NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

మంత్రిగా ఏడాది పూర్తిచేసుకున్న రోజా.. మిగతా మంత్రులతో పోల్చుకుంటే నాకే ప్రశంసలు..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ యూత్‌ ఐకాన్‌ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. అమరావతిలో తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది ముగిసిన క్రమంలో ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు.. ఇక, ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి రోజాకు అభినందనలు తెలిపిన అధికారులు. ఈ ఏడాది కాలంలో మిగిలిన మంత్రులతో పోల్చుకుంటే తనకు ప్రశంసలు దక్కాయన్న రోజా.. ఉన్నతాధికారులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.. ఏపీ నుంచి అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ కావాలనే ప్రపోజల్ రాలేదని పీటీ ఉషా ఎలా అన్నారో తెలియదన్నారు మంత్రి రోజా.. పీటీ ఉషా తొలిసారి ఏపీకి వచ్చారు. పీటీ ఉషా ఆ విధంగా వ్యాఖ్యానించడం బాధ కలిగించిందన్న ఆమె.. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ గురించి నాకు చెబితే నేను డిస్కస్ చేసేదాన్ని అన్నారు. మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నా.. క్రీడా, టూరిజం, సాంస్కృతిక శాఖలపై సమీక్ష నిర్వహించాను.. ఈ ఏడాది కాలంలో ఎన్నో ఫంక్షన్లు, ఈవెంట్స్ జరిగాయన్నారు. ఎన్నో ప్రసిద్ధ దేవాలయాల్లో ప్రసాద స్కీంను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆవిష్కరించాం.. క్రీడా, కళా రంగాల్లో ఉన్న వాళ్లని గుర్తించాం. సాంస్కృతిక రంగంలో తొలిసారిగా పోటీలు పెట్టాం అని వెల్లడించారు.

ఆ విషయం బీఆర్ఎస్‌ స్పష్టం చేయాలి.. లేదంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే..!
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకరేపుతోంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పర్యటిస్తున్న సింగరేణి డైరెక్టర్ల బృందం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్టీల్‌ ప్లాంట్‌లో పర్యటిస్తున్నారు.. ఈవోఐ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సాధ్యసాధ్యలపై అధ్యయనం చేస్తున్నారు అధికారులు.. మరో రెండు రోజుల పాటు విశాఖలో సింగరేణి అధికారుల బృందం పర్యటించనుంది.. అయితే, ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం సీరియస్‌గానే స్పందిస్తోంది.. ఎన్టీవీతో మాట్లాడిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. బిడ్‌లో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్టే అంటున్నారు. ఇక, రాజకీయ కారణాలతోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని తెలిపారు మంత్రి అమర్నాథ్.. బీఆర్‌ఎస్‌కు, బీజేపీతో ఉన్న రాజకీయ విబేధాలకు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారని ఆరోపించారు. అసలు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ, బిడ్ లో పాల్గొంటే మాత్రం ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే అంటున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూనే బిడ్ లో పాల్గొంటాం అంటే అర్థం ఏంటి? అని నిలదీశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయితే మాతో పాటు కలిసి వస్తే ఆహ్వానిస్తామన్న ఆయన.. ప్రజల సెంటిమెంటును గౌరవిస్తారా? లేదా? చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతందని స్పష్టం చేశారు.. ప్రజల సెంటిమెంటును గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటాయన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్‌ పాల్గొంటే స్వాగతిస్తాం..!
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బిడ్డింగ్‌ విషయంలో ఇప్పుడు తెలంగాణ సర్కార్ వర్సెస్‌ ఏపీ ప్రభుత్వంగా మారిపోతోంది.. అసలు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్‌, వ్యతిరేకమా? అనుకూలమా? అనే విషయం స్పష్టం చేయాలి.. బిడ్‌లో పాల్గొంటే మాత్రం ప్రైవేటీకరణకు మద్దతు తెలిపినట్టే అని ఏపీ మంత్రి గుడివాడ్‌ అమర్నాథ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు.. కానీ, కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యక్తులుగా తీసుకుంటే మాత్రం మేం వ్యతిరేకిస్తాం అని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వం తీసుకుంటే పబ్లిక్ సెక్టార్‌గా మారుతుందన్న ఆయన.. స్టీల్ ప్లాంట్ కొంటే నష్టం ఉండదు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 30 వేల ఎకరాల భూమి ఉందని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దొంగ చేతికి ఇచ్చిన 3 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని వ్యాఖ్యానించారు సీపీఐ నేత నారాయణ.. అదానీ ఎందుకు వస్తున్నారు..? విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకోవడానికి కారణం దానిని స్క్రాప్ కింద అమ్మేయడానికేనని ఆరోపించారు. స్వాధీనం చేసుకొని డంపింగ్ యార్డ్ కింద అదానీ మార్చుకుంటారని విమర్శించారు. ఎయిర్‌పోర్ట్‌, పోర్టులకు దగ్గరగా 30 వేల ఎకరాలు ఎక్కడా దొరకదన్నారు.. ఇక, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి బానిసగా మారిపోయారని ఆరోపించారు. అదానీకి అనుకూలంగా ఉండకపోతే వైఎస్‌ జగన్‌ను జైల్లో పెడతారని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. అదానీకి అనుకూలంగా లేకపోతే అమిత్ షా ఊరుకోడు.. అందుకే.. ఆస్తి పోయినా పర్వాలేదు.. నన్ను కపాడు అంటారని పేర్కొన్నారు. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకుంటా అని జగన్ అంటే మరుసటి రోజు జైల్లో ఉంటాడు అంటూ సంచలన కామెంట్లు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

వివేకాపై సంచలన ఆరోపణలు.. అందుకే హత్య..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.. తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ జరిగింది.. వైఎస్‌ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు.. అయితే, నిందితుడిగా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా మార్చడంపై వైఎస్‌ భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. దస్తగిరి స్టేట్‌మెంట్‌ ఆధారంగా భాస్కర్ రెడ్డిని ఎలా ఈ కేసులోకి లాగుతారని ఆయన తరుపు లాయర్‌ వాదనలు వినిపించారు.. వైఎస్‌ వివేకా కూతురు, సీబీఐ కలిసిపోయి దస్తగిరిని అప్రూవర్ గా మార్చారని ఆరోపించారు భాస్కర్ రెడ్డి తరపు లాయర్.. ఇక, గూగుల్ టేక్ ఔట్ ఫోటోలు ఎలా ఆధారాలు అవుతాయి? అని ప్రశ్నించారు.. దాంతో వైఎస్‌ భాస్కర్ రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డిలు ఎలా నిందితులు అవుతారని వాదనలు వినిపించారు లాయర్‌.. మరోవైపు.. వైఎస్‌ భాస్కర్ రెడ్డి లాయర్ వాదనలో కీలక అంశాలు తెరపైకి వచ్చాయి.. సునీల్ యాదవ్ తల్లిని వైఎస్‌ వివేకానంద రెడ్డి లైంగికంగా వేధించాడని కోర్టులో ప్రస్తావించారు భాస్కర్ రెడ్డి తరపు లాయర్.. అందుకే సునీల్ యాదవ్ కక్ష గట్టి.. వైఎస్‌ వివేకాను హత్య చేశాడని పేర్కొన్నారు.. దీంతో.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చినట్టు అయ్యింది.

మహిళా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త..
మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వారికి ప్రత్యేక సెలవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామి రెడ్డి తెలిపారు.. ప్రభుత్వం మహిళల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మహిళలకు 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసింది.. అయితే, ఈ సౌకర్యం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మాత్రం లేదు.. కానీ, ఇప్పుడు వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది సర్కార్.. ఈ సౌకర్యాన్ని ఔట్‌సోర్సింగ్‌ మహిళా ఉద్యోగులకు కూడా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.. ఇక, ముఖ్యమంత్రి మా విజ్ఞప్తిని మన్నించి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా సంవత్సరానికి 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేయడానికి అంగీకరించారని తెలిపారు కాకర్ల వెంకటరామిరెడ్డి.. ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 39 తేదీ. 11-04-2023 ద్వారా ఔట్‌సోర్సింగ్‌ మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.. ఔట్‌సోర్సింగ్‌ మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌కు.. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు కాకర్ల వెంకటరామి రెడ్డి.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విచారణ వాయిదా..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసు విచారణ వాయిదా పడింది. మంగళవారం పేపర్ లీక్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించాలని వేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ దన్క వాదనలు వినిపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే ఇద్దరు మాత్రమే నిందితులు అని ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఎలా చెబుతారని పిటిషన్ లో పేర్కొన్నారు. పేపర్ లీకేజీపై అనుమానాలు ఉన్నాయని వాదించారు. సీబీఐ ద్వారా విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకి వస్తాయని వివేక్ దన్క వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది నిందితుల్లో 17 మందిని అరెస్ట్ చేశామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. మరో నిందితుడు ప్రశాంత్ న్యూజిలాండ్ లో ఉన్నాడని త్వరలో విచారణ చేస్తామని చెప్పారు. నిందితులను చట్ట ప్రకారం అరెస్ట్ చేసి జైలుకు పంపించామని ఏజీ చెప్పారు. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24వ తారీఖున విచారణ చేస్తామని తెలిపింది.

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురికి బెయిల్ మంజూరు
తెలంగాణలో సంచలనం రేపిన పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహరంలో వరంగల్ కోర్టు విచారణ చేసి మరో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సాయంత్రం లోపు నింధితులు విడుదలైయ్యే అవకాశం ఉంది. ఖాజీపేట్ రైల్వే కోర్టులో రెండు రోజుల పాటు వాదనలు కొనసాగాయి. నిందితులు బయటకు వస్తే సాక్షాలు ప్రభావితం అవుతారని బెయిల్ ఇవ్వకుడదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాడు. అయితే A1 బెయిల్ లో బయట ఉన్నప్పుడు A2, A3, A5.. ఎలా ప్రభావితం చేస్తారని బీజేపీ లీగల్ సెల్ న్యాయ వాదులు ప్రశ్నించారు. 10 వ తరగతి పరీక్షలు నేటితో ముగిసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు చేసిన వాదనకు మేజిస్ట్రేట్ ఏకీభవించింది. దీంతో న్యాయ మూర్తి కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. 20 వేల పూచీకత్తు.. అనుమతి లేకుండా దేశం విడిచిపోవద్దనే కండిషన్ తో బెయిల్ ను న్యాయమూర్తి మంజూరు చేశారు. సాయంత్రం లోపు కరీంనగర్ జైలు నుంచి నిందితులు ప్రశాంత్, మహేష్, శివ, గణేష్ లు విడుదల కానున్నారు.

బీజేపీకి ఈశ్వరప్ప షాక్.. పోటీ చేయనని నడ్డాకు లేఖ
బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఈశ్వరప్ప. అభ్యర్థుల ఎంపికలో తన పేరును పరిశీలించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి కూడా తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. కర్ణాటక రాజకీయాల్లో ఈశ్వరప్పకు 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. సాధారణ బూత్ స్థాయి కార్యకర్త నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు ఎదిగారు. శివమొగ్గ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కంచుకోటగా మలిచారు. ఇప్పుడు కూడా ఆయనకే టికెట్ దక్కడం ఖాయమౌతుందనే వార్తలు వెలువడుతున్నాయి. బీజేపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వస్తోన్నారాయన. మొన్నటి వరకు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. హఠాత్తుగా ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు అదే బాటలో ఆయన శిష్యుడి, బీజేపీలో నంబర్ 2గా ఉంటోన్న ఈశ్వరప్ప కూడా తప్పుకోవడం కలకలం రేపుతోంది.

2024లో బీజేపీదే అధికారం.. 300కు పైగా లోక్‌సభ స్థానాలు గెలుస్తాం..
2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 300కు పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం దిబ్రూఘర్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్ సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. 2024 ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుపొందడం ద్వారా మూడోసారి నరేంద్రమోదీ ప్రధాని అవుతారని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు కాంగ్రెస్ కు కంచుకోటగా భావించబడేదని, అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న సందర్భంలో కూడా ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, కాంగ్రెస్ పనితీరు అర్థం అవుతోందని అన్నారు. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మిగతా రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది.

‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ పాట పాడి ఏడిపించిన మొగిలయ్య కి తీవ్ర అస్వస్థత
నటుడు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా వేణు యేల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బలగం. దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం భారీ విజయాన్ని అందుకుంది. కుటుంబాల మధ్య ఉన్న బంధాలను అనుబంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించి వేణు ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా బలగం క్లైమాక్స్ లో పాడిన పాట అందరి గుండెలను పిండేసిందంటే అతిశయోక్తి కాదు. ఒక తండ్రి ఆత్మ.. బిడ్డలు కలిసి ఉండాలని ఎంత తాపత్రయపడుతుందో ఆ సాంగ్ లో చూపించారు. ఇక ఈ పాట పాడిన దంపతులు మొగిలియ్య, కొమురమ్మ లకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తరువాత నుంచి మొగిలయ్య పేరు బలగం మొగిలియ్యగా మారిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకున్న మొగిలయ్య తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతున్నాడని, తన భర్తను ప్రభుత్వమే ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపింది. ” నా బర్త్ మొగిలయ్యకు అంతకు ముందు కిడ్నీ సమస్య ఉంది. ఇప్పుడు గుండె సమస్య వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. దయచేసి.. నా భర్తను కాపాడండి. ప్రభుత్వానికి, పెద్దలకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ఆయనను హైదరాబాద్ కు తరలించారు. ఇక్కడ డాక్టర్లు ప్రస్తుతానికి చూసుకుంటున్నారు. నా భర్త కోలుకోవడానికి సహాయం చేయండి” అంటూ కంటనీరు పెడుతూ వీడియోలో మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్న కళాకారులకు ప్రభుత్వం సాయం చేయాలని అభిమానులు కోరుతున్నారు.