ఏపీ మంత్రులకు హరీష్‌రావు కౌంటర్.. మా గురించి మాట్లాడకండి మీకే మంచిది..
తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. దీంతో.. ఏపీ మంత్రులు కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. ఇక, వారి వ్యాఖ్యలపై మరోసారి అదేస్థాయిలో స్పందించారు మంత్రి హరీష్‌రావు.. సంగారెడ్డి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని సవాల్ చేశారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది.. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉంది.. కేసీఆర్ కిట్ ఉంది. కళ్యాణ లక్ష్మి ఉంది.. ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉంది అంటూ రాష్ట్రంలో అమలు చేస్తోన్న పథకాల గురించి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. ఏపీలోని రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్‌రావు.. ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టినా ఏమీ అడగరు.. ఏపీ లో ఏముంది..? అని ప్రశ్నించారు హరీష్‌రావు.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదన్న ఆయన.. విశాఖ ఉక్కును తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఉందన్నారు.. అధికార పార్టీ అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదని కౌంటర్ ఇచ్చారు.. రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు. అయితే, అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి.. అది మీకే మంచిదని ఆంధ్ర మంత్రులకు సూచించారు.. ఇక, ఢిల్లీలో ఉన్నోళ్లు మనల్ని నూకలు బుక్కమని ఎగతాళి చేశారు.. తెలంగాణ ప్రజలంతా కలిసి ఢిల్లీలో ఉన్నోడికి నూకలు బుక్కీయ్యాలి అని పిలుపునిచ్చారు మంత్రి హరీష్‌రావు.
నేను సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదు..
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఏపీలో రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నేను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేసిన సంస్కృతి లేదు.. నేను ఏ ఒక్క రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదు.. అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకేలా ఉన్నాయన్నారు.. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన.. విజయవాడలో మీడియాతో మాట్లాడారు.. బీజేపీలో ఎందుకు చేరానో ఇప్పటికే స్పష్టంగా చెప్పాను.. అరవై సంవత్సరాలు పైన మా కుటుంబం కాంగ్రెస్ లోనే కొనసాగాం.. వివిధ పరిణామాలు వల్ల రాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాం.. విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు అనుగుణంగా నడవాలి.. రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో మళ్లీ కాంగ్రెస్ లో చేరాను అని తెలిపారు. కానీ, నాయకులు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి పని చేయాలని చూశాను.. కానీ, అక్కడ నిర్ణయాలు ఒక్కో రాష్ట్రంలో పార్టీ దెబ్బ తినే పరిస్థితి ఉందన్నారు. నాకు, రాహుల్ గాంధీకి మధ్య కొన్ని అంశాల పై చర్చ జరిగిందని గుర్తుచేసుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు ఇస్తాం అన్నా.. వద్దు అని చెప్పా అన్నారు. నీళ్లు బాటిల్ నుంచి పడకముందే జాగ్రత్త ఉండాలి.. కానీ, కింద పడ్డాక.. మళ్లీ ఆ నీళ్లను సీసాలో పోయలేం అనే విషయాన్నే వాళ్లకి చెప్పానన్నారు. అయినా అందరం కలిసి పని చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెంచాం.. అయితే, కాంగ్రెస్ బలోపేతం అవుతున్న సమయంలో టీడీపీతో పొత్తుకు వెళ్లారని మండిపడ్డారు. ఎవరినీ అడగకుండా, చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే తాను బయటకి వచ్చానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన నచ్చి.. ప్రజలకు మంచి చేయవచ్చనే నమ్మకంతో బీజేపీలో చేరానని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సింగరేణి అధికారులు.. రెండో రోజు పర్యటన
విశాఖ స్టీల్ ప్లాంట్ లో తెలంగాణ సింగరేణి కాలరీస్ అధికారులు బృందం రెండో రోజు పర్యటిస్తోంది.. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనంలో అధికారులను బృందం కలుసుకుంది. స్టీల్ ప్లాంట్ లోపల కూడా అధికారుల బృందం పర్యటిస్తోంది. ఈ సాయంత్రం స్టీల్ ప్లాంట్ సీఎండీతో తెలంగాణ అధికారులు భేటీ అవుతారు. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫుర్నేస్ 3లో ముడి సరకు కోసం జరుగుతున్న బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొవడాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి స్వాగతించి మద్దతు పలుకుతోంది. అయితే, విశాఖ స్టీల్‌ప్లాంట్ పూర్తి సామర్ధ్యంతో నడపకుండా కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డిందని కార్మిక సంఘలు ఆవేదన చెందుతున్నాయి. విశాఖ స్టీల్‌లోని బ్లాస్‌ఫర్నస్ 3ను మూసివేసిందని.. విశాఖ స్టీల్‌లోని అనేక విభాగాలు అపిందని అన్నారు. దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్‌కు లాభాలు వచ్చిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సుమారు 3వేల కోట్లు నష్టాలు మూటకట్టిందని బాధ పడుతున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం సామర్ధ్యంతో నడపాలని స్టీల్ పోరాట కమిటీ ఒత్తిడి చేస్తోంది. ఫలితంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ముడిఖనిజం, మూలధనం సమకూర్చడానికి ఆసక్తి కలిగిన వారు కోసం యాజమాన్యం గత నెల నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ తో తెలంగాణలోని సింగరేణి కాలరీస్ తమ ఆసక్తి వ్యక్త పరచడం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ లో పర్యటిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు.. అనూహ్య స్పందన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నే మా భవిష్యత్తు పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం సాగుతోంది. వైఎస్సార్సీపీ మెగా ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. క్షేత్రస్థాయిలో ఈ ఉద్యమానికి ఊహించని విధంగా మద్దతు లభిస్తోంది. రోజురోజుకీ మరింత విస్తృతంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, వైసీపీ శ్రేణులు ప్రజలతో మమేకం అవుతున్నారు.. నాలుగో రోజు అనగా ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల ఇళ్లలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా పీపుల్స్ సర్వే నిర్వహించారు.. ఇక, పార్టీ ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ 82960 82960కు 10వ తేదీన 28 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయి.. ఇక, ఐదో రోజు.. అంటే ఈ నెల 11వ తేదీకి వచ్చేసరికి ఆ సంఖ్య మరింత పెరిగింది.. ఏకంగా 45 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించాయి వైసీపీ శ్రేణులు.. నిన్న మొత్తంగా 37 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చినట్టు వైఎస్‌ఆర్సీపీ ప్రకటించింది..
తెలంగాణలో ఇంటర్ రిజల్స్.. రిలీజ్ ఎప్పుడంటే
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) 2023 ఇంటర్ ఫలితాలను మే రెండవ లేదా మూడవ వారంలో ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. 2023 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించబడ్డాయి. ప్రశ్నా పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 15 వేర్వేరు శిబిరాల్లో ప్రారంభమైంది.. ఇది ఏప్రిల్ 20, 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 4,82,677 ప్రథమ సంవత్సరం, 4,65,022 ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు సహా మొత్తం 9,47,699 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు మే 2023 చివరి వారంలో నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు.
30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే.. ఆ ఒక్కరు ఎవరంటే..?
భారత రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉంటాయనేది కాదనకూడని నిజం. సాధారణంగా గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఒక్కసారి అధికారం వస్తే కోట్లకు పడగలెత్తుతున్నారు. అలాంటిది సీఎం అయితే కోట్ల ఆస్తులు ఉండటం చాలా సహజం. అయితే భారతదేశంలో మొత్తం 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే అని అంటే 97 శాతం మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఎన్నికల ముందు సమర్పించే అఫిడవిట్ లో ఉన్న సమాచారం ప్రకారం ఏడీఆర్ ఈ నివేదికను ప్రకటించింది. ఈ నివేదికలో టాప్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి టాప్ లో ఉన్నారు. అయితే కోటీశ్వరులు కానీ సీఎంగా ఒకే ఒక్కరుగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. కేవలం ఆమె ఆస్తుల విలువ రూ.15 లక్షలుగా పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఏకంగా రూ.510 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల సెల్ఫ్ అఫిడవిట్ విశ్లేషించిన తర్వతే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ తెలిపింది.
సంసారాల్లో చిచ్చు పెడుతున్న చాట్ జీపీటీ.. హాంకాంగ్ లో ఘటన
ప్రస్తుత యుగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాలం నడుస్తోంది. చాట్ జీపీటీ(ChatGPT) రాకతోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాట్‌జీపీటీ వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలు ఉలిక్కిపడుతున్నాయి. కేవలం ఐదు రోజుల్లో వన్ మిలియన్ వినియోగదారులను సంపాదించుకుని రికార్డు నెలకొల్పింది. ప్రతి ఒక్కరూ వారి ప్రశ్నలకు సమాధానమివ్వమని ChatGPTని అడుగుతున్నారు. అయితే ఈ చాట్‌జీపీటీ వల్ల ఇంట్లో మనస్పర్థలు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి ఘటనే హాంకాంగ్ నుంచి వెలుగులోకి వచ్చింది. ఒక భర్త తన పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టడానికి చాట జీపీటీ సహాయం తీసుకున్నాడు. కానీ అలా చేయడం వల్ల అతని భార్యకు విపరీతమైన కోపం వచ్చింది. హాంకాంగుకు చెందిన ఓ జంట త్వరలో బిడ్డను ఆశిస్తున్నారు. అందుకు భార్య కాబోయే బిడ్డకు మంచి పేరు సూచించాలని తన భర్తను కోరింది. కానీ సోమరి అయిన ఆ భర్త ఆ బిడ్డకు మంచి పేరు పెట్టడానికి ChatGPTని ఉపయోగించాడు. అయితే ఈ విషయం అతని భార్యకు తెలియడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తన భర్తపై చాలా కోపగించుకుంది. పాపకు తండ్రి ఎవరు, మీరా లేదా ChatGPT నా అంటూ ప్రశ్నించింది. ఈ ఘటనపై స్వయంగా మహిళ ఓ వేదికపై మాట్లాడింది. మార్చి చివరలో సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారం అంతా పోస్ట్ చేసింది. ఆమె ఆ రకంగా పోస్ట్ చేసింది.. “మా బిడ్డకు పేరు పెట్టడంలో మాకు సహాయం చేయమని నేను నా భర్తను అడిగాను, కానీ అతను ChatGPT నుండి సహాయం తీసుకున్నాడు.”
ఏయ్.. ఏయ్.. అన్నా.. హీరోయిన్ తో పులిహోర కలుపుతున్నావా..?
సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన నటన, చలాకీతనం, కామెడీ, సెటైర్లు, కౌంటర్లు అందరికి తెలిసినవే. స్టేజిమీద అయినా, సోషల్ మీడియాలో అయినా బ్రహ్మజీ వేసే కౌంటర్లకు నవ్వు ఆగదు అంటే అతిశయోక్తి కాదు. ఇక కొన్నిరోజుల ముందు.. అనసూయ ఆంటీ వివాదం ఎంత రచ్చచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దానికి కౌంటర్ గా బ్రహ్మజీ.. నన్ను అంకుల్ అంటే.. పోలీస్ కేస్ పెడతా అని ట్వీట్ వేసి షాక్ ఇచ్చాడు. ఇక్కడితో అయిపోలేదు. సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అయితే దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ప్రభాస్.. ఆదిపురుష్ టీజర్ లంచ్ లో డైరెక్టర్ ఓం రౌత్ ను.. కమ్ టూ మై రూమ్ అన్న పదం ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే. దాన్ని బ్రహ్మాజీ ఇమిటేట్ చేస్తూ సుమ షోలో సుమ .. కమ్ టూ మై రూమ్ అంటూ చేసిన హంగామా ఇప్పటికీ మర్చిపోలేం. ఇక తాజాగా ఈ నటుడు.. విరూపాక్ష బ్యూటీ సంయుక్తను సరదాగా ఏడిపించాడు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నిన్న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటు సంయుక్తకు మంచి పేరు వచ్చింది. దీంతో సంయుక్త ట్విట్టర్ అభిమానులతో చిట్ చాట్ మొదలుపెట్టింది. విరూపాక్ష ట్రైలర్ ఎలా ఉంది అంటూ అడిగేసింది. ఈ ప్రశ్నకు అభిమానులు తమదైన రీతిలో జవాబులు చెప్పుకొస్తుండగా.. బ్రహ్మాజీ కూడా తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చి అదరగొట్టేశాడు. “ట్రైలర్ నచ్చిందా.. చెప్పండి అన్న ప్రశ్నకు.. చాలా బావుంది ప్లాటినం లెగ్ గారు” అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి సంయుక్త.. ” అర్రే.. ఏంటి బ్రహ్మీ గారు” అంటూ సిగ్గులు మొగ్గలు వేసింది. ఇక బ్రహ్మాజీ అలా అనడానికి కారణం కూడా లేకపోలేదు. టాలీవుడ్ ఎంట్రీనే పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ తో ఇచ్చింది. అది హిట్.. ఆ తరువాత బింబిసార హిట్, సార్.. హిట్. ఇలా అమ్మడు అడుగుపెట్టిన ప్రతి సినిమా హిట్ అవడంతో బ్రహ్మాజీ గోల్డ్ లెగ్ బదులు ప్లాటినం లెగ్ అనేశాడు. ఇక వీరిద్దరి కామెంట్స్ చూసిన అభిమానులు.. ఏయ్.. ఏయ్.. అన్నా.. హీరోయిన్ తో పులిహోర కలుపుతున్నావా..?.. చిలిపి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
శకుంతలకూ… జ్వరమొస్తుందా!?
స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ఈ నెల 14న ఈ సినిమా ఐదు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. గత కొద్ది రోజులుగా ధూమ్ ధామ్ గా మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ చిత్ర బృందం మీడియా సమావేశాలకు హాజరవుతూ హల్చల్ చేస్తోంది. నిజానికి సమంత ఆ మధ్య అనారోగ్యం పాలై… ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ హెల్త్ ఇష్యూస్ కారణంగానే తన గత చిత్రం ‘యశోద’ ప్రమోషన్స్ లో ఆమె పాల్గొనలేదు. కేవలం ఒకటి రెండు ఇంటర్వ్యూలతో సరిపెట్టేసింది. అయితే ఇప్పుడు తిరిగి హెల్త్ నార్మల్ కండిషన్ కు రావడంతో… ‘శాకుంతలం’ ప్రమోషన్స్ కు బాగానే డేట్స్ కేటాయించింది. అయితే… సమంత ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలుస్తోంది. విషయం ఏమంటే… గత వారం రోజులుగా సమంత ‘శాకుంతలం’ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో ఇప్పుడు అనారోగ్యం పాలైంది. తనకు జ్వరం వచ్చిందని, గొంతు కూడా పోయిందని సోషల్ మీడియా ద్వారా సమంత తెలిపింది. సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం చివరి నిమిషం వరకూ ప్రమోషన్స్ ను ప్లాన్ చేసింది. అందులో భాగంగా బుధవారం సాయంత్రం ఎంఎల్ఆర్ఐటీ వార్షికోత్సవంలో చిత్ర బృందం పాల్గొనవలసి ఉంది. కానీ తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని సమంత తెలిపింది. ‘గత వారం రోజులుగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ మీ అందరి ప్రేమాభిమానాలలో మునిగి తేలాను. కానీ హెక్టిక్ షెడ్యూల్స్, ప్రమోషన్స్ వల్ల ఇబ్బందికి గురయ్యాను. ప్రస్తుతం జ్వరంతోనూ, గొంతునొప్పితోనూ బాధపడుతున్నాను’ అని సమంత తన అశక్తతను వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే… ఇప్పటికే హైదరాబాద్ లో ‘శాకుంతలం’ మూవీ స్పెషల్ ప్రీమియర్ షో ను వేశారు. ప్రసాద్ ఐమాక్స్ లో త్రీడీ వర్షన్ ను ప్రదర్శించారు. అయితే… దీనికి మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఒకటి రెండు చోట్ల వేయాలనుకున్న స్పెషల్ ప్రీమియర్ షోస్ ను ‘దిల్’ రాజు కాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా… సమంతను గుణశేఖర్ శకుంతలగా ఎలా తెర మీద ప్రజంట్ చేశారో చూడాలనే ఆసక్తి అయితే చాలా మందిలో నెలకొని ఉంది. మరి ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.