NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఏదో జరిగినట్లు.. అల్లు అర్జున్‌ను పెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉంది!

పోలీసులు వద్దన్నా సినీ హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు వెళ్లాడని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అయ్యాడన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదని, ఘటన జరిగిన తర్వాత కనీసం పరామర్శించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. ఏదో జరిగినట్లు అల్లు అర్జున్‌ను పెద్దపెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉందని, చట్టం ముందు అందరూ సమానులే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి అల్లు అర్జున్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ… ‘పోలీసులు వద్దన్నా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లాడు. థియేటర్‌వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదు. ఘటన జరిగిన తర్వాత కనీసం పరామర్శించకపోవడం దారుణం. ఏదో జరిగినట్లు అల్లు అర్జున్‌ను పెద్దపెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉంది. చట్టం ముందు అందరూ సమానులే. స్టార్‌లకు ప్రత్యేక మినహాయింపులు ఉండవు. అరెస్టు కోసం ఇంటికి వెళ్లిన పోలీసుల పట్ల అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులు సహనంతో వ్యవహరించారు’ అని అన్నారు. ‘ఏసీపీ, డీసీపీ చెప్పిన తర్వాతనే థియేటర్ నుండి అల్లు అర్జున్ బయటకి వెళ్ళాడు. ఇమేజ్‌ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదు. సభా నాయకుడు, సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనను ఎదిరించడం తప్పు. మేం సినీ నటులను గౌరవిస్తాం. మంచి సినిమాలు తీస్తే ప్రోత్సహిస్తాం. సినీ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక నుంచి బెనిఫిట్‌ షోలు ఉండవు’ అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

 

నా కుటుంబం కోసమే రోజుకు 12 గంటలు పని చేస్తున్నా.. మోడీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీ కువైట్‌లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించారు. అక్కడున్న భారతీయ కార్మికులతో సంభాషించారు. ఈ సందర్భంగా, భారతదేశంలో చౌకైన డేటా (ఇంటర్నెట్) ఉందన్నారు. ప్రపంచంలో ఎవరితోనైనా ఆన్‌లైన్‌లో మాట్లాడాలనుకుంటే, ఖర్చు చాలా తక్కువ అని ప్రధాని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు కూడా తక్కువే అని తెలిపారు. “నేను అభివృద్ధి చెందిన భారతదేశం 2047 గురించి మాట్లాడుతున్నాను. అప్పటి వరకు సుదూర ప్రాంతాల నుంచి పని చేయడానికి వచ్చిన మీరు కూడా మీ గ్రామంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా నిర్మించాలో ఆలోచిస్తారు. ఈ ఆకాంక్షే నా దేశానికి బలం. మన రైతులు ఎంత కష్టపడుతున్నారో రోజంతా ఆలోచిస్తూ ఉంటాను. పొలాల్లో మన కూలీలు ఎంత కష్టపడి పని చేస్తారు. వీళ్లంతా 10 గంటలు పని చేస్తే నేను కూడా 11 గంటలు పని చేయాలి అనిపిస్తుంది. వాళ్ళు 11 గంటలు పనిచేస్తే నేను కూడా 12 గంటలు పని చేయాలని ఉంటుంది. రెండవది మీరు మీ కుటుంబం కోసం కష్టపడుతున్నారా లేదా? నేను కూడా నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. మా కుటుంబంలో 140 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి నేను కొంచెం ఎక్కువ కష్టపడి పని చేయాలి.” అని  ప్రధాని తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. “నాకు అభివృద్ధి అంటే మంచి రోడ్లు, మంచి విమానాశ్రయాలు, మంచి రైల్వే స్టేషన్లు మాత్రమే కాదు. నిరుపేదలకు కూడా వారి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని కోరుకుంటున్నా. 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడమే మా లక్ష్యం. పేదలకు శాశ్వత ఇళ్లు ఉండాలి. ఇప్పటి వరకు 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చాం. అందులో కనీసం15-16 కోట్ల మంది అందులో నివసిస్తారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు కృషి చేస్తున్నాను.” అని మోడీ వెల్లడించారు.

 

ప్రధాని మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం..
కువైట్ తన దేశ అత్యున్నత గౌరవంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ కువైట్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్’ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందించారు. కువైట్-భారతదేశం మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కువైట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఇదిలా ఉండగా.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ శనివారం కువైట్ చేరుకున్నారు. 43 ఏళ్లలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. “మేక్ ఇన్ ఇండియా” ఉత్పత్తులు కువైట్‌లో ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెకానికల్ మెషినరీ, టెలికమ్యూనికేషన్ రంగాలలో కొత్త ప్రవేశాలు చేస్తున్నందుకు తాము సంతోషిస్తున్నట్లు మోడీ తెలిపారు. భారతదేశం నేడు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అత్యంత తక్కువ ఖర్చుతో తయారు చేస్తోందని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడానికి చమురుయేతర వాణిజ్యాన్ని వైవిధ్యపరచడం కీలకమని చెప్పారు. ఫార్మాస్యూటికల్, హెల్త్, టెక్నాలజీ, డిజిటల్, ఇన్నోవేషన్, టెక్స్‌టైల్ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు గొప్ప అవకాశం ఉందన్నారు. ఇరువైపులా ఉన్న వ్యాపార వర్గాలు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు పరస్పరం చర్చించుకోవాలని ఆయన కోరారు.

 

విద్యుత్ దొంగతనం.. సమాజ్‌వాదీ ఎంపీకి చుక్కలు చూపిస్తున్న యోగి సర్కార్..
విద్యుత్ చౌర్యం కేసులో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్‌పై యూపీ విద్యుత్ శాఖ కేసు నమోదు చేశారు. నవంబర్ నెలలో సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో అధికారులపై దాడులు చేసిన ఘటనలో రెహ్మాన్ బార్క్ నిందితుడుగా ఉన్నాడు. అప్పటి నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్, ఆ ప్రాంతంలోని ఆక్రమణలను తొలగిస్తోంది. ఆ ప్రాంతంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తులపై కేసులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఇంటికి కూడా మీటర్ లేదని యూపీ అధికారులు గుర్తించారు. యూపీ విద్యుత్ శాఖ బార్క్‌ని 15 రోజుల్లో రూ. 1.9 కోట్లు జరిమానా చెల్లించాలని లేదా ప్రాపర్టీని అటాచ్‌మెంట్ చేయాలని కోరింది. సంభాల్‌లోని దీపా సరాయ్ పరిసరాల్లోని జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో విద్యుత్ చౌర్యం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుత్ మీటర్ ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో గురువారం విద్యుత్ శాఖ భారీ బందోబస్తుతో బార్క్ నివాసంలో సోదాలు నిర్వహించింది. తనిఖీల్లో రెండు విద్యుత్ మీటర్లలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో ఏసీలు, సీలింగ్ ఫ్యాన్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలు ఉన్నా గత ఏడాది విద్యుత్ బిల్లు మాత్రం జీరోగా వచ్చినట్లు తేలింది. విద్యుత్ శాఖ ఎంపీ నివాసంలో పాత మీటర్లను తొలగించింది, వీటిని లాబోరేటరీకి పంపించింది. ఈ కేసులో సమాజ్‌వాదీ ఎంపీ తండ్రి మమ్లుక్ ఉర్ రెహ్మాన్ బార్క్‌పై నఖాసా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తనఖీల సమయంలో విద్యుత్ అధికారుల్ని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 352, 351(2), మరియు 132 కింద కేసులు బుక్ అయ్యాయి.

 

ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోంది?
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో సవరణలపై కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రతను బలహీనపరిచే కుట్ర అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఈ దుస్సాహసం, పక్కా ప్రణాళికతో ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని దెబ్బతీయడం రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని విమర్శించారు. వాటిని పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఖర్గే అన్నారు. ఎన్నికల కమిషనర్లను నియమించే సెలక్షన్ ప్యానెల్ నుంచి గతంలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారని, ఇప్పుడు హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎన్నికల సమాచారాన్ని దాచిపెడుతున్నారని ఆయన అన్నారు. ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఈవీఎంలలో పారదర్శకత లోపించడం వంటి ఎన్నికల అక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ రాసినప్పుడల్లా ఎన్నికల సంఘం అవమానకర రీతిలో స్పందించిందన్నారు. కొన్ని తీవ్రమైన ఫిర్యాదులను కూడా స్వీకరించలేదని ఖర్గే ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి, పాక్షిక న్యాయవ్యవస్థ అయినప్పటికీ స్వతంత్రంగా ప్రవర్తించడం లేదని ఇది మరోసారి రుజువు చేస్తోందన్నారు.
జైరాం రమేష్ ప్రకటన..
పంజాబ్, హర్యానా హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు ఇటీవల జారీ చేసిన సూచనల మేరకు ఈ చర్యను హడావుడిగా తీసుకున్నట్లు చెబుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సవరణను చట్టపరంగా సవాలు చేస్తామని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అసలేం జరిగింది..
ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ‘ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961’లోని రూల్‌ 93లో కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం సవరణ చేసింది. దీని ప్రకారం కొన్ని రకాల ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లు, వీడియోలను ప్రజలందరూ చూసేలా బహిరంగపర్చడానికి అవకాశం ఉండదు. ఆంక్షలు అమలవుతాయి. కాండక్డ్‌ ఆఫ్‌ ఎలక్షన్‌ రూల్స్‌–1961లోని రూల్‌ 93(2)(ఎ) ప్రకారం.. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను బహిరంగపర్చాల్సిందే. ప్రజలంతా వాటిని చూడొచ్చు. తనిఖీ చేసుకోవచ్చు. కొత్తగా చేసిన సవరణ ప్రకారం.. ఎన్నికలకు సంబంధించి కొన్ని రకాల పత్రాలను మాత్రమే బహిరంగపర్చవచ్చు. ఎల్రక్టానిక్‌ డాక్యుమెంట్లు బహిర్గతం చేయడం నేరమవుతుంది.

 

సంభాల్‌లో బయటపడుతున్న పురాతన ఆనవాళ్లు.. వెలుగులోకి 1857 నాటి బావి..
ఇటీవల మసీదు సర్వే సమయంలో అల్లర్లు జరగడంతో ఒక్కసారి ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ నగరం వార్తల్లోకి వచ్చింది. ఈ అల్లర్ల తరువాత జరిగిన పరిణామాల్లో సంభాల్‌లో అనేక పురాతన హిందూ దేవాలయాలు, బావులు బయటపడ్డాయి. తాజాగా శనివారం సర్వే చేస్తుందడగా సంభాల్‌లోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో ‘‘మెట్ల బావి’’ వెలుగులోకి వచ్చింది. 1857 తిరుగుబాటు కాలం నాటి 250 అడుగుల లోతున్న మెట్ల బావిని కనుగొన్నారు. నివేదిక ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో అదే ప్రాంతంలో పురాతన బాంకే బిహారీ ఆలయ శిథిలాలను కొనుగొన్నారు. దీని తర్వాత తాజాగా ‘‘రాణి కి బావడి’’ అనే మెట్ల బావిని కనుగొనడటం జరిగింది. సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా ఆదివారం రోజు 400 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న బావిని కనుగొన్నట్లు ధృవీకరించారు. చుట్టూ నాలుగు గదులు ఉన్న ఈ నిర్మాణంలో పాలరాతితో చేసిన కొన్ని అంతస్తులు ఉణ్నాయని తెలిపారు. శుక్రవారం, భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సంభాల్‌లోని కార్తికేయ ఆలయంలో కార్బన్ డేటింగ్ నిర్వహించింది. 46 ఏళ్ల తర్వాత డిసెంబర్ 13న ఈ ఆలయాన్ని తిరిగి తెరిచారు. 1978 మత అల్లర్ల తర్వాత ఈ ప్రాంతం నుంచి హిందువులు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆలయం మూసేసి ఉంది. దీంతో పాటు భద్రక్ ఆశ్రమం, స్వర్గ్‌దీప్, చక్రపాణి సహా పరిసర ప్రాంతాల్లోని ఐదు పుణ్యక్షేత్రాలను పరిశీలించడంతో పాటు 19 బావుల్ని సర్వే చేశారు. సంభాల్‌లో ఆక్రమణలకు నిరోధిస్తూ బుల్డోజర్ యాక్షన్ తీసుకున్న సమయంలో ఈ ఆలయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆలయం వివాదాస్పద షాహీ జామా మసీదు నుంచి కూతవేటు దూరంలో ఉంది. నవంబర్ 24న కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన సమయంలో ఒక గుంపు అధికారులపై దాడులు చేసింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని తర్వాత నుంచి ఆ ప్రాంతంలో ఆక్రమణపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఈ సమయంలోనే పురాతన కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి.

 

అత్తమామల్ని లేపేసేందుకు ఏకంగా బాంబు తయారీ నేర్చుకున్నాడు..
అహ్మదాబాద్‌లోని ఓ ఇంట్లో డెలివరీ చేసిన పార్సిల్ పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. తన నుంచి భార్యని విడదీసేందుకు కారణమైన ఆమె ఫ్రెండ్ బల్దేవ్ సుఖాడియా, ఆమె తండ్రి, సోదరుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితుడు రూపన్ రావు(44) ఇంటర్నెట్‌లో బాంబులు, నాటు తుపాకులను తయారుచేయడం నేర్చుకున్నట్లు తేలింది. నిందితుల నుంచి మరో రెండు బాంబులు, కంట్రీమేడ్ పిస్టర్, క్యాట్రిడ్జ్‌లు, ఆయుధాల తయారీలో ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూపన్ రావు భార్య విడాకులు తీసుకుంటోంది. ఈ కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో ఉంది. సుఖాడియా తనకు, తన భార్యకు మధ్య విభేదాలు సృష్టించి తనకు, తన పిల్లలకు దూరం చేసిందని రూపర్ రావు నమ్మాడు. తన భార్య, అత్తమామలు, బావమరిది కడుపునొప్పి కారణంగా తాను బలహీనపరిచారని నిందితుడు భావించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు సుఖాదియా, అతని అత్తమామలను చంపడానికి, తన భార్యను ఆమె కుటుంబ నుంచి వేరు చేయడానికి, ఆమెను ఒంటరి చేయడానికి మూడు నాలుగు నెలల్లో ఇంటర్నెల్‌లో చూసి బాంబులు, ఆయుధాల తయారీని నేర్చుకోవడం ప్రారంభించినట్లు విచారణ తేలింది. రూపన్ రావుతో పాటు సహ నిందితులు సల్ఫర్ పౌడర్, బ్లేడ్లు, బ్యాటరీలు, బొగ్గు, బాణాసంచా నుంచి గన్‌పౌడర్ వంటి పదార్థాలను ఉపయోగించి రిమోట్ కంట్రోల్డ్ బాంబులను తయారు చేసిన కుట్ర పన్నారు. రూపన్ రావుకి రోహన్ రావల్(21), గౌరవ్ గాధవి సహకరించాడు. శుక్రవారం రాత్రి సుఖాడియా ఇంటికి రావల్ మొదట బాంబు ఉన్న పార్సిల్‌ని తీసుకెళ్లాడు. అయితే, వారి టార్గెట్ ఇంట్లో లేకపోవడంతో పార్సిల్ ఇవ్వకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ మరుసటి రోజు పార్సిట్ డెలివరీ చేయడానికి గాధమిని పంపించారు. రావల్‌ వెనక నుంచి రిమోట్ కంట్రోల్ ఉపయోగించి బాంబును పేల్చారు. రూపన్ రావు తన అత్తమామల్ని, బావమరిదిని కూడా ఇదే విధంగా హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు డీసీసీ వెల్లడించారు. పేలుడు ఘటన తర్వాత గాధవిని స్పాట్‌లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను వెంబడిస్తున్నప్పుడు, పోలీసులు ఒక కారు నుంచి రెండు లైవ్ బాంబుల్ని కనుగొన్నారు. వాటిని తర్వాత నిర్వీర్యం చేశారు. అదే కారులో కంట్రీ మేడ్ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, అక్రమ ఆయుధాల సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.

 

అలాంటి వారికి దూరంగా ఉండండి.. ఫాన్స్‌కు అల్లు అర్జున్‌ రిక్వెస్ట్‌!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ రాకతో థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో కొందరు ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసి.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం బన్నీ దృష్టికి రాగా.. ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా స్పందించారు. సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని అల్లు అర్జున్‌ తన ఫాన్స్‌కు సూచించారు. ‘నా ఫాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యాన్స్‌ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్‌ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడుతాయి. నెగెటివ్‌ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫాన్స్‌కు సూచిస్తున్నా’ అని ఐకాన్ స్టార్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్జున్‌ అరెస్టు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్‌ ఘటనపై సీఎం మాట్లాడారు. ఒక్కరోజు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన హీరో ఇంటి దగ్గర క్యూ కట్టి మరీ.. ప్రభుత్వాన్ని తిడుతున్నారన్నారు. కొందరు అడ్డగోలుగా పోస్టులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని సీఎం మండిపడ్డారు. దాంతో అల్లు అర్జున్ తన అభిమానులకు రిక్వెస్ట్‌ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.