తెలంగాణలో రేపే పోలింగ్.. పూర్తైన ఎన్నికల సామాగ్రి పంపిణీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో.. అధికారులు పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటున్నారు. సిబ్బందికి ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అధికారులు అందించారు. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35, 655 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఎన్నికల పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్వాడ్లను ఎన్నికల కమిషన్ నియమించుకుంది.
కేటీఆర్‌పై ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ నేత, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఫిర్యాదు చేశారు. వెంటనే కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన సీఈఓను కోరారు. కాగా ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు మాత్రం ఉండటంతో పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి కార్యాకలాపాలు నిర్వహించకుండ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేశారు ఎన్నికల అధికారుల. అయితే, నేడు.. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కేసీఆర్ 2009 నవంబర్ 29న అమరణ నిరహార దీక్ష చేపట్టిన రోజు. ఈ సందర్భంగా దీక్ష దీవాస్ పేరుతో పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రక్తదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించి నిబంధనలు ఉల్లఘించారని ఆరోపిస్తూ జీ నిరంజన్ ఎన్నికల అధికారికి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపారు. వెంటనే కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని సీఈఓను ఆయన కోరారు. కాగా ఎన్నికలకు ఒక్క రోజు ముందు కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
ఎన్టీఆర్, చిరు, మహేష్ సహా సినిమా సెలబ్రటీస్ ఓటు హక్కు వినియోగించుకునేది ఇక్కడే..
తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. గత కొద్దిరోజులుగా ప్రచారాలతో హోరెత్తించిన పార్టీలు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో ఎన్నికల నిబంధనల మేరకు బ్రేక్ తీసుకున్నాయి. ఇక ఎన్నికల కోసం ఎక్కడెక్కడో ఉన్న మన టాలీవుడ్ టాప్ హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు అందరూ తమ విధిగా ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే షూటింగ్లలో బిజీగా ఉన్న వారు సైతం బ్రేక్ తీసుకుని ఒక్కరొక్కరుగా హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ఇక ఏయే సెలబ్రిటీ ఏయే బూత్ లో తమ ఓటు హక్కు వినియీగించుకోనున్నారు. రేపు ఓటుహక్కు వినియోగించుకోనున్న సినిమా సెలబ్రటీస్.. జూబ్లీహిల్స్ క్లబ్ (పోలింగ్ బూత్ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్.. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 165): మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మీ, మనోజ్ (పోలింగ్ బూత్ 164): విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్.. బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ (పోలింగ్ బూత్ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్.. మణికొండ: హైస్కూల్ లో ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం..
తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో జోరుగా బెట్టింగులు..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.. మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది.. ఇప్పుడు ప్రలోభాల పర్వం జోరుగా సాగుతున్నట్టు కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతోంది.. గురువారం రోజు పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎన్నికల ఫలితాలపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయట.. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారట బెట్టింగ్ రాయుళ్లు.. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్ బోణీ కొడుతుందా? బీజేపీకి వచ్చే స్థానాలు ఎన్ని? ఇలా పందెం కాస్తున్నారట.
ఏపీలో ఎన్నికలు ఇప్పట్లో లేవు.. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే
విజయవాడలో బీసీ ఐక్యత సమగ్రాభివృద్ధి కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో.. అనేది తెలియదని చెప్పారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్ధిక వెనక బాటుతనం పోగొట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రపంచం మారుతున్నప్పుడు అందరం మారాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఓటు ఒక చోటే ఉండాలని కోరామని చెప్పుకొచ్చారు. కొంత మందికి తెలంగాణ, ఏపీ రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి.. ఇలాంటి వాటిని వెరిఫై చేసి చర్యలు తీసుకోవాలని విఙప్తి చేశామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాము ఓడిపోవడం ఖాయం అని టీడీపీ, జనసేనకు తెలుసు.. అందుకే ఓట్లు తొలగిస్తున్నారని మా మీద బురద చల్లుతున్నారు.. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండాలి అంటూ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.
మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు.. అయితే ఇది తప్పనిసరి..
వ్యవసాయ రంగంలో మార్పు తేవాలని.. అంధునాతన సాంకేతిక పద్దతులను ఉపయోగించి మహిళలు వ్యవసాయం చేసేలా మహిళలకు అగ్రికల్చర్ డ్రోన్లను అందించి.. ఉపాధిని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో చెప్తుంది. మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని.. వాళ్లకు మరింత చేయూతనిచ్చి బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని గతంలో మోడీ ఓ సమావేశంలో పేర్కొన్నారు. అన్నట్టుగానే అగ్రి కల్చర్ డ్రోన్ ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించేందుకు.. అలానే వాళ్ళు రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా స్కీమ్ ను రోపొందించింది కేంద్రం.
“ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హత్యకు కుట్ర”.. అమెరికా ఆరోపణలపై విచారణ కమిటీని ఏర్పాటు చేసిన భారత్..
ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్రపన్నిందని, ఈ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. అమెరికా గడ్డపై అమెరికా పౌరుడిని హత్య చేసే కుట్రను ఆ దేశం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వైట్‌హౌజ్ ప్రతినిధి మాట్లాడుతూ.. భారత్‌కి అత్యున్నత స్థాయిలో తమ ఆందోళన చేశామని, దీనికి బాధ్యులు బాధ్యత వహించాలని అమెరికా ఇండియాను హెచ్చరించింది. అయితే ఇది తమ విధానం కాదని భారత్ అమెరికాకు సమాధానం ఇచ్చింది. ఇదిలా ఉంటే అమెరికా లేవనెత్తిన ఆందోళనలపై భారత్ ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ బుధవారం వెల్లడించారు. పన్నూని భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. పలు ఏజెన్సీలు అతనిని భారత్‌కి అప్పగించాలని కోరుతున్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది అయిన పన్నూ, ఖలిస్తాన్ రెఫరెండం కోసం కెనడా, అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇతనికి అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది.
ఇట్స్ ఆఫీషియల్.. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఉత్కంఠ వీడింది. టీమిండియా కోచ్‌గా కొనసాగేందుకు ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ బుధవారం అధికారికంగా వెల్లడించింది. టీమిండియా (సీనియర్ మెన్) హెడ్ కోచ్ మరియు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్‌లను పొడిగించాం అని బీసీసీఐ తన ఎక్స్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ ద్రవిడ్‌తో పాటు సహాయక సిబ్బంది పదవీకాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌లు యధావిధిగా కొనసాగనున్నారు. అయితే ద్రవిడ్ కోచింగ్ బృందం ఎప్పటివరకు ఈ పదవిలో ఉంటారనే విషయం మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న విషయం తెలిసిందే. అప్పటివరకు ఇదే కోచింగ్ బృందం కొనసాగనుంది. దక్షిణాఫ్రికా పర్యటనతో ద్రవిడ్ బృందం భారత జట్టుతో కలుస్తుంది.