ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల మాస్ కాపీయింగ్ కలకలం సృష్టిస్తోంది.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు జగ్గయ్యపేటలో పరీక్షలకు హాజరవుతున్నారు.. ముడు సెంటర్లలో దాదాపు 700 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.. జగ్గయ్యపేట ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఓపెన్ ఇంటర్ పరీక్షల లో జవాబు పత్రాలు అందిస్తామంటూ విద్యార్థికి రూ.15 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక, డబ్బులు తీసుకున్న యాజమాన్యం.. హాల్ టికెట్ పొందిన విద్యార్థులు కాకుండా మరొకరితో పరీక్షలు రాయిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ బహిరంగ సత్యమేనంటున్నారు విద్యార్థులు. ఉన్నతాధికారిల నుండి ఇన్విజిలేటర్ల వరకు చిల్లర పంపిణీ చేసిన నిర్వాహకులు. జవాబు పత్రాలను జిరాక్స్ తీసి అందిస్తున్నట్టు తెలుస్తోంది.. ప్రైవేట్ కళాశాల యాజమాన్యం, నిర్వాహకుల తీరు బయటకు వచ్చినా.. అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు విద్యార్థులు మండిపడుతున్నారు..
వైజాగ్ స్టీల్‌పై తెలంగాణ సంచలన నిర్ణయం.. ఇలా స్పందించిన మంత్రి అమర్నాథ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు అనేదే మా స్టాండ్ అని స్పష్టం చేశారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. మా స్టాండ్ అదయినప్పుడు మేం కొంటామా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు కొoటే మీ స్టాండ్ ఏంటి? అనే ప్రశ్నేలేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిoచటానికి వీలు లేదు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వ్యక్తి చెప్పారన్నప్పుడు.. మళ్లీ వాళ్లే కొంటాం అనడమెందుకు? అని నిలదీశారు. అంటే స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయమనేనా వారి ఉద్దేశమా? అని ప్రశ్నించారు. అయినా. స్టీల్ ప్లాంట్ పై మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ తప్ప ఇంతవరకు కేసీఆర్ నుంచి గానీ.. తెలంగాణ ప్రభుత్వం నుండి గానీ అధికారిక ప్రకటన వినలేదన్నారు. వాళ్ల స్టాండ్ ఏంటో క్లారిటీ రావాలి.. వాళ్ల స్టాండ్ ఏంటో తెలియకుండా నేను ఏమీ మాట్లాడలేను అన్నారు. రాజకీయాల కోసం వాళ్లు ఏవేవో మాట్లాడుతారు… వాళ్ల రాజకీయ విమర్శలకో.. ఇంకోదానికో.. మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఏదేమైనా స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్‌గా స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
విద్యాశాఖపై సీఎం సమీక్ష.. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేయాల్సిందే..!
విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. సంబంధిత శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. స్కూళ్లుకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని స్పష్టం చేశారు.. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది.. దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి.. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని.. అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు. పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నాం.. ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుందని.. ఆ తర్వాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయి.. ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.. ఇలా ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్ చేస్తున్నాం.. అందుకే డ్రాప్‌అవుట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం.. దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. ఇక, వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుకపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు.. విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే, మే 15 నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్న అధికారులు సీఎంకు తెలియజేశారు.. మరోవైపు.. సబ్జెక్టు టీచర్ల పైనా సీఎం సమీక్ష చేపట్టారు.. పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం ఈ విధానాన్ని తీసుకు వచ్చామన్న సీఎం. దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్నారు.. గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సులు ఉండాలన్నారు. వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్ కోర్సు కొనసాగుతుందన్న అధికారులు తెలిపారు.
నన్ను సస్పెండ్ చేయడం హాస్యాస్పదం.. వందలసార్లు పిలిచినా వెళ్లలేదు
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనని సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సభ్యత్వమే లేనప్పుడు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించిన ఆయన.. పార్టీ నుండి తనని సస్పెండ్ చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తనను బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని వందలసార్లు పలిచారని, అయినా తాను వెళ్లలేదని తెలిపారు. గత వంద రోజుల నుంచే బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వ పరిపాలన తీరును తాను ప్రశ్నిస్తూనే ఉన్నానన్నారు. తనను సస్పెండ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు చాలాసార్లు ఇబ్బందులు పెట్టినా, అవమానపర్చినా.. ఆ బాధల్ని దిగమింగుకుని ఉన్నానన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తనకు ఎంపీ సీటు ఇవ్వకపోయినా.. కేటీఆర్ గురించే బీఆర్ఎస్‌లో ఉన్నానని స్పష్టం చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఒక్క అభ్యర్థే గెలిచారన్న పొంగులేటి.. 2018 ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో ఏనాడైనా సమీక్ష చేశారా? తొమ్మిది మంది బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమిపై చర్చించారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
పొంగులేటి తీరు తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లే
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విమర్శలు గుప్పించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశామని ఆయన అన్నారు. అయితే.. పార్టీ మారి మాట్లాడాలే తప్ప పార్టీలో ఉంటూ జాతీయ పార్టీ నాయకుడు కేసీఆర్ పై అనుచితంగా మాట్లాడడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లే అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు చెందట్లేదా అని ఆయన ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి మోసం చేస్తూ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆయన గత ఎన్నికల్లో అనేక మందిని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ లో ఉన్నప్పుడు ఎడవల్లికి టికెట్ ఇస్తానని చెప్పి వనమాకు టికెట్ ఇచ్చారని, రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి మృతి చెందిన తర్వాత వారి సతీమణి నామినేషన్ వేసిన క్రమంలో పొంగులేటి టీఆర్ఎస్ పార్టీలోకి చేరింది వాస్తవం కాదా అని ఆయన అన్నారు. పార్టీ మారకుండా పార్టీలో ఉంటూ కేసీఆర్ ని విమర్శించడం సరైనది కాదని, మిగతా వారి పైన కూడా సస్పెండ్ వేటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
కోవిడ్ పరిహారాన్ని అందజేయండి.. ఏపీ సర్కార్‌కు సుప్రీం ఆదేశాలు
కోవిడ్ బాధితులకు పరిహారాన్ని అందజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. కోవిడ్ నష్టపరిహారాన్ని బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అందజేయకపోవడం అంశంపై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.. అయితే, వీలైనంత త్వరగా మొత్తం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.. ఇదే సమయంలో.. నష్టపరిహారం అందజేయని విషయాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అధారిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది.. కాగా, కోవిడ్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు.. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం.. కోవిడ్ బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది.. కాగా, కోవిడ్ బాధితుల కుటుంబాలకు పరిహారంపై పిటిషన్ దాఖలు చేసిన పల్లా శ్రీనివాసరావు తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది గౌరవ కుమార్ బన్సల్.
అబ్బబ్బ.. ఎంత ముద్దుగా ఉన్నాడు సార్.. దిష్టి తగేలేనేమో
నందమూరి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తాత పేరును నిలబెడుతూ నందమూరి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. కొద్దిగా సమయం చిక్కినా ఇద్దరు కొడుకులతో వెకేషన్ ఎంజాయ్ చేస్తాడు. ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు.. అభయ్ రామ్, భార్గవ్ రామ్. ఇక పిల్లలకు సోషల్ మీడియాను అలవాటు చేయకుండా పెంచుతున్నారు ఎన్టీఆర్- ప్రణతి. చాలా రేర్ ఆ వీరి ఫోటోలు బయట కనిపిస్తూ ఉన్తయి. అది కూడా ఎన్టీఆర్ పోస్ట్ చేస్తే తప్ప.. ఎక్కడా దొరకవు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఇప్పుడిప్పుడే స్కూల్ కు వెళ్తున్నారు. తన పిల్లల గురించి చెప్పాలంటే.. అభయ్ చాలా సైలెంట్.. ప్రశ్నల బుక్. కొన్నిసార్లు వాడు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక పారిపోతూ ఉంటాను. వాడంటే అందుకే నాకు భయం అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక చిన్నవాడు భార్గవ్.. అల్లరి పిడుగు అని చెప్పుకొచ్చాడు. భార్గవ్.. చూస్తూ ఉండగానే పెద్దవాడు ఐపోయాడు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్.. లండన్ వెకేషన్ కు వెళ్ళినప్పుడు భార్గవ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ చిన్నారులు ఎలా ఉన్నారు అనేది ఎవరికి తెలియదు.
షారుఖ్ సినిమాలో బన్నీ.. సైలెంట్ గా షూటింగ్ కూడా కానిచ్చేసాడంట..?
టాలీవుడ్ రోజురోజుకు తన ఖ్యాతిని పెంచుకుంటూ వెళ్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు.. తెలుగు సినిమాల్లో కనిపిస్తే గొప్పగా ఫీల్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు తెలుగు హీరోలు బాలీవుడ్ సినిమాలో గెస్ట్ పాత్రలో చేయమని వారే అడుగుతున్నారు. టాలీవుడ్ రేంజ్ ఇలా మారుతుందని బాలీవుడ్ వాళ్లు అస్సలు ఉహించి ఉండరు. ఇప్పటికే మన స్టార్ హీరోల బాలీవుడ్ డెబ్యూలు సిద్దమయి పోయాయి. ప్రభాస్.. ఆదిపురుష్, ఎన్టీఆర్.. వార్ 2.. త్వరలోనే అల్లు అర్జున్ సైతం బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నాడు. దీనికి ముందే బన్నీ ఒక బాలీవుడ్ సినిమాలో క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షారుఖ్ తో పాటు అల్లు అర్జున్ కూడా కనిపించనున్నాడని వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. అయితే ఆ వార్తలో నిజం లేదని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు కొద్దిగా నిరాశ చెందారు కూడా.