గురించి కుటుంబానికి కనీస సూచన ఇవ్వలేదని తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలను చూసిన తమ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారని అజిత్ ఆంటోని చెప్పారు. అనిల్ ఆంటోనీ బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించడాన్ని చూసిన తర్వాత తన తండ్రి చాలా కృంగిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఇంట్లో ఒక మూలన కూర్చొని చాలా బాధ పడ్డారని తెలిపారు. తన జీవితంలో ఆయనను ఇంత బలహీనంగా ఎప్పుడూ చూడలేదన్నారు. ఆయన కన్నీళ్లు పెట్టుకోలేదు, అంతే అని అజిత్ ఆంటోని అన్నారు. తన సోదరుడు బీజేపీలో చేరడానికి తన సొంత కారణాలు ఉంటాయన్నారు. గుర్తు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి తనకు చాలాసార్లు అసభ్యకరమైన కాల్స్ వస్తున్నాయని, అది తనను బాధించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్‌లో ఆర్సీబీ మరో చెత్త రికార్డ్.. ఏకంగా 15 సార్లు
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఇప్పటికే ఒక చెరగని చెత్త రికార్డ్ ఉంది. కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయ్యి.. అత్యల్ప స్కోరుకి చాపచుట్టేసిన జట్టుగా నిలిచింది. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఆర్సీబీ ఈ ‘చెత్త’ రికార్డ్‌ని తన పేరిట లిఖించుకుంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోరును నమోదు చేయలేదంటే.. ఎంత చిత్తుచిత్తుగా ఓడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆర్సీబీ జట్టు ఇదే ఐపీఎల్‌లో మరో చెత్త రికార్డ్‌ని నమోదు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో 125 పరుగులలోపు అత్యధిక సార్లు (15 సార్లు) ఆలౌటైన జట్టుగా అవతరించింది. ఏప్రిల్ 7వ తేదీన కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 123 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ అవ్వడంతో, ఈ చెత్త రికార్డ్ ఆ జట్టు సొంతం అయ్యింది. ఆర్సీబీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 15 సార్లు 125 స్కోరులోపే ఆలౌటైంది. ఈ రెండు జట్ల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ 11 సార్లు, కేకేఆర్‌, ముంబై ఇండియన్స్‌ 9 సార్లు, పంజాబ్‌ 8 సార్లు 125 పరుగుల లోపు ఆలౌటయ్యాయి.

పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిని కాల్చి చంపి ఆపై!
ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు.. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. ప్రాణాలు సైతం తీసేందుకు మగాళ్లు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఓ యువతిని గన్‌తో కాల్చి చంపి అనంతరం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. 26 ఏళ్ల యువకుడు తన ప్రియురాలిని కాల్చి చంపి అనంతరం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. రాహుల్ చౌదరి అనే నిందితుడు దీప్మల యాదవ్ (24)ని నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఘుక్నా గ్రామంలోని తన ఇంటి వద్ద గురవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు ఆలయానికి వెళ్లిన సమయంలో కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత విషం సేవించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నగరం) నిపున్ అగర్వాల్ తెలిపారు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. రాహుల్‌ చౌదరిని ఈశాన్య ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని అధికారి తెలిపారు.

పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందోచ్
పుష్ప.. పుష్ప.. పుష్ప.. మూడు రోజులుగా పుష్ప పేరు మోత మ్రోగిపోతుంది. తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు..? అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతూనే ఉంది. ఇక దానికి ఆన్సర్ తెలిసిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాతనే స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ గా మార్చింది. బన్నీని ఆర్య నుంచి పుష్ప అని పిలిచుకొనేలా చేసింది. పుష్ప 1 తో హైప్ క్రియేట్ చేసి వదిలేసిన సుక్కు ..పుష్ప 2 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేలా చేశాడు.. ఇక ఆ ఎదురుచూపులుకు సమాధానం వచ్చేసింది. రేపు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుంచి ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ను ఇచ్చి అభిమానుల్లో జోష్ పెంచేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మూడు నిముషాలు ఉన్న ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తిరుపతి పోలీస్ స్టేషన్ నుంచి 8 బుల్లెట్ల గాయాలతో పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలియక పోలీసులు ఒక పక్క వెతుకుతూ ఉండగా .. ఇంకోపక్క పుష్ప మద్దతుదారులు అతని కోసం పోలీస్ స్టేషన్ మీద దాడికి దిగడం, అల్లర్లు చేయడం చూపించారు. పుష్ప అసలు బతికి ఉన్నాడా..? లేక పోలీసులు చంపి డ్రామాలు ఆడుతున్నారా..? అన్న అనుమానాలు… పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పుష్ప విదేశాలకు పారిపోయాడని చర్చలు.. ఇక వీటన్నింటి మధ్య పుష్ప శేషాచల అడవుల్లో కనిపించినట్లు చూపించిహైప్ పెంచేశాడు సుకుమార్. వావ్ వీడియో మాత్రం అదిరిపోయింది. ఇక ” అడవిలో జంతువులూ రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులే రెండు అడుగులు వెనక్కి వచ్చిందంటే పుష్ప వచ్చాడని అర్ధం” అనే ఒక్క డైలాగ్ తో పుష్ప ఏంటి అనేది చూపించేశాడు. ఇక చివర్లో పుష్పరాజ్ రూల్ అని చెప్పే షాట్ వీడియోకె హైలైట్ గా నిలిచింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో హైలైట్ అని చెప్పాలి. పుష్పకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నే కంటిన్యూ చేసి అభిమానులకు మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. విజువల్స్, సెట్టింగ్స్ తో సుకుమార్ ఈ సినిమా అంచనాలను మరింత పెంచేశాడు. పుష్ప మ్యానియా మరోసారి మొదలయ్యింది. సినిమా రిలీజ్ అయ్యేవరకు ఈ మ్యానియా తగ్గేదేలే అని చెప్పాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.