గండికోటలో కూడా సీప్లేన్ ఆపరేషన్స్.. సీఎం చంద్రబాబు ప్రకటన
గండికోట ప్రపంచంలో టాప్ 10 ప్రదేశాలలో ఒకటని.. 13వ శతాబ్దం లో నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గండికోటలో కోట సముదాయంలో రాజవంశాల వారసత్వాలు ఉన్నాయన్నారు. గండికోట లోఅడ్వంచెర్ గేమ్స్‌కి అవకాశాలు ఉన్నాయని.. గండికోట లో కూడా సీప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి.. ఇవాళే అక్కడ దిగాలనుకున్నామన్నారు. కేంద్రం సహకారంతో సీప్లేన్‌లు ఎక్కువ ప్రాంతాల్లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గండికోటలో కూడా సీప్లేన్ ఆపరేషన్స్ చేస్తామని సీఎం ప్రకటించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, కోనసీమ, అరకు వ్యాలీ, లంబసింగి…ఇవన్నీ కలుపుతూ చేయగలిగితే ప్రపంచంలో టూరిజం డెస్టినేషన్ అవుతుందన్నారు. టూరిజంకి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చామని.. అన్ని సెక్టార్ల కంటే టూరిజంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ అని తెలిపారు. టూరిజం లో 4 నుంచి 6 శాతం ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో ఐదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయి విధ్వంసం జరిగిందని… అభివృద్ధి గురించి ఆలోచించాలంటే భయవుడే పరిస్థితి ఉందన్నారు. నేను నాలుగోసారి సీఎం, మూడుసార్లు సీఎంగా ఉన్నపుడు ఇంత ఇబ్బంది లేదన్నారు. బ్రాండ్ ఏపీని నాశనం చేశారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలంలో పరమశివుడిని దర్శనం చేసుకోవడం అదృష్టమని సీఎం పేర్కొన్నారు. శ్రీశైలం రావడం కష్టంగా ఉందని.. రవాణా ఇబ్బందిగా ఉందన్నారు. శ్రీశైలం చుట్టూ వన్యప్రాణుల అభయారణ్యం, జలాశయం ఉన్నాయని.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసినపుడు ఆహ్లాదంగా ఉంటుందన్నారు. రోప్ వే ఉంది, తానే ప్రారంభించానని తెలిపారు. సీప్లేన్ లోనుంచి దిగితే అద్భుతమైన అనుభూతి పొందానని ముఖ్యమంత్రి చెప్పారు. ఇన్నేళ్ళుగా విమానాల్లో తిరిగినా సీప్లేన్ లో ప్రయాణం కొత్త అనుభూతి అనిపించింది.. సీప్లేన్ రన్ వే వాటర్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నారు. విజయవాడ, శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రాలు అని… తిరుమలలో కూడా పచ్చదనం బాగుంటుందన్నారు. శ్రీశైలం లో ఏడాది ఉంటే ఎక్కువ కాలం బతుకుతారని ఆయన తెలిపారు. శ్రీశైలం చుట్టూ అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయన్నారు. శ్రీశైలం స్పిరిచువల్, రిలీజియస్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఉందన్నారు. 2014-19 మధ్య శ్రీశైలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. జంగిల్ సఫారీ కూడా ఇక్కడ బాగుందన్నారు. మంత్రులు పవన్ కళ్యాణ్, ఆనం, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్‌తో కమిటీ వేసి అభివృద్ధికి ప్రణాళికలు వేసి అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కమిటీ త్వరలోనే రిపోర్ట్ ఇస్తారని.. సున్నిపెంటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక్కడ నివసించే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష..
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ రైతు గర్జన కార్యక్రమం నిర్వహించింది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు సునీతా రెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నాం.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో చెప్పని ఎన్నో పథకాలు రైతుల కోసం కేసీఆర్ పెట్టారు.. రైతుల సీఎం కేసీఆర్ అని ఇతర రాష్ట్రాల్లోనూ అన్నారని హరీష్ రావు తెలిపారు. భూతుల సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచారు.. ఆరు గ్యారెంటీలు అమలు చేసిన అని మహారాష్ట్రలో రేవంత్ చెపుతున్నారు.. అందరిని మోసం చేసి మహారాష్ట్రలో అబద్దాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మోసం చేశారు.. రుణమాఫీ చేయలేదని అడిగితె దేవుళ్ళ మీద ఒట్లు పెట్టారు.. దేశంలో దేవుడిని మోసం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి వచ్చాక గ్యారెంటీలకు, బాండ్ పేపర్లకు విలువ లేకుండా పోయింది.. ఆరు గ్యారెంటీలని కాంగ్రెస్ ఓట్లను డబ్బాలో వేసుకుందని దుయ్యబట్టారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేసింది.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేశారు.. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితేనే కొంచమైనా రుణమాఫీ అయింది.. పంద్రాగస్టు రుణమాఫీ చేస్తానని తనతో ఛాలెంజ్ విసిరాడని.. వాయిదాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తీవ్ర విమర్శలు చేశారు. మూసీ మురికికి కారకులు కాంగ్రెస్, టీడీపీ నేతలు అని హరీష్ ఆరోపించారు. ఆంధ్ర బాబుల బ్యాగులు మోసి.. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టారని రేవంత్ పై మండిపడ్డారు. నీ సవాల్‌కు రెడీ.. ఎక్కడ ఇళ్లు కూలగూడితే అక్కడ నుంచి చేద్దాం.. రేవంత్ రెడ్డి డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ ది తిట్లు అయితే.. బీఆర్ఎస్‌ది కిట్ల సర్కార్ అని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా రైతుబంధు ఇవ్వలేదు.. మూసీ మురికి కంటే రేవంత్ నోటి కంపు ఎక్కువగా ఉందని విమర్శించారు. మాటలు కాదు.. ప్రజలకు చేతలు చూపించు అని అన్నారు. రేవంత్ అందితే జుట్టు.. లేదంటే అబద్దాలు మాట్లాడుతున్నాడు.. సీఎం సోయితో మాట్లాడాలని పేర్కొన్నారు. సీఎం ఖుర్చీకి విలువ లేకుండా చేస్తున్నాడని దుయ్యబట్టారు. రైతుల ధాన్యం ఎప్పుడూ కొంటారో చెప్పాలి.. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు. కల్లాల వద్దకు సీఎం, మంత్రులు రావాలి.. రైతుల గోస తెలుస్తుందని పేర్కొన్నారు. రేవంత్ మహారాష్ట్రకు డబ్బు మూటలు పంపే పనిలో ఉన్నారు.. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీ అర్థమైంది.. మహారాష్ట్రలోనూ ఓటమి తప్పదని హరీష్ రావు తెలిపారు.
ఈ నెల 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు..
ఈ నెల 14 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. గత పది నెలల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సర్కార్ ముందుకు దూసుకెళ్తుంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నందున.. ఈ నెల 14 వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలు ఫోకస్ చేస్తూ.. ప్రభుత్వ విజన్ ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని.. దాదాపు రూ. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేయడంతో పాటు, మహిళా సంఘాలకు రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందచేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. అంతేకాకుండా.. పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదర్చడం, స్పోర్ట్ యూనివర్సిటీకి ఫౌండేషన్, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల కళాశాలల ప్రారంభోత్సవం, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగనున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ వేడుకలను నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం.
సీఎం చేయాల్సింది మూసీ యాత్ర కాదు.. కల్లాల్లో పర్యటించాలి
యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పోచంపల్లి మండలం గౌస్ కొండ, రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కిషన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుంది.. హమాలీల కొరత ఉంది.. ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదు.. బస్తాలు, తర్పలిన్, సూతిల్ కూడా లేవని కిషన్ రెడ్డికి రైతులు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది.. ధాన్యం కొనుగోలు చేసినందుకు.. రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఇస్తున్నాం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైతులకు చెప్పారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. కలెక్టర్ తన పర్యటనకు రాకపోవంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన టూర్‌కు ఎందుకు రాలేదని కలెక్టర్‌ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు ఎందుకు ఆలస్యం అవుతుందని, త్వరగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం.. రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కిషన్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అధికార కాంగ్రెస్ గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. రైతు డిక్లరేషన్ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. 500 వందల బోనస్.. ఓ బోగస్.. బోనస్ విషయంలో రైతులకు భరోసా లేదన్నారు. 11 నెలలు గడుస్తున్నా రైతు రుణ మాఫీ కాలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వమే గందరగోళంలో ఉంది.. మూసీ యాత్ర కాదు సీఎం చేయాల్సింది.. కల్లాల్లో పర్యటించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కేసీఆర్.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో హామీలు అమలు చేశామని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుంది.. తెలంగాణలో ఏం సాధించారని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చేస్తున్నారని సీఎంపై విమర్శలు గుప్పించారు. నిన్నటి సభలో ముఖ్యమంత్రి భాషా సరిగ్గా లేదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది.. 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తుంది.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కూడా రైతులకు న్యాయం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు, చిత్త శుద్ధి ఉంటే.. తెలంగాణలో రైతు కల్లాలోకి రావాలన్నారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు.
నకిలీ లేడీ ఇన్‌స్పెక్టర్ గుట్టురట్టు.. యూనిఫాం ధరించి 8 ఏళ్లుగా సందడి
యూపీలోని డియోరియాలో నకిలీ మహిళా ఇన్‌స్పెక్టర్ రహస్యం బట్టబయలైంది. ఈ నకిలీ మహిళా ఇన్‌స్పెక్టర్ గత ఎనిమిదేళ్లుగా ఖాకీ యూనిఫాం ధరించి విధ్వంసం సృష్టించింది. డియోరియాలోని ఖంపర్ పోలీసులు.. భింగారి మార్కెట్ నుంచి నకిలీ మహిళా ఇన్‌స్పెక్టర్‌ని ఒక వ్యక్తి బైక్‌పై కూర్చొని ఎక్కడికో వెళుతుండగా పట్టుకున్నారు. పోలీసులకు పట్టుబడిన ఆమె పోలీసు యూనిఫాంలో ఉంది. బైక్‌పై యూనిఫాంలో ఉన్న మహిళను మార్కెట్‌లో ఉంచిన ఓ పోలీసు చూడగానే అనుమానం వచ్చింది. బైక్‌ను ఆపి విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు నకిలీ మహిళా ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మహిళను ఖంపర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషానియా పైకౌలి గ్రామానికి చెందిన ప్రభునాథ్ దూబే భార్య రజనీ దూబేగా గుర్తించారు. ఛత్ రోజున గురువారం గ్రామానికి వచ్చి భర్తను భింగారి మార్కెట్‌కు పిలిపించింది. ఇక్కడ భర్తతో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా పోలీసులకు చిక్కింది. ఆమె గత ఎనిమిదేళ్లుగా యూనిఫాం ధరించి నకిలీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది. నకిలీ ఇన్‌స్పెక్టర్‌గా తిరుగుతున్న మహిళను పోలీసులు ఆపి విచారించారు. నకిలీ పోలీసు అని తేలడంతో కేసు నమోదు చేసి యూనిఫాం స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఖంపర్ మహేంద్ర చతుర్వేది తెలిపారు. తాను లక్నోలోని ఇళ్లలో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నానని, లక్నోలోనే ఈ యూనిఫాం కుట్టించానని నకిలీ ఇన్‌స్పెక్టర్ చెప్పింది. అద్దె చెల్లించకుండా ఉండేందుకు ఈ యూనిఫామ్‌ను ఉపయోగించానని ఆమె తెలిపింది. నకిలీ లేడీ ఇన్‌స్పెక్టర్‌ను విచారించిన తర్వాత.. ప్రభుత్వ యూనిఫాం దుర్వినియోగం చేసినందుకు కేసు నమోదు చేసి.. బాండ్ చెల్లింపు అనంతరం మహిళను విడుదల చేశారు.
కెనడా వెళ్లాలనుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్‌కి షాక్.. SDS వీసా నిలిపివేత..
కెనడా వెళ్లి చదువుకోవాలనుకోవడం భారతీయ విద్యార్థుల్లో చాలా మందికి ఉంటుంది. ఇన్నాళ్లు ఆ దేశ ప్రభుత్వం కూడా భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులను ఆహ్వానిస్తూ వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం కెనడా వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు షాక్ ఇచ్చింది. కెనడా స్టూడెంట్ వీసా స్కీమ్‌ని నిలిపేసింది. కెనడా ప్రస్తుతం హౌసింగ్ సంక్షోభంతో పాటు వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇబ్బడిముబ్బడిగా ఆ దేశంలోకి వలసలు పెరిగిపోతున్నాయని అక్కడి కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్‌ని నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఉద్దేశించబడిన ‘‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(SDS) వీసా’’ కార్యక్రమాన్ని శుక్రవారం నిలిపివేసింది. బ్రెజిల్, చైనా, కొలంబియా, కోస్టారికా, ఇండియా, మొరాకో, పాకిస్థాన్, పెరూ, ఫిలిప్పీన్స్ మరియు వియత్నాంతో సహా 14 దేశాల నుండి స్టూడెంట్స్ కోసం స్టడీ పర్మిట్ అప్లికేషన్లను వేగవంత చేయడానికి ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ మరియు సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) 2018లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసింది. ‘‘ ఈ ప్రోగ్రామ్ సమగ్రతను బలోపేతం చేయడానికి, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ సమానమైన, న్యాయపరమైన యాక్సెస్ అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని కెనడా ప్రభుత్వం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ స్కీమ్ ద్వారా నవంబర్ 8న మధ్యాహ్నం 2 గంటల వరకు స్వీకరించిన దరఖాస్తుల్ని మాత్రమే ప్రాసెస్ చేస్తామని చెప్పింది. దీని తర్వాత వచ్చే అన్ని దరఖాస్తులు రెగ్యులర్ స్టడీ పర్మిట్ స్ట్రీమ్ కింద ప్రాసెస్ చేయబడతాయి. . ఈ కార్యక్రమం నిలిపివేయడంతో, భారతదేశం మరియు 13 ఇతర దేశాల విద్యార్థులు మరింత సుదీర్ఘమైన వీసా ప్రక్రియలకు లోనవుతారు. కెనడా మొదటిసారిగా దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది.
ట్రంప్ ఎఫెక్ట్ స్టార్ట్.. ఖతార్ నుంచి హమాస్ బహిష్కరణ..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు హమాస్ ఉగ్రవాదం సంస్థలకు మద్దతుగా వ్యవహరిస్తూ, హమాస్ నాయకులకు ఆశ్రయం ఇస్తున్న ఖతార్ తన వైఖరిని మార్చుకుంది. దోహాలో నివసిస్తున్న హమాస్ లీడర్లను బహిష్కరించేందుకు ఖతార్ అంగీకరించింది. అమెరికా నుంచి నుంచి వచ్చిన ఒత్తిడి తర్వాత ఖతార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్-హమాస్ వివాదంలో కాల్పుల విరమణ, బందీల విడుదల గురించి హమాస్‌తో అనేక నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పటికీ బందీల విడుదల గురించి హమాస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ట్రంప్ గెలిచిన తర్వాత ఖతార్‌కి స్పష్టమైన ఆదేశాలు అందడంతో ఖతార్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ సంస్థ లీడర్లను బహిష్కరించేందుకు సిద్ధమైంది. హమాస్ బందీల విడుదల విడుదల చేయడానికి, కాల్పులు విరమణ ప్రతిపాదనని ఇష్టపడకపోవడంపై ఖతార్ కూడా ఒకింత ఆగ్రహంగా ఉంది. ఈ పరిణామాలు అమెరికా ఇంట్రెస్ట్‌కి విరుద్ధంగా ఉన్నాయి. వారం క్రితమే హమాస్‌కి ఖతాన్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అమెరికన్-ఇజ్రాయిలీ బందీ అయిన హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్ మరణం తర్వాత హమాస్‌పై అమెరికా కోపంగా ఉంది. దీంతో హమాస్ నాయకుల్ని ఖతార్ బహిష్కరించాలనే విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది.
ఇది పుష్ప గాడి రేంజ్.. రికార్డు బుకింగ్స్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప-2’. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. ప్రస్తుతం కిస్సిక్ అని వచ్చే ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది. డిసెంబరు 4 ఓవర్సీస్ లో రిలీజ్ కానున్న పుష్ప ఇప్పటి నుండే అక్కడ తన వేట మొదలు పెట్టింది. ఈ సినిమా కు సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఇప్పటి వరకు అత్యంత వేగంగా 500 K అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన ఆల్ టైమ్ ఇండియన్ సినిమాగా పుష్ప సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక టికెట్స్ బుకింగ్స్ లోను అదరగొట్టాడు పుష్ప రాజ్. ఇప్పటివరకు USA లో కేవలం ప్రీమియర్స్ రూపంలోనే 20,000 పైగా అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ బుక్ రికార్డు సృస్టించిందింది పుష్ప – 2. ఇది ఓవర్సీస్ లోని తెలుగు సినిమాలలో ఒక రికార్డు. ఇప్పుడే ఇలా ఉంటె రిలీజ్ నాటికీ అటు ఇటుగా 4 మిలియన్ కు పైగా అడ్వాన్స్ రూపంలో ఈ సినిమా రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అలాగే ఓవర్సీస్ లోను భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్.
కంగనా రనౌత్ ఇంట్లో తీవ్ర విషాదం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటి నుంచి ఓ విషాధ వార్త బయటకు వచ్చింది. ఆమె అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కంగనా తెలియజేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అమ్మమ్మతో కలిసి ఉన్న కొన్ని చిత్రాలను పంచుకున్నారు. నవంబర్ 8వ తేదీ శుక్రవారం రాత్రి కంగనా రనౌత్ అమ్మమ్మ మరణించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె శనివారం తన అభిమానులకు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం తన అమ్మమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని రాసుకొచ్చారు. కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మొదటి కథనంలో ఆమె తన అమ్మమ్మతో కలిసి బిగ్గరగా నవ్వుతూ కనిపించారు. “నిన్న రాత్రి మా అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ జీ మరణించారు. కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దయచేసి వారి కోసం ప్రార్థించండి. ” అని ఆమె రాసుకొచ్చారు. కంగనా రనౌత్ తన అమ్మమ్మతో మరొక చిత్రాన్ని పంచుకున్నారు. “అమ్మమ్మ అద్భుతమైన మహిళ. ఆమెకు 5 మంది పిల్లలు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. ఆమె తన పిల్లలందరికీ మంచి విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అందేలా చూశారు. పెళ్లయిన తర్వాత తన కుమార్తెలు పని చేయాలని వారి స్వంత వృత్తిని కలిగి ఉండాలని ఆమె సూచించారు. కుమార్తెలకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఇది ఆ రోజుల్లో అరుదైన విజయం. ఆడవారితో సహా ఆమె 5 మంది పిల్లలకు ఇప్పుడు మంచిగా స్థిరపడ్డారు. ఆమె తన పిల్లల కెరీర్‌ల గురించి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. ” అని నటి పేర్కొన్నారు. తన అమ్మమ్మ వయస్సు 100 ఏళ్లు దాటిందని బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయినట్లు తెలిపారు.