NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా కేబినెట్ నిర్ణయించింది. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఏపీ, డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లు మారనుంది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. 25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ రంగంలో ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టే విద్యాసంస్థల‌కు 20 ల‌క్షల ప్రోత్సాహం అందించనున్నారు. ఏపీ అన్ని రంగాల్లోనూ గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. డ్రోన్ పాలసీ ద్వారా ఓర్వకల్లును డ్రోన్ల తయారీ హబ్‌గా మార్చాలని నిర్ణయించామన్నారు. రూ.1000 కోట్ల పెట్టుబడి, రూ. 3000 కోట్ల రాబడి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. 25 వేల‌‌ మందికి ప్రత్యక్షంగానూ, మరో 25 వేల‌‌‌‌ మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు. ఇండియా ఒక పెద్ద మార్కెట్ అని.. డేటా సెంటర్లు కావాలన్నారు. బొంబాయి, మద్రాసు, హైదరాబాద్‌లలో డేటా సెంటర్లు పెడుతున్నారన్నారు. హైదరాబాద్‌ కంటే తక్కువగా భూముల విలువలు ఉన్నా మన రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేదని చెప్పారు. ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.O కి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువ అవుతాయన్నారు. 2014-19 మధ్యలో ఎలక్ట్రానిక్ మేనుఫ్యాక్చరింగ్ క్లష్టర్లు చంద్రబాబు ఏర్పాటు చేశారని వెల్లడించారు. సెమీ కండక్టర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రారంభించే వారికి 50% సబ్సిడీ లేదా ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు. చిప్, సెమీకండక్టర్ తయారీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. గత ఐదేళ్ళలో భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ను రిపీల్ చేసి కొత్త చట్టం తీసుకు రావడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏపీలో ఎలాంటి భూములు అయినా కొత్త చట్టం కిందకు వస్తాయన్నారు. కొత్త చట్టం కింద 10 నుంచీ 14 సంవత్సరాల‌ జైలు, ఆస్తి విలువ, ఆస్తి కూడా పెనాల్టీగా పొందుపరచామన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలుకు ప్రత్యేక కోర్టులు తెస్తామన్నారు. ఈ అంశాలపై కలెక్టర్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు.4.57 లక్షల పనులకు సంబంధించి రూ. 331 కోట్ల విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. NREGS చట్టం ప్రకారం 12% వడ్డీ ఇవ్వాలి…ఈ అంశంపై చర్చించామన్నారు. 01.11.2024 నుంచీ చట్టంలోని సెక్షన్ 3(1)(a) కింద జ్యూడీషియల్ అధికారుల‌ పదవీ విరమణ‌ వయసు పెంచుతూ ఆమోదం తెలిపిందన్నారు. ఎక్సైజ్ పాలసీ ప్రకారం 3 ఆర్డినెన్స్‌లు తెచ్చామని.. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్ట సవరణ చేస్తామన్నారు. క్వాలిటీ లిక్కర్ తెచ్చేలా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు.కుప్పం ప్రధాన కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కేబినెట్ ఆమోదించిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 189 కిలోమీటర్ల పొడవైన ORR ను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఏపీ సీఆర్‌డీఏ 8352.69 చ.కి.మీ లుగా పునరుద్ధరించేందుకు బాపట్ల, మంగళగిరిలలో కలిపిన మండలాలను తిరిగి సీఆర్డీఏలోకి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. విద్యార్ధుల ఫీజు రీఇంబర్సుమెంట్ గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని.. విద్యార్థుల ఫీజు నేరుగా కాలేజీ ఖాతాలకు పంపే విధానాన్ని పునరుద్ధరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. పిఠాపురం ప్రాంతానికి మెరుగైన వైద్య సేవలు లభించేలా 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ డ్యూటీ యాక్ట్‌ను సవరించడానికి నిర్ణయించామన్నారు. 311 మంది పారిశ్రామికవేత్తలకు APIIC కేటాయించిన భూములను ఆమోదించిందన్నారు. ఇకపై APIIC నుంచీ భూముల కేటాయింపు 50 ఎకరాల వరకూ ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

 

సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ
సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చను లేవనెత్తారు. కొంత మంది వైసీపీ నేతలు మళ్లీమళ్లీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని పవన్‌ కల్యాణ్ కేబినెట్‌ సమావేశంలో పేర్కొన్నారు. కొంత మంది పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారన్నారు. ఇలా అయితే ఎలా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేసినా రియాక్టు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఇంట్లో మహిళల పైనా పోస్టులు పెడితే ఊరుకోవాలా?…అందువల్లే తాను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

 

కుల గణన వల్ల జరిగే ప్రయోజనాలు ఇవే.. భట్టి విక్రమార్క స్పష్టం
కుల గణనపై ఎన్నికలకు ముందే.. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చెప్తున్నారని.. కుల గణనతో వనరులు, ఆస్తులు సమానంగా అందాలీ అనేది తమ విధానమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఐనా కొద్ది మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి మాత్రమే ఫలాలు అందాలని అనుకునే వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సమగ్ర సమాచారం వస్తే.. సంపద ఇంకా ఎంత మందికి అందలేదు అనేది తెలుస్తుందని చెప్పారు. రాజకీయ అవకాశాలు అందాయా..? ఎలాంటి అవకాశాలు వచ్చాయి అనేది సర్వేలో తేలుతుందని స్పష్టం చేశారు. త్వరగా సర్వే నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా కుల గణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. కుల గణన.. దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైందని తెలిపారు. ఈ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై సీఎం.. ఆకాశం -భూమి ఏకమై, అవకాశాల్లో సమానత్వం, అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం చేస్తోన్న యజ్ఞం ఇదని తెలిపారు. అలాగే నేడు తెలంగాణ గడ్డ పై మొదలై.. రేపు రాహుల్ సారథ్యంలో దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం ఇది అని వ్యాఖ్యానించారు.

 

పేద విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం-విద్యాలక్ష్మీ పథకానికి ఆమోదం
పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం మోడీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మీ పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులు ఉన్నత విద్య కోసం సులభంగా రుణాలు పొందేందుకు విద్యాలక్ష్మీ పథకానికి కేబినేట్ ఆమోదముద్ర వేసింది. డబ్బు లేని కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే పీఎం- విద్యాలక్ష్మీ పథకం ఉద్దేశం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు పీఎం-విద్యాలక్ష్మీ ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. ఇక సులభంగా రుణాలు పొందుకోవచ్చు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రముఖ విద్యా నాణ్యత కలిగిన 860 ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించనుంది. రూ. ఏడున్నర లక్షల వరకు రుణ సౌకర్యం అందించనుంది. ఈ పథకం ద్వారా 75 శాతం క్రెడిట్ గ్యారెంటీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. పీఎం-విద్యాలక్ష్మీ ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ. 10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్‌ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ ఆపరేషన్ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2004-14తో పోల్చితే 2014-24 మధ్య నాలుగు రెట్లు అధికంగా రైతులకు ఆహార సబ్సిడీ అందిందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

 

మరోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే సంవత్సరం బంగారుమయం అవుతుందని, ఈ విజయం అపురూపం అని ఆయన అన్నారు. ముఖ్యంగా మాకు స్వింగ్ రాష్ట్రాల పూర్తి మద్దతు లభించిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ 277 స్థానాలలో విజయం సాధించగా, 226 స్థానాలలో కమలా హారిస్ విజయం సాధించారు. దీనితో విజయానికి 270 స్థానాలు అవసరం అవ్వగా.. దానిని దాటేసిన ట్రంప్ విజయాన్ని నమోదు చేసారు. ముందు నుంచే కూడా ఎన్నికల్లో గెలుపు మీద ట్రంప్‌ ధీమా వ్యక్తం చేసిన ఆయన, అనుకున్నట్లుగానే గెలిచారు. మొత్తానికి మరో మారు విజయం అందుకున్న ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విజయం తో ట్రంప్‌ 2.o.. పాలనపై అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం డోనాల్డ్ ట్రంప్‌ పలుమార్లు ప్రయత్నాలు చేశారు. ఇదివరకు 1988, 2004, 2012 అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం చేసారు. కానీ అది జరగలేదు. అయితే, న్యూయార్క్‌ గవర్నర్‌ పదవిపై 2006, 2014లో దృష్టి సాధించారు. కాకపోతే, ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు. ఆ తర్వాత పలు ప్రయత్నాల తర్వాత 2015 జూన్‌ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆ సమయంలో ఆయన మళ్లీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాననే నినాదంతో ట్రంప్ ప్రచారం ప్రారంభించారు.

 

నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‭కు శుభాకాంక్షలు
ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా ఎన్నికలు 2024 ఫలితాలు రానే వచ్చేసాయి. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి గెలుపొందారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్ని వర్గ రంగాలకు సంబంధించి ప్రముఖులు, వివిధ దేశాది నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారతదేశ ప్రధాని మోడీ కూడా మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికనైనా ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా మోడీ ట్రంప్ కు అభినందనలు తెలిపారు.
హృదయపూర్వక అభినందనలు మిత్రమా.. అంటూ మోడీ ట్రంప్ ను ఉదేశిస్తూ పోస్ట్ చేసారు. మీరు మీ మునుపటి పదవీకాల విజయాల ఆధారంగా, మీ చారిత్రాత్మక ఎన్నికల విజయం సందర్బంగా.. భారతదేశం, అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురుచూస్తున్నట్లు ఆయన అన్నారు. మన ప్రజల అభివృద్ధి కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, ఇంకా శ్రేయస్సును ప్రోత్సహించడానికి పని చేద్దామని ఆయన రాసుకొచ్చారు. ఇకపోతే, ట్రంప్ గత పాలనలో భారత్, అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నా.. మరి ట్రంప్ 2.0 పాలనలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదురుకావచ్చని విశ్లేషణలు జరుగుతున్నాయి. అమెరికా దేశానికీ ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, సైనిక సహకారం, దౌత్యం లాంటి అంశాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారబోతున్నాయి.

 

ట్రంప్ విజయంపై పాకిస్తాన్ మౌనం! కారణమిదేనా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్‌ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్‌ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విక్టరీపై ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తానని ట్రంప్ ప్రకటించారు.ఇదిలా ఉంటే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా దేశాధినేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. నాటో దేశాధినేతలతో సహా పలు దేశాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ట్రంప్ గెలుపుపై మౌనం వహించింది. పాకిస్తాన్ ప్రభుత్వాధినేతల నుంచి స్పందన కరవైంది. అమెరికా ఎన్నికల గురించి ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భారత ప్రధాని మోడీ మాత్రం.. ట్రంప్‌కు శుభకాంక్షలు తెలిపారు. మిత్రుడుకు హృదయపూర్వక అభినందనలు అంటూ మోడీ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న (2016-20) సమయంలో పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరించారు. సైనిక సహాయాన్ని నిలిపివేశారు. అంతేకాకుండా ఇస్లామాబాద్ గడ్డపై పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేశారు. 2018లో పాకిస్తాన్‌కు 300 మిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని తగ్గించినట్లు ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో పనిచేస్తున్న సమూహాలకు ఆశ్రయం ఇచ్చిందని ట్రంప్ ధ్వజమెత్తారు. “అమెరికా గత 15 ఏళ్లలో పాకిస్తాన్‌కు మూర్ఖంగా 33 బిలియన్ డాలర్ల సహాయం చేసింది. వారు మాకు అబద్ధాలు, మోసం తప్ప మరేమీ ఇవ్వలేదు. మన నాయకులను వారు మూర్ఖులుగా భావిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మేము వేటాడే ఉగ్రవాదులకు వారు సురక్షితమైన స్వర్గధామం ఇస్తారు. సహాయం ఇక లేదు!’’ అంటూ 2019లో ఎక్స్‌ పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ మొదటి టర్మ్‌లో పాకిస్తాన్‌తో దెబ్బతిన్న సంబంధాలు మెరుగుపడకపోవచ్చని డాన్ కథనం పేర్కొంది. భారత్‌తో అమెరికాకు ఉన్న సంబంధాలు కారణంగా పాకిస్తాన్‌ను ట్రంప్ పక్కన పెట్టే అవకాశం ఉందని కథనంలో వెల్లడించింది. పాకిస్తాన్.. మొదటి నుంచి చైనాతో సంబంధాలు కలిగి ఉంది. ఇక అమెరికాకు చైనా ఏ మాత్రం పడదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ను ట్రంప్ పక్కనపెట్టొచ్చనే వార్తలు వినిపిస్తు్న్నాయి. గతంలో ట్రంప్ వ్యవహరించిన తీరుతోనే అమెరికా ఫలితాలపై పాకిస్తాన్ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ వ్యూహాత్మకంగా వెళ్లొచ్చని డాన్ కథనం తెలిపింది.

Show comments